కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మనం బాధలనుభవించడానికి దేవుడు ఎందుకు అనుమతిస్తున్నాడు?

మనం బాధలనుభవించడానికి దేవుడు ఎందుకు అనుమతిస్తున్నాడు?

యువత ఇలా అడుగుతోంది . . .

మనం బాధలనుభవించడానికి దేవుడు ఎందుకు అనుమతిస్తున్నాడు?

“దేవుడు పరలోకంలో ఉంటాడు, అక్కడంతా హాయిగా ఉంటుంది, ఇక్కడ మనమేమో బాధలనుభవిస్తున్నాము.”​—మేరి. *

నేటి యౌవనస్థులు క్రూరమైన లోకంలో జన్మించారు. వేలాదిమంది జీవితాలను బలిగొనే ఘోరమైన భూకంపాలు, ప్రకృతి వైపరీత్యాలు సర్వసాధారణమైనట్లు కనిపిస్తున్నాయి. యుద్ధాలు, తీవ్రవాద దాడులు వార్తల ముఖ్యాంశాలుగా ఉన్నాయి. అనారోగ్యం, వ్యాధులు, నేరాలు, దుర్ఘటనలు మన ప్రియమైనవారిని మనకు దూరం చేస్తున్నాయి. పైన ప్రస్తావించబడిన మేరి అలాంటి విషాదాన్ని తన ఇంట్లోనే అనుభవించింది. ఆ చేదైన మాటలు ఆమె తండ్రి చనిపోయిన తర్వాత ఆమె పలికినవి.

మనం వ్యక్తిగతంగా విషాదానికి గురైనప్పుడు ప్రతికూలంగా భావించడం, కలవరపడడం, కోపం తెచ్చుకోవడం మానవ నైజం. ‘ఇలా ఎందుకు జరిగింది?’ అని మీరు తలంచవచ్చు. ‘నాకే ఇలా ఎందుకు జరిగింది?’ లేదా ‘ఇప్పుడే ఎందుకు జరిగింది?’ వంటి ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానాలు అవసరం. అయితే వాటికి సరైన సమాధానాలు కావాలంటే మనం సరైన మూలాన్ని ఆశ్రయించాలి. నిజమే, టెరెల్‌ అనే యువకుడు వ్యాఖ్యానించినట్లు కొన్నిసార్లు ప్రజలు “ఎంత ఎక్కువగా బాధపెడతారంటే ఆ విషయం గురించి జాగ్రత్తగా ఆలోచించడమే కష్టమవుతుంది.” కాబట్టి సహేతుకంగా, జ్ఞానయుక్తంగా ఆలోచించగలిగేలా మీరు మీ భావోద్వేగాలను కొంతమేరకు శాంతింపజేసుకోవడానికి ప్రయత్నించాలి.

బాధాకరమైన వాస్తవాలను ఎదుర్కోవడం

మరణం, బాధలు జీవితపు సత్యాలు అని అంగీకరించడం కష్టంగా ఉండవచ్చు. “స్త్రీ కనిన నరుడు కొద్ది దినములవాడై మిక్కిలి బాధనొందును” అని చెప్పినప్పుడు యోబు ఆ విషయాన్ని చక్కగా వ్యక్తం చేశాడు.​—యోబు 14:1.

‘నీతి నివసించే’ ఒక నూతనలోకం గురించి బైబిలు వాగ్దానం చేస్తోంది. (2 పేతురు 3:13; ప్రకటన 21:3, 4) అయితే అలాంటి పరిస్థితులు ఈ భూమిపైకి రావడానికి ముందు, మానవాళి అంతులేని దుష్టత్వం రాజ్యమేలే కాలంలో జీవించాలి. “అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలిసికొనుము” అని బైబిలు చెబుతోంది.​—2 తిమోతి 3:1.

ఈ కష్టభరితమైన కాలాలు ఎంతవరకు ఉంటాయి? యేసు శిష్యులు దాదాపు ఇలాంటి ప్రశ్నే అడిగారు. అయితే యేసు, బాధలతో నిండిన ఈ విధానం ఎప్పుడు అంతమవుతుందో సూచిస్తూ వారికి ఖచ్చితమైన తేదీని గానీ సమయాన్ని గానీ ఇవ్వలేదు. దానికి బదులు, “అంతమువరకు సహించినవాడెవడో వాడే రక్షింపబడును” అని యేసు చెప్పాడు. (మత్తయి 24:3, 13) మనం దూరదృష్టిగల దృక్కోణాన్ని అలవర్చుకోవాలని యేసు మాటలు ప్రోత్సహిస్తున్నాయి. చివరకు అంతం వచ్చేలోపు మనం ఎన్నో బాధాకరమైన పరిస్థితులను సహించడానికి సిద్ధంగా ఉండాలి.

దేవుడు బాధ్యుడా?

దేవుడు బాధలను అనుమతిస్తున్నాడు కాబట్టి ఆయనపై కోపం పెంచుకోవడం సహేతుకమేనా? దేవుడు బాధలన్నింటిని అంతం చేస్తానని వాగ్దానం చేశాడని తెలుసుకున్న తర్వాత ఇంకా ఆయనపై కోపం పెంచుకోవడం సహేతుకం కాదు. దేవుడే చెడు సంఘటనలు జరిగేలా చేస్తాడని భావించడం కూడా తప్పే. చాలా విషాదాలు అకస్మాత్తుగా జరిగిన సంఘటనలవల్లే కలుగుతాయి. ఉదాహరణకు, పెనుగాలికి విరిగిపడిన చెట్టువల్ల ఒక వ్యక్తి గాయపడ్డాడు అనుకోండి. దేవుడే అలా చేశాడని ప్రజలు అనవచ్చు. కానీ దేవుడు ఆ చెట్టు పడిపోయేలా చేయలేదు. ఇలాంటి విషాదకర సంఘటనలు కేవలం అనూహ్యంగా “కాలవశముచేత” జరుగుతాయని గ్రహించడానికి బైబిలు మనకు సహాయం చేస్తోంది.​—ప్రసంగి 9:11.

జ్ఞానమూ వివేచనా లేకపోవడంవల్ల కూడా బాధలు కలుగవచ్చు. కొందరు యౌవనులు మద్యం సేవించి వాహనాన్ని నడుపుతున్నారు అనుకోండి. ఫలితంగా ఘోరమైన రోడ్డు ప్రమాదం జరిగింది. దానికి ఎవరు బాధ్యులు? దేవుడా? కాదు, వాళ్ళు వివేచనారహితంగా ప్రవర్తించినందుకు దాని పర్యవసానాలను అనుభవించారు.​—గలతీయులు 6:7.

‘కానీ బాధలను ఇప్పుడే అంతం చేయడానికి దేవునికి శక్తి లేదా?’ అని మీరు అడగవచ్చు. బైబిలు కాలాల్లోని కొందరు విశ్వసనీయులు కూడా అలాగే ఆలోచించారు. “కపటులను నీవు చూచియు, దుర్మార్గులు తమకంటె ఎక్కువ నీతిపరులను నాశనము చేయగా నీవు చూచియు ఎందుకు ఊరకున్నావు?” అని హబక్కూకు ప్రవక్త దేవుణ్ణి ప్రశ్నించాడు. అయితే హబక్కూకు తొందరపడి ఒక నిర్ధారణకు రాలేదు. ‘ఆయన నాకు ఏమి సెలవిచ్చునో చూచుటకై నేను కనిపెట్టుకొనియుంటాను’ అని అన్నాడు. ఆ తర్వాత దేవుడు తాను “నిర్ణయకాలమున” బాధలను అంతం చేస్తానని హబక్కూకుకు హామీ ఇచ్చాడు. (హబక్కూకు 1:13; 2:1-3) కాబట్టి మనం ఓపికతో ఉండి దేవుడు తన నిర్ణయ కాలంలో దుష్టత్వాన్ని అంతం చేసేవరకూ వేచివుండాలి.

దేవుడు మనం బాధలనుభవించాలని కోరుకుంటున్నాడు లేక ఆయనే మనల్ని పరీక్షిస్తున్నాడు అనే తొందరపాటు నిర్ధారణకు రాకండి. నిజానికి పరీక్షలు మనలోని అత్యుత్తమమైన లక్షణాలను వెల్లడి చేస్తాయి, దేవుడు అనుమతించే కష్టాలు మన విశ్వాసాన్ని మెరుగుపరుస్తాయి. (హెబ్రీయులు 5:8; 1 పేతురు 1:7) కష్టభరితమైన పరిస్థితులను, మనసును తీవ్రంగా గాయపరిచే అనుభవాలను ఎదుర్కొనే ప్రజలు మరింత సహనంగలవారిగా లేక మరింత సానుభూతిగలవారిగా తయారవుతారనేది వాస్తవం. అంతమాత్రాన వాళ్ళు అనుభవించిన కష్టాలకు దేవుడే కారణమని మనం భావించకూడదు. అలాంటి ఆలోచనా విధానం దేవుని ప్రేమను, జ్ఞానాన్ని పరిగణలోనికి తీసుకోదు. బైబిలు స్పష్టంగా ఇలా చెబుతోంది: “దేవుడు కీడువిషయమై శోధింపబడనేరడు; ఆయన ఎవనిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు—నేను దేవునిచేత శోధింపబడుచున్నానని అనకూడదు.” దానికి భిన్నంగా ‘ప్రతి శ్రేష్ఠమైన యీవి ప్రతి సంపూర్ణమైన వరము’ దేవుని నుండి వస్తాయి!​—యాకోబు 1:13, 17.

దేవుడు చెడుతనాన్ని అనుమతించడానికిగల కారణం

ఈ చెడుతనానికి మూల కారకుడు ఎవరు? దేవునికి వ్యతిరేకులు ఉన్నారని గుర్తుంచుకోండి, ప్రాముఖ్యంగా “సర్వలోకమును మోస పుచ్చుచు, అపవాదియనియు సాతాననియు పేరుగల” దేవుని వ్యతిరేకి. (ప్రకటన 12:9) దేవుడు మన మొదటి తల్లిదండ్రులైన ఆదాము హవ్వలను కష్టాల్లేని లోకంలో ఉంచాడు. కానీ దేవుని పరిపాలన లేకుండానే తాను సుఖంగా ఉండగలదని సాతాను హవ్వను నమ్మించాడు. (ఆదికాండము 3:1-5) విచారకరంగా, హవ్వ సాతాను చెప్పిన అబద్ధాలను నమ్మి దేవునికి అవిధేయత చూపించింది. ఆదాము కూడా ఆ తిరుగుబాటులో భాగం వహించాడు. దాని ఫలితం? “మరణము అందరికిని సంప్రాప్తమాయెను” అని బైబిలు చెబుతోంది.​—రోమీయులు 5:12.

దేవుడు వెంటనే సాతానును అతని అనుచరులను నాశనం చేసి ఆ తిరుగుబాటును అణచివేయకుండా, కొంతకాలం గడవనివ్వడం బాగుంటుందని భావించాడు. దానివల్ల లాభమేమిటి? మొదటిగా, సాతాను అబద్ధికుడని నిరూపించబడతాడు! దేవుని నుండి స్వతంత్రంగా ఉంటే అది కేవలం నాశనానికే దారితీస్తుందనడానికి రుజువులు సమకూడే సమయం కూడా ఉంటుంది. సరిగ్గా అలాగే జరగలేదా? “లోకమంతయు దుష్టుని యందున్నది.” (1 యోహాను 5:19) అంతేకాకుండా ‘ఒకడు మరియొకనిపైన అధికారియై తనకు హాని తెచ్చుకొన్నాడు.’ (ప్రసంగి 8:9) మానవుల మతాలు విరుద్ధమైన బోధలతో కలగాపులగంగా ఉన్నాయి. నైతిక విలువలు మునుపెన్నడూ లేనంత ఎక్కువగా దిగజారిపోయాయి. మానవ ప్రభుత్వాలు అన్నిరకాల పరిపాలనా విధానాలను ప్రయత్నించాయి. అవి ఒప్పందాలపై సంతకాలు పెట్టి శాసనాలను రూపొందిస్తాయి, కానీ సాధారణ ప్రజల అవసరాలు మాత్రం ఇప్పటికీ తీరలేదు. యుద్ధాలు బాధను మరింత ఎక్కువ చేస్తున్నాయి.

దేవుడే జోక్యం చేసుకొని దుష్టత్వాన్ని అంతం చేయాలి! అయితే అది దేవుని నిర్ణయ కాలంలోనే జరుగుతుంది. అప్పటివరకూ దేవుని ఆజ్ఞలకు విధేయత చూపిస్తూ బైబిలులోని సూత్రాలను అనుసరిస్తూ దేవుని పరిపాలనకు మద్దతునివ్వడమే మనకున్న ఆధిక్యత. చెడు విషయాలు జరిగినప్పుడు మనం కష్టాలులేని లోకంలో జీవించబోతున్నామనే దృఢ నిరీక్షణలో ఓదార్పు పొందవచ్చు.

ఒక్కరే కాదు

మనం వ్యక్తిగతంగా బాధలనుభవిస్తున్నప్పుడు, ‘నాకే ఇలా ఎందుకు జరిగింది?’ అని మనం ప్రశ్నించుకోవచ్చు. అయితే బాధలు అనుభవించేది మనం ఒక్కరమే కాదని అపొస్తలుడైన పౌలు మనకు గుర్తు చేస్తున్నాడు. ‘సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవవేదన పడుచునున్నది’ అని ఆయన చెబుతున్నాడు. (రోమీయులు 8:22) ఈ వాస్తవాన్ని తెలుసుకోవడం, బాధలను తట్టుకోవడానికి మీకు సహాయం చేయవచ్చు. ఉదాహరణకు న్యూయార్క్‌లోను, వాషింగ్టన్‌ డి.సి.లోను 2001, సెప్టెంబరు 11న జరిగిన తీవ్రవాద దాడుల కారణంగా నికోల్‌ భావోద్వేగపరంగా ఎంతో గాయపడింది. “నేను దిగ్భ్రాంతికి గురై భయకంపితురాలినయ్యాను” అని ఆమె అంటోంది. అయితే తన తోటి క్రైస్తవులు ఆ విషాదాన్ని ఎలా భరించారో చదివినప్పుడు ఆమె దృక్పథం మారింది. * “నేను ఒక్కదాన్నే లేనని నాకు అర్థమయ్యింది. క్రమంగా నేను నా బాధ నుండి దుఃఖం నుండి కోలుకోవడం ప్రారంభించాను.”

కొన్ని సందర్భాల్లో మీరు మీ తల్లిదండ్రులతో, పరిణతి చెందిన స్నేహితులతో లేదా క్రైస్తవ పెద్దలతో గానీ మాట్లాడడం జ్ఞానయుక్తంగా ఉంటుంది. మీరు నమ్మే వ్యక్తికి మీ హృదయంలోని తలంపులను భావాలను తెలియజేసినప్పుడు మీకు ప్రోత్సాహకరమైన ‘దయగల మాట’ లభిస్తుంది. (సామెతలు 12:25) బ్రెజిల్‌కు చెందిన ఒక క్రైస్తవ యువకుడు ఇలా గుర్తుచేసుకుంటున్నాడు: “తొమ్మిది సంవత్సరాల క్రితం నేను మా నాన్నను కోల్పోయాను, యెహోవా ఆయనను ఒకరోజు పునరుత్థానం చేస్తాడని నాకు తెలుసు. అయితే నా భావాలను వ్రాత రూపంలో పెట్టడం నా బాధను తట్టుకోవడానికి సహాయం చేసింది. అంతేకాకుండా నేను నా క్రైస్తవ స్నేహితులతో నా భావాలను పంచుకున్నాను.” మీరు నమ్మగల ‘నిజమైన స్నేహితులు’ ఎవరైనా ఉన్నారా? (సామెతలు 17:17) వారి ప్రేమపూర్వకమైన సహాయం నుండి ప్రయోజనం పొందండి! ఏడవడానికి గానీ, మీ భావోద్వేగాలను వ్యక్తం చేయడానికి గానీ వెరవకండి. అంతెందుకు తన స్నేహితుడు చనిపోయినప్పుడు యేసు కూడా ‘కన్నీళ్ళు విడిచాడు.’​—యోహాను 11:35.

ఒకరోజు మనం ‘నాశనమునకు లోనయిన దాస్యములో నుండి విడిపించబడి, దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యము పొందుతామని’ బైబిలు హామీ ఇస్తోంది. (రోమీయులు 8:20) అప్పటివరకూ చాలామంది మంచి ప్రజలు బాధలు అనుభవించాల్సి రావచ్చు. అలాంటి బాధలు ఎందుకు ఎదురవుతున్నాయో తెలుసుకోవడం ద్వారా, అవి ఎల్లప్పుడూ ఉండవని తెలుసుకోవడం ద్వారా ఓదార్పు పొందండి. (g04 3/22)

[అధస్సూచీలు]

^ కొన్ని పేర్లు మార్చబడ్డాయి.

^ తేజరిల్లు! (ఆంగ్లం), 2002, జనవరి 8 సంచికలో “విపత్తు సంభవించినప్పుడు ధైర్యంగా ఉండడం” అనే శీర్షికను చూడండి.

[16వ పేజీలోని చిత్రం]

దుఃఖాన్ని వ్యక్తం చేయడం మీకు సహాయకరంగా ఉండవచ్చు