కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీ పిల్లలకు జ్వరం వచ్చినప్పుడు

మీ పిల్లలకు జ్వరం వచ్చినప్పుడు

మీ పిల్లలకు జ్వరం వచ్చినప్పుడు

“నాకు నీరసంగా ఉంది!” అని మీ బాబు బాధగా అన్నప్పుడు, మీరు వెంటనే వాడికి జ్వరం వచ్చిందేమోనని పరీక్షిస్తారు. వాడికి జ్వరంవుంటే, మీరు కలతపడవచ్చు.

అమెరికా, మేరీల్యాండ్‌, బాల్టిమోర్‌లోవున్న ద జాన్స్‌ హోప్‌కిన్స్‌ చిల్డ్రన్స్‌ సెంటర్‌ చేసిన అధ్యయనం ప్రకారం, 91 శాతం తల్లిదండ్రులు “మామూలు జ్వరమైనా సరే మూర్ఛరోగం లేదా మెదడు దెబ్బతినడంవంటి హానికరమైన ప్రభావాలను కలుగజేయగలదని” నమ్ముతున్నారు. “89% తల్లిదండ్రులు పిల్లవాడి జ్వరం 102 డిగ్రీల ఫారన్‌హీట్‌కు (38.9 డిగ్రీల సెల్సియస్‌కు) చేరకముందే జ్వరం తగ్గే మందులు ఇచ్చినట్లు” అదే అధ్యయనం చూపిస్తోంది.

మీ పిల్లవాడికి జ్వరంవస్తే మీరు ఎంతమేరకు జాగ్రత్త తీసుకోవాలి? దానికి చికిత్స చేయడానికి శ్రేష్ఠమైన మార్గాలేమిటి?

జ్వరంవహించే ప్రాముఖ్యమైన పాత్ర

జ్వరం దేనివల్ల వస్తుంది? ఒక వ్యక్తి శరీరపు సగటు ఉష్ణోగ్రత (థర్మామీటరు నోట్లోపెట్టి పరీక్షించినప్పుడు) దాదాపు 37 డిగ్రీల సెల్సియస్‌ ఉంటుంది, అది సాధారణంగా రోజంతట్లో 1 డిగ్రీ అటూఇటుగా మారుతూ ఉంటుంది. * ఆ విధంగా మీ శరీర ఉష్ణోగ్రత ఉదయం తక్కువగా ఉండి మధ్యాహ్నం దాటేసరికి ఎక్కువగా ఉండవచ్చు. మెదడు క్రిందిభాగంలో ఉండే హైపోథాలమస్‌, థర్మోస్టాట్‌ మాదిరిగా శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. బ్యాక్టీరియా లేదా వైరస్‌లు దాడి చేసినప్పుడు, శరీర రోగనిరోధక వ్యవస్థ దానికి ప్రతిస్పందించి పైరోజన్లు అని పిలువబడే పదార్థాలను ఉత్పత్తి చేసినప్పుడు జ్వరం వస్తుంది. ఇది హైపోథాలమస్‌ శరీర ఉష్ణోగ్రత పెరిగేలా “సవరించడానికి” కారణమవుతుంది.

జ్వరం ఇబ్బంది కలిగించి, నిర్జలీకరణ కలిగించినంత మాత్రాన అది హానికరమైనది కాదు. వాస్తవానికి, మాయో ఫౌండేషన్‌ ఫర్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ ప్రకారం బ్యాక్టీరియా, వైరస్‌లు కలిగించే ఇన్ఫెక్షన్‌ను శరీరం నుండి తొలగించడానికి సహాయపడడంలో జ్వరం కీలకపాత్ర వహిస్తున్నట్లుగా కనిపిస్తోంది. “జలుబు, ఇతర శ్వాసకోశ ఇన్ఫెక్షన్‌లకు కారణమయ్యే వైరస్‌లు తక్కువ ఉష్ణోగ్రతను ఇష్టపడతాయి. కొద్దిపాటి జ్వరం కలుగజేయడం ద్వారా మీ శరీరం నిజానికి ఆ వైరస్‌లను తొలగించడానికి దోహదపడుతుంది.” అందుకని, ఈ అధికార రీసెర్చ్‌ సెంటర్‌ ఇంకా ఇలా చెబుతోంది: “మామూలు జ్వరాన్ని తగ్గించడం అనవసరం, అది మీ పిల్లవాని సహజ శరీర స్వస్థతా వ్యవస్థను ఆటంకపరచవచ్చు.” ఆసక్తికరమైన విషయమేమంటే, మెక్సికోలోని ఒక ఆసుపత్రి హైపోథెర్మియా అని పిలువబడే చికిత్స ద్వారా అంటే శరీర ఉష్ణోగ్రతను పెంచడం ద్వారా కొన్ని అస్వస్థతలకు చికిత్స సహితం అందిస్తోంది.

అమెరికన్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఎమర్జెన్సీ ఫిజిషియన్స్‌కు చెందిన డాక్టరు ఆల్‌ సాక్కేటీ ఇలా చెబుతున్నాడు: “జ్వరం ఒక సమస్యగా మారడం అరుదు. అయితే శరీరంలో ఇన్ఫెక్షన్‌ ఉందనడానికి అదొక సూచన. అందువల్ల, పిల్లవాడికి జ్వరంవస్తే ఆ పిల్లవాడిమీద, వాడికి ఉండగల ఇన్ఫెక్షన్‌మీద దృష్టినిలపాలి అంతేగానీ పిల్లవాడికి జ్వరం ఎంతవుందో చూడ్డంపై కాదు.” ది అమెరికన్‌ అకాడమీ అఫ్‌ పీడియాట్రిక్స్‌ ఇలా చెబుతోంది: “పిల్లవాడు మరీ ఇబ్బంది పడకపోతే లేదా జ్వరంతోపాటు మూర్ఛవచ్చే పూర్వచరిత్ర లేకపోతే 101 డిగ్రీల ఫారన్‌హీట్‌ (38.3 డిగ్రీల సెల్సియస్‌) ఉండే జ్వరాలకు చికిత్స చేయడం అనవసరం. మీ పిల్లవాడికి జ్వరంతోపాటు మూర్ఛవచ్చే పూర్వచరిత్ర లేకపోతే లేదా దీర్ఘకాల వ్యాధి లేకపోతే, జ్వరం ఎక్కువున్నా కూడా అది ప్రమాదకరమైనది లేదా గంభీరమైనది కాదు. మీ పిల్లవాని ప్రవర్తనను గమనించడమే ఎక్కువ ప్రాముఖ్యం. వాడు బాగానే తింటూ, చక్కగా నిద్రపోతుంటే, అప్పుడప్పుడు ఆటలాడుతుంటే వాడికి బహుశా ఎలాంటి చికిత్సా అవసరం లేదు.”

మాములు జ్వరానికి ఎలాంటి చికిత్స ఇవ్వాలి

అంటే దానర్థం మీ పిల్లవాడి జ్వరాన్ని తగ్గించడానికి మీరు చేయగలిగిందేమీ లేదని కాదు. మామూలు జ్వరానికి ఈ క్రింది చికిత్సలను వైద్య నిపుణులు సిఫారసు చేస్తున్నారు: మీ పిల్లవాని గదిని హాయిగా ఉండేంత చల్లగా ఉంచండి. పిల్లవానికి తేలికైన దుస్తులు తొడగండి. (అధికవేడి జ్వరాన్ని ఎక్కువ చేయగలదు.) నీళ్లు, పలచని పండ్ల రసాలు, సూప్‌వంటి ద్రవపదార్థాలు ఎక్కువ తీసుకోవడానికి పిల్లవాణ్ణి ప్రోత్సహించండి, ఎందుకంటే జ్వరం నిర్జలీకరణకు దారితీస్తుంది. * (కోలా లేదా బ్లాక్‌ టీవంటి కేఫేయిన్‌ ఉన్న ద్రవపదార్థాలు మూత్రవర్ధకాలు కాబట్టి నిర్జలీకరణ ఎక్కువకావడానికి కారణం కావచ్చు.) పసిపిల్లలకు తల్లిపాలు పడుతూనే ఉండాలి. జ్వరం ఉదర క్రియను తక్కువ చేస్తుంది కాబట్టి జీర్ణానికి కష్టమయ్యే ఆహార పదార్థాలు తినడం మానెయ్యాలి.

పిల్లవాడి జ్వరం 38.9 డిగ్రీల సెల్సియస్‌కంటే ఎక్కువైనప్పుడు, మందుల షాపునుండి కొనితెచ్చే ఎసిటమినోఫెన్‌ లేదా ఐబుప్రోఫెన్‌ వంటి జ్వరంతగ్గే మాత్రలు తరచూ వాడతారు. అయితే, లేబులుమీదున్న మోతాదు ప్రకారమే మందు తీసుకోవడం ప్రాముఖ్యం. (రెండు సంవత్సరాలకు తక్కువ వయస్సున్న పిల్లలకు డాక్టరు సలహా లేకుండా ఎలాంటి మందులు ఇవ్వకూడదు.) జ్వరంతగ్గే మందులు వైరస్‌లమీద పనిచెయ్యవు. అందువల్ల, జలుబు లేదా అలాంటి ఇతర వ్యాధుల నుండి పిల్లలు త్వరగా కోలుకునేలా అవిచేయవు గానీ అవి చికాకును తొలగిస్తాయి. ఆస్ప్రిన్‌కు ప్రాణహాని కలిగించే జబ్బు రియేస్‌ సిండ్రోమ్‌కు సంబంధం ఉంది కాబట్టి, జ్వరం తగ్గడానికి 16 సంవత్సరాలకు తక్కువ వయస్సుగల పిల్లలకు ఆస్ప్రిన్‌ ఇవ్వకూడదని కొందరు నిపుణులు సిఫారసు చేస్తున్నారు. *

స్పంజితో శరీరం తుడవడం కూడా జ్వరాన్ని తగ్గిస్తుంది. కొన్ని సెంటీమీటర్ల మట్టంగా గోరువెచ్చని నీళ్లున్న చిన్న టబ్బులో పిల్లవాణ్ణి కూర్చోబెట్టి స్పంజితో ఒళ్లు తుడవండి. (రబ్బింగ్‌ ఆల్కహాల్‌ విషయుక్తంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి దానిని ఉపయోగించకండి.)

డాక్టరును ఎప్పుడు పిలవాలి అనే విషయానికి సంబంధించి సహాయకరమైన సమాచారం దీనితోపాటు ఇవ్వబడ్డ బాక్సులో ఉంది. డెంగ్యూ, ఇబోలా వైరస్‌, టైఫాయిడ్‌ లేదా ఎల్లో ఫీవర్‌ వంటి వైరల్‌ జ్వరాలు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో నివసించే వారికి ప్రత్యేకంగా వైద్య అవధానం ప్రాముఖ్యం.

కాబట్టి, సాదాసీదాగా చెప్పాలంటే మీ పిల్లవాడికి ఇబ్బంది కలుగకుండా చూడడమే మీరు చేపట్టగల ఉత్తమ విధానం. నరాలు దెబ్బతినేంత లేదా ప్రాణంపోయేంత ఎక్కువ జ్వరం రావడం అరుదు అని మరచిపోకండి. జ్వరం కలిగించే మూర్ఛలు సహితం, ప్రమాదకరంగా అనిపించినా సాధారణంగా అవి శాశ్వత హాని కలిగించవు.

నిజమే, నివారణే అత్యుత్తమ వైద్యం. ఇన్ఫెక్షన్‌ నుండి మీ పిల్లవాణ్ణి కాపాడేందుకు అత్యంత ఫలదాయక మార్గమేమంటే పిల్లలకు ప్రాథమిక పరిశుభ్రత నేర్పించడమే. పిల్లలు తరచూ ప్రత్యేకంగా భోజనానికి ముందు, టాయిలెట్‌ ఉపయోగించిన తర్వాత, రద్దీగావుండే ప్రాంతాల్లో తిరిగొచ్చిన తర్వాత లేదా పెంపుడు జంతువులతో ఆడుకున్న తర్వాత చేతులు కడుక్కోవాలని వాళ్లకు నేర్పించాలి. మీరు చేయగలిగినదంతా చేసిన తర్వాత కూడా మీ పిల్లవాడికి మామూలు జ్వరంవస్తే, అతిగా ప్రతిస్పందించకండి. మనం నేర్చుకున్నట్లుగా మీ పిల్లవాడు కోలుకొనేలా సహాయం చేయడానికి మీరు చేయాల్సింది ఎంతో ఉంది. (g03 12/08)

[అధస్సూచీలు]

^ శరీర భాగాన్నిబట్టి, థర్మామీటరునుబట్టి శరీర ఉష్ణోగ్రత మారే అవకాశం ఉంది.

^ జ్వరంతోపాటు విరోచనాలు లేదా వాంతులు అవుతుంటే పునర్జలీకరణ ఫార్ములా కోసం 1995 ఏప్రిల్‌ 8, తేజరిల్లు! (ఆంగ్లం) సంచికలో 11వ పేజీ చూడండి.

^ రియేస్‌ సిండ్రోమ్‌ అనేది వైరల్‌ ఇన్ఫెక్షన్‌ తర్వాత పిల్లల్లో వృద్ధయ్యే ప్రమాదకరమైన నరాల వ్యాధి.

[31వ పేజీలోని బాక్సు]

జ్వరంతోవున్న పిల్లవాడి పరిస్థితి ఇలావుంటే డాక్టరును పిలవండి . . .

◼ మూడునెలలు అంతకంటే తక్కువ వయసున్న పసిపిల్లల మలాశయపు ఉష్ణోగ్రత 38 డిగ్రీల సెల్సియస్‌ లేదా అంతకంటే ఎక్కువ ఉంటే

◼ మూడు నుండి ఆరు నెలల వయసు పిల్లల ఉష్ణోగ్రత 38.3 డిగ్రీల సెల్సియస్‌ లేదా అంతకంటే ఎక్కువ ఉంటే

◼ ఆరు నెలలకంటే ఎక్కువ వయసున్న పిల్లల ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్‌ లేదా అంతకంటే ఎక్కువ ఉంటే

◼ ద్రవపదార్థాలు నిరాకరిస్తూ, నిర్జలీకరణ లక్షణాలు కనబడుతుంటే

◼ మూర్ఛపోయినప్పుడు లేదా తీవ్ర అలసట కనబడినప్పుడు

◼ 72 గంటల తర్వాత కూడా ఇంకా జ్వరం ఉంటే

◼ అదేపనిగా ఏడుస్తుంటే లేదా బిత్తరచూపులు లేదా సంధి లక్షణాలు కనబడితే

◼ దద్దుర్లు రావడం, శ్వాస పీల్చడం కష్టం కావడం, విరోచనాలు లేదా ఆగకుండా వాంతులు అవుతుంటే

◼ మెడ పట్టేస్తే లేదా తీవ్రమైన తలనొప్పి ఉంటే

[చిత్రసౌజన్యం]

సమాచార సేకరణ: ది అమెరికన్‌ అకాడమీ ఆఫ్‌ పీడియాట్రిక్స్‌