బైబిలు జీవితాలను మారుస్తుంది
“వీధులే నా ఇల్లు”
పుట్టిన సంవత్సరం: 1955
దేశం: స్పెయిన్
ఒకప్పుడు: డ్రగ్స్‌కు, మందుకు బానిస; రౌడీ
నా గతం
జీవితంలో ఎదురైన చేదు అనుభవాల నుండి గుణపాఠాలు నేర్చుకోవడానికి కొంతమందికి చాలాకాలం పడుతుంది. నేను ఆ కోవకు చెందినవాడినే. స్పెయిన్‌లో రెండవ అతిపెద్ద నగరమైన బార్సలోన అనే నగరంలో పుట్టి పెరిగాను. మా ఇల్లు సోమోర్రోరో అనే ప్రాంతంలో ఉండేది, అది బీచ్‌కు దగ్గర్లో ఉంటుంది. నేరాలు, డ్రగ్స్ మాఫియాలు అక్కడ ఎక్కువ జరిగేవి.
మా అమ్మానాన్నలకు మొత్తం తొమ్మిదిమంది పిల్లలు, నేను పెద్దవాడిని. మేము చాలా పేదవాళ్లం కాబట్టి నన్ను చిన్నవయసులోనే నాన్న పనికి పంపించాడు. నేను దగ్గర్లో ఉన్న టెన్నిస్ క్లబ్లో బాల్ బాయ్‌గా పనిచేసేవాడిని. అప్పటికి నా వయసు పదేళ్లు, రోజుకు పది గంటలు పనిచేసేవాడిని. అందుకే అందరు పిల్లల్లా స్కూల్‌కు వెళ్లలేకపోయా. నాకు 14 ఏళ్లు వచ్చేసరికి ఒక మెటల్ షాపులో మెషిన్ ఆపరేటర్‌గా పనిచేసేవాడిని.
1975లో, మిలిటరీలో చేరమని అధికారులు పిలిచారు, స్పెయిన్‌లో అది తప్పనిసరి. నాకు జీవితంలో ఏదో కొత్తగా చేయాలని ఉండేది. అందుకే పశ్చిమ ఆఫ్రికాలో స్పానిష్ ప్రజలు ఉండే మెలిల్లా అనే ప్రాంతంలోని స్పానిష్ ఫారిన్ లీజన్‌లో పనిచేయడానికి ముందుకొచ్చాను. ఆ సమయంలోనే నేను డ్రగ్స్, మందు లాంటి చెడ్డ అలవాట్లకు బానిసయ్యాను.
లీజన్‌లో పని మానేశాక బార్సిలోనకు తిరిగొచ్చి ఒక రౌడీ గ్యాంగ్ తయారు చేసుకున్నాను. మేం దొరికిందల్లా దోచుకునేవాళ్లం. తర్వాత వాటిని అమ్మి ఆ డబ్బుతో డ్రగ్స్ కొనుక్కునేవాళ్లం. నేను ఎల్ఎస్డి, యాంఫిటమైన్స్ డ్రగ్స్ వాడడం మొదలుపెట్టాను; సెక్స్, మందు తాగడం, జూదం ఇవే నా ప్రపంచం అయిపోయాయి. ఆ జీవన విధానం నన్ను మరింత క్రూరునిగా మార్చేసింది. ఎప్పుడూ ఒక చిన్నకత్తి, పెద్దకత్తి, గొడ్డలి పెట్టుకుని తిరిగేవాడిని; అవసరమనిపిస్తే వాటిని వాడడానికి ఏమాత్రం ఆలోచించేవాడిని కాదు.
ఒకసారి నేనూ, మా గ్యాంగ్ కలిసి కారును దొంగలించాం, పోలీసులు మమ్మల్ని వెంబడించడం మొదలుపెట్టారు. దొంగిలించిన కారులో దాదాపు 30 కిలోమీటర్లు వెళ్లాం, ఇక ఆ తర్వాత పోలీసులు కాల్పులు జరపడం మొదలుపెట్టారు. చివరికి మా డ్రైవరు కారును ఒకచోట గుద్దేశాడు, మేమందరం అక్కడి నుండి పారిపోయాం. అదంతా ఏదో సినిమాలో సీన్లా అనిపించింది. జరిగిందంతా మా నాన్నకు తెలిసిపోయింది, నన్ను ఇంట్లో నుండి గెంటేశాడు.
తర్వాతి ఐదేళ్లు వీధులే నా ఇల్లు అయిపోయాయి. అరుగుల మీద, ట్రక్కుల్లో, పార్కు బెంచీలమీద, స్మశానాల్లో పడుకునేవాడిని. కొన్నిరోజులు ఒక గుహలో కూడా ఉన్నాను. ఒక లక్ష్యం లేకుండా జీవించాను; నేను బతికున్నా, చనిపోయినా ఒక్కటే అనిపించింది. కొన్నిసార్లు డ్రగ్స్ మత్తులో మణికట్టుని, చేతుల్ని కోసుకున్నాను. ఆ మచ్చలు ఇప్పటికీ ఉన్నాయి.
బైబిలు నా జీవితాన్ని ఎలా మార్చిందంటే ...
నాకు 28 ఏళ్లు ఉన్నప్పుడు, అమ్మ నాకోసం వెతుక్కుంటూ వచ్చి ఇంటికి తిరిగి రమ్మని పిలిచింది. సరే అన్నాను, చెడ్డ అలవాట్లు మానేసి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తానని తనకు మాటిచ్చాను. ఆ మాట నిలబెట్టుకోవడానికి కాస్త సమయం పట్టింది.
ఒకరోజు మధ్యాహ్నం ఇద్దరు యెహోవాసాక్షులు మా ఇంటి తలుపు తట్టారు. వాళ్లు చెప్తున్నది నేను వింటుంటే, వాళ్లను పంపించేయమని లోపలి నుండి నాన్న గట్టిగా అరిచాడు. ఒకరు చెప్పింది చేయడం నాకెప్పుడూ ఇష్టం ఉండదు కాబట్టి నాన్న మాటల్ని నేను పట్టించుకోలేదు. ఆ రోజు సాక్షులు నాకు మూడు చిన్న పుస్తకాలు ఇచ్చారు, సంతోషంగా తీసుకున్నాను. వాళ్ల మీటింగ్స్ ఎక్కడ జరుగుతాయో అడిగి కొన్ని రోజుల తర్వాత ఆ రాజ్యమందిరానికి వెళ్లాను.
రాజ్యమందిరంలో ఉన్నవాళ్లందరూ మంచి బట్టలు వేసుకుని ఉన్నారు. నేనేమో పొడవాటి జుట్టుతో, చింపిరి గడ్డంతో, మురికి బట్టలతో వెళ్లాను. అందుకే లోపలికి వెళ్లలేక బయటే ఉండిపోయాను. అప్పుడే ఒక ఆశ్చర్యకరమైన విషయం నా కంటబడింది. ఒకప్పుడు నాతో కలిసి తిరిగిన రౌడీ, సూట్ వేసుకుని రాజ్యమందిరంలో కనిపించాడు. అతని పేరు వాన్. సంవత్సరం క్రితమే అతను యెహోవాసాక్షిగా మారాడని నాకు తర్వాత తెలిసింది. అతన్ని చూశాక, నాకు కూడా లోపలికి వెళ్లి మీటింగ్ హాజరవ్వాలని అనిపించింది. ఆ రోజుతో నా జీవితం మారిపోవడం మొదలైంది.
బైబిలు స్టడీ తీసుకోవడానికి ఒప్పుకున్నాను. దేవుడు నన్ను ఇష్టపడాలంటే నా కోపాన్ని, విచ్చలవిడి జీవితాన్ని విడిచిపెట్టాలని కొన్నిరోజులకే అర్థంచేసుకున్నాను. కానీ వాటిని విడిచిపెట్టడం కష్టంగా అనిపించింది. యెహోవాను సంతోషపెట్టాలంటే నా ‘మనసు మార్చుకోవాలని’ గ్రహించాను. (రోమీయులు 12:2) దేవుని కరుణ నాలో చాలా మార్పు తెచ్చింది. అన్ని తప్పులు చేసినా, కొత్త జీవితాన్ని ప్రారంభించే అవకాశం ఆయన నాకు ఇస్తున్నట్లు అనిపించింది. యెహోవా గురించి నేర్చుకుంటున్న విషయాలు నా హృదయం పై చాలా ప్రభావం చూపించాయి. నన్ను పట్టించుకునే సృష్టికర్త ఉన్నాడని నాకు స్పష్టంగా అర్థమైంది.—1 పేతురు 5:6, 7.
దాంతో ఒక్కొక్కటిగా నా అలవాట్లను మార్చుకోవడం మొదలుపెట్టాను. ఎలాగంటే, స్టడీ చేస్తున్నప్పుడు సిగరెట్ గురించి టాపిక్ వస్తే, నాలో నేను ఇలా అనుకునేవాడిని, ‘నేను అన్ని రకాలుగా శుభ్రంగా, ఏ కళంకం లేకుండా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు కాబట్టి ఈ సిగరెట్లను నేను మానేయాల్సిందే.’ (2 కొరింథీయులు 7:1) వెంటనే వాటిని చెత్తడబ్బాలో పడేశాను!
వాటితోపాటు డ్రగ్స్‌ను వాడడం, అమ్మడం కూడా వదులుకోవాల్సి వచ్చింది. కాకపోతే దానికి కాస్త సమయం పట్టింది. నేను డ్రగ్స్ జోలికి పోకుండా ఉండాలంటే నా పాత స్నేహితులతో సంబంధాన్ని పూర్తిగా తెంచేసుకోవాలని నాకు అర్థమైంది. ఎందుకంటే వాళ్ల వల్ల దేవునికి దగ్గరవ్వలేకపోయాను. కొన్నిరోజులకు, సహాయం కోసం యెహోవాపై, సంఘంలోని స్నేహితులపై ఆధారపడడం మొదలుపెట్టాను. వాళ్లు నామీద చూపించిన లాంటి ప్రేమ, శ్రద్ధ ఇంతకుముందు ఎవ్వరూ చూపించలేదు. నెలలు గడిచేకొద్దీ డ్రగ్స్‌కు పూర్తిగా దూరమవ్వగలిగాను. దేవుడు నన్ను ఇష్టపడేలా ‘కొత్త వ్యక్తిత్వాన్ని అలవర్చుకోగలిగాను.’ (ఎఫెసీయులు 4:24) 1985 ఆగస్టు నెలలో బాప్తిస్మం తీసుకుని యెహోవాసాక్షి అయ్యాను.
నేనెలా ప్రయోజనం పొందానంటే ...
బైబిలు వల్ల నా జీవితం బాగుపడింది. నా ఆరోగ్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పాడుచేస్తున్న చెడ్డ జీవన విధానానికి దూరమవ్వడానికి బైబిలు నాకు సహాయం చేసింది. నా పాత స్నేహితుల్లో 30 కన్నా ఎక్కువమంది చిన్నవయసులోనే AIDSతో చనిపోయారు; కొంతమంది డ్రగ్స్ తీసుకోవడం వల్ల వచ్చే జబ్బులతో చనిపోయారు. బైబిలు సూత్రాల్ని పాటించడం వల్ల అలాంటి ఘోరమైన పర్యవసానాన్ని తప్పించుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది.
గతంలో అంటే యువకునిగా ఉన్నప్పుడు చేసినట్లుగా కత్తులను, గొడ్డళ్లను నాతో తీసుకెళ్లడం లేదు. వాటికి బదులు బైబిలు తీసుకెళ్తానని, దాని సహాయంతో ప్రజలకు సహాయం చేస్తానని నేనెప్పుడూ ఊహించలేదు. ప్రస్తుతం నేనూ, నా భార్య పూర్తికాల సేవచేస్తూ యెహోవాసాక్షులుగా జీవిస్తున్నాం.
మా అమ్మానాన్నలు యెహోవాసాక్షులుగా మారలేదుగానీ, బైబిలు స్టడీ తీసుకోవడం వల్ల నేను మారినందుకు వాళ్లు సంతోషంగా ఉన్నారు. నాన్న అయితే తన తోటి ఉద్యోగస్థుల దగ్గర యెహోవాసాక్షుల్ని సమర్థిస్తూ మాట్లాడాడు. నేను కొత్తగా నేర్చుకున్న సత్యం వల్లే నాలో మంచి మార్పు వచ్చిందని ఆయన నమ్మాడు. అమ్మ అయితే, నేను కాస్త ముందే బైబిలు స్టడీ తీసుకుని ఉంటే బాగుండేదని అంటూ ఉంటుంది. నాకూ అలాగే అనిపిస్తుంది!
డ్రగ్స్, ఇతర చెడ్డ అలవాట్లు సంతోషాన్ని ఇస్తాయని అనుకోవడం ఎంత పిచ్చి పనో నా జీవితం నాకు నేర్పింది. నా జీవితాన్ని కాపాడిన దేవుని వాక్యాన్ని ఇతరులకు బోధిస్తూ ఇప్పుడు నిజమైన సంతోషాన్ని అనుభవిస్తున్నాను.