బైబిలు జీవితాలను మారుస్తుంది
“పరదైసు గురించిన వాగ్దానం నా జీవితాన్నే మార్చేసింది!”
-
జననం: 1974
-
దేశం: లాట్వియా
-
ఒకప్పుడు: ప్రాణాంతకమైన బైక్ రేస్‌లలో పాల్గొనేవాణ్ణి
నా గతం:
లాట్వియా రాజధాని రీగలో నేను పుట్టాను. నన్ను, అక్కను అమ్మే పెంచింది. మేము క్యాథలిక్కులం. అయినా, పండుగలప్పుడు తప్ప చర్చీకి వెళ్లేవాళ్లం కాదు. దేవుడు ఉన్నాడని నేను ఎప్పుడూ నమ్మేవాణ్ణి. కానీ, యౌవనప్రాయంలో వేరే అభిరుచుల కారణంగా దేవుని మీద అంతగా ధ్యాస పెట్టలేదు.
నేను ఎదుగుతున్న వయసులో, కనబడిన వస్తువునల్లా విప్పదీసి మళ్లీ బిగించేవాణ్ణి. నాలో ఉన్న ఆ సామర్థ్యాన్ని అమ్మ గమనించింది. అలాంటి వస్తువులు మాకు చాలా ఉండేవి కాబట్టి అమ్మ నన్ను ఇంట్లో ఒంటరిగా వదిలి వెళ్లాలంటే భయపడేది. అందుకే, నాకొక ఆట వస్తువు కొనిచ్చింది. అందులో చాలా విడిభాగాలు ఉంటాయి; వాటిని నట్లు, బోల్ట్‌లతో బిగించి కారు, క్రేను లాంటి బొమ్మలు తయారు చేయవచ్చు. దానితో ఆడుకోవడం నాకు చాలా సరదాగా ఉండేది. నేను అంతే ఇష్టపడిన మరో విషయం బైక్ రేసులు. అమ్మ నన్ను జల్టా మోపాట్స్ (ద గోల్డెన్ మోపెడ్) అనే బైక్ రేసులో చేర్పించింది. మొదట్లోనేమో మోపెడ్‌లతో, ఆ తర్వాత మోటార్‌బైక్‌లతో రేసుల్లో పాల్గొనేవాణ్ణి.
నేను దేన్నైనా ఇట్టే నేర్చుకునేవాణ్ణి, దాంతో ఈ వేగవంతమైన, ప్రమాదకరమైన క్రీడలో కూడా త్వరగా రాణించాను. వేర్వేరు మోటార్‌సైకిల్ రేసింగ్ క్లాసుల మధ్య జరిగే లాట్వియన్ ఛాంపియన్‌షిప్‌లో మూడుసార్లు గెలుపొందాను, బాల్టిక్ స్టేట్స్ ఛాంపియన్షిప్నైతే రెండుసార్లు గెలుచుకున్నాను.
బైబిలు నా జీవితాన్ని ఎలా మార్చిందంటే . . .
నేను ఈ రేసుల్లో మంచి విజయాలు సాధిస్తూ ఉన్నత దశలో ఉన్నప్పుడు, నా ప్రియురాలు ఎవియాకు (తర్వాత మేము పెళ్లి చేసుకున్నాం) యెహోవాసాక్షులతో పరిచయమైంది. వాళ్లకు సంబంధించిన సాహిత్యంలో, బైబిలు అధ్యయనం కోసం రిక్వెస్టు చేసే ఒక కూపన్ ఉండడం చూసి దాన్ని నింపి పోస్ట్‌లో పంపింది. కొన్ని రోజులకు ఇద్దరు యెహోవాసాక్షులు వచ్చి ఆమెతో బైబిలు అధ్యయనం మొదలుపెట్టారు. అందుకు నేను అడ్డుచెప్పలేదు, కానీ ఆ సమయంలో నాకు మత సంబంధ విషయాలపై అంతగా ఆసక్తి ఉండేది కాదు.
అయితే కొంతకాలానికి వాళ్లు ఎవియాతో పాటు నన్ను కూడా బైబిలు అధ్యయనంలో కూర్చోమని ఆహ్వానించారు. అందుకు నేను ఒప్పుకున్నాను, కీర్తన 37:10, 11లో ఉన్న ఈ మాటలు వాళ్లు నాకు చూపించారు: “ఇక కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోవుదురు వారి స్థలమును జాగ్రత్తగా పరిశీలించినను వారు కనబడకపోవుదురు. దీనులు భూమిని స్వతంత్రించుకొందురు బహు క్షేమము కలిగి సుఖించెదరు.” ఆ వాగ్దానం నాకు చాలా సంతోషాన్నిచ్చింది.
వాళ్ల బోధలు నాకు నచ్చాయి. ముఖ్యంగా, పరదైసు (భూమి అందమైన తోటలా మారడం) గురించిన బైబిలు వాగ్దానం నన్ను బాగా ఆకట్టుకుంది. ఉదాహరణకు,ఆధ్యాత్మిక విషయాల పట్ల నాలో ఆసక్తి పెరుగుతూ వచ్చింది. దేవుని గురించి ఎన్నో అబద్ధాలు వ్యాప్తిలో ఉన్నాయని నేను గుర్తించాను. అయితే, బైబిలు బోధలు ఎంతో అర్థవంతంగా, స్పష్టంగా ఉండడంతో అవి నా హృదయాన్ని తాకాయి.
నా బైబిలు అధ్యయనం కొనసాగుతుండగా యెహోవా దృష్టిలో జీవానికి ఎంత విలువ ఉందో, అది ఆయనకు ఎంత అమూల్యమైనదో తెలుసుకున్నాను. (కీర్తన 36:9) అందుకే, ప్రాణాలతో చెలగాటమాడే బైక్ రేసుల్లో ఇక పాల్గొనకూడదని నిర్ణయించుకున్నాను. నా జీవాన్ని యెహోవాను మహిమపర్చడానికి ఉపయోగించాలని అనుకున్నాను. అందుకే, బైక్ రేసుల వల్ల వచ్చే పేరుప్రఖ్యాతులుగానీ, గౌరవంగానీ, థ్రిల్‌గానీ నాకు ముఖ్యమనిపించలేదు.
జీవదాత యెహోవాకు నేను జవాబుదారినని అర్థంచేసుకున్నాను
1996లో ఇస్టోనియాలోని టాల్లిన్లో జరిగిన యెహోవాసాక్షుల అంతర్జాతీయ సమావేశానికి హాజరయ్యాను. నేను చాలాసార్లు రేసుల్లో పాల్గొన్న స్టేడియంకు దగ్గర్లోనే అది జరిగింది. అక్కడ ఎన్నో దేశాలకు చెందినవాళ్లు శాంతిసామరస్యాలతో కలిసిమెలిసి ఉండడం గమనించాను. ఉదాహరణకు, ఒక యెహోవాసాక్షి తన హాండ్ బ్యాగ్ పోగొట్టుకున్నప్పుడు, అది ఇక ఆమెకు దొరకనే దొరకదని అనుకున్నాను. కొద్దిసేపటికే మరో యెహోవాసాక్షికి అది దొరికింది. ఆమె దాన్ని భద్రంగా తిరిగిచ్చింది. అది చూసినప్పుడు నా నోట మాటరాలేదు! యెహోవాసాక్షులు నిజంగా బైబిల్లోని ఉన్నత ప్రమాణాలకు కట్టుబడి జీవిస్తారని అప్పుడు నాకు అర్థమైంది. నేను, నా భార్య ప్రగతి సాధించి, 1997లో బాప్తిస్మం తీసుకుని యెహోవాసాక్షులమయ్యాం.
నేనెలా ప్రయోజనం పొందానంటే . . .
ప్రాణాంతకమైన ఆ బైక్ రేసుల వల్ల నా స్నేహితుల్లో కొందరు చనిపోయారు. నా బైబిలు అధ్యయనం వల్ల, జీవదాత యెహోవాకు నేను జవాబుదారినని అర్థంచేసుకున్నాను. ఆ అవగాహనే లేకపోతే ఈపాటికి నేను చనిపోయి ఉండేవాణ్ణేమో.
నాకు, నా భార్యకు రీగలోని యెహోవాసాక్షుల బ్రాంచి కార్యాలయంలో నాలుగేళ్లు సేవచేసే గొప్ప అవకాశం దక్కింది. ఇప్పుడు, మా పాప ఎలైస్‌ను చూసుకోవడంలో, యెహోవాను ప్రేమించేలా తనకు సహాయం చేయడంలో ఎంతో సంతోషాన్ని పొందుతున్నాం. అంతేకాక, వారానికి ఒకరోజు ట్రాన్స్లేషన్ ఆఫీస్‌కు సంబంధించిన కార్లను, ఇతర వస్తువులను బాగుచేసే గొప్ప పనిలో ఆనందం పొందుతున్నాను. చిన్నతనంలో నేను అలవర్చుకున్న నైపుణ్యాలు ఇప్పుడు బాగా ఉపయోగపడుతున్నందుకు నేనెంతో సంతోషిస్తున్నాను! అవును, ఇప్పటికీ నేను వస్తువుల్ని విప్పదీసి తిరిగి బిగించే పనే చేస్తున్నాను!
నా కుటుంబంతో కలిసి, ఏకైక సత్యదేవుని గురించి సాక్ష్యమివ్వడం ఎంతో గొప్ప ఘనతగా భావిస్తున్నాను. అప్పట్లో నేను చేసిన బైబిలు అధ్యయనం వల్లే ఇదంతా సాధ్యమౌతోంది. అవును, పరదైసు గురించిన వాగ్దానం నా జీవితాన్నే మార్చేసింది! (w14-E 02/01)