సృష్టిలో అద్భుతాలు
చీమ మెడ
చీమలు వాటి శరీర బరువు కన్నా ఎన్నోరెట్లు ఎక్కువ బరువును మోయగలవు. వాటికున్న ఆ సామర్థ్యాన్ని చూసి మెకానికల్ ఇంజనీర్లు ఆశ్చర్యపోతున్నారు. ఆ సామర్థ్యాన్ని అర్థం చేసుకోవడానికి అమెరికాలో ఒహాయో స్టేట్ యూనివర్సిటీ ఇంజనీర్లు చీమల శరీర నిర్మాణం, వాటి సామర్థ్యాలు, అవి చేసే పనులను గమనించి కంప్యూటర్ మోడల్స్‌ను తయారు చేశారు. చీమలను అడ్డంగా X-ray (micro CT scans) తీసి, బరువులు మోసేటప్పుడు చీమలు ఉత్పత్తి చేసే శక్తిని కృత్రిమంగా పెట్టి ఈ మోడల్స్‌ను తయారు చేశారు.
చీమ శరీరంలో ముఖ్యమైన భాగం మెడ. చీమ నోటితో పట్టుకున్న బరువుల్ని మెడ మోస్తుంది. చీమ మెడలో ఉండే మెత్తని టిష్యూలు (కణజాలాలు) పొట్టను, తలను కప్పే గట్టి పొరకు (బాహ్య అస్థిపంజరం) అతుక్కుని ఉంటాయి. మన రెండు చేతుల్ని కలిపి వేళ్ల మధ్యలో వేళ్లను పెట్టి పట్టుకున్నట్లుగానే చీమ మెడలో ఉండే మెత్తని టిష్యూలు బాహ్య అస్థిపంజరానికి అతుక్కుని ఉంటాయి. “ఇలాంటి నిర్మాణం మెడ బాగా పనిచేయడానికి చాలా ముఖ్యం,” అని ఒక పరిశోధకుడు చెప్తున్నాడు. ఆయన ఇంకా ఇలా అంటున్నాడు: “మెత్తని పదార్థాలు గట్టి పదార్థాలు ఇలా ప్రత్యేక విధంగా అతుక్కుని ఉండడం వల్ల బలం పెరుగుతుంది. పెద్దపెద్ద బరువులు మోయడానికి చీమ మెడకు ఉన్న శక్తికి అసలు రహస్యం అదే అయ్యుండవచ్చు.” పరిశోధకులు చీమ మెడ ఎలా పనిచేస్తుందో అర్థంచేసుకోవడం వల్ల అత్యాధునిక రోబోలు తయారు చేయవచ్చని ఆశిస్తున్నారు.
మీరేమంటారు? చీమ మెడ నిర్మాణం ఎలా జరిగింది? పరిణామం వల్లా? లేదా ఎవరైన దాన్ని చేశారా? ◼ (g16-E No. 3)