కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఆశతో బ్రతకడం ఎందుకు అవసరం?

ఆశతో బ్రతకడం ఎందుకు అవసరం?

ఆశతో బ్రతకడం ఎందుకు అవసరం?

ముందటి ఆర్టికల్‌లో చూసిన డానియేల్‌ అనే అబ్బాయి, చివరివరకు ఆశ వదులుకోకుండా ఉండుంటే కాన్సర్‌ తగ్గిపోయి ఉండేదా? ఇప్పటికీ బ్రతికి ఉండేవాడా? ఆశతో బ్రతకడం అనారోగ్యంతో ఉన్నవాళ్లకు సహాయం చేస్తుందని బలంగా నమ్మేవాళ్లు సైతం, ‘కాదు’ అనే చెప్తారు. కాబట్టి ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆశ అనేది సర్వరోగ నివారిణి అని, సమస్యలన్నిటినీ పరిష్కరిస్తుంది అని మనం అనుకోకూడదు.

తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్లతో, ఆశ ఉంటే అంతా బాగౌతుంది అనడం ప్రమాదకరమని ఒక న్యూస్‌ ఛానెల్‌కి ఇంటర్వ్యూ ఇస్తూ డాక్టర్‌ నేతన్‌ చెర్ని చెప్పాడు. ఆయన ఇలా అన్నాడు: “కొంతమంది భర్తలు అనారోగ్యంతో ఉన్న తమ భార్యల్ని సరిగ్గా ధ్యానం చేయట్లేదని, సానుకూలంగా ఆలోచించట్లేదని తిడుతుంటారు. ... దానివల్ల అనారోగ్యంతో ఉన్న వ్యక్తి తాను సానుకూలంగా ఆలోచిస్తే జబ్బు నయం అవుతుందని, తన జబ్బు నయం అవ్వలేదు అంటే తాను సానుకూలంగా ఆలోచించకపోవడమే కారణమని అనుకోవచ్చు. అది సరైనది కాదు.”

నిజానికి, ప్రాణాంతకమైన వ్యాధితో బాధపడేవాళ్లు ఆ వ్యాధితో పోరాడి చాలా అలసిపోయి ఉంటారు. దానికి తోడు, ‘నువ్వు సానుకూలంగా ఆలోచించట్లేదు’ అని పదేపదే అంటే వాళ్ల భారాన్ని పెంచినట్టు అవుతుంది. కుటుంబ సభ్యులు, స్నేహితులు అలా చేయాలని ఎన్నడూ కోరుకోరు. మరైతే, ఆశతో ఉండడం ఏమీ సహాయం చేయదా?

చేస్తుంది. పైన చెప్పిన డాక్టర్‌ నేతన్‌, నయంకాని జబ్బులతో బాధపడుతున్న వాళ్లను ఉంచే విభాగంలో పనిచేస్తారు. ఆ విభాగంలో జబ్బును తగ్గించలేకపోయినా, కనీసం పేషెంట్‌ బ్రతికినంతకాలం బాధ అనుభవించకుండా సంతోషంగా ఉండేలా చూసుకుంటారు. తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న పేషెంట్లకు కూడా అలాంటి ట్రీట్‌మెంట్‌ సహాయం చేస్తుందని అక్కడ పనిచేసే డాక్టర్లు బలంగా నమ్ముతున్నారు. ఆశతో బ్రతకడం నిజంగా సహాయం చేస్తుందని చెప్పడానికి చాలా రుజువులు ఉన్నాయి.

ఆశతో బ్రతకడం మీకు సహాయం చేయగలదు

“ఆశ ఒక శక్తివంతమైన మందు” అని డాక్టర్‌ డబ్ల్యు. జిఫర్డ్‌-జోన్స్‌ అన్నారు. ఇంకొన్ని రోజుల్లో చనిపోబోయే పేషెంట్లను మానసికంగా బలపర్చడం ఎంత ప్రాముఖ్యమో ఆయన పరిశోధన చేశారు. అలా బలపర్చడం వల్ల మరింత ఆశతో ఉండవచ్చని, సానుకూలంగా ఆలోచించవచ్చని చాలామంది నమ్ముతున్నారు. మానసికంగా బలపర్చబడిన పేషెంట్లు మిగతావాళ్ల కన్నా ఎక్కువకాలం బ్రతికారని 1989 లో జరిపిన ఒక పరిశోధనలో గమనించారు, కానీ అది పూర్తిగా నిర్ధారణ అవ్వలేదు. అయితే, మానసికంగా బలపర్చబడిన పేషెంట్లు అలా బలపర్చబడని పేషెంట్ల కన్నా తక్కువ కృంగుదలను, బాధను అనుభవిస్తారని మాత్రం పరిశోధనలు నిర్ధారించాయి.

ఆశా-నిరాశలకు, గుండె జబ్బులకు మధ్య ఉన్న సంబంధాన్ని తెలుసుకోవడానికి జరిపిన మరో పరిశోధన గమనించండి. జీవితం మీద ఆశతో ఉన్నారా లేక నిరాశతో ఉన్నారా అని 1,300 కన్నా ఎక్కువమంది పురుషుల్ని అడిగి తెలుసుకున్నారు. పది సంవత్సరాల తర్వాత వాళ్లలో దాదాపు 160 మందికి గుండె జబ్బు వచ్చింది. అలా జబ్బు వచ్చిన వాళ్లలో ఎక్కువశాతం మంది నిరాశావాదులే. ఈ పరిశోధన గురించి మెడికల్‌ కాలేజీలో డాక్టర్‌గా పనిచేస్తున్న ఒకామె ఏమందంటే, “‘సానుకూలంగా ఆలోచించడం’ ఆరోగ్యానికి మంచిదని చాలామంది నమ్ముతారు. అలా ఆలోచించడం గుండెకు కూడా మంచిదని ఈ పరిశోధన మొట్టమొదటిసారి రుజువు చేసింది.”

‘మా ఆరోగ్యం బాగుంది మాకేం కాలేదు’ అనుకున్నవాళ్లు ఆపరేషన్‌ తర్వాత చక్కగా కోలుకున్నారని, ‘మా ఆరోగ్యం పాడైంది’ అనుకున్నవాళ్లు ఆపరేషన్‌ తర్వాత కోలుకోలేకపోయారని కొన్ని వైద్య పరిశోధనల్లో తేలింది. ఆశతో జీవించేవాళ్లు ఎక్కువ కాలం బ్రతుకుతారని కూడా కొన్ని పరిశోధనలు చూపిస్తున్నాయి. వయసు పైబడడం గురించిన సరైన ఆలోచన ఎలాంటి ప్రభావం చూపిస్తుందో తెలుసుకోవడానికి కొంతమంది వృద్ధుల మీద ఒక పరిశోధన జరిపారు. అందులో, వృద్ధులకు ఎక్కువ తెలివి, అనుభవం ఉంటుంది అనే చిన్నచిన్న మెసేజ్‌లను పరిశోధకులు వాళ్లకు చూపించారు. దానివల్ల ఆ వృద్ధులు ఇంకా చురుగ్గా, బలంగా నడిచారు. చెప్పాలంటే, 12 వారాలపాటు వ్యాయామం చేస్తే ఎంత ఓపిక వస్తుందో వాళ్లకు అంత ఓపిక వచ్చింది.

ఆశతో బ్రతకడం, సానుకూలంగా ఆలోచించడం ఎందుకు ఆరోగ్యానికి మంచిది? బహుశా, దానికి ఖచ్చితమైన జవాబులు చెప్పడానికి సైంటిస్టులు, డాక్టర్లు మానవ మెదడును, శరీరాన్ని ఇంకా పూర్తిగా అర్థం చేసుకోలేదు. కానీ, ఇప్పటివరకు జరిపిన పరిశోధనల్ని బట్టి నిపుణులు కొన్ని విషయాలు చెప్తున్నారు. ఉదాహరణకు, ఒక న్యూరాలజీ ప్రొఫెసర్‌ ఇలా అంటున్నాడు: “ఒక వ్యక్తి సంతోషంతో, ఆశతో జీవిస్తే అతనికి ఒత్తిడి తక్కువగా ఉంటుంది, దానివల్ల ఆరోగ్యంగా ఉంటాడు. కాబట్టి, ఆరోగ్యంగా ఉండడానికి ప్రజలు వాళ్లకై వాళ్లు చేసుకోగల పనుల్లో సంతోషంగా ఉండడం కూడా ఒకటి.”

ఈ విషయం కొంతమంది డాక్టర్లకు, మనస్తత్వాన్ని పరిశోధించే నిపుణులకు, సైంటిస్టులకు కొత్తేమో గానీ బైబిలు చదివే వాళ్లకు మాత్రం కొత్తది కాదు. దాదాపు 3,000 సంవత్సరాల క్రితం, దేవుడు సొలొమోను అనే ఒక తెలివైన రాజుతో ఇలా రాయించాడు: “సంతోష హృదయం మంచి ఔషధం, నలిగిన మనస్సు ఒంట్లో శక్తినంతా లాగేస్తుంది.” (సామెతలు 17:22) గమనించండి, సంతోష హృదయం రోగాలన్నిటినీ నయం చేస్తుందని బైబిలు చెప్పట్లేదు గానీ అది “మంచి ఔషధం” అని మాత్రమే చెప్తుంది.

ఆశ మందులా పనిచేస్తే దాన్ని ప్రతీ డాక్టర్‌ ఇవ్వాలని కోరుకుంటాడు. అయితే, ఆశతో బ్రతకడం వల్ల ఆరోగ్యం మెరుగవ్వడమే కాదు వేరే ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

ఆశావాదం, నిరాశావాదం మీ జీవితం మీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయి?

ఆశావాదులు సానుకూలంగా ఆలోచిస్తారు కాబట్టి చాలా ప్రయోజనం పొందుతారని సైంటిస్టులు కనుగొన్నారు. వాళ్లు స్కూల్లో, ఉద్యోగంలో, ఆఖరికి క్రీడల్లో కూడా చక్కగా రాణిస్తారు. ఉదాహరణకు, ఒక స్త్రీల క్రీడాకారుల జట్టు మీద పరిశోధన జరిగింది. ఆ పరిశోధనలో, ఏ స్త్రీ ఎంత బాగా పరుగెత్తగలదో చెప్పమని కోచ్‌లను అడిగారు. అదే సమయంలో, ‘మీరు ఎంత బాగా పరుగెత్తగలరు అనుకుంటున్నారు’ అని ఆ స్త్రీలను కూడా అడగడం జరిగింది. చివరికి చూస్తే, మేము బాగా పరుగెత్తగలం అని సానుకూలంగా ఆలోచించినవాళ్లు కోచ్‌లు ఇచ్చిన రిపోర్టులకు భిన్నంగా చాలా బాగా పరుగెత్తగలిగారు. ఆశతో ఉండడం ఎందుకు అంత బలంగా పనిచేస్తుంది?

నిరాశావాదుల మీద, అంటే ఎప్పుడూ ప్రతికూలంగా ఆలోచించేవాళ్ల మీద పరిశోధన చేసి సైంటిస్టులు చాలా విషయాలు తెలుసుకున్నారు. జంతువులు చాలా ప్రయత్నాలు చేసిన తర్వాత ఆశ వదిలేసుకుంటాయని, అలా మనుషులకు కూడా జరిగే అవకాశం ఉందని 1960లలో సైంటిస్టులు తెలుసుకున్నారు. ఉదాహరణకు, వాళ్లు కొంతమంది మనుషుల్ని బాగా శబ్దం వస్తున్న ఒక గదిలో పెట్టి, కొన్ని బటన్లు ఒక వరుసలో నొక్కితే ఆ శబ్దం ఆగిపోతుందని చెప్పారు. లోపల ఉన్నవాళ్లు ఆ శబ్దాన్ని ఆపగలిగారు.

ఇంకో గుంపువాళ్లకు కూడా అదే చెప్పారు, కానీ వాళ్లు బటన్లు నొక్కి ఎంత ప్రయత్నించినా ఫలితం రాలేదు. దాంతో వాళ్లు ఆశలు వదిలేసుకున్నారు. ఆ తర్వాత చేసిన ప్రయోగాల్లో కూడా, ఎలాగూ ఫలితం రాదు కదా అని అనుకుంటూ వాళ్లు అసలు ప్రయత్నించడమే మానేశారు. అయితే, ఆ గుంపులో ఉన్న ఆశావాదులు మాత్రం పట్టువదలకుండా ప్రయత్నిస్తూనే ఉన్నారు.

డాక్టర్‌ మార్టిన్‌ సెలిగ్మెన్‌ అలాంటి కొన్ని ప్రయోగాల్లో సహాయం చేశాడు. కాబట్టి ఆశావాదం, నిరాశావాదం గురించి పరిశోధన కొనసాగించాలని ఆయన నిర్ణయించుకున్నాడు. కొంతమంది ఎప్పుడూ ప్రతికూలంగా ఆలోచిస్తూ ఎందుకు నిరాశావాదులుగా ఉంటారో ఆయన అధ్యయనం చేశాడు. నిరాశావాదులకు చర్య తీసుకోవడం కష్టమని లేదా అసాధ్యమని ఆయన ముగింపుకు వచ్చాడు. సెలిగ్మెన్‌ ఇలా అంటున్నాడు: “నేను 25 సంవత్సరాలుగా దీన్ని అధ్యయనం చేస్తున్నాను. నిరాశావాదులు తమకు జరిగే చెడు అంతటికి తామే కారణమని, తాము ఏం చేసినా చెడు జరుగుతూనే ఉంటుందని అనుకుంటారు. నిరాశావాదులు అలా ఆలోచిస్తారు కాబట్టే ఆశావాదుల కన్నా వాళ్లకే ఎక్కువ చెడు జరుగుతూ ఉంటుందని నా అభిప్రాయం.”

ఈ విషయం కూడా కొంతమందికి కొత్తేమో గానీ బైబిలు చదివేవాళ్లకు కొత్త కాదు. ఈ సామెత గమనించండి: “కష్టం వచ్చిన రోజున నిరుత్సాహపడితే నీ శక్తి తగ్గిపోతుంది.” (సామెతలు 24:10) అవును, నిరుత్సాహపడితే, ప్రతికూలంగా ఆలోచిస్తే మన శక్తి తగ్గిపోతుందని బైబిలు స్పష్టంగా చెప్తుంది. మరి, నిరాశను జయించి ఆశతో బ్రతకడానికి మీరేం చేయవచ్చు?

[చిత్రం]

ఆశతో బ్రతకడం ఎంతో మేలు చేస్తుంది