కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అనుకరించే పక్షులు అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నాయి

అనుకరించే పక్షులు అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నాయి

అనుకరించే పక్షులు అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నాయి

బ్రిటన్‌లోని తేజరిల్లు! రచయిత

“భూమిమీద, అంతరించిపోయే ప్రమాదం చాలా ఎక్కువగా ఉన్న పక్షులలో” చిలుకలు ఉన్నాయి అని అమెరికాలోని మేరీలాండ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన డా. తిమోతీ రైట్‌ వ్యాఖ్యానించారు. విచారకరమైన విషయం ఏమిటంటే, ఈ పక్షులకున్న ప్రకాశవంతమైన రంగుల ఈకలు, మానవ గొంతును అనుకరించగల అద్భుతమైన సామర్థ్యం ఆ ప్రమాదాన్ని మరింత ఎక్కువ చేశాయి.

ఆసక్తికరంగా, సా.శ.పూ. ఐదవ శతాబ్దానికి చెందిన గ్రీకు వైద్యుడు ఒక పెంపుడు చిలుక గురించిన తొలి వ్రాతపూర్వకమైన నివేదికను వ్రాశాడు. ఆ పక్షి తన స్వదేశమైన ఇండియా భాషకు సంబంధించిన కొన్ని పదాలతోపాటు గ్రీకు పదాలను పలకడం మొదలుపెట్టినప్పుడు ఆయన ఆశ్చర్యపోయాడు.

నేడు, చిలుకలకున్న అనుకరించే సామర్థ్యం పట్ల గల ఆకర్షణ పెంపుడు పక్షులుగా వాటికున్న ఆదరణను పెంచి, చట్టవిరుద్ధంగా పక్షులను పట్టుకొని చేసే వ్యాపారం అధికమయ్యేలా చేస్తుంది. గత 20 సంవత్సరాలుగా జరిపిన అధ్యయనాలు, దొంగతనం చేసేవారు, 14 దేశాలలో ఉన్న 21 జాతుల చిలుకలలో 30 శాతం చిలుకల గూడులను నాశనం చేశారని, 4 జాతుల చిలుకల విషయంలో అయితే అలా నాశనమైన గూళ్ళు 70 శాతమని సూచిస్తున్నాయి. ఈ పక్షుల సంతానోత్పత్తి నిష్పత్తి చాలా తక్కువగా ఉండడం అంటే సాధారణంగా ఒక సంవత్సరానికి కేవలం ఒక గూడులోనే గుడ్లు పెట్టడం వల్ల వాటి సహజ నివాసం నాశనం చేయబడడం వల్ల వాటి అమ్మకపు ధరలు అధికమయ్యాయి​—⁠చిలుక ఎంత అరుదైనదైతే, దాని ధర అంత ఎక్కువగా ఉంటుంది.

కొన్ని నిర్దిష్టమైన జాతుల సంఖ్య చాలా తక్కువగా ఉందని చూపించే రిపోర్టులు, అవి అంతరించిపోయే ప్రమాదం ఎంత తీవ్రంగా ఉందో మరింత స్పష్టం చేస్తున్నాయి. బ్రెజిల్‌లో లియర్స్‌ మాకా అనే జాతి చిలుకలు 200 కంటే తక్కువ ఉన్నాయని అంచనా వేయబడింది. ప్యూర్టోరికన్‌ చిలుక పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంది, ఆ జాతి పక్షులు అడవులలో 50 కన్నా తక్కువ జీవించివున్నాయి. ఒకప్పుడు అంతరించిపోయింది అనుకున్న స్పిక్స్‌ మాకా జాతి చిలుకల సంరక్షణ చాలా మట్టుకు వాటిని నిర్బంధించి పెంచేందుకు చేస్తున్న ప్రయత్నాల మీద ఆధారపడి ఉంది.

మిరిమిట్లుగొలిపే అందమైన ఈ పక్షులు జీవించి ఉన్నంత కాలం, వాటి అద్భుతమైన రూపాన్ని బట్టీ వాటికున్న గమనార్హమైన సామర్థ్యాలను బట్టీ ఎంతో సంతోషించే సృష్టికర్త ఉన్నాడని సాక్ష్యమిస్తాయి. మానవ స్వార్థం చిలుకలు అంతరించిపోయేలా చేస్తుందా? కాలమే చెబుతుంది. అంతవరకూ ఈ అనుకరించే పక్షులు అంతరించిపోయే ప్రమాదంలోనే ఉంటాయి. (g02 7/22)

[31వ పేజీలోని చిత్రాలు]

ప్యూర్టోరికన్‌ చిలుకలు

లీర్స్‌ మాకా

స్పిక్స్‌ మాకాలు

[చిత్రసౌజన్యం]

ప్యూర్టోరికన్‌ చిలుకలు: U.S. Geological Survey/Photo by James W. Wiley; లీర్స్‌ మాకా: © Kjell B. Sandved/Visuals Unlimited; స్పిక్స్‌ మాకాలు: Progenies of and courtesy of Birds International, Inc.