బైబిలు జీవితాలను మారుస్తుంది
చివరికి మా నాన్నకు దగ్గరయ్యాను
పుట్టిన సంవత్సరం: 1954
దేశం: ఫిలిప్పీన్స్
ఒకప్పుడు: నాన్న కొడుతున్నాడని ఇంట్లో నుండి పారిపోయాడు
నా గతం
ఫిలిప్పీన్స్‌లో పాగ్‌సాంగ్‌హాన్ అనే ఊరి దగ్గరున్న జలపాతాలు చూడడానికి చాలామంది టూరిస్ట్‌లు వస్తుంటారు. మా నాన్న నార్డో లెరోన్ పెరిగింది ఆ ఊరిలోనే. ఆయన పేదరికంలో పెరిగాడు. ప్రభుత్వంలో, పోలీసుల్లో, ఉద్యోగ స్థలంలో అవినీతిని చూసి ఆయన కోపంగా, దురుసుగా తయారయ్యాడు.
మా అమ్మానాన్నలకు ఎనిమిది మంది పిల్లలం. మమ్మల్ని పెంచడానికి వాళ్లు చాలా కష్టపడ్డారు. వాళ్లు కొండల మీద పంటలు పండిస్తూ తరచూ ఎన్నో గంటలు ఇంటికి దూరంగా గడిపేవాళ్లు. చాలాసార్లు నేనూ, మా అన్నయ్య రోడీలీయో మమ్మల్ని మేము చూసుకునేవాళ్లం. ఎన్నోసార్లు ఆకలితో ఉన్నాం. బాల్యంలో మాకు ఆడుకోవడానికే సమయం దొరకలేదు. ఏడేళ్లకే పిల్లలమందరం పని చేయడం మొదలుపెట్టాం. పంట పండించేవాళ్లం, ఏటవాలు కొండల మీద చాలా బరువున్న కొబ్బరికాయల మూటలు మోసేవాళ్లం. అవి లేపలేనంత బరువుగా ఉన్నప్పుడు, వాటిని బలవంతంగా ఈడ్చుకెళ్లమనేవాళ్లు.
మా నాన్న మమ్మల్ని కొడుతుంటే భరించాం కానీ మా అమ్మని కొడుతుంటే మాత్రం తట్టుకోలేకపోయాం. ఆయన్ని ఆపడానికి ప్రయత్నించినా ఆగేవాడు కాదు. పెద్దయ్యాక మా నాన్నని చంపేయాలని నేను, రోడీలీయో రహస్యంగా ప్లాన్ చేశాం. “మమ్మల్ని ప్రేమించే ఒక నాన్న ఉండుంటే ఎంతబావుండేది అని నేను అనుకునేవాణ్ణి!”
మా నాన్న పెట్టే హింసకు కోపం, చిరాకు వచ్చి 14 ఏళ్ల వయసులో నేను ఇంట్లో నుండి పారిపోయాను. కొంతకాలం వీధుల్లో బ్రతికాను, తర్వాత గంజాయికి అలవాటు పడ్డాను. తర్వాత నాకు, పడవలో టూరిస్ట్‌లను జలపాతాల దగ్గరికి తీసుకెళ్లే పని దొరికింది.
కొన్ని సంవత్సరాల తర్వాత, నేను మనీలాలో యూనివర్సిటీ చదువులు మొదలుపెట్టాను. కానీ శని, ఆదివారాల్లో పాగ్‌సాంగ్‌హాన్‌కు వెళ్తూ ఉండేవాడిని కాబట్టి, చదువుకోవడానికి సమయం దొరికేది కాదు. నా జీవితం ఏ గమ్యం లేకుండా, చాలా దుర్భరంగా ఉండేది. గంజాయి వల్ల కూడా నా బాధ తగ్గలేదు. ఉత్ప్రేరకాలు, కొకెయిన్, హెరాయిన్ వాడి చూశాను. డ్రగ్స్ వల్ల తరచూ లైంగిక అనైతికతకు పాల్పడేవాడిని. పేదరికం, అన్యాయం, బాధలు ఇవే నా చుట్టూ ఉండేవి. వాటికి కారణం ప్రభుత్వమే అని భావించి దాన్ని ద్వేషించేవాడిని. “జీవితం ఎందుకు ఇలా ఉంది?” అని దేవున్ని అడిగాను. ఎన్ని మతాల్లో వెదికినా జవాబు దొరకలేదు. బాధను మర్చిపోవడానికి ఇంకా ఎక్కువగా డ్రగ్స్ తీసుకున్నాను.
1972లో ఫిలిప్పీన్స్‌లో విద్యార్థులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాలు చేస్తున్నారు. నేనూ ఒకదాంట్లో పాల్గొన్నాను, కానీ హింస చెలరేగింది. చాలామందిని అరెస్టు చేశారు, కొన్ని నెలల తర్వాత దేశమంతా సైనిక శాసనం చాటించారు.
దాంతో నేను మళ్లీ వీధిన పడ్డాను. తిరుగుబాటు చేసినవాళ్లలో నేనూ ఉన్నాను కాబట్టి అధికారులు ఏం చేస్తారో అనే భయం పట్టుకుంది. డ్రగ్స్ కొనడానికి డబ్బులు లేక దొంగతనం చేయడం మొదలుపెట్టాను, చివరికి ధనవంతులతో, విదేశీయులతో వ్యభిచారం చేసేవాడిని. నేను బ్రతికున్నా, చచ్చిపోయినా నాకు పెద్ద విషయం కాదు.
ఈలోపు మా అమ్మ, తమ్ముడు యెహోవాసాక్షుల దగ్గర బైబిలు స్టడీ తీసుకోవడం మొదలుపెట్టారు. మా నాన్న కోపంతో వాళ్ల బైబిలు సాహిత్యాన్ని కాల్చేసేవాడు. కానీ వాళ్లిద్దరూ పట్టువిడవకుండా, బాప్తిస్మం తీసుకుని యెహోవాసాక్షులయ్యారు.
ఒకరోజు, ఒక యెహోవాసాక్షి మా నాన్నను కలిసి, భవిష్యత్తులో భూవ్యాప్తంగా న్యాయం జరుగుతుందని బైబిలు ఇస్తున్న వాగ్దానం గురించి మాట్లాడాడు. (కీర్తన 72:12-14) ఆ నిరీక్షణ మా నాన్నకు ఎంత నచ్చిందంటే, ఆయన సొంతగా పరిశోధన చేయాలని నిర్ణయించుకున్నాడు. న్యాయం జరిగించే ప్రభుత్వం గురించి దేవుడు చేసిన వాగ్దానమే కాకుండా, భర్తలు, తండ్రులు ఎలా ఉండాలని దేవుడు కోరుతున్నాడో కూడా మా నాన్న బైబిల్లో గమనించాడు. (ఎఫెసీయులు 5:28; 6:4) కొంతకాలానికే ఆయన, నా తోబుట్టువులందరూ యెహోవాసాక్షులయ్యారు. ఇంటికి దూరంగా ఉన్న నాకు ఇవన్నీ తెలీదు.
బైబిలు నా జీవితాన్ని ఎలా మార్చిందంటే ...
1978లో నేను ఆస్ట్రేలియాకు వెళ్లిపోయాను. ప్రశాంతంగా, సుసంపన్నంగా ఉన్న ఈ దేశంలో కూడా నాకు మనశ్శాంతి దొరకలేదు. మందు, డ్రగ్స్ తీసుకుంటూనే ఉన్నాను. అదే సంవత్సరం యెహోవాసాక్షులు నన్ను కలిశారు. శాంతియుతమైన భూమి గురించి వాళ్లు నాకు బైబిల్లో చూపించారు. కానీ వాళ్లతో అంతగా కలవకూడదని అనుకున్నాను.
అది జరిగిన కొంతకాలానికి, కొన్ని వారాలు ఉండివద్దామని ఫిలిప్పీన్స్‌కు వెళ్లాను. మా నాన్న మంచి వ్యక్తిగా మారడానికి చాలా కృషిచేశాడని మా తోబుట్టువులు చెప్పారు. కానీ ఆయన మీద ఉన్న కోపం వల్ల, ఆయనతో మాట్లాడడానికి నా మనసు ఒప్పుకోలేదు.
ఎందుకు ఇంత బాధ, అన్యాయం ఉన్నాయో మా చెల్లి నాకు బైబిలు నుండి వివరించింది. అనుభవం లేని ఆ టీనేజీ అమ్మాయి నా ప్రశ్నలకు జవాబివ్వడం చూసి నేను ఆశ్చర్యపోయాను. నేను వెళ్లిపోయే ముందు, మా నాన్న మీరు పరదైసు భూమిపై నిరంతరము జీవించగలరు a అనే పుస్తకాన్ని ఇచ్చి, “ఇక నీ వెతుకులాట ఆపు. నువ్వు ఏం వెదుకుతున్నావో అది ఇందులో ఉంది” అన్నాడు. ఆస్ట్రేలియాకు వెళ్లాక యెహోవాసాక్షుల్ని కలవమని ఆయన చెప్పాడు.
మా నాన్న మాట విని, బ్రిస్బేన్‌లో నా ఇంటికి దగ్గర్లో ఉన్న యెహోవాసాక్షుల రాజ్యమందిరానికి వెళ్లాను. క్రమంగా బైబిలు స్టడీ తీసుకోవడానికి ఒప్పుకున్నాను. దానియేలు 7వ అధ్యాయంలో, యెషయా 9వ అధ్యాయంలో ఉన్నలాంటి బైబిలు ప్రవచనాలు చూసినప్పుడు, అవినీతి మచ్చుకైనా లేని దేవుని ప్రభుత్వం భవిష్యత్తులో మనల్ని పరిపాలిస్తుందని తెలుసుకున్నాను. అంతేకాదు, భూమ్మీద పరదైసులాంటి పరిస్థితులు ఉంటాయని తెలుసుకున్నాను. నేను దేవునికి నచ్చే విధంగా ఉండాలని కోరుకున్నాను. కానీ అలా ఉండాలంటే నా భావోద్వేగాలు అణచుకోవాలి, డ్రగ్స్ తీసుకోవడం అలాగే అతిగా తాగడం మానేయాలి, విచ్చలవిడి జీవితాన్ని వదిలేయాలి. కాబట్టి నాతోపాటు ఉంటున్న అమ్మాయి నుండి వేరుగా వచ్చేశాను, అలాగే నా వ్యసనాలన్నిటి నుండి బయటపడ్డాను. యెహోవా మీద నమ్మకం పెరిగే కొద్దీ, ఇంకా వేరే మార్పులు చేసుకోవడానికి కూడా సహాయం చేయమని ప్రార్థించాను.
మెల్లమెల్లగా, నేను నేర్చుకుంటున్న విషయాలు జీవితాల్నే మార్చేయగలవు అని తెలుసుకున్నాను. కృషి చేస్తే “కొత్త వ్యక్తిత్వాన్ని” అలవర్చుకోగలమని బైబిలు చెప్తుంది. (కొలొస్సయులు 3:9, 10) నేను దాన్ని అలవర్చుకోవడానికి ప్రయత్నిస్తుండగా, మా నాన్నలో వచ్చిన మార్పు కూడా నిజమే అయ్యుంటుందని గ్రహించాను. కోపాన్ని, ద్వేషాన్ని తీసేసుకుని ఆయనతో సమాధానపడాలి అనుకున్నాను. చివరికి, నేను ఆయన్ని క్షమించాను, చిన్నప్పటి నుండి ఆయన మీద పెంచుకున్న ద్వేషాన్ని తీసేసుకున్నాను.
నేనెలా ప్రయోజనం పొందానంటే...
యౌవనంలో ఉన్నప్పుడు, నేను వేరేవాళ్ల ప్రమాదకరమైన, హానికరమైన ప్రవర్తనను అనుసరించాను. బైబిలు ఇస్తున్న హెచ్చరిక నా విషయంలో నిజమైంది. చెడ్డ సహవాసుల వల్ల నేను పక్కదారి పట్టాను. (1 కొరింథీయులు 15:33) కానీ యెహోవాసాక్షుల్లో నాకు మంచి స్నేహితులు దొరికారు, నేను మంచి వ్యక్తిగా మారడానికి వాళ్లు సహాయం చేశారు. వాళ్లలోనే నా భార్య లోరెటా కూడా నాకు దొరికింది. ఇప్పుడు ఇద్దరం కలిసి, బైబిలు జీవితాల్ని ఎలా మారుస్తుందో ఇతరులకు బోధిస్తున్నాం.
బైబిలు సహాయం వల్ల, నేను మా నాన్నను ఎలా చూడాలనుకున్నానో అలా చూడగలిగాను. ఆయన మా అమ్మకు ఒక ప్రేమగల భర్తగా, అలాగే వినయం-సమాధానం గల క్రైస్తవుడిగా మారాడు. నేను 1987లో బాప్తిస్మం తీసుకున్నప్పుడు, మా నాన్న నా జీవితంలో మొదటిసారి నన్ను కౌగిలించుకున్నాడు!
35 కన్నా ఎక్కువ సంవత్సరాలు మా నాన్న మా అమ్మతో కలిసి బైబిలు నిరీక్షణను ఇతరులతో పంచుకున్నాడు. ఆయన కష్టపడి పని చేసే, శ్రద్ధ చూపించే, ప్రజలకు సహాయం చేసే వ్యక్తిగా మారాడు. ఆ సంవత్సరాల్లో నేను ఆయన్ని గౌరవించడం, ప్రేమించడం నేర్చుకున్నాను. ఆయన కొడుకునని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాను! ఆయన 2016లో కన్ను మూశాడు. కానీ ఆయన్ని ఇప్పటికీ తలుచుకుంటున్నాను. నేనూ, మా నాన్న బైబిలు బోధల్ని పాటించి మా వ్యక్తిత్వంలో పెద్దపెద్ద మార్పులు చేసుకున్నాం. అంతకుముందు ఆయన మీద ఉన్న ద్వేషం ఇప్పుడు నాలో రవ్వంత కూడా లేదు. ప్రతీ కుటుంబంలో కష్టాలకు కారణమయ్యే ప్రతీ దాన్ని తీసేస్తానని వాగ్దానం చేసిన నా పరలోక తండ్రైన యెహోవా దేవుణ్ణి తెలుసుకున్నందుకు సంతోషిస్తున్నాను.
a యెహోవాసాక్షులు ప్రచురించినది, ప్రస్తుతం ముద్రించబడడం లేదు.