కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఉపాధ్యాయ వృత్తిని ఎందుకు చేపట్టాలి?

ఉపాధ్యాయ వృత్తిని ఎందుకు చేపట్టాలి?

ఉపాధ్యాయ వృత్తిని ఎందుకు చేపట్టాలి?

“ఉపాధ్యాయ వృత్తిని అత్యధికులు ఎందుకు చేపడతారంటే, అది ప్రజలకు సహాయం చేసే వృత్తి కాబట్టి. [ఉపాధ్యాయ వృత్తి] అంటే పిల్లల జీవితాల్లో గొప్ప ప్రభావాన్ని చూపించాలన్న నిబద్ధత ఉన్న వృత్తి.”​—ఉపాధ్యాయులు, పాఠశాలలు, సమాజము.

ఉపాధ్యాయ వృత్తి సులువైనదన్నట్లుగా కొందరు ఉపాధ్యాయులు చిత్రీకరించినా, అది సవాలుదాయకమైన వృత్తి. విద్యార్థుల సంఖ్య మరీ ఎక్కువగా ఉండడం, పేపర్‌ వర్క్‌ విపరీతంగా ఉండడం, పై అధికారుల నుండి ఒత్తిడి, విద్యార్థులు సరిగా స్పందించకపోవడం, తగిన జీతాలు లేకపోవడం వంటి ఎన్నో సవాళ్ళను అధిగమించాల్సిన వృత్తి. స్పెయిన్‌లోని మాడ్రిడ్‌లో ఉన్న పేత్రో అనే ఉపాధ్యాయుడు ఇలా వివరిస్తున్నాడు: “ఉపాధ్యాయుడిగా పని చేయడం అంత సులభమేమీ కాదు. అందుకు ఎంతో స్వయంత్యాగం అవసరం. అయితే దీంట్లో ఎన్ని కష్టాలున్నా, వ్యాపారాలు చేయడం కంటే బోధించే పని ఎంతో ప్రతిఫలదాయకమని నేను భావిస్తున్నాను.”

అనేక దేశాల్లోని పెద్ద నగరాల్లో ఉండే పాఠశాలల్లో సవాళ్ళు ఇంకా విపరీతంగా ఉండవచ్చు. మాదకద్రవ్యాల వినియోగం, నేర ప్రవృత్తి, అనైతిక ప్రవర్తన, కొన్నిసార్లు తల్లిదండ్రులే తమ పిల్లల్ని పట్టించుకోకపోవడం వంటి కారణాలు పాఠశాల వాతావరణాన్ని క్రమశిక్షణను తీవ్రంగా భంగపరుస్తాయి. అందుకే తిరుగుబాటు ధోరణి సర్వసాధారణమైపోతోంది. ఇప్పుడు తలెత్తే ప్రశ్నేమిటంటే, అంతమంది అర్హులైన వ్యక్తులు ఉపాధ్యాయ వృత్తిని ఎందుకు చేపడతారు?

లీమరీజ్‌, డయానాలు న్యూయార్క్‌ సిటీలో టీచర్లుగా ఉన్నారు. వాళ్ళు కిండర్‌గార్టెన్‌ వయస్సుగల పిల్లల నుండి పదేళ్ళ వయస్సుగల పిల్లలకు బోధిస్తారు. ఇద్దరికీ రెండు భాషలూ వచ్చు, (ఇంగ్లీషు-స్పానిష్‌) ఎక్కువగా స్పానిష్‌ సంస్కృతి నుండి వచ్చిన పిల్లలతో పనిచేస్తుంటారు. వారిని మేము అడిగిన ప్రశ్న . . .

ఒక ఉపాధ్యాయుడిని/రాలిని ప్రేరేపించేది ఏమిటి?

లీమరీజ్‌ ఇలా చెబుతోంది: “ఉపాధ్యాయురాలిగా నన్ను ప్రేరేపించేది ఏమిటని అడుగుతున్నారా? పిల్లల మీద నాకున్న ప్రేమే. కనీసం కొంతమంది పిల్లల ప్రయత్నాల్లోనైనా, వారికి సహాయం చేసే వ్యక్తిని నేను మాత్రమేనని నాకు తెలుసు.”

డయానా ఇలా చెబుతోంది: “ప్రత్యేకంగా చదవడం విషయంలో స్కూల్లో సమస్యనెదుర్కొంటున్న ఎనిమిదేళ్ళ మా అన్న కొడుకుకి ఇంట్లో ట్యూషన్‌ చెప్పేదాన్ని. వాడూ ఇతర పిల్లలు అనేక విషయాలు నేర్చుకోవడం చూసినప్పుడు నాలో ఎంత గొప్ప అనుభూతులు కలిగాయో! అందుకే ఉపాధ్యాయ వృత్తిని చేపట్టాలని నిర్ణయించుకొని, నేను చేస్తున్న బ్యాంకు ఉద్యోగం మానేశాను.”

అదే ప్రశ్నను తేజరిల్లు! వేర్వేరు దేశాల్లోని ఉపాధ్యాయులను అడిగింది, వచ్చిన జవాబుల్లో కొన్ని క్రింద ఉన్నాయి.

40వ పడిలో ఉన్న జూల్యానో ఇటలీ దేశస్థుడు, ఇలా అంటున్నాడు: “నేనీ వృత్తిని ఎందుకు ఎన్నుకున్నానంటే, నేను విద్యార్థిగా (కుడిప్రక్కన) ఉన్నప్పుడే దీనిపట్ల ఆకర్షితుణ్ణయ్యాను. ఈ వృత్తి ఎంతో సృజనాత్మకమైనది, ఇతరులను ప్రేరేపించడానికి అవకాశాలు మెండుగా ఉంటాయని నేను భావించాను. ఇందులో నాకున్న తొలి ఆసక్తి మూలంగా, నా కెరీర్‌ ప్రారంభంలో నేను ఎదుర్కొన్న కష్టాలను అధిగమించాను.”

ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్‌ వేల్స్‌ నివాసియైన నిక్‌ ఇలా అంటున్నాడు: “నేనున్న రసాయనిక పరిశోధనా రంగంలో ఉద్యోగావకాశాలు తక్కువగా ఉన్నాయి, కానీ విద్యా రంగంలో అనేక అవకాశాలున్నాయి. అప్పటి నుండి నేను ఉపాధ్యాయ వృత్తిలో ఆనందాన్ని అనుభవించాను, విద్యార్థులు కూడా నా బోధనా విధానాన్ని ఇష్టపడుతున్నట్లు నాకనిపించింది.”

ఉపాధ్యాయులవ్వాలని ఎంపిక చేసుకున్నవారిలో ఎక్కువగా తల్లిదండ్రుల మాదిరే ఒక పెద్ద కారణం. కెన్యాలోని విలియం మా ప్రశ్నకు ఇలా జవాబిచ్చాడు: “బోధించాలన్న నా కోరిక చాలా మట్టుకు మా నాన్నగారి ప్రేరణ వల్లే కలిగింది, ఆయన 1952 ప్రాంతంలో ఉపాధ్యాయుడిగా పనిచేశారు. నేను యౌవనస్థుల మనస్సులను రూపుదిద్దుతున్నానన్న తలంపు, ఈ వృత్తిని అంటిపెట్టుకుని ఉండేందుకు నాకు సహాయపడింది.”

అదే దేశంలోని రోజ్‌మేరీ మాతో ఇలా చెబుతోంది: “అభాగ్యులకు సహాయం చేయాలన్నది నాకు చిన్నప్పటి నుండి ఉన్న కోరిక. అందుకే అయితే నర్సు లేకపోతే టీచరు అవ్వాలనుకున్నాను. టీచరుగా అవకాశం ముందు వచ్చింది. నేను ఒక తల్లిని కూడా కావడం నా వృత్తి పట్ల ప్రేమను పెంచింది.”

జర్మనీలోని డూయీరెన్‌లో ఉంటున్న బెర్టోల్ట్‌ ఈ వృత్తిని చేపట్టడానికి వేరే కారణాలు ఉన్నాయి: “నాలో మంచి ఉపాధ్యాయుడి లక్షణాలు ఉన్నాయని నా భార్య నన్ను ఒప్పించింది.” ఆమె చెప్పింది నిజమేనని తేలింది. ఆయనిలా చెబుతున్నాడు: “నా వృత్తి ఇప్పుడు నాకు చాలా ఆనందాన్నిస్తోంది. ఒక ఉపాధ్యాయుడు/రాలు విద్యలోని విలువను గుర్తించనంత వరకూ, యౌవనస్థుల పట్ల ఆసక్తి చూపనంత వరకూ అతడు లేక ఆమె మంచి, విజయవంతమైన, ప్రేరణాత్మకమైన, సంతృప్తిననుభవించే ఉపాధ్యాయుడు/రాలు కాలేరు.”

జపాన్‌లోని నాకాట్సూ సిటీలో ఉంటున్న మాసాహిరో అనే పేరుగల ఉపాధ్యాయుడు ఇలా అన్నాడు: “నేను ఉపాధ్యాయునిగా అయ్యేందుకు నన్ను ప్రేరేపించినది ఏమిటంటే, నేను ఉన్నత పాఠశాలలో మొదటి సంవత్సరంలో ఉన్నప్పుడు మాకు భలే మేస్టారు ఉండేవారు. ఆయనెంతో అంకిత భావంతో పాఠాలు చెప్పేవారు. నేనీ వృత్తిలో కొనసాగడానికి ప్రధాన కారణం నేను చిన్న పిల్లల్ని ప్రేమించడమే.”

జపాన్‌ దేశానికే చెందిన, ఇప్పుడు 54 ఏళ్ళున్న యోషీయాకు ఒక ఫ్యాక్టరీలో మంచి జీతం వచ్చే ఉద్యోగం ఉండేది. కానీ తను బానిసలా పనిచేయాల్సి వస్తుందని, పనికి వెళ్ళి రావడంలోనే శక్తి హరించుకుపోతోందని భావించాడు. “ఒకరోజు నేను, ‘ఇలాంటి జీవితం నేనెంత కాలం కొనసాగించాలి?’ అని ఆలోచించాను. దాంతో, యంత్రాలతోకాక ప్రజలతో ఎక్కువ సంబంధాలుండే ఉద్యోగాన్ని వెతుక్కోవాలని నిర్ణయించుకున్నాను. ఉపాధ్యాయ వృత్తి విలక్షణమైనది. అందులో పిల్లలతో వ్యవహరించే అవకాశం ఉంటుంది. అది మానవీయమైనది.”

ఉపాధ్యాయినిగా ఉండడంలోని ఆ అవకాశాన్ని రష్యాలోని సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌కు చెందిన వలెంటీనా కూడా ఇష్టపడుతోంది. ఆమె ఇలా అంటోంది: “ఉపాధ్యాయ వృత్తిని నాకై నేనుగా ఎంపిక చేసుకున్నాను. నేను ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయినిగా 37 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. నాకు పిల్లలతో వ్యవహరించడం అంటే చాలా ఇష్టం, ప్రత్యేకంగా చిన్న పిల్లలతో వ్యవహరించడం ఇష్టం. నా వృత్తి మీద నాకు ఇష్టం ఉంది, అందుకనే నేనింకా ఉద్యోగ విరమణ చేయలేదు.”

ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న విలియం ఏయర్స్‌ ఇలా వ్రాస్తున్నారు: “ప్రజలు పిల్లలను యౌవనస్థులను ప్రేమిస్తారు కాబట్టి, లేదా వారితో ఉండడం ఇష్టపడతారు కాబట్టి ఉపాధ్యాయ వృత్తివైపు ఆకర్షించబడతారు. పిల్లలు పువ్వుల్లా వికసిస్తుండడం చూసి, లోకంలో మరింత సమర్థులుగా, మరింత యోగ్యులుగా, మరింత శక్తిపరులుగా ఎదుగుతుండడం చూసి ఆనందిస్తారు కాబట్టే ఈ వృత్తిని చేపడతారు. . . . తనను తాను ఇతరులకు కానుకగా అర్పించుకోవడం బట్టే ఒక వ్యక్తి ఉపాధ్యాయ వృత్తిని చేపడతాడు. నేనైతే లోకాన్ని ఇంకాస్త మెరుగుపరచాలన్న ఆశతోనే ఉపాధ్యాయ వృత్తిని చేపట్టాను.”

అవును, కష్టాలు సవాళ్ళు ఉన్నప్పటికీ వేలాదిమంది స్త్రీ పురుషులు అంకిత భావంతో ఉపాధ్యాయ వృత్తిపట్ల ఆకర్షితులవుతున్నారు. వారు ఎదుర్కొనే కొన్ని ప్రధాన సవాళ్ళేమిటి? తర్వాతి ఆర్టికల్‌ ఆ ప్రశ్నను పరిశీలిస్తుంది. (g02 3/8)

[6వ పేజీలోని బాక్సు]

ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు మధ్య మంచి సంబంధానికి సూచనలు

✔ తల్లిదండ్రుల గురించి తెలుసుకోండి. అది సమయాన్ని వ్యర్థం చేయడం కాదు. అది పరస్పర ప్రయోజనాన్ని కలిగిస్తుంది. మీకు అతి శ్రేష్ఠమైన రీతిలో సహకరించగల వ్యక్తులతో ఒక సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి మీకు గల అవకాశం అదే.

✔ తల్లిదండ్రుల స్థాయిలోనే మాట్లాడండి​—మీకన్నా మరీ తక్కువ జ్ఞానమున్న వ్యక్తులుగా దృష్టిస్తూ మాట్లాడకండి. ఉపాధ్యాయుల మధ్య ఉపయోగించే సాంకేతిక పదజాలాన్ని ఉపయోగించకండి.

✔ పిల్లల గురించి మాట్లాడుతున్నప్పుడు ఎక్కువగా ప్రోత్సాహకరమైన అంశాలనే మాట్లాడండి. నిందారోపణల కన్నా ప్రశంసా వాక్యాలే ఎక్కువ మేలు చేకూరుస్తాయి. పిల్లవాడు విద్యార్థిగా విజయాన్ని సాధించడానికి తల్లిదండ్రులు ఏమి చేయగలరో వివరించండి.

✔ తల్లిదండ్రులను మాట్లాడనివ్వండి, వారు మాట్లాడుతున్నప్పుడు వినండి.

✔ పిల్లవాడి ఇంటి వాతావరణాన్ని గురించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. సాధ్యమైతే ఇంటికి వెళ్ళండి.

✔ తర్వాత సంప్రదించే తేదీని నిర్ణయించండి. దానికి కట్టుబడివుండండి. మీరు కనపరుస్తున్న ఆసక్తి నిజమైనదని అది చూపిస్తుంది.​—టీచింగ్‌ ఇన్‌ అమెరికా ఆధారంగా.

[6వ పేజీలోని చిత్రం]

‘మా నాన్నగారు కూడా ఉపాధ్యాయుడిగా పనిచేశారు.’​విలియం, కెన్యా

[7వ పేజీలోని చిత్రం]

“నాకు పిల్లలతో పనిచేయడం అంటే చాలా ఇష్టం.”​—వలెంటీనా, రష్యా

[7వ పేజీలోని చిత్రాలు]

“ఉపాధ్యాయ వృత్తి విలక్షణమైనది. అందులో పిల్లలతో వ్యవహరించే అవకాశం ఉంటుంది.”​—యోషీయా, జపాన్‌