కంటెంట్‌కు వెళ్లు

రక్తం విషయంలో దేవుని అభిప్రాయం సరైనదని నేను తెలుసుకున్నాను

రక్తం విషయంలో దేవుని అభిప్రాయం సరైనదని నేను తెలుసుకున్నాను

రక్తం విషయంలో దేవుని అభిప్రాయం సరైనదని నేను తెలుసుకున్నాను

ఒక డాక్టర్‌ తన అనుభవం చెప్తున్నాడు

నేను హాస్పిటల్‌లో ఉన్న ఆడిటోరియంలో కొంతమంది డాక్టర్ల ముందు, చనిపోయిన ఒక వ్యక్తి మీద జరిపిన పరిశోధనా ఫలితాల గురించి మాట్లాడుతున్నాను. ఆ చనిపోయిన వ్యక్తి ఒక క్యాన్సర్‌ పేషెంట్‌. నేను ఇలా అన్నాను: “ఈ పేషెంట్‌కు రక్తం ఎక్కించడం వల్ల ఎర్ర రక్త కణాలన్నీ చచ్చిపోయి, కిడ్నీలు ఫెయిల్‌ అయ్యి అతను మరణించాడని మనం ముగింపుకు రావచ్చు.”

అప్పుడు వెంటనే వాళ్లలో ఒక ప్రొఫెసర్‌ నిలబడి కోపంగా, “అంటే మేము తప్పు రక్తం ఎక్కించామని నువ్వు అంటున్నావా?” అని అరిచాడు. “లేదు, నా ఉద్దేశం అదికాదు” అని నేను అన్నాను. నేను ఆ పేషెంట్‌ కిడ్నీ తాలూకు చిన్నచిన్న భాగాల్ని కొన్ని స్లైడ్ల రూపంలో చూపిస్తూ, ఇలా అన్నాను: “ఇక్కడ మనం ఈ కిడ్నీలో చాలా ఎర్ర రక్త కణాలు చచ్చిపోయి ఉండడం చూస్తున్నాం. దీనివల్లే అతని కిడ్నీలు ఫెయిల్‌ అయ్యాయని చెప్పవచ్చు.” a అప్పుడు హాలులో వాతావరణమంతా వేడెక్కిపోయింది. టెన్షన్‌కి నా నోరు తడారిపోయింది. నేనేమో పెద్దగా అనుభవంలేని డాక్టర్‌ని, కానీ నన్ను నిలదీసింది ఒక ప్రొఫెసర్‌. అయినా గానీ, నేను నా మాటల్ని వెనక్కి తీసుకోదలుచుకోలేదు.

ఆ సంఘటన జరిగే సమయానికి నేను ఇంకా యెహోవాసాక్షి కాలేదు. నేను 1943 లో, జపాన్‌ ఉత్తర భాగంలోని సెండయ్‌ అనే నగరంలో పుట్టాను. మా నాన్న డాక్టర్‌ కాబట్టి, నేను కూడా మెడిసిన్‌ చదవాలని నిర్ణయించుకున్నాను. 1970 లో, నేను మెడిసిన్‌ రెండో సంవత్సరం చదువుతున్నప్పుడు, మసూకో అనే ఆమెను పెళ్లి చేసుకున్నాను.

పాథాలజీ చదవడం మొదలుపెట్టాను

నా మెడిసిన్‌ పూర్తయ్యే వరకు, కుటుంబం కోసం మసూకో కష్టపడి పనిచేసింది. వైద్య రంగం నాకు చాలా నచ్చేది. మానవ శరీర నిర్మాణం చూసి నాకు ఆశ్చర్యంగా అనిపించేది! అయినా గానీ సృష్టికర్త ఉన్నాడా, లేడా అని నేను ఎప్పుడూ ఆలోచించలేదు. వైద్య పరిశోధనల వల్ల నా జీవితానికి ఒక అర్థం వస్తుందని నేను అనుకునేవాణ్ణి. అందుకే, డాక్టర్‌ అయిన తర్వాత, వ్యాధుల గురించి ఎక్కువ తెలుసుకోవాలనే ఉద్దేశంతో పాథాలజీ కూడా చదవడం మొదలుపెట్టాను.

క్యాన్సర్‌ వల్ల చనిపోయిన పేషెంట్ల మీద పరిశోధన చేస్తున్నప్పుడు, రక్తమార్పిడులు నిజంగా అంత ఉపయోగపడతాయా అని నాకు అనుమానం మొదలైంది. క్యాన్సర్‌ బాగా ముదిరినప్పుడు, ఆ పేషెంట్లలో రక్తస్రావం కారణంగా రక్తహీనత ఏర్పడవచ్చు. అంతేకాదు, కీమోథెరపి మూలంగా కూడా రక్తహీనత ఎక్కువౌతుంది. అందుకే డాక్టర్లు తరచూ క్యాన్సర్‌ పేషెంట్లకు రక్తమార్పిడులను సూచిస్తారు. కానీ, ఆ రక్తమార్పిడుల వల్ల క్యాన్సర్‌ ఇంకా ఎక్కువ వ్యాప్తి అవుతుందేమో అని నాకు అనుమానం కలిగింది. కానీ ఇప్పుడు డాక్టర్లందరికీ తెలిసింది ఏంటంటే, రక్తమార్పిడుల వల్ల క్యాన్సర్‌ పేషెంట్లలో వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుంది, క్యాన్సర్‌ తిరగబెట్టే అవకాశం ఎక్కువ ఉంటుంది, ఆయుష్షు కూడా తగ్గుతుంది. b

ఈ ఆర్టికల్‌ మొదట్లో నేను చెప్పిన సంఘటన 1975 లో జరిగింది. నన్ను నిలదీసిన ఆ ప్రొఫెసరే ఆ పేషెంట్‌కు వైద్యం చేశాడు. ఆయన రక్త సంబంధిత వ్యాధుల్లో స్పెషలిస్ట్‌. అందుకే, రక్తమార్పిడుల వల్ల ఆ పేషెంట్‌ చనిపోయాడు అనగానే ఆయనకు కోపం పొడుచుకొచ్చింది. కానీ, నేను మాత్రం చెప్పాలనుకుంది చెప్పాను. తర్వాత మెల్లమెల్లగా ఆయన చల్లబడ్డాడు.

రోగాలు, మరణాలు లేని కాలం

దాదాపు అదే సమయంలో, ఒక పెద్దవయసు ఆవిడ మసూకోను కలిసింది. ఆవిడ ఒక యెహోవాసాక్షి. ఆమె మాట్లాడుతున్నప్పుడు “యెహోవా” అనే పదం ఉపయోగించింది. నా భార్య, ఆ పదానికి అర్థమేంటి అని అడిగింది. అప్పుడు ఆ పెద్దవయసు ఆవిడ, “యెహోవా అనేది నిజమైన దేవుని పేరు” అని చెప్పింది. మసూకో చిన్నప్పటి నుండి బైబిలు చదువుతుంది. కానీ, తన బైబిల్లో దేవుని పేరు ఉండాల్సిన చోట “ప్రభువు” అనే పదం ఉంది. ఇప్పుడు దేవునికి ఒక పేరు ఉందని ఆమె తెలుసుకుంది!

వెంటనే మసూకో ఆ పెద్దవయసు ఆవిడ దగ్గర బైబిలు స్టడీ తీసుకోవడం మొదలుపెట్టింది. నేను అర్ధరాత్రి ఒంటిగంటకు హాస్పిటల్‌ నుండి ఇంటికి వచ్చినప్పుడు, నా భార్య చాలా ఉత్సాహంగా, “తెలుసా రోగాలు, మరణాలు ఉండని కాలం వస్తుందని బైబిలు చెప్తుంది!” అని అంది. నేను, “అలా జరిగితే చాలా బాగుంటుంది!” అన్నాను. అప్పుడు తను, “కొత్తలోకం వచ్చేస్తుంది, నువ్వు టైం వేస్ట్‌ చేసుకోవడం నాకు ఇష్టంలేదు” అంది. తను నన్ను డాక్టర్‌గా ఉండొద్దు అంటుందనుకొని, నేను తన మీద కోపం పెంచుకున్నాను. మా ఇద్దరి బంధం బీటలువారింది.

నా భార్య మాత్రం పట్టువిడవకుండా, నాతో బైబిలు గురించి మాట్లాడడానికి ప్రయత్నించేది. ఆమె ప్రార్థన చేసుకునిమరీ, మంచిమంచి లేఖనాలు వెతికి నాకు చూపించేది. ఆమె చెప్పినవాటిలో, ముఖ్యంగా ప్రసంగి 2:22, 23 లేఖనం నా హృదయాన్ని తాకింది. “సూర్యుని కింద మనిషి పడే కష్టమంతటి వల్ల, కష్టపడి పనిచేసేలా అతన్ని నడిపించే కోరిక వల్ల నిజానికి అతనికి వచ్చే లాభం ఏంటి? . . . రాత్రిపూట కూడా అతని హృదయానికి నెమ్మది ఉండదు. ఇది కూడా వ్యర్థమే.” నాకు నిజంగా అలానే అనిపించింది. నేను రాత్రి-పగలు అనే తేడా లేకుండా కష్టపడి పనిచేస్తున్నాను, కానీ నిజమైన సంతృప్తి మాత్రం దొరకట్లేదు.

1975, జూలైలో ఒక ఆదివారం ఉదయం, నా భార్య యెహోవాసాక్షుల రాజ్యమందిరంలో మీటింగ్‌కి వెళ్లింది. నాకు కూడా ఉన్నట్టుండి ఎందుకో వెళ్లాలనిపించి వెళ్లాను. నన్ను అక్కడ చూసి నా భార్య చాలా ఆశ్చర్యపోయింది. సాక్షులు నన్ను ఆప్యాయంగా పలకరించారు. ఇక అప్పటినుండి, నేను ప్రతీ ఆదివారం మీటింగ్‌కి వెళ్లడం మొదలుపెట్టాను. దాదాపు ఒక నెల తర్వాత, ఒక యెహోవాసాక్షి నాతో బైబిలు స్టడీ చేయడం మొదలుపెట్టాడు. నా భార్య, యెహోవాసాక్షుల్ని కలిసిన మూడు నెలల్లోనే బాప్తిస్మం తీసుకుంది.

రక్తం విషయంలో దేవుని అభిప్రాయం సరైనదని నేను ఒప్పుకున్నాను

బైబిలు స్టడీలో క్రైస్తవులు ‘రక్తానికి దూరంగా ఉండాలని’ బైబిలు చెప్తుందని నేను తెలుసుకున్నాను. (అపొస్తలుల కార్యాలు 15:28, 29; ఆదికాండం 9:4) నాకు అప్పటికే రక్తమార్పిడుల మీద సందేహాలు ఉండేవి కాబట్టి, రక్తం విషయంలో దేవుని అభిప్రాయం c సరైనదని ఒప్పుకోవడం పెద్ద కష్టమనిపించలేదు. నాకు ఇలా అనిపించింది: ‘ఒక సృష్టికర్త ఉండుంటే, ఆయన చెప్పేది ఇదే అయితే, ఖచ్చితంగా ఇది సరైనదే అయ్యుంటుంది.’

రోగాలకు, మరణానికి ఆదాము చేసిన పాపమే కారణమని కూడా నేను స్టడీలో తెలుసుకున్నాను. (రోమీయులు 5:12) ఆ సమయంలో, నేను ధమనులు గట్టిపడే వ్యాధి (ఆర్టీరియోస్క్‌లెరోసిస్‌) మీద పరిశోధన చేస్తున్నాను. మనకు వయసు మీదపడే కొద్దీ మన ధమనులు గట్టిపడి, సన్నగా అవుతాయి. దానివల్ల గుండె, మెదడు, కిడ్నీ వ్యాధులు వస్తాయి. వీటన్నిటికీ, వారసత్వంగా వచ్చిన పాపమే కారణం అనేది నాకు సరైనదిగా అనిపించింది. ఆ తర్వాత, మెల్లమెల్లగా నాకు మెడిసిన్‌ మీద ఆసక్తి తగ్గింది. ఎందుకంటే, యెహోవా దేవుడు మాత్రమే రోగాల్ని, మరణాన్ని తీసేయగలడు!

1976, మార్చిలో, అంటే బైబిలు స్టడీ మొదలుపెట్టిన ఏడు నెలల తర్వాత, నేను యూనివర్సిటీలో చేస్తున్న పరిశోధనల్ని ఆపేశాను. నేను మళ్లీ డాక్టర్‌గా పని చేయగలనో లేదో అని భయపడ్డాను గానీ, వేరే హాస్పిటల్‌లో నాకు ఉద్యోగం దొరికింది. 1976, మే నెలలో నేను బాప్తిస్మం తీసుకున్నాను. నా జీవితాన్ని శ్రేష్ఠమైన విధంగా ఉపయోగించే మార్గం, పయినీరుగా (అంటే పూర్తికాలం సువార్త ప్రకటించే వ్యక్తిగా) సేవ చేయడమే అని నేను నిర్ణయించుకున్నాను. అందుకే 1977, జూలైలో నేను పయినీరు సేవ మొదలుపెట్టాను.

రక్తం విషయంలో దేవుని అభిప్రాయాన్ని సమర్థించడం

1979, నవంబరులో మసూకో, నేనూ చీబా సంఘానికి వెళ్లాం. అక్కడ సువార్త ప్రకటించేవాళ్ల అవసరం ఎంతో ఉంది. అక్కడ ఒక హాస్పిటల్‌లో నేను పార్ట్‌-టైం డాక్టరుగా చేరాను. నేను ఉద్యోగానికి వెళ్లిన మొదటి రోజే, కొంతమంది సర్జన్లు నా చుట్టూ చేరి ప్రశ్నల వర్షం కురిపించారు. వాళ్లు, “ఎవరైనా రక్తం ఎక్కించుకోవాల్సిన పేషెంట్‌ నీ దగ్గరికి వచ్చారనుకో, ఒక యెహోవాసాక్షిగా నువ్వు ఏం చేస్తావు?” అని గుచ్చిగుచ్చి అడిగారు.

రక్తం గురించి దేవుడు ఏం చెప్తున్నాడో, అదే నేను పాటిస్తాను అని గౌరవపూర్వకంగా వివరించాను. రక్తమార్పిడులకు ప్రత్యామ్నాయ పద్ధతులు ఉన్నాయని, నా పేషెంట్లకు సహాయం చేయడానికి నేను చేయగలిగినదంతా చేస్తానని వాళ్లకు చెప్పాను. దాదాపు గంటసేపు అలా మాట్లాడుకున్న తర్వాత, మా సర్జరీ చీఫ్‌ ఇలా అన్నాడు: “నాకు అర్థమైంది. ఒకవేళ విపరీతంగా రక్తం పోయి ఎవరైనా పేషెంట్‌ వస్తే, మేము చూసుకుంటాంలే. నువ్వు కంగారుపడకు.” మాములుగా అయితే ఆ సర్జరీ చీఫ్‌ చాలా కోపిష్ఠి అని విన్నాను. కానీ ఆ గంటసేపు చర్చ తర్వాత, మేమిద్దరం చక్కగా కలిసి పనిచేశాం. ఆయన ఎప్పుడూ నా నమ్మకాలకు విలువ ఇచ్చేవాడు.

కష్టమైన పరిస్థితుల్లో కూడా నేను రక్తం విషయంలో దేవుని అభిప్రాయాన్ని గౌరవించాను

మేము చీబా సంఘంలో సేవ చేస్తున్నప్పుడు, జపాన్‌లోని ఎబినాలో యెహోవాసాక్షుల కొత్త ప్రధాన కార్యాలయం (బెతెల్‌) నిర్మాణంలో ఉంది. నేనూ, నా భార్య వారానికి ఒకసారి, అక్కడ నిర్మాణ పనిలో పాల్గొంటున్న వాలెంటీర్ల ఆరోగ్యాన్ని చూసుకోవడానికి వెళ్లేవాళ్లం. కొన్ని నెలల తర్వాత, ఎబినా బెతెల్‌లో పూర్తికాల సేవ చేయడానికి మాకు ఆహ్వానం వచ్చింది. కాబట్టి 1981 మార్చిలో, 500 కన్నా ఎక్కువమంది నిర్మాణ వాలెంటీర్లు ఉండడానికి ఏర్పాటు చేసిన తాత్కాలిక భవనాల్లో మేము నివసించడం మొదలుపెట్టాం. ఉదయం పూట, నేను ఆ నిర్మాణ స్థలంలో ఉన్న టాయిలెట్లు శుభ్రం చేయడంలో సహాయం చేసేవాణ్ణి. మధ్యాహ్నం పూట, మెడికల్‌ చెకప్స్‌ చేసేవాణ్ణి.

నా పేషెంట్లలో ఒకరు, ఇల్మా ఇజ్లాబ్‌ అనే సహోదరి. ఆమె 1949 లో ఆస్ట్రేలియా నుండి జపాన్‌ వచ్చిన మిషనరీ. ఆమెకు బ్లడ్‌ క్యాన్సర్‌ ఉందని, ఇంకా కొన్ని నెలలే బ్రతుకుతుందని డాక్టర్లు చెప్పారు. కానీ, ఆమె రక్తం ఎక్కించుకుని తన ఆయుష్షును పెంచుకోవడం కన్నా, బ్రతికినన్ని రోజులు బెతెల్‌లోనే ఉండాలని నిర్ణయించుకుంది. ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని పెంచే ఎరిత్రోపోయిటిన్‌ వంటి మందులు అప్పటికింకా అందుబాటులోకి రాలేదు. కాబట్టి, కొన్నిసార్లు ఆమెకు హిమోగ్లోబిన్‌ ఎంతగా తగ్గిపోయేదంటే, 3 లేదా 4 గ్రాములే ఉండేది! (అసలైతే 12 నుండి 15 గ్రాములు ఉండాలి.) ఆమెకు వైద్యం అందించడానికి నేను చేయగలిగినదంతా చేశాను. ఆమె 1988, జనవరిలో చనిపోయింది. అంటే, డాక్టర్లు ఆమె చనిపోతుంది అని చెప్పిన దాదాపు ఏడు సంవత్సరాల తర్వాత అన్నమాట! ఆఖరి క్షణం వరకు కూడా, ఆమె దేవుని మీద చెక్కుచెదరని విశ్వాసం చూపించింది.

ఇన్ని సంవత్సరాల్లో, చాలామంది వాలెంటీర్లకు జపాన్‌లోని యెహోవాసాక్షుల బ్రాంచి కార్యాలయంలో సర్జరీలు అవసరమయ్యాయి. సంతోషకరంగా, దగ్గర్లోని హాస్పిటల్స్‌లో ఉన్న డాక్టర్లు, రక్తం లేకుండా సర్జరీ చేయడానికి ఒప్పుకున్నారు. ఆపరేషన్‌ విధానాల్ని చూడడానికి తరచూ నన్ను ఆపరేషన్‌ థియేటర్‌లోకి పిలిచేవాళ్లు. కొన్నిసార్లయితే, నేను ఆపరేషన్లలో కూడా సహాయం చేశాను. రక్తం విషయంలో యెహోవాసాక్షుల నిర్ణయాన్ని గౌరవించే డాక్టర్లకు నేను ఎంతో కృతజ్ఞుణ్ణి. వాళ్లతో కలిసి పనిచేయడం వల్ల, నా నమ్మకాల్ని పంచుకునే ఎన్నో అవకాశాలు నాకు దొరికాయి. ఈమధ్యే ఒక డాక్టరు బాప్తిస్మం తీసుకుని, యెహోవాసాక్షి కూడా అయ్యాడు.

ఆసక్తికరంగా, యెహోవాసాక్షులకు రక్తం లేకుండా చికిత్స చేయడానికి డాక్టర్లు చేసే కృషి వల్ల వైద్య రంగంలోనే ఒక కొత్త పద్ధతికి తెరతీసింది. రక్తమార్పిడులకు దూరంగా ఉండడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉంటాయో రక్తరహిత చికిత్సలు రుజువు చేశాయి. పరిశోధనల్లో ఏం తేలిందంటే, రక్తం ఎక్కించుకోని పేషెంట్లు తొందరగా కోలుకుంటున్నారు, ఆపరేషన్‌ తర్వాత వచ్చే సమస్యలు కూడా తక్కువ ఉంటున్నాయి.

ఈ విశ్వంలోనే బెస్ట్‌ డాక్టర్‌ దగ్గర నేను నేర్చుకుంటూ ఉన్నాను

వైద్య రంగంలో తాజాగా వస్తున్న మార్పుల్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి నేను ప్రయత్నిస్తాను. అయితే, అదే సమయంలో నేను ఈ విశ్వంలోనే గొప్ప డాక్టర్‌ అయిన యెహోవా దగ్గర నేర్చుకుంటూ ఉన్నాను. ఆయన మనుషుల్ని కేవలం పైపైన చూడడు గానీ, మొత్తం వ్యక్తిని చూస్తాడు. (1 సమూయేలు 16:7) డాక్టర్‌గా నేను కూడా, పేషెంట్‌ అనారోగ్యం మీద మనసుపెట్టే బదులు, ప్రతీ పేషెంట్‌ని మొత్తం వ్యక్తిగా చూడడానికి ప్రయత్నిస్తాను. దానివల్ల, ఎక్కువ శ్రద్ధతో వైద్యం అందించగలుగుతాను.

నేను ఇప్పటికీ బెతెల్‌లో సేవ చేస్తున్నాను. నాకు ఇప్పటికీ ఎంతో ఆనందాన్నిచ్చే విషయాల్లో ఒకటి, యెహోవా గురించి, రక్తం విషయంలో ఆయన అభిప్రాయం గురించి ఇతరులకు చెప్పడం. గొప్ప డాక్టర్‌ అయిన యెహోవా దేవుడు అతిత్వరలోనే రోగాలన్నిటినీ, మరణాన్ని తీసేయాలని నేను ప్రార్థిస్తున్నాను.​—యాసుషి ఐజవా చెప్పినది.

[అధస్సూచీలు]

a డాక్టర్‌ డినైస్‌ ఎమ్‌. హార్మెనింగ్‌ రాసిన మోడ్రన్‌ బ్లడ్‌ బ్యాంకింగ్‌ అండ్‌ ట్రాన్స్‌ఫ్యూషన్‌ ప్రాక్టీసెస్‌ అనే పుస్తకం ఇలా చెప్తుంది: “గర్భవతులకు, అంతకుముందు రక్తం ఎక్కించుకున్న వాళ్లకు, లేదా అవయవ మార్పిడి జరిగినవాళ్లకు రక్తం ఎక్కిస్తే, కొంతకాలం తర్వాత తీవ్రమైన రియాక్షన్‌ జరిగి వాళ్లలోని ఎర్ర రక్త కణాలు చచ్చిపోయే ప్రమాదముంది.” అలాంటి కేసుల్లో, ఆ రియాక్షన్‌కు కారణమయ్యే యాంటీబాడీల్ని “రక్తమార్పిడికి ముందు చేసే సాధారణ పరీక్షల్లో గుర్తించలేం.” డైలీస్‌ నోట్స్‌ ఆన్‌ బ్లడ్‌ అనే పుస్తకం ఇలా చెప్తుంది: “సరిపడని రక్తం కొద్ది మోతాదులో ఎక్కించినా గానీ, ఎర్ర రక్త కణాలు చచ్చిపోయే ప్రక్రియ మొదలవ్వవచ్చు.” దాంతో కిడ్నీలు ఫెయిల్‌ అవుతాయి. “అప్పుడు, రక్తంలో ఉన్న మలినాల్ని కిడ్నీ ఫిల్టర్‌ చేయలేకపోతుంది కాబట్టి, మెల్లమెల్లగా అవన్నీ పేషెంట్‌ శరీరంలో విషంలా తయారౌతాయి.”

b ఆగస్టు, 1988, జర్నల్‌ ఆఫ్‌ క్లినికల్‌ ఆంకాలజీ ఇలా చెప్పింది: “ఆపరేషన్‌ ముందు గానీ, తర్వాత గానీ, ఆపరేషన్‌ సమయంలో గానీ రక్తం ఎక్కించుకున్న క్యాన్సర్‌ పేషెంట్స్‌ కంటే, ఎక్కించుకోని క్యాన్సర్‌ పేషెంట్లే త్వరగా కోలుకునే అవకాశముంది.”

c రక్తం విషయంలో బైబిలు ఇంకా ఏం చెప్తుందో తెలుసుకోవడానికి, యెహోవాసాక్షులు ప్రచురించిన రక్తము నీ జీవమును ఎట్లు కాపాడగలదు? అనే బ్రోషురు చూడండి.

[బ్లర్బ్‌]

“రక్తమార్పిడులకు ప్రత్యామ్నాయ పద్ధతులు ఉన్నాయని, నా పేషెంట్లకు సహాయం చేయడానికి నేను చేయగలిగినదంతా చేస్తానని వాళ్లకు చెప్పాను”

[బ్లర్బ్‌]

“రక్తమార్పిడులకు దూరంగా ఉండడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉంటాయో రక్తరహిత చికిత్సలు రుజువు చేశాయి”

[చిత్రాలు]

పైన: బైబిలు ప్రసంగం ఇస్తూ

కుడి: ఇప్పుడు, నా భార్య మసూకోతో