కుటుంబం కోసం
అనురాగం ఎలా చూపించాలి?
సంవత్సరాలు గడిచే కొద్దీ కొంతమంది భార్యాభర్తల మధ్య అనురాగం చూపించుకోవడం తగ్గిపోతూ ఉంటుంది. మీ వివాహంలో అలా జరుగుతుంటే మీరు దాని గురించి ఆలోచించాలా?
మీరేం తెలుసుకోవాలి?
వివాహ బంధం బలంగా ఉండాలంటే అనురాగం చూపించుకోవడం తప్పనిసరి. మనం బలంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారం, నీళ్లు క్రమంగా తీసుకోవడం ఎంత ప్రాముఖ్యమో, వివాహ బంధాన్ని పోషించి బలపర్చుకోవడానికి క్రమంగా అనురాగం చూపించుకోవడం కూడా అంతే ప్రాముఖ్యం. పెళ్లయి దశాబ్దాలు గడిచినా, వివాహ భాగస్వామికి తనమీద ఎంతో ప్రేమ, శ్రద్ధ ఉన్నాయనే భరోసా భార్యకు/భర్తకు అవసరం.
నిజమైన ప్రేమలో స్వార్థం ఉండదు. నిజమైన ప్రేమ ఎదుటివ్యక్తి సంతోషాన్ని కోరుకుంటుంది. కాబట్టి నిజమైన శ్రద్ధ ఉన్న భర్త/భార్య, తనకు బుద్ధి పుట్టినప్పుడు మాత్రమే కాకుండా తన వివాహజత అవసరాన్ని అర్థంచేసుకుని ఆ అవసరానికి తగ్గట్టు వాళ్లమీద అనురాగం చూపించడానికి ప్రయత్నిస్తారు.
సాధారణంగా, భర్తల కన్నా భార్యలు ఎక్కువగా అనురాగాన్ని కోరుకుంటారు. భర్తకు భార్య మీద చాలా ప్రేమ ఉండవచ్చు. కానీ ఆ ప్రేమను కేవలం ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి, లేదా లైంగిక సంబంధానికి ముందు మాత్రమే చూపిస్తే, అసలు తన భర్తకు నిజంగా తనమీద శ్రద్ధ ఉందా అనే అనుమానం భార్యకు రావచ్చు. కాబట్టి ప్రతీరోజు వీలైనప్పుడల్లా అనురాగం చూపిస్తూ ఉండడం మంచిది.
మీరేం చేయవచ్చు?
మాటల్లో అనురాగం చూపించండి. “ఐ లవ్ యు,” “నువ్వు నాకు దొరికిన వరం” లాంటి చిన్నచిన్న మాటలు కూడా మీకు తనంటే ఎంత ఇష్టమో మీ భార్యకు చూపిస్తాయి.
బైబిలు సూత్రం: “హృదయం నిండా ఏముంటే నోరు అదే మాట్లాడుతుంది.”—మత్తయి 12:34.
టిప్: మీ అనురాగాన్ని మాటలకే పరిమితం చేయాల్సిన అవసరం లేదు. మీరు తనను ఎంతగా ప్రేమిస్తున్నారో రాసి చెప్పండి, లేదా ఈ-మెయిల్, మెసేజ్ పంపండి.
చేతల్లో అనురాగం చూపించండి. కౌగిలించుకోవడం, ముద్దుపెట్టడం, లేదా ఊరికే చేతులు పట్టుకోవడం లాంటివి మీరు నిజంగా తనను ప్రేమిస్తున్నారు కాబట్టే “ఐ లవ్ యు” చెప్పారని మీ భార్యకు తెలియజేస్తాయి. మృదువుగా తాకడం, ప్రేమతో చూడడం, అప్పుడప్పుడు బహుమతులు ఇవ్వడం ఇవన్నీ నిజమైన శ్రద్ధ ఉందని చూపిస్తాయి. అంతేకాదు, తనకు సహాయం చేయడానికి మీరు బ్యాగులు మోయడం, తలుపు తీసి ఉంచడం, గిన్నెలు కడగడం, బట్టలు ఉతకడం, లేదా వంట చేయడం లాంటివి కూడా చేయవచ్చు. చాలా సందర్భాల్లో, ఈ పనులు చేయడం ద్వారా మీరు తనకు సహాయం చేయడమే కాదు, మీ అనురాగాన్ని చేతల్లో చూపిస్తారు!
బైబిలు సూత్రం: “మన ప్రేమను మాటల్లో [మాత్రమే] కాదు చేతల్లో చూపించాలి.”—1 యోహాను 3:18.
టిప్: పెళ్లికాక ముందు పరిచయమైన కొత్తలో తనమీద ఎంత శ్రద్ధ చూపించేవాళ్లో ఇప్పుడూ అంతే శ్రద్ధ చూపించండి.
మీ భర్త/భార్య కోసం సమయం కేటాయించండి. మీరిద్దరు కలిసి సమయం గడపడం వల్ల మీ వివాహ బంధం బలపడుతుంది, అంతేకాదు తనతో సమయం గడపడం మీకు ఇష్టమని మీ భర్తకు/భార్యకు తెలుస్తుంది. నిజమే, మీకు పిల్లలుంటే లేదా ప్రతీరోజు చాలా విషయాల గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటే, మీరిద్దరు కలిసి ఎక్కువ సమయం గడపలేకపోవచ్చు. అలాంటప్పుడు కేవలం మీరిద్దరు కలిసి కాసేపు వాకింగ్ చేసేలా ఏర్పాటు చేసుకున్నా మంచిదే.
బైబిలు సూత్రం: “ఏవి ఎక్కువ ప్రాముఖ్యమైనవో మీరు పరిశీలించి తెలుసుకోవాలి.”—ఫిలిప్పీయులు 1:10.
టిప్: కాస్త బిజీగా ఉండే కొందరు దంపతులు సాయంత్రాల్లో లేదా వారాంతాల్లో కలిసి సమయం గడపడానికి “డేట్ నైట్స్,” “డేట్ వీకెండ్స్” లాంటివి క్రమంగా ఏర్పాటు చేసుకుంటారు.
మీ భర్త/భార్య అవసరాలు తెలుసుకోండి. అనురాగం కోరుకునే విషయంలో ఒక్కో వ్యక్తి అవసరాలు ఒక్కోలా ఉంటాయి. మీరు తనమీద ఎలా అనురాగం చూపించాలని మీ వివాహజత కోరుకుంటున్నారో, మీరు ఇంకా ఎక్కువ అనురాగం చూపించాల్సిన అవసరం ఉందేమో ఒకరితో ఒకరు మాట్లాడి తెలుసుకోండి. తర్వాత, తను కోరినట్టు చేయడానికి కృషిచేయండి. వివాహ బంధం బలంగా ఉండాలంటే అనురాగం చూపించడం తప్పనిసరి అని గుర్తుంచుకోండి.
బైబిలు సూత్రం: “ప్రేమ . . . స్వార్థం చూసుకోదు.”—1 కొరింథీయులు 13:4, 5.
టిప్: మీ వివాహజతను మీ మీద అనురాగం చూపించమని అడిగే బదులు, ‘నా భర్త/భార్య నా మీద ఇంకా ఎక్కువ అనురాగం చూపించాలంటే నేనేం చేయాలి?’ అని ఆలోచించండి.