వాళ్లలా విశ్వాసం చూపించండి | యోనాతాను
“యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను”
యుద్ధము అయిపోయింది, ఏలా లోయ ప్రశాంతంగా ఉంది. సైనికులు వేసుకున్న డేరాలు మధ్యాహ్నం వీచే గాలికి నెమ్మదిగా రెపరెపలాడుతున్నాయి, రాజైన సౌలు తన మనుషుల్లో కొంతమందితో మాట్లాడుతున్నాడు. అతని పెద్ద కొడుకు యోనాతాను కూడా అక్కడే ఉన్నాడు, యువకుడైన ఒక గొర్రెల కాపరి ఆసక్తిగా తన కథను చెప్తున్నాడు. ఆ యువకుడి పేరు దావీదు, అతను చాలా చురుగ్గా, ఉత్సాహంగా ఉన్నాడు. సౌలు దావీదు చెప్పే ప్రతి మాటని చాలా శ్రద్ధగా వింటున్నాడు. మరి యోనాతానుకు ఎలా అనిపించి ఉంటుంది? యెహోవా సైన్యంలో ఎంతోకాలంగా సేవ చేస్తూ ఎన్నో విజయాలు సాధించాడు. కానీ ఈ రోజు విజయం యోనాతానుది కాదు; ఆ విజయం ఈ యువకుడిది. దావీదు భారీకాయుడైన గొల్యాతును చంపాడు! దావీదుకు వచ్చిన ఘనతను చూసి యోనాతాను అసూయ పడ్డాడా?
యోనాతాను స్పందన మీకు ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు. మనం ఇలా చదువుతాం: “దావీదు సౌలుతో మాటలాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను; యోనాతాను దావీదును తనకు ప్రాణస్నేహితునిగా భావించుకొని అతని ప్రేమించెను.” యోనాతాను దావీదుకు తను యుద్ధంలో ఉపయోగించే సొంత సామాగ్రిని, అతని విల్లును కూడా ఇచ్చాడు, అది చాలా ప్రత్యేకమైన బహుమతి అని చెప్పాలి, ఎందుకంటే యోనాతాను మంచి విలుకాడు. ఆ తర్వాత యోనాతాను, దావీదు ఒక ఒప్పందం చేసుకున్నారు, ఆ ముఖ్యమైన ఒప్పందం వాళ్లిద్దరిని ఒకరికి ఒకరు మద్దతు ఇచ్చుకునేలా స్నేహితులుగా ఒకటి చేసింది.—1 సమూయేలు 18:1-5.
అలా బైబిలు అతి గొప్ప స్నేహం అని వర్ణిస్తున్న స్నేహం మొదలైంది. విశ్వాసుల మధ్య స్నేహం చాలా ముఖ్యం. మనం స్నేహితులను తెలివిగా ఎంపిక చేసుకుని, మద్దతు ఇచ్చే నమ్మకమైన స్నేహితుడిగా ఉంటే, ప్రేమలేని ఈ కాలంలో మన విశ్వాసాన్ని మరింత బలంగా చేసుకోవచ్చు. (సామెతలు 27:17) స్నేహం గురించి యోనాతాను నుండి ఏమి నేర్చుకోవచ్చో ఇప్పుడు చూద్దాం.
స్నేహానికి పునాది
అలాంటి స్నేహం అంత త్వరగా ఎలా ఏర్పడింది? ఆ స్నేహానికి ఉన్న పునాదే దానికి జవాబు ఇస్తుంది. కొన్ని విషయాలను పరిశీలిద్దాం. యోనాతాను కష్టమైన కాలంలో జీవిస్తున్నాడు. ఆయన తండ్రి రాజైన సౌలు సంవత్సరాలు గడుస్తుండగా మారిపోతూ ఉన్నాడు, ఇంతకుముందుకన్నా ఘోరంగా అతని స్వభావం మారిపోతుంది. ఒకప్పుడు వినయంగా, విధేయతతో దేవుని మీద విశ్వాసం ఉంచిన సౌలు ఇప్పుడు అహంకారిగా, అవిధేయుడైన రాజుగా తయారయ్యాడు.—1 సమూయేలు 15:17-19, 26.
సౌలు అలా మారుతున్నప్పుడు యోనాతానుకు ఎంతో బాధ కలిగి ఉంటుంది, ఎందుకంటే ఆయనకు తన తండ్రితో దగ్గరి బంధం ఉంది. (1 సమూయేలు 20:2) యెహోవా ఏర్పాటు చేసుకున్న జనాంగం మీద సౌలు ఏ హాని తెస్తాడో అని యోనాతాను ఆలోచించి ఉండవచ్చు. రాజు అవిధేయత అతని పౌరులకు యెహోవా ఆమోదం పోగొట్టుకునేలా చేస్తుందా? సందేహం లేదు, యోనాతాను లాంటి విశ్వాసం గలవాళ్లకు అవి చాలా కష్టమైన కాలాలు.
యోనాతాను, యువకుడైన దావీదుకు ఎందుకు అంత దగ్గరయ్యాడో అర్థం చేసుకోవడానికి ఈ విషయాలు మనకు సహాయం చేస్తాయి. యోనాతాను దావీదుకున్న గొప్ప విశ్వాసాన్ని చూశాడు. గుర్తు చేసుకోండి, సౌలు సైనికుల్లా గొల్యాతు భారీ శరీరాన్ని చూసి దావీదు భయపడలేదు. యెహోవా పేరుతో యుద్ధానికి వెళ్లడం ఆయుధాలు ఉన్న గొల్యాతు కన్నా తనను ఎంతో శక్తిమంతుణ్ణి చేస్తుందని దావీదు తర్కించాడు.—1 సమూయేలు 17:45-47.
కొన్ని సంవత్సరాల క్రితం, యోనాతాను కూడా అలాగే తర్కించాడు. ఇద్దరు మనుషులు అంటే తను, తన ఆయుధాలు మోసే అతను సైనికుల దండు మొత్తం మీద దాడి చేసి, ఓడించగలరని నమ్మకంతో ఉన్నాడు. ఎందుకు? రక్షణ ఇచ్చే విషయంలో యెహోవాను ఏదీ అపలేదని యోనాతాను అన్నాడు. (1 సమూయేలు 14:6) కాబట్టి యోనాతానుకు, దావీదుకు ఒకేలాంటి లక్షణాలు చాలా ఉన్నాయి: యెహోవా మీద బలమైన విశ్వాసం, ప్రగాఢమైన ప్రేమ ఉన్నాయి. ఈ ఇద్దరి ప్రాణ స్నేహానికి ఇవే మంచి పునాదిగా ఉన్నాయి. యోనాతాను శక్తివంతమైన రాకుమారుడు, దాదాపు 50 సంవత్సరాలవాడు, దావీదు మామూలు గొర్రెల కాపరి, కనీసం 20 సంవత్సరాలు కూడా లేనివాడు, అయినా, ఈ తేడాలు ఏమీ వాళ్లకు అడ్డుగా లేవు. a
వాళ్లు చేసుకున్న ఒప్పందం వాళ్ల స్నేహానికి నిజమైన రక్షణగా ఉంది. ఎలా? యెహోవా దావీదు కోసం ఏమి చేయబోతున్నాడో దావీదుకు తెలుసు; ఆయన ఇశ్రాయేలీయులకు తర్వాత రాజు అవ్వబోతున్నాడు! ఆ విషయాన్ని యోనాతానుకు చెప్పకుండా ఉన్నాడా? లేదు, చెప్పాడు! దాపరికాలు లేకుండా మాట్లాడుకోవడం, రహస్యాలకు, అబద్ధాలకు చోటు ఇవ్వకుండా ఉండడం వల్ల వాళ్లలాంటి స్నేహాలు బలంగా ఉంటాయి. దావీదు రాజు కాబోతున్నాడని తెలుసుకున్నప్పుడు యోనాతానుకు ఎలా అనిపించి ఉండవచ్చు? యోనాతాను ఏదో ఒకరోజు రాజు అయ్యి తన తండ్రి చేసిన తప్పులను సరిచేయాలని అనుకుంటుంటే అప్పుడేమిటి? యోనాతాను తన మనసులో సతమతం అవుతున్నట్లు బైబిలు ఏమి చెప్పడం లేదు; కానీ యోనాతాను విశ్వసనీయత, ఆయన విశ్వాసం లాంటి ముఖ్యమైన వాటి గురించి బైబిలు చెప్తుంది. యెహోవా పవిత్రశక్తి దావీదుతో ఉండడాన్ని ఆయన చూడగలిగాడు. (1 సమూయేలు 16:1, 11-13) కాబట్టి యోనాతాను తను చేసుకున్న ఒప్పందాన్ని నిలబెట్టుకుంటూ దావీదును తన స్నేహితుడిగా చూశాడు కానీ తనకు పోటీదారుడిగా చూడలేదు. యెహోవా చిత్తం నెరవేరాలని యోనాతాను కోరుకున్నాడు.
యోనాతాను, దావీదు ఇద్దరిలో యెహోవా మీద బలమైన విశ్వాసం, ఆయన మీద ప్రగాఢమైన ప్రేమ ఉన్నాయి
ఆ స్నేహం గొప్ప ఆశీర్వాదం అయింది. యోనాతాను విశ్వాసం నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు? దేవుని సేవకులు ఎవరైనా స్నేహానికి ఉన్న విలువను గుర్తించాలి. మన స్నేహితులకు మనకు ఒకే వయసు, ఓకే నేపథ్యం ఉండాల్సిన అవసరం లేదు, కానీ నిజమైన విశ్వాసం ఉంటే వాళ్లు మనకు ఎంతో మేలు చేయగలరు. యోనాతాను, దావీదు ఒకరినొకరు ఎన్నోసార్లు బలపర్చుకున్నారు, ప్రోత్సహించుకున్నారు. అది వాళ్లిద్దరికి ఎంతో అవసరం కూడా, ఎందుకంటే వాళ్ల స్నేహం ఇంకా ఎన్నో పెద్దపెద్ద పరీక్షలను ఎదుర్కోబోతుంది.
నమ్మకం చూపించే విషయంలో పరీక్ష
మొదట్లో, సౌలుకు దావీదు అంటే చాలా ఇష్టం, ఆయనను తన సైన్యానికి అధిపతిగా పెట్టాడు. యోనాతాను అసూయ అనే శత్రువును ఎదిరించాడు, కానీ కొంతకాలానికే సౌలు ఆ శత్రువును జయించలేకపోయాడు. ఇశ్రాయేలు శత్రువులైన ఫిలిష్తీయులపై దావీదు ఒకదాని తర్వాత ఒకటి ఎన్నో విజయాలు సాధించాడు. దావీదు ఘనతను, అభిమానాన్ని గెలుచుకుంటున్నాడు. ఇశ్రాయేలు స్త్రీలలో కొంతమంది పాడుతూ: “సౌలు వేలకొలదియు, దావీదు పదివేలకొలదియు (శత్రువులను) హతము చేసిరనిరి.” సౌలుకు ఆ పాట నచ్చలేదు. “కాబట్టి నాటనుండి సౌలు దావీదుమీద విషపు చూపు నిలిపెను” అని మనం చదువుతాం. (1 సమూయేలు 18:7, 9) దావీదు తన రాజరికాన్ని తీసేసుకుంటాడని సౌలు భయపడ్డాడు. సౌలు బుద్ధిహీనంగా ఆలోచించాడు. నిజమే, దావీదు సౌలు తర్వాత రాజు అవుతాడని దావీదుకు తెలుసు కానీ యెహోవా అభిషేకించిన రాజు ఇంకా పరిపాలనలో ఉండగానే అతని స్థానాన్ని ఆక్రమించుకోవాలని దావీదు అస్సలు ఆలోచించలేదు.
దావీదును యుద్ధంలో చంపేయాలని సౌలు పన్నాగాలు పన్నాడు, కానీ అవేవి ఫలించలేదు. దావీదు విజయాలు సాధిస్తూ ఉన్నాడు, ప్రజల ప్రేమను, గౌరవాన్ని ఇంకా ఎక్కువగా సంపాదించుకుంటూ ఉన్నాడు. తర్వాత సౌలు, దావీదును చంపడానికి మరో పన్నాగం వేశాడు, తన కుటుంబం అంతటిని, తన సేవకులందర్నీ, తన పెద్ద కొడుకును కలుపుకుని దావీదును చంపాలని అనుకున్నాడు. తన తండ్రి ఇలా చేయడం యోనాతానుకు ఎంత బాధ కలిగించి ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి! (1 సమూయేలు 18:25-30; 19:1) యోనాతాను నమ్మకంగా ఉండే కొడుకు, కానీ ఆయన నమ్మకమైన స్నేహితుడు కూడా. కానీ ఇద్దరిలో ఎవరికి నమ్మకంగా ఉండాలి అనే ప్రశ్న తలెత్తింది, మరి ఆయన ఎవరికి నమ్మకంగా ఉంటాడు?
యోనాతాను మాట్లాడుతూ: “నీ సేవకుడైన దావీదు నీ విషయములో ఏ తప్పిదమును చేసినవాడు కాక బహు మేలుచేసెను గనుక, రాజా నీవు అతని విషయములో ఏ పాపము చేయకుందువుగాక. అతడు ప్రాణమునకు తెగించి ఆ ఫిలిష్తీయుని చంపగా యెహోవా ఇశ్రాయేలీయుల కందరికి గొప్ప రక్షణ కలుగజేసెను; అది నీవే చూచి సంతోషించితివి గదా; నిష్కారణముగా దావీదును చంపి నిరపరాధియొక్క ప్రాణము తీసి నీవెందుకు పాపము చేయుదువని మనవి” చేశాడు. అనుకోని ఒక సమయంలో సరిగ్గా ఆలోచించి సౌలు యోనాతాను మాటలు విన్నాడు, దావీదును చంపనని ప్రమాణం కూడా చేశాడు. కానీ సౌలు తన మాటను నిలబెట్టుకోలేదు. దావీదు ఇంకా విజయాలు సాధిస్తుండగా, సౌలు అసూయతో, కోపంతో నిండిపోయి దావీదు మీదకు ఈటె విసురుతాడు! (1 సమూయేలు 19:4-6, 9, 10) కానీ దావీదు తప్పించుకుని, సౌలు రాజ భవనం నుండి పారిపోయాడు.
ఎవరికి నమ్మకంగా ఉండాలో తేల్చుకోవాల్సిన పరిస్థితి మీకు ఎప్పుడైనా ఎదురైందా? అది తట్టుకోలేనంత కష్టమైన పరిస్థితి. అలాంటి సందర్భాల్లో కుటుంబానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని కొంతమంది మీకు చెప్పవచ్చు. కానీ యోనాతానుకు ఏమి చేయాలో బాగా తెలుసు. దావీదు యెహోవాకు నమ్మకమైన, విధేయుడైన సేవకుడిగా ఉన్నప్పుడు యోనాతాను తన తండ్రి పక్షాన ఎలా ఉండగలడు? యెహోవాకు నమ్మకంగా ఉండడమే అతను సరైన నిర్ణయం తీసుకోవడానికి నడిపించింది. అందుకే దావీదు పక్షాన మాట్లాడాడు. యెహోవాకు నమ్మకంగా ఉండడమే యోనాతానుకు అన్నిటికన్నా ముఖ్యం, అయినా కూడా తన తండ్రికి కూడా నమ్మకంగా ఉన్నాడు, ఎలాగంటే ఆయనకు ఇష్టమైనదేదో చెప్పే బదులు నిజాయితీగా తన తండ్రికి సలహా ఇచ్చాడు. యోనాతాను విశ్వసనీయత చూపించిన విధానాన్ని అనుకరించడం ద్వారా మనలో ప్రతి ఒక్కరం ప్రయోజనం పొందవచ్చు.
విశ్వసనీయతకు తగిన ప్రతిఫలం
యోనాతాను దావీదుకు సౌలుకు మధ్య సంధి కుదర్చడానికి ప్రయత్నించాడు కానీ అంత విజయం సాధించలేదు. దావీదు రహస్యంగా యోనాతాను దగ్గరకు వచ్చాడు, తన ప్రాణం విషయంలో భయపడుతున్నట్లు చెప్పాడు. “నాకును మరణమునకును అడుగు మాత్రమున్నదని” తనకంటే వయసులో పెద్దవాడైన తన స్నేహితుడితో చెప్పాడు. ఈ విషయంలో తన తండ్రి భావాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి యోనాతాను అంగీకరించాడు, సౌలు దావీదుతో సమాధానపడ్డానికి ఇష్టపడుతున్నాడో లేదో దావీదుకు చెప్పాలని అనుకున్నాడు. దావీదు దాక్కుని ఉన్నప్పుడు, యోనాతాను ఆ వార్తను తన విల్లు, బాణాలతో సంకేతాలు పంపించడం ద్వారా తెలియజేయాలనుకున్నాడు. యోనాతాను దావీదుతో కేవలం ఈ ప్రమాణం చేయించుకుంటాడు: “యెహోవా దావీదు శత్రువులను ఒకడైన భూమిమీద నిలువకుండ నిర్మూలము చేసిన తరువాత నీవు నా సంతతివారికి దయ” చూపిస్తూ ఉండు. దావీదు యోనాతాను సంతతివాళ్ల మీద ఎప్పటికీ శ్రద్ధ చూపిస్తూ వాళ్లను కాపాడతానని ఒప్పుకుంటాడు.—1 సమూయేలు 20:3, 13-27.
యోనాతాను సౌలుతో దావీదు గురించి మంచిగా చెప్పడానికి ప్రయత్నిస్తాడు, కానీ రాజు చాలా కోపపడ్డాడు. ఆయన యోనాతానును “ఆగడగొట్టుదాని కొడుకా” అని పిలుస్తూ, దావీదుకు ఆయన నమ్మకంగా ఉండడం తన కుటుంబానికే సిగ్గుచేటుగా ఉందని తిడతాడు. యోనాతానుకు జరగాల్సిన మంచి గురించి చెప్తూ “యెష్షయి కుమారుడు భూమిమీద బ్రదుకునంత కాలము నీకైనను నీ రాజ్యమునకైనను స్థిరత కలుగదు గదా” అంటాడు. ఆ మాటలకు కదిలిపోకుండా, యోనాతాను తన తండ్రిని మళ్లీ ఒకసారి ‘అతడెందుకు మరణశిక్ష నొందవలెను? అతడు ఏమి చేసెను?’ అని వేడుకున్నాడు. సౌలు కోపంతో విరుచుకుపడ్డాడు. పెద్ద వయసువాడైనా సౌలు ఇంకా బలవంతుడైన యుద్ధ వీరుడు. ఆయన తన కొడుకు మీదకు ఈటెను విసిరాడు! ఆయన ఈటెను విసరడంలో ఎంతో నైపుణ్యం ఉన్నవాడు, కానీ అది యోనాతానుకు తగలలేదు. ఎంతో బాధతో, అవమానంతో యోనాతాను కోపంగా వెళ్లిపోయాడు.—1 సమూయేలు 20:24-34.
తన సొంత మేలు కోరుకునే విషయంలో యోనాతానుకు వచ్చిన పరీక్షలో ఆయన నెగ్గాడు
తర్వాత రోజు ఉదయం, యోనాతాను దావీదు దాక్కున్న చోటుకు దగ్గర్లో ఉన్న పొలంలోకి వెళ్లాడు. సౌలు ఇంకా తనను చంపడానికి చూస్తున్నాడని దావీదుకు తెలిసేలా వాళ్లు ముందే అనుకున్నట్లు ఒక బాణాన్ని విసిరాడు. తర్వాత యోనాతాను తన పనివానిని పట్టణంలోకి పంపిస్తాడు. ఆయన, దావీదు మాత్రమే ఉన్నారు కాబట్టి మాట్లాడుకోవడానికి వాళ్లకు కొంత సమయం దొరికింది. ఇద్దరూ బాగా ఏడ్చారు, యోనాతాను బాధతో తన యువ స్నేహితుడికి వీడ్కోలు చెప్పాడు, దావీదు వేరే ప్రాంతానికి పారిపోయాడు.—1 సమూయేలు 20:35-42.
ఇలాంటి కష్టమైన పరిస్థితుల్లో యోనాతాను స్వార్థపరుడిగా కాకుండా నిజంగా విశ్వసనీయంగా ఉన్నానని నిరూపించుకున్నాడు. నమ్మకంగా ఉండే ప్రజలందరికీ శత్రువైన సాతాను, యోనాతాను కూడా సౌలు నడిచిన మార్గంలోనే వెళ్తే చూడాలని కోరుకుని ఉంటాడు. అధికారం లేదా ఘనత కోరుకుంటూ తన సొంత ఇష్టాలకు యోనాతాను మొదటి స్థానం ఇస్తే చూడాలని సాతాను ఎంతో కోరుకుని ఉంటాడు. గుర్తుంచుకోండి, మనుషుల స్వార్థపూరిత కోరికలను చాలా ఆకర్షణీయంగా చూపించడం సాతానుకు ఇష్టం. మన మొదటి తల్లిదండ్రులైన ఆదాము, హవ్వ విషయంలో సాతాను విజయం సాధించాడు. (ఆదికాండము 3:1-6) కానీ, అతను యోనాతాను విషయంలో విఫలం అయ్యాడు. సాతాను ఎంత కోపంతో ఉండి ఉంటాడో కదా! మీరూ అలాంటి ప్రయత్నాలను తిప్పికొట్టగలరా? స్వార్థం అన్నిచోట్ల అందరిలో వ్యాపించి ఉన్న కాలాల్లో మనం జీవిస్తున్నాము. (2 తిమోతి 3:1-5) యోనాతానుకున్న స్వార్థం లేని, విశ్వసనీయ స్ఫూర్తి నుండి మనం నేర్చుకుంటామా?
“నీవు నాకు అతిమనోహరుడవై యుంటివి”
సౌలుకు దావీదు మీద ఉన్న కోపం అతను అదుపు కోల్పోయేలా చేసింది. తన తండ్రి ఒక పిచ్చి పట్టిన వాడిలా తన సైన్యాన్ని దేశమంతా పంపుతూ, ఒక అమాయకుడిని చంపడానికి వెదుకుతుంటే యోనాతాను నిస్సహాయకుడిగా ఏమీ చేయలేక చూస్తూ ఉండిపోయాడు. (1 సమూయేలు 24:1, 2, 12-15; 26:20) యోనాతాను కూడా ఆ పనిలో చేతులు కలిపాడా? ఆసక్తికరంగా, లేఖనాల్లో ఎక్కడా తప్పుడు సైనిక చర్యలతో ఆయనకు సంబంధం ఉన్నట్లు చెప్పలేదు. యోనాతాను యెహోవాకు, దావీదుకు, స్నేహం విషయంలో ఆయన చేసుకున్న తన సొంత ఒప్పందానికి నమ్మకంగా ఉండడం వల్ల అలాంటి పని చేయకుండా ఉండగలిగాడు.
ఆ యువ స్నేహితుడి పట్ల యోనాతానుకున్న భావాలు అస్సలు మారలేదు. ఈలోగా, దావీదును కలవడానికి మరో మార్గం ఆయనకు కనిపించింది. హోరేషులో అది సాధ్యమైంది, హోరేషు అంటే “అడవులున్న స్థలం” అని అర్థం. ఒక అరణ్యం లాంటి, పర్వత ప్రాంతంలో హెబ్రోనుకు కొన్ని మైళ్ల దూరంలో ఆగ్నేయ దిశగా హోరేషు ఉంది. అలాంటి ప్రమాదకరమైన చోటుకు సాహసం చేసి యోనాతాను ఎందుకు వెళ్లాడు? యెహోవా యందు బలం తెచ్చుకునేలా దావీదుకు సహాయం చేయాలనేది యోనాతాను ఉద్దేశం అని బైబిలు చెప్తుంది. (1 సమూయేలు 23:17) యోనాతాను ఆ పని ఎలా చేశాడు?
“భయపడవద్దు,” అని యోనాతాను తన యువ స్నేహితుడికి చెప్పాడు. ఈ అభయాన్ని కూడా ఇచ్చాడు: “నా తండ్రియైన సౌలు నిన్ను పట్టుకొనజాలడు.” దేని ఆధారంగా ఆ అభయాన్ని ఇచ్చాడు? యెహోవా సంకల్పం తప్పకుండా నెరవేరుతుందని యోనాతానుకున్న బలమైన విశ్వాసం ఆధారంగా ఆ అభయాన్ని ఇచ్చాడు. ఆయన ఇంకా ఇలా చెప్పాడు: “నీవు ఇశ్రాయేలీయులకు రాజవగుదువు.” ఆ విషయాన్ని చెప్పమని ప్రవక్తయైన సమూయేలు కొన్ని సంవత్సరాల క్రితం ఆజ్ఞాపించబడ్డాడు, యెహోవా మాటలు తప్పకుండా నమ్మదగినవని ఇప్పుడు యోనాతాను దావీదుకు మళ్లీ గుర్తు చేస్తున్నాడు. భవిష్యత్తులో తాను ఏమి చేస్తానని యోనాతాను ఆలోచించుకుని ఉంటాడు? “నేను నీకు సహకారినౌదును” అని చెప్తున్నాడు. వెలకట్టలేని ఎంత చక్కని వినయాన్ని యోనాతాను చూపించాడో కదా! తనకన్నా 30 సంవత్సరాలు చిన్నవాడైన దావీదు అధికారం క్రింద సేవ చేయడంలో, ఆయనకు కుడి చేయిలా మద్దతు ఇస్తూ సేవ చేయడంలో యోనాతాను సంతృప్తిపడ్డాడు! యోనాతాను ఈ మాటలతో ముగించాడు: “ఇది నా తండ్రియైన సౌలునకు తెలిసియున్నదని” అన్నాడు. (1 సమూయేలు 23:17, 18) సౌలుకు కూడా తన హృదయంలో తెలుసు, తన తర్వాత రాజుగా యెహోవా ఎన్నుకున్న అతనితో చేసే పోరాటంలో తాను తప్పక ఓడిపోతాడని!
ఆ తర్వాత సంవత్సరాల్లో, దావీదు ఎన్నోసార్లు వాళ్లు ఇలా కలుసుకున్న సందర్భాన్ని గుర్తు చేసుకుని ఉండవచ్చు. వాళ్లు అలా కలుసుకున్నది అదే చివరిసారి. విచారకరంగా, నేను నీకు సహకారినౌదును అని యోనాతాను కోరుకున్నట్లు జరగలేదు.
యోనాతాను తన తండ్రి పక్షాన ఇశ్రాయేలు శత్రువులుగా ప్రకటించుకున్న ఫిలిష్తీయులపైకి యుద్ధానికి వెళ్లాడు. ఆయన మంచి ఉద్దేశంతోనే తన తండ్రి పక్కన ఉండి యుద్ధం చేయగలిగాడు, ఎందుకంటే తన తండ్రి చేసిన తప్పులు తాను యెహోవాకు చేసే సేవకు అడ్డురాకుండా చూసుకున్నాడు. ఆయన ఎప్పుడూ చేసిన విధంగానే ధైర్యంగా, నమ్మకంగా పోరాడాడు, కానీ యుద్ధం ఇశ్రాయేలీయుల మీద మరీ విరుచుకు పడింది. సౌలు అభిచారానికి పాల్పడేంతగా ఆయన దుష్టత్వం పెరిగిపోయింది. దేవుని ధర్మశాస్త్రం ప్రకారం అది మరణశిక్ష పడాల్సిన తప్పు కాబట్టి యెహోవా సౌలును ఆశీర్వదించడం ఆపేశాడు. యోనాతానుతో సహా, సౌలు ముగ్గురు కుమారులు యుద్ధంలో చంపబడ్డారు. సౌలు గాయపడి, తన ప్రాణాన్ని తనే తీసేసుకున్నాడు.—1 సమూయేలు 28:6-14; 31:2-6.
“నీవు ఇశ్రాయేలీయులకు రాజవగుదువు, నేను నీకు సహకారినౌదును” అని యోనాతాను చెప్పాడు.—1 సమూయేలు 23:17
దావీదు దుఃఖంలో మునిగిపోయాడు. గొప్ప మనసున్న దావీదు, తనను ఎంతో బాధ పెట్టి, కష్టాలు పాలు చేసిన సౌలు గురించి కూడా ఏడ్చాడు! సౌలు, యోనాతాను గురించి దావీదు ఒక విలాప గీతాన్ని రాశాడు. హృదయాన్ని తాకే మాటలు బహుశా తన ప్రియ సలహాదారుడిని, స్నేహితుడిని ఉద్దేశించి అయ్యిండవచ్చు: “నా సహోదరుడా, యోనాతానా నీవు నాకు అతిమనోహరుడవై యుంటివి నీ నిమిత్తము నేను బహు శోకము నొందుచున్నాను నాయందు నీకున్న ప్రేమ బహు వింతైనది స్త్రీలు చూపు ప్రేమకంటెను అది అధికమైనది.”—2 సమూయేలు 1:26.
యోనాతానుతో చేసిన ఒప్పందాన్ని దావీదు ఎప్పుడూ మర్చిపోలేదు. సంవత్సరాల తర్వాత యోనాతాను అవిటి కొడుకైన మెఫీబోషెతు కోసం వెదికి అతని గురించి శ్రద్ధ తీసుకున్నాడు. (2 సమూయేలు 9:1-13) యోనాతాను చూపించిన విశ్వసనీయత నుండి, గౌరవం నుండి, ఎన్నో కష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చినా తన స్నేహితుడికి నమ్మకంగా ఉండాలనే ఆయన మనసు నుండి దావీదు ఖచ్చితంగా ఎంతో నేర్చుకుని ఉంటాడు. మనం కూడా అలాంటి పాఠాలనే నేర్చుకుంటామా? మనమూ యోనాతాను లాంటి స్నేహితులను సంపాదించుకోగలమా? మనం అలాంటి స్నేహితులుగా ఉండగలమా? యెహోవా మీద విశ్వాసాన్ని పెంచుకుని, బలపర్చుకునేలా మనం మన స్నేహితులకు సహాయం చేసినప్పుడు, దేవుని మీద మనకున్న విశ్వసనీయతకు మొదటిస్థానం ఇచ్చినప్పుడు, మన సొంత ఇష్టాలను వెదకకుండా విశ్వసనీయంగా ఉంటే, మనం యోనాతాను లాంటి స్నేహితుడిగా ఉండవచ్చు. మనం ఆయన లాంటి విశ్వాసాన్ని చూపించిన వాళ్లం అవుతాం.
a ఈ లేఖన వృత్తాంతంలో యోనాతాను గురించి మొట్టమొదట చెప్పినప్పుడు, సౌలు పరిపాలన ఆరంభంలో, యోనాతాను ఒక సైన్యాధికారి, కాబట్టి అతనికి కనీసం 20 సంవత్సరాలు ఉండి ఉంటాయి. (సంఖ్యాకాండము 1:3; 1 సమూయేలు 13:2) సౌలు 40 సంవత్సరాలు పరిపాలించాడు. సౌలు మరణించినప్పుడు, యోనాతాను వయసు దాదాపు 60 సంవత్సరాలు. సౌలు మరణించినప్పుడు దావీదు వయసు 30 సంవత్సరాలు. (1 సమూయేలు 31:2; 2 సమూయేలు 5:4) కాబట్టి యోనాతాను దావీదు కన్నా 30 సంవత్సరాలు పెద్దవాడని స్పష్టంగా తెలుస్తుంది.