కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

 A2

ఈ అనువాదంలోని ప్రత్యేకతలు

ఇంగ్లీషు భాషలోని క్రైస్తవ గ్రీకు లేఖనాల కొత్త లోక అనువాదం 1950లో విడుదల చేయబడింది, అయితే పవిత్ర లేఖనాల కొత్త లోక అనువాదం పూర్తి బైబిలు 1961లో ప్రచురించబడింది. అప్పటి నుండి 170 కన్నా ఎక్కువ భాషలకు చెందిన కోట్లమంది ప్రజలు పవిత్ర లేఖనాల ఈ అనువాదం నుండి ప్రయోజనం పొందారు. దీన్ని మూలభాషల్లో నుండి ఉన్నదున్నట్టు, చక్కగా చదవగలిగేలా అనువదించారు.

కొత్త లోక బైబిలు అనువాద కమిటీ, బైబిల్ని అనువదిస్తున్నప్పుడు ఈ కాలం పాఠకుల హృదయాల్ని చేరుకునే భాష ఉపయోగించాల్సిన అవసరం ఉందని గుర్తించింది. అందుకే, కింది లక్ష్యాల్ని చేరుకోవాలనే ఉద్దేశంతో ఈ అనువాదంలో శైలికి, పదాలకు సంబంధించిన కొన్ని సూత్రాలు పాటించారు:

  •  అర్థమయ్యే ఆధునిక భాష ఉపయోగించడం. ఈ అనువాదంలో, అర్థంకాని పాత పదాలకు బదులు, వాడుకలో ఉన్న అర్థమయ్యే పదాలు ఉపయోగించాం. ఉదాహరణకు, “దినము” బదులు “రోజు,” “నిబంధన” బదులు “ఒప్పందం,” “నామము” బదులు “పేరు,” “చిత్తం” బదులు “ఇష్టం,” “సుంకరి” బదులు “పన్ను వసూలుచేసే వ్యక్తి,” “లోభత్వం” బదులు “అత్యాశ,” “గడియ” బదులు “గంట,” “ఘటసర్పం” బదులు “మహాసర్పం” లాంటి పదాలు ఉపయోగించాం.—ఆదికాండం 1:5; 9:9; మత్తయి 6:9, 10; 9:11; 23:25; 24:36; ప్రకటన 12:9.

  •  బైబిలు పదాల అసలు అర్థం తెలియజేయడం. చాలా బైబిళ్లలో తప్పుడు నమ్మకాల్ని బలపర్చే పదాలు ఉపయోగించారు. ఉదాహరణకు, షియోల్‌ అనే హీబ్రూ పదాన్ని, హేడిస్‌ అనే గ్రీకు పదాన్ని “మృతుల లోకము” లేదా “పాతాళము” అని అనువదించారు. దానివల్ల అది భూమి కింద, చనిపోయినవాళ్లు జీవిస్తూ ఉండే ఒక చోటని ప్రజలు అనుకుంటున్నారు. కానీ షియోల్‌, హేడిస్‌ అనే పదాలు సమాధిని, అంటే చనిపోయిన వాళ్లందర్నీ పాతిపెట్టే చోటును సూచిస్తున్నాయి. అందుకే ఈ అనువాదంలో “మృతుల లోకము” లేదా “పాతాళము” అనే పదాలకు బదులు “సమాధి” అనే పదాన్ని ఉపయోగించాం.—ఆదికాండం 37:35; కీర్తన 16:10; అపొస్తలుల కార్యాలు 2:27; ప్రకటన 20:14.

    అలాగే చాలా బైబిళ్లు రూ-ఆహ్‌ అనే హీబ్రూ పదాన్ని, న్యూమా అనే గ్రీకు పదాన్ని ‘అమర్త్యమైన ఆత్మ’ అనే తప్పుడు సిద్ధాంతాన్ని బలపర్చే “ఆత్మ” అనే పదంతో అనువదించారు. రూ-ఆహ్‌, న్యూమా అనే పదాల అసలు అర్థం ఊపిరి. అయితే వాటిని జీవశక్తి, వైఖరి, దేవదూత లేదా చెడ్డదూత, ప్రాణం, శక్తి, పవిత్రశక్తి, స్ఫూర్తి, గాలి వంటి పదాలతో కూడా అనువదించవచ్చు. కాబట్టి ఈ అనువాదంలో సందర్భాన్ని బట్టి ఆ పదాల్లో తగినదాన్ని ఉపయోగించాం.—ఆదికాండం 6:17, అధస్సూచి; సంఖ్యాకాండం 14:24; 1 రాజులు 22:21; కీర్తన 31:5; దానియేలు 4:8; మత్తయి 28:19, 20; లూకా 1:17.

    తెలుగు బైబిళ్లలో తప్పుడు అర్థం వచ్చే మరో పదం “సిలువ.” అయితే మూలభాషలో దానికి ఉపయోగించిన పదానికి నిలువుగా ఉన్న ఒక కర్ర లేదా కొయ్య అని అర్థం. అందుకే, ఈ అనువాదంలో “సిలువ” అనే పదానికి బదులు “కొయ్య” అనే పదం ఉపయోగించాం.—ద్వితీయోపదేశకాండం 21:23; మత్తయి 27:31.

ఈ అనువాదంలోని ఇతర అంశాలు:

ఈ బైబిల్లో కొన్ని రకాల అధస్సూచీలు ఉన్నాయి:

  • “లేదా” హీబ్రూ, అరామిక్‌, గ్రీకు భాషల్లో నుండి ఇలా కూడా అనువదించవచ్చు, అయితే మొత్తంగా చూస్తే ఒకే అర్థం వస్తుంది.—ఆదికాండం 1:2, “చురుకైన శక్తి” అధస్సూచి; యెహోషువ 1:8, “ధ్యానించాలి” అధస్సూచి.

  • “లేదా . . . అయ్యుంటుంది” మూలభాషల్లో నుండి ఇలా కూడా అనువదించవచ్చు, అయితే మొత్తంగా చూస్తే వేరే అర్థం వస్తుంది.—ఆదికాండం 21:6, “నాతో కలిసి నవ్వుతారు”; జెకర్యా 14:21, “కనానీయుడూ.”

  • “అక్ష.” హీబ్రూ, అరామిక్‌, గ్రీకు భాషల మక్కికిమక్కి అనువాదం లేదా మూలభాషలో ఉపయోగించిన పదబంధానికి ప్రాథమిక అర్థం.—ఆదికాండం 30:22, “పిల్లలు పుట్టేలా చేశాడు”; నిర్గమకాండం 4:12, “నీకు.”

  • పదాల అర్థం, నేపథ్య సమాచారం పేర్ల అర్థాలు (ఆదికాండం 3:17, “ఆదాముతో”; నిర్గమకాండం 15:23, “మారా”); బరువులు, కొలతల వివరాలు (ఆదికాండం 6:15, “మూరల”); సర్వనామం దేన్ని సూచిస్తుంది (ఆదికాండం 38:5, “అతను”); అనుబంధంలో, పదకోశంలో ఉన్న అదనపు సమాచారం.—ఆదికాండం 37:35, “సమాధిలోకి”; మత్తయి 5:22, “గెహెన్నాలో.”

ముందు భాగంలోని “దేవుని వాక్యంలో ఏముందో తెలుసుకోండి” అనే దానిలో బైబిల్లోని ప్రాథమిక బోధల గురించి సంక్షిప్తంగా ఉంది. ప్రకటన గ్రంథం తర్వాత “బైబిలు పుస్తకాల పట్టిక,” “బైబిలు పదాల అకారాది పట్టిక,” “బైబిలు పదాల పదకోశం” అనేవి ఉన్నాయి. ఆయా పదాల్ని బైబిల్లో ఎలా ఉపయోగించారో తెలుసుకోవడానికి పదకోశం సహాయం చేస్తుంది. అనుబంధం Aలో ఈ భాగాలు ఉన్నాయి: “బైబిలు అనువాద సూత్రాలు,” “ ఈ అనువాదంలోని ప్రత్యేకతలు,” “బైబిలు మన వరకు ఎలా వచ్చింది?,” “హీబ్రూ లేఖనాల్లో దేవుని పేరు,” “క్రైస్తవ గ్రీకు లేఖనాల్లో దేవుని పేరు,” “చార్టు: యూదా, ఇశ్రాయేలు రాజ్యాల ప్రవక్తలు, రాజులు,” “యేసు భూ జీవితంలోని ముఖ్యమైన సంఘటనలు.” అనుబంధం Bలో మ్యాపులు, చార్టులు, శ్రద్ధగా బైబిల్ని అధ్యయనం చేసేవాళ్లకు ఉపయోగపడే సమాచారం ఉన్నాయి.

బైబిలు పుస్తకాల్లో, ప్రతీ పుస్తకంలో ఏముందో చెప్పే విషయసూచిక, అలాగే సంబంధిత లేఖనాలు ఉంటాయి. దానివల్ల, చదివేవాళ్లకు ఆ పుస్తకంలో ఏముందో కొంతవరకు తెలుస్తుంది. ప్రతీ పేజీ మధ్యలో ఆయా వచనాలకు సంబంధించిన లేఖనాల రెఫరెన్సులు ఉంటాయి.