కంటెంట్‌కు వెళ్లు

బైబిలు జీవితాలను మారుస్తుంది

“నా గోతిని నేనే తవ్వుకుంటున్నాను”

“నా గోతిని నేనే తవ్వుకుంటున్నాను”
  • పుట్టిన సంవత్సరం: 1978

  • దేశం: ఎల్‌ సాల్వడార్‌

  • ఒకప్పుడు: హింసలకు పాల్పడే ముఠా సభ్యుడు

నా గతం

 “నువ్వు నిజంగా దేవుని గురించి తెలుసుకోవాలనుకుంటే యెహోవాసాక్షులనే అంటిపెట్టుకుని ఉండు.” ఆ మాటలు విని ఆశ్చర్యపోయాను. అప్పటికే కొంతకాలంగా యెహోవాసాక్షుల దగ్గర స్టడీ తీసుకుంటున్నాను. కానీ నేనెందుకు ఆశ్చర్యపోయానో తెలియాలంటే మీరు నా గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలి.

 నేను ఎల్‌ సాల్వడార్‌లోని కెసాల్‌టెపెకెలో పుట్టాను. మేం మొత్తం 15 మంది తోబుట్టువులం, నేను ఆరోవాడిని. నేను నిజాయితీపరునిగా, చట్టానికి లోబడే వ్యక్తిగా ఉండాలని అమ్మానాన్న కోరుకున్నారు. పైగా యెహోవాసాక్షి అయిన లియోనార్డో, అలాగే మరో ఇద్దరు సహోదరీలు అప్పుడప్పుడు వచ్చి మాకు బైబిలు గురించి నేర్పిస్తుండేవాళ్లు. కానీ వాళ్లు నేర్పించేవి నాకు నచ్చలేదు. ఒకదాని తర్వాత ఒకటి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూపోయాను. నాకు 14 ఏళ్లు ఉన్నప్పుడు స్కూల్లోని స్నేహితులతోపాటు మద్యం తాగడం, డ్రగ్స్‌ తీసుకోవడం మొదలుపెట్టాను. వాళ్లలో ఒకరి తర్వాత ఒకరు స్కూల్‌ మానేసి ముఠాలో చేరారు. వాళ్లను చూసి నేను కూడా అదే చేశాను. మేం రోజుల తరబడి వీధుల్లో తిరుగుతూ మా చెడ్డ అలవాట్ల కోసం ప్రజల దగ్గర డబ్బులు లాక్కునేవాళ్లం, దొంగతనాలు చేసేవాళ్లం.

 ఆ ముఠా సభ్యులే నాకు కుటుంబం అయిపోయారు. వాళ్లకు నమ్మకంగా ఉండాలని అనుకున్నాను. ఒకసారి మా తోటి ముఠా సభ్యుడు డ్రగ్స్‌ మత్తులో మా పక్కింటాయన పై దౌర్జన్యం చేశాడు. ఆయన నా స్నేహితుణ్ణి లొంగదీసుకుని పోలీసులకు ఫోన్‌ చేశాడు. నాకు ఎంత కోపం వచ్చిందంటే, నా స్నేహితుణ్ణి విడిపించుకోవడానికి ఒక పెద్ద కర్ర తీసుకుని మా పక్కింటాయన కారును కొట్టడం మొదలుపెట్టాను. నేను అద్దాల్ని పగులగొట్టి, కారు అంతటినీ పాడుచేస్తుంటే దయచేసి ఆపమని ఆయన బ్రతిమాలాడు. అయినా నేను వినలేదు.

 నాకు 18 ఏళ్లు ఉన్నప్పుడు మా ముఠా పోలీసులతో గొడవపడింది. నేను వాళ్లమీదికి ఇంట్లో తయారు చేసిన బాంబును విసరబోతుండగా, ఏమైందో ఏమోగానీ అది నా చేతిలోనే పేలిపోయింది. నుజ్జునుజ్జు అయిన నా చేతిని చూసి కళ్లు తిరిగి పడిపోయాను. కళ్లు తెరిచేసరికి హాస్పిటల్‌లో ఉన్నాను. నా కుడి చెయ్యి పోయింది, కుడిచెవి వినికిడి శక్తి పోయింది, కుడి కన్ను చూపు దాదాపు పోయింది.

 ఇన్ని దెబ్బలు తగిలినా హాస్పిటల్‌ నుండి డిశ్చార్జ్‌ అవ్వగానే నేరుగా మా ముఠా దగ్గరికి వెళ్లిపోయాను. కానీ వెంటనే పోలీసులు వచ్చి అరెస్టు చేసి నన్ను జైల్లో వేశారు. అక్కడికి వెళ్లాక మా ముఠా సభ్యులతో నాకున్న స్నేహం ఇంకా బలపడింది. రోజంతా అన్నీ పనులు కలిసే చేసేవాళ్లం. టిఫిన్‌ తిని, ఉదయాన్నే గంజాయి పీల్చడం దగ్గర నుండి, రాత్రి పడుకునే వరకు కలిసే ఉండేవాళ్లం.

బైబిలు నా జీవితాన్ని ఎలా మార్చిందంటే ...

 నేను జైల్లో ఉన్నప్పుడు లియోనార్డో కలవడానికి వచ్చాడు. మాటల మధ్యలో, ఆయన నా కుడి చేతి మీద ఉన్న టాటూను చూపించి, “నీ టాటూలోని ఈ మూడు చుక్కలకు అర్థమేంటో తెలుసా?” అని అడిగాడు. “తెలుసు. సెక్స్‌, డ్రగ్స్‌, రాక్‌ అండ్‌ రోల్‌” అన్నాను. దానికి లియోనార్డో “నేనైతే వాటికర్థం హాస్పిటల్‌, జైలు, చావు అనుకుంటున్నా. మొన్నటిదాకా హాస్పిటల్‌లో ఉన్నావు, ఇప్పుడు జైల్లో ఉన్నావు, తర్వాత ఏంటో నీకు తెలుసు” అన్నాడు.

 లియోనార్డో మాటలకు ఖంగుతిన్నాను. ఆయన చెప్పింది కరెక్టే. నా గోతిని నేనే తవ్వుకుంటున్నాను. అయితే లియోనార్డో బైబిలు స్టడీ తీసుకోమని అడగడంతో నేను ఒప్పుకున్నాను. నేర్చుకుంటున్న విషయాలు నాలో మార్పు తీసుకురావడం మొదలుపెట్టాయి. ఉదాహరణకు, “చెడు సహవాసాలు మంచి నైతిక విలువల్ని పాడుచేస్తాయి” అని బైబిలు చెప్తుంది. (1 కొరింథీయులు 15:33, అధస్సూచి) కాబట్టి నేను చేయాల్సిన మొదటి పని, కొత్త స్నేహితుల్ని వెతుక్కోవడం అనుకున్నాను. అందుకే ముఠా మీటింగులకు వెళ్లడం మానేశాను. దానికి బదులు జైల్లో యెహోవాసాక్షులు జరుపుతున్న కూటాలకు వెళ్లడం మొదలుపెట్టాను. అక్కడ నాకు ఆండ్రెస్‌ అనే వ్యక్తి పరిచయమయ్యాడు, తను జైల్లోనే బాప్తిస్మం తీసుకున్నాడు. తనతో కలిసి టిఫిన్‌ తినడానికి రమ్మని ఆయన నన్ను పిలిచాడు. ఆ తర్వాత నుండి ఉదయాన్నే గంజాయి పీల్చే అలవాటును మానేశాను. దానికి బదులు ఆండ్రెస్‌ నేనూ కలిసి ప్రతీరోజు ఉదయం ఒక బైబిలు వచనం గురించి చర్చించుకునేవాళ్లం.

 నాలో వస్తున్న మార్పుల్ని ముఠా సభ్యులు వెంటనే గుర్తించారు. వాళ్లలో ఒకతను నాతో మాట్లాడాలి రమ్మని పిలిచాడు. నా ఉద్దేశం తెలిస్తే నన్ను ఏమి చేస్తాడోనని భయమేసింది. ఎందుకంటే ఒక్కసారి ఏదైనా ముఠాలో చేరామంటే దానిలో నుండి బయటికి రావడం అసాధ్యం. అయితే ఆ సభ్యుడు నాతో ఇలా అన్నాడు, “నువ్వు మన ముఠా మీటింగులకు రాకుండా యెహోవాసాక్షుల కూటాలకు వెళ్లడం మేం చూశాం. ఏం చేయాలనుకుంటున్నావు?” నేను బైబిలు స్టడీ కొనసాగించి మారాలని అనుకుంటున్నానని అతనితో చెప్పాను. నేను నిజంగా యెహోవాసాక్షిగా మారాలని అనుకుంటున్నట్లయితే ముఠా సభ్యులందరూ నా నిర్ణయాన్ని గౌరవిస్తారని అతను చెప్పాడు. అతను అలా అంటాడని అస్సలు ఊహించలేదు. ఆ తర్వాత ఇలా అన్నాడు, “నువ్వు నిజంగా దేవుని గురించి తెలుసుకోవాలనుకుంటే యెహోవాసాక్షులనే అంటిపెట్టుకుని ఉండు. చెడ్డ పనులు చేయడం ఇక మానేయి. సరైన దారిలో వెళ్తున్నందుకు నిన్ను మెచ్చుకుంటున్నాను. సాక్షులు నీకు సహాయం చేయగలరు. నేను అమెరికాలో ఉన్నప్పుడు వాళ్ల దగ్గర స్టడీ తీసుకున్నాను, మా కుటుంబ సభ్యుల్లో కూడా కొంతమంది యెహోవాసాక్షులయ్యారు. భయపడకుండా నువ్వు అనుకున్నది చేయి.” నాలో భయంపోలేదు గానీ, పట్టరానంత సంతోషం అనిపించింది. మనసులో యెహోవాకు కృతజ్ఞతలు చెప్పాను. పంజరం నుండి బయటికొచ్చిన పక్షిలా అనిపించింది. ఆ క్షణం, “మీరు సత్యాన్ని తెలుసుకుంటారు, ఆ సత్యం మిమ్మల్ని విడుదల చేస్తుంది” అని యేసు చెప్పిన మాటల అర్థం నేను గ్రహించాను.—యోహాను 8:32.

 నా పాత స్నేహితులు కొంతమంది, నన్ను డ్రగ్స్‌ తీసుకోమని అడిగేవాళ్లు. కొన్నిసార్లు వాళ్ల ఒత్తిడికి లొంగిపోయాను. కానీ ఎన్నోసార్లు పట్టుదలగా ప్రార్థన చేసి చివరికి నా చెడ్డ అలవాట్లు మానుకున్నాను.—కీర్తన 51:10, 11.

 జైలు నుండి బయటికొచ్చాక మళ్లీ నా పాత జీవితాన్ని కొనసాగిస్తానని చాలామంది అనుకున్నారు. కానీ నేనలా చేయలేదు. బదులుగా, బైబిలు నుండి నేను నేర్చుకున్నవాటిని ఇతర ఖైదీలకు చెప్పడానికి తరచూ జైలుకు వెళ్తుండేవాణ్ణి. నేను పూర్తిగా మారిపోయానని నా పాత స్నేహితులకు చివరికి నమ్మకం కుదిరింది. కానీ నా పాత శత్రువులకు మాత్రం నమ్మకం కుదర్లేదు.

 ఒకరోజు నేను ప్రీచింగ్‌లో ఉన్నప్పుడు, కొంతమంది ఆయుధాలతో వచ్చి నన్నూ, నాతోపాటు ప్రీచింగ్‌ చేస్తున్న సహోదరుణ్ణి చుట్టుముట్టారు. వాళ్లు నా పాత శత్రువులు, నన్ను చంపాలని వచ్చారు. అయితే నాతో ఉన్న సహోదరుడు ధైర్యం చేసి, నాకు ఆ పాత ముఠాతో ఎటువంటి సంబంధం లేదని వాళ్లకు నచ్చజెప్పడానికి ప్రయత్నించాడు. నేను ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించాను. వాళ్లు నన్ను కొట్టి, ఇంకోసారి ఈ ప్రాంతంలో కనిపించకూడదని హెచ్చరించాక మమ్మల్ని వెళ్లనిచ్చారు. బైబిలు నిజంగా నా జీవితాన్ని మార్చింది. ఒకప్పుడైతే ఎలాగైనా వాళ్లమీద పగతీర్చుకోవాలని అనుకునేవాణ్ణి. కానీ ఇప్పుడు మాత్రం 1 థెస్సలొనీకయులు 5:15 లో ఉన్న ఈ సలహాను పాటిస్తున్నాను: “ఎవరైనా హానిచేస్తే వాళ్లమీద పగతీర్చుకోకుండా జాగ్రత్తపడండి. తోటి విశ్వాసులకు, మిగతా వాళ్లందరికీ ఏది మంచిదో దాన్నే ఎప్పుడూ చేయండి.”

 యెహోవాసాక్షిగా మారినప్పటి నుండి నిజాయితీగా బ్రతకడానికి ప్రయత్నిస్తూ వచ్చాను. కాస్త కష్టంగానే అనిపించింది. కానీ యెహోవా దేవుని సహాయంతో, బైబిల్లోని సలహాల సహాయంతో, నా కొత్త స్నేహితుల మద్దతుతో విజయం సాధించాను. మళ్లీ నా పాత జీవితానికి వెళ్లాలని అనుకోవట్లేదు.—2 పేతురు 2:22.

నేనెలా ప్రయోజనం పొందానంటే ...

 నాకు విపరీతమైన కోపం, దౌర్జన్యం చేసే స్వభావం ఉండేది. ఇంకా ఆ చెడ్డ దారిలోనే వెళ్లుంటే ఇప్పటికి ప్రాణాలతో ఉండేవాడిని కాదని నాకు ఖచ్చితంగా తెలుసు. బైబిల్లో నేను నేర్చుకున్న విషయాలు నన్ను పూర్తిగా మార్చేశాయి. నా చెడ్డ అలవాట్లను మానుకున్నాను. నా పాత శత్రువులతో శాంతియుతంగా ఉండడం నేర్చుకున్నాను. (లూకా 6:27) ఇప్పుడు ఉన్న నా స్నేహితులు నేను మంచి లక్షణాల్ని వృద్ధి చేసుకోవడానికి సహాయం చేస్తున్నారు. (సామెతలు 13:20) నేను చేసిన తప్పులన్నిటినీ క్షమించిన దేవునికి సేవచేస్తూ ఇప్పుడు అర్థవంతమైన జీవితాన్ని జీవిస్తున్నాను, సంతోషంగా ఉన్నాను.—యెషయా 1:18.

 2006 లో ఒంటరి క్రైస్తవ సువార్తికులకు శిక్షణ ఇచ్చే ప్రత్యేక పాఠశాలకు హాజరయ్యాను. ఆ తర్వాత కొన్నేళ్లకు పెళ్లి చేసుకున్నాను, మాకు ఇప్పుడు ఒక కూతురు ఉంది. ప్రస్తుతం, నాకు సహాయం చేసిన బైబిలు సూత్రాల్ని ఇతరులకు నేర్పించడానికి ఎక్కువగా నా సమయాన్ని ఉపయోగిస్తున్నాను. సంఘపెద్దగా కూడా సేవచేస్తున్నాను. సంఘంలోని యౌవనస్థులతో సమయం గడుపుతూ, వాళ్ల వయసులో నేను చేసినలాంటి తప్పుల్ని చేయవద్దని ప్రోత్సహిస్తుంటాను. నా గోతిని నేను తవ్వుకునే బదులు, దేవుడు వాగ్దానం చేసిన శాశ్వత జీవితానికి పునాది వేసుకుంటున్నాను.