కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీరు నిరాశావాదంతో పోరాడగలరు

మీరు నిరాశావాదంతో పోరాడగలరు

మీరు నిరాశావాదంతో పోరాడగలరు

సమస్యలు వచ్చినప్పుడు మీరు ఎలా స్పందిస్తారు? ఆ ప్రశ్నకు మీరు ఇచ్చే జవాబును బట్టి మీరు ఆశావాదులో లేక నిరాశావాదులో చెప్పవచ్చని చాలామంది నిపుణులు నమ్ముతున్నారు. జీవితంలో మనందరికీ రకరకాల సమస్యలు వస్తాయి, కొందరికైతే మిగతావాళ్ల కన్నా ఎక్కువ వస్తాయి. కొంతమంది చిన్నచిన్న సమస్యలకే ఆశ వదిలేసుకుంటే, మరికొంతమంది పెద్ద సమస్యలు వచ్చినా ఆశ వదులుకోకుండా పోరాడుతూనే ఉంటారు. ఎందుకలా?

ఉదాహరణకు, మీరు ఉద్యోగం కోసం వెతుకుతున్నారు అనుకోండి. మీరు ఇంటర్వ్యూకు వెళ్లారు, అక్కడ వాళ్లు మీకు ఉద్యోగం ఇవ్వలేదు. మీకెలా అనిపిస్తుంది? ‘నాలాంటి వాళ్లను ఎవ్వరూ పనిలో పెట్టుకోరు. నాకసలు ఉద్యోగమే రాదు’ అని అనుకుంటారా? లేదా ఇంకా ఘోరంగా, ‘జీవితంలో నేను దేంట్లోనూ విజయం సాధించలేను. నావల్ల ఎవరికీ ఉపయోగం లేదు’ అని అనుకుంటారా? అలా అనుకోవడం నిరాశావాదమే అవుతుంది.

నిరాశావాదంతో పోరాడడం

మరి అలా నిరాశలో కూరుకుపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? ముందుగా, ప్రతికూల ఆలోచనల్ని గుర్తించాలి. తర్వాత, వాటితో పోరాడాలి. ఉదాహరణకు, వాళ్లు మీకు ఉద్యోగం ఇవ్వకపోవడానికి కారణం ఏమై ఉండవచ్చో ఆలోచించడానికి ప్రయత్నించండి. వాళ్లకు మీరంటే నచ్చక ఉద్యోగం ఇవ్వలేదా? లేదా వాళ్లు వేరే అర్హతలు ఉన్న వ్యక్తి కోసం వెతుకుతున్నారా?

వాస్తవాల్ని చూడండి, అప్పుడు మీ ఆలోచనలన్నీ మీరు అతిగా ఊహించుకున్నవే అని అర్థమౌతుంది. ఏదో ఒక్క విషయంలో విజయం సాధించనంత మాత్రాన, అన్ని విషయాల్లో విజయం సాధించలేరు అని మీరు అనుకున్నారు. కానీ వాస్తవం ఏంటంటే ఆధ్యాత్మిక విషయాలు, కుటుంబ బంధాలు, స్నేహాలు వంటివాటిలో మీరు కొంతమేరకు విజయం సాధిస్తుండవచ్చు. కాబట్టి, ఏం చేసినా అది విఫలమే అవుతుంది అనే ఆలోచన నుండి బయటికి రండి. ఎప్పటికీ ఉద్యోగం రాదని మీకు ఖచ్చితంగా తెలుసా? ప్రతికూల ఆలోచనల్ని తీసేసుకోవడానికి మీరు ఇంకా ఏం చేయవచ్చో ఇప్పుడు చూద్దాం.

సానుకూలంగా ఆలోచిస్తూ లక్ష్యాలు పెట్టుకోండి

ఈమధ్య కాలంలో పరిశోధకులు, ఆశ అంటే లక్ష్యాలు చేరుకోగలమనే నమ్మకం కలిగి ఉండడమే అని ఒక్కమాటలో తేల్చి చెప్పారు. మనం సానుకూలంగా ఆలోచిస్తూ లక్ష్యాలు పెట్టుకోవడానికి ఆ విషయం సహాయం చేస్తుంది. కానీ ఆశ అంటే అదొక్కటే కాదు, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. దాని గురించి మనం తర్వాతి ఆర్టికల్‌లో చూస్తాం.

మీరు ఇప్పటికే కొన్ని లక్ష్యాలు పెట్టుకుని, వాటిని సాధించివుంటే భవిష్యత్‌ లక్ష్యాల్ని చేరుకోగలమనే నమ్మకం మీకు ఉంటుంది. ఒకవేళ మీరు ఇప్పటివరకు ఏ లక్ష్యాలూ పెట్టుకోకపోతే, దాని గురించి ఆలోచించడం మంచిది. ‘నేను అసలు జీవితంలో ఏం సాధించాలనుకుంటున్నాను?’ అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. నిజమే, ఉరుకులు-పరుగుల జీవితంలో తీరిక లేకుండా ఉండడం వల్ల మనకు నిజంగా ఏం అవసరమో, ఏవి చాలా ప్రాముఖ్యమైనవో ఆలోచించలేకపోవచ్చు. కానీ ఈ విషయంలో బైబిలు ఏం సలహా ఇస్తుందో గమనించండి: ‘ఏవి ఎక్కువ ప్రాముఖ్యమైనవో పరిశీలించి తెలుసుకోండి.’—ఫిలిప్పీయులు 1:10.

మన జీవితంలో ఏవి చాలా ప్రాముఖ్యమైనవో అర్థం చేసుకుంటే, లక్ష్యాలు పెట్టుకోవడం తేలిక అవుతుంది. మనం ఒకేసారి ఎక్కువ లక్ష్యాలు పెట్టుకోకూడదు, అలాగే చేరుకోలేని లక్ష్యాలు పెట్టుకోకూడదు. ఏదైనా లక్ష్యం చేరుకోవడానికి మరీ కష్టంగా ఉంటే, మనం నిరుత్సాహపడి దాన్ని మధ్యలోనే వదిలేసే అవకాశం ఉంది. కాబట్టి పెద్ద లక్ష్యాల్ని, ఎక్కువకాలం పట్టే లక్ష్యాల్ని చిన్న లక్ష్యాలుగా, తక్కువకాలం పట్టే లక్ష్యాలుగా విడగొట్టుకోవడం మంచిది.

“మనసుంటే మార్గం ఉంటుంది.” ఇది పాత సామెతే అయినా, అందులో కొంత నిజం ఉంది. లక్ష్యాలు పెట్టుకోవడంతో పాటు వాటిని చేరుకోవాలనే మనసు కూడా ఉండాలి, అంటే వాటిని చేరుకోవాలనే కోరిక, దృఢ నిశ్చయం ఉండాలి. మన లక్ష్యాలకు వచ్చే ఫలితాల గురించి ఆలోచించడం ద్వారా, వాటిని చేరుకోవాలనే కోరికను పెంచుకోవచ్చు. నిజమే ఆటంకాలు ఎదురౌతాయి, కానీ వాటిని దాటుకుంటూ గమ్యం వైపుకు మన ప్రయాణం కొనసాగించాలి.

అయితే, మన లక్ష్యాల్ని చేరుకోవడానికి ఏయే దారులు ఉన్నాయో కూడా ఆలోచించాలి. ఆశ గురించి లోతుగా అధ్యయనం చేసిన సి. ఆర్‌. స్నీడర్‌ అనే రచయిత, ఏదైనా లక్ష్యం చేరుకోవడానికి ఒక్క దారే కాకుండా చాలా దారుల్ని ముందే ఆలోచించి పెట్టుకోవాలని సలహా ఇస్తున్నాడు. అప్పుడు ఒక దారి మూసుకుపోతే ఇంకో దారిలో అయినా ఆ లక్ష్యాన్ని చేరుకోగలుగుతాం.

కొన్నిసార్లు మన లక్ష్యాన్ని పూర్తిగా మార్చేయడం మంచిదని కూడా స్నీడర్‌ సలహా ఇస్తున్నాడు. ఒక లక్ష్యాన్ని చేరుకోవడానికి అన్ని దారులు మూసుకుపోయాక ఇంకా దాని కోసమే ప్రయత్నిస్తూ ఉంటే, మనం నిరుత్సాహపడిపోతాం. అలాంటప్పుడు, దాని స్థానంలో మనం చేరుకోగల ఇంకో లక్ష్యాన్ని పెట్టుకుంటే సానుకూలంగా ఉండగలుగుతాం.

దీనికి బైబిల్లో ఒక చక్కని ఉదాహరణ ఉంది. దావీదు అనే ఒక రాజు తన దేవుడైన యెహోవాకు ఆలయం కట్టాలని లక్ష్యం పెట్టుకున్నాడు. అయితే, ఆయన కాదుగానీ ఆయన కొడుకైన సొలొమోను దాన్ని కడతాడని దేవుడు చెప్పాడు. అప్పుడు దావీదు నిరుత్సాహపడలేదు, కోపం పెంచుకోలేదు, లేదా తన లక్ష్యాన్ని ఎలాగైనా చేరుకోవాలని మొండిగా ప్రయత్నించలేదు. బదులుగా ఆయన తన లక్ష్యాన్ని మార్చుకున్నాడు. ఆలయాన్ని కట్టడం పూర్తిచేయగలిగేలా ఆయన తన కొడుకుకు సహాయం చేశాడు. ఆ నిర్మాణ పనికి కావాల్సిన డబ్బును, సామగ్రిని సమకూర్చడానికి తన శక్తంతా ధారపోశాడు.​—1 రాజులు 8:17-19; 1 దినవృత్తాంతాలు 29:3-7.

నిరాశావాదంతో పోరాడడం, సానుకూలంగా ఆలోచిస్తూ లక్ష్యాలు పెట్టుకోవడం నేర్చుకున్నా ఆశతో బ్రతకడం మనకు ఇంకా కష్టంగానే ఉండవచ్చు. ఎందుకు? ఎందుకంటే, ప్రపంచంలో ప్రజల ఆశల్ని నీరుగారుస్తున్న సమస్యలు ఎన్నో ఉన్నాయి. వాటిని పరిష్కరించే శక్తి మనకు లేదు. పేదరికం, యుద్ధాలు, అన్యాయం, అనారోగ్యం, మరణం లాంటి సమస్యలు మన చుట్టూ ఉన్నా మనమెలా ఆశతో బ్రతకవచ్చు?

[చిత్రం]

ఒక్కసారి ఉద్యోగం రానంత మాత్రాన, మీకు అసలు ఎప్పటికీ ఉద్యోగం రాదు అని అనుకుంటున్నారా?

[చిత్రం]

అవసరమైనప్పుడు దావీదు రాజు తన లక్ష్యాల్ని మార్చుకున్నాడు