కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

నిజమైన ఆశ—అది ఎక్కడ దొరుకుతుంది?

నిజమైన ఆశ—అది ఎక్కడ దొరుకుతుంది?

నిజమైన ఆశ—అది ఎక్కడ దొరుకుతుంది?

మీ వాచ్‌ పగిలిపోయి, పనిచేయడం ఆగిపోయిందని ఊహించుకోండి. దాన్ని బాగు చేయించుకోవడానికి చాలా షాపులు ఉన్నాయి. మీ వాచ్‌ను బాగు చేయగలమని వాళ్లందరూ చెప్తున్నారు. కానీ, ఒక్కొక్కరు ఒక్కోలా చెప్తుంటే ఏది నమ్మాలో మీకు అర్థం కావట్లేదు. అయితే, మీ వాచ్‌ను తయారుచేసిన వ్యక్తి మీకు దగ్గర్లోనే ఉంటున్నాడని మీకు తెలిసింది. అతను మీ వాచ్‌ను బాగు చేయడానికి ఇష్టపడుతున్నాడు, పైగా ఉచితంగా కూడా చేస్తాను అంటున్నాడు. ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్లాలో మీకు అర్థమయ్యే ఉంటుంది.

ఆశను ఆ వాచ్‌తో పోల్చవచ్చు. ఈ కష్టమైన కాలాల్లో, చాలామందిలాగే మీరూ ఆశను కోల్పోతున్నారని అనిపిస్తే, సహాయం కోసం ఎక్కడికి వెళ్తారు? మీకు సహాయం చేయగలమని చాలామంది చెప్తున్నారు. కానీ, ఒక్కొక్కరు ఒక్కోలా చెప్తుంటే ఏది నమ్మాలో మీకు అర్థం కావట్లేదు. అలాంటప్పుడు, ఆశలు పెట్టుకునే సామర్థ్యంతో మనుషుల్ని తయారుచేసిన సృష్టికర్త వైపు ఎందుకు చూడకూడదు? “ఆయన మనలో ఏ ఒక్కరికీ దూరంగా లేడు” అని, ఆయన మనకు నిజంగా సహాయం చేయాలనుకుంటున్నాడు అని బైబిలు చెప్తుంది.—అపొస్తలుల కార్యాలు 17:27; 1 పేతురు 5:7.

ఆశకు లోతైన అర్థం ఉంది

ఆశ గురించి బైబిలు చెప్పేదానికి, నేడున్న డాక్టర్లు, సైంటిస్టులు, మనస్తత్వాన్ని పరిశోధించే నిపుణులు చెప్పేదానికి తేడా ఉంది. బైబిలు చెప్పే ఆశకు లోతైన అర్థం ఉంది. బైబిల్లో, “నిరీక్షణ” లేదా ఆశ అంటే ఆత్రుతతో వేచి ఉండడం అలాగే మంచి జరుగుతుందని ఎదురుచూడడం. అంటే ఆశలో రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి, ఏదైనా మంచి జరగాలని కోరుకోవడం. రెండు, అది తప్పకుండా జరుగుతుందని ఆధారాలతో నమ్మడం. బైబిలు ఇస్తున్న ఆశ ఏదో గుడ్డి నమ్మకం కాదు. అది వాస్తవాలు, రుజువుల మీద ఆధారపడి ఉంటుంది.

విశ్వాసం కూడా రుజువుల మీద ఆధారపడి ఉంటుంది. ఈ విషయంలో నిరీక్షణ, విశ్వాసం ఒకేలా ఉన్నాయి. (హెబ్రీయులు 11:1) అయినా ఆ రెండు వేర్వేరు అని బైబిలు చెప్తుంది.—1 కొరింథీయులు 13:13.

దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణ ఆలోచిద్దాం: మీరు మీ స్నేహితుణ్ణి ఏదైనా సహాయం అడిగారు అనుకోండి. అతను తప్పకుండా సహాయం చేస్తాడని మీరు ఆశలు పెట్టుకుంటారు. ఎందుకంటే మీకు అతని మీద విశ్వాసం ఉంది. అంతకుముందు కూడా అతను దయ, ఉదారత చూపించాడు. కాబట్టి విశ్వాసం ఉంటే ఆశ ఉంటుంది, ఆశ ఉంటే విశ్వాసం ఉంటుంది. అలా రెండిటికీ సంబంధం ఉంది. అయినా అవి రెండు వేర్వేరు. మరి దేవుని మీద ఆశలు పెట్టుకోవడానికి ఏదైనా ఆధారం ఉందా?

ఆశకు లేదా నిరీక్షణకు ఆధారం

నిజమైన ఆశకు లేదా నిరీక్షణకు మూలం దేవుడే. బైబిలు కాలాల్లో యెహోవాను, “ఇశ్రాయేలుకు నిరీక్షణగా ఉన్న దేవా” అని పిలిచారు. (యిర్మీయా 14:8) ఇశ్రాయేలీయులు ఆయన మీదే ఆశలు పెట్టుకున్నారు. ఎందుకంటే, వాళ్లకు ఆయన మీద పూర్తి నమ్మకం ఉంది. వందల సంవత్సరాలుగా ఆయన తన మాట నిలబెట్టుకోవడం వాళ్లు చూశారు. అదే వాళ్లకు బలమైన ఆధారం. వాళ్ల నాయకుడైన యెహోషువ వాళ్లతో ఇలా అన్నాడు: “మీ దేవుడైన యెహోవా మీకు చెప్పిన మంచి వాగ్దానాలన్నిట్లో ఒక్కమాట కూడా తప్పిపోలేదని మీకు బాగా తెలుసు.”—యెహోషువ 23:14.

ఇప్పుడు కూడా దేవుని వాగ్దానాల్ని నమ్మడానికి అదే ఆధారం ఉంది. దేవుడు చేసిన ఎన్నో వాగ్దానాల గురించి, అవి ఎలా నెరవేరాయి అనే దాని గురించి బైబిల్లో చదువుతాం. యెహోవా చేసిన వాగ్దానాలు ఎంత ఖచ్చితమంటే, కొన్నిసార్లు ఆయన వాటిని అప్పటికే జరిగిపోయినట్టుగా రాయించాడు.

కాబట్టి, బైబిలు మనలో ఆశను నింపుతుంది. దేవుడు మనుషులతో ఎలా వ్యవహరించాడో బైబిల్లో చదివే కొద్దీ, ఆయన మీద ఆశలు పెట్టుకోవడానికి మీకు ఇంకా ఎక్కువ ఆధారాలు దొరుకుతాయి. బైబిలు ఇలా చెప్తుంది: “మన సహనం వల్ల, లేఖనాలు ఇచ్చే ఊరట వల్ల మనం నిరీక్షణ [లేదా, ఆశ] కలిగివుండాలని పూర్వం రాయబడినవన్నీ మనకు బోధించడానికే రాయబడ్డాయి.”—రోమీయులు 15:4.

దేవుడు మనకు ఏ నిరీక్షణ ఇస్తున్నాడు?

మనకు ఎప్పుడు నిరీక్షణ బాగా అవసరం అవుతుంది? మన ప్రియమైనవాళ్లు చనిపోయినప్పుడు. కానీ, అలాంటప్పుడే చాలామంది ఆశలు వదిలేసుకుంటారు. ఎందుకంటే మనలో ఎవ్వరం చావును తప్పించుకోలేం, చనిపోయిన మన ప్రియమైనవాళ్లను తిరిగి తీసుకురాలేం. అందుకే, బైబిలు మరణాన్ని “చివరి శత్రువు” అని పిలుస్తుంది.—1 కొరింథీయులు 15:26.

మరి, చనిపోయినవాళ్ల విషయంలో ఏదైనా నిరీక్షణ ఉందా? ఉంది. మరణాన్ని చివరి శత్రువు అని పిలిచిన ఆ బైబిలు వచనంలోనే, అది ‘నాశనం చేయబడుతుంది’ అని కూడా ఉంది. యెహోవా దేవుడు మరణం కంటే బలవంతుడు. ఆయన ఆ విషయాన్ని చాలాసార్లు నిరూపించాడు. ఎలా? చనిపోయినవాళ్లను తిరిగి బ్రతికించడం ద్వారా. దేవుడు తన శక్తిని ఉపయోగించి తొమ్మిది మందిని తిరిగి బ్రతికించినట్టు బైబిల్లో చదువుతాం.

ఉదాహరణకు, యేసు తన తండ్రైన యెహోవా ఇచ్చిన శక్తితో తన ప్రియ స్నేహితుడైన లాజరును తిరిగి బ్రతికించాడు. లాజరు చనిపోయి అప్పటికే నాలుగు రోజులైంది. యేసు రహస్యంగా కాదుగానీ, చాలామంది చూస్తుండగా ఆయన్ని లేపాడు.—యోహాను 11:38-48, 53; 12:9, 10.

‘దేవుడు వాళ్లను లేపడంలో ఉపయోగం ఏముంది? ఎలాగూ వాళ్లు లేచిన తర్వాత ముసలివాళ్లై మళ్లీ చనిపోయారు కదా?’ అని మీకు అనిపించవచ్చు. నిజమే, వాళ్లు చనిపోయారు. కానీ బైబిల్లో ఉన్న అలాంటి ఉదాహరణలు, చనిపోయినవాళ్లు తప్పకుండా లేస్తారని నమ్మడానికి బలమైన ఆధారాన్ని ఇస్తాయి. మరో మాటలో చెప్పాలంటే, మనకు నిజమైన నిరీక్షణను ఇస్తాయి.

యేసు ఇలా అన్నాడు: “చనిపోయినవాళ్లను బ్రతికించేది, జీవాన్ని ఇచ్చేది నేనే.” (యోహాను 11:25) భూవ్యాప్తంగా చనిపోయినవాళ్లను బ్రతికించే శక్తిని యెహోవా యేసుకు ఇస్తాడు. యేసు ఇలా చెప్పాడు: “ఒక సమయం రాబోతుంది, అప్పుడు సమాధుల్లో ఉన్న వాళ్లందరూ ఆయన [క్రీస్తు] స్వరం విని బయటికి వస్తారు.” (యోహాను 5:28, 29) అవును, సమాధిలో నిద్రిస్తున్న వాళ్లందరికీ తిరిగి బ్రతికించబడి పరదైసు భూమ్మీద జీవించే అవకాశం ఉంది.

యెషయా అనే ఒక ప్రవక్త, చనిపోయినవాళ్లు బ్రతికించబడడం గురించి చక్కగా వర్ణించాడు: “చనిపోయిన నీవాళ్లు బ్రతుకుతారు. నావాళ్ల శవాలు లేస్తాయి. మట్టిలో నివసిస్తున్న వాళ్లారా, లేవండి, సంతోషంతో అరవండి! ఎందుకంటే నీ మంచు తెల్లవారుజాము మంచులా ఉంది, భూమి తనలో ఉన్న మృతుల్ని సజీవుల్ని చేస్తుంది.”—యెషయా 26:19.

ఆ మాటలు ఎంత ఊరటను ఇస్తున్నాయో కదా! ఒక బిడ్డ తల్లి కడుపులో సురక్షితంగా ఉన్నట్టే, చనిపోయినవాళ్లు కూడా సురక్షితమైన చోట ఉన్నారు. చెప్పాలంటే, వాళ్లు సర్వశక్తిమంతుడైన దేవుని అపారమైన జ్ఞాపకంలో పదిలంగా ఉన్నారు. (లూకా 20:37, 38) చనిపోయినవాళ్లు త్వరలోనే తిరిగి బ్రతుకుతారు. బిడ్డ పుట్టగానే ఎప్పటినుండో ఎదురుచూస్తున్న కుటుంబ సభ్యులు బిడ్డను ఆప్యాయంగా హత్తుకున్నట్టే, చనిపోయినవాళ్లు తిరిగి బ్రతికినప్పుడు వాళ్ల కుటుంబ సభ్యులు సంతోషంతో వాళ్లను కొత్తలోకంలోకి ఆహ్వానిస్తారు! కాబట్టి, చనిపోయినవాళ్ల విషయంలో కూడా ఒక నిరీక్షణ ఉంది.

నిరీక్షణ మీకు ఎలా సహాయం చేయగలదు?

నిరీక్షణ ఎంత ప్రాముఖ్యమో పౌలు అనే ఒక దేవుని సేవకుడు వివరించాడు. నిరీక్షణను ఆధ్యాత్మిక యుద్ధ కవచంలోని ఒక ముఖ్యమైన భాగంతో, అంటే శిరస్త్రాణం లేదా హెల్మెట్‌తో ఆయన పోల్చాడు. (1 థెస్సలొనీకయులు 5:8) ఎందుకు? బైబిలు కాలాల్లో తరచూ ఒక సైనికుడు యుద్ధానికి వెళ్లే ముందు, తలకు వస్త్రంతో లేదా తోలుతో చేసిన క్యాప్‌ను ధరించి, దానిమీద లోహపు శిరస్త్రాణాన్ని పెట్టుకునేవాడు. సైనికుడి తలకు బలమైన గాయం అయ్యి చనిపోకుండా ఉండేలా ఆ శిరస్త్రాణం కాపాడుతుంది. పౌలు ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నాడు? శిరస్త్రాణం తలను కాపాడినట్టే, నిరీక్షణ కూడా మన మెదడును, ఆలోచనా సామర్థ్యాన్ని కాపాడుతుంది. దేవుని వాగ్దానాల మీద మీకు బలమైన నిరీక్షణ ఉంటే, తీవ్రమైన సమస్యలు వచ్చినా ప్రశాంతంగా ఉండగలుగుతారు. అలాంటి శిరస్త్రాణాన్ని ఎవరు మాత్రం వద్దనుకుంటారు?

నిరీక్షణ ఎంత ప్రాముఖ్యమో తెలియజేయడానికి పౌలు ఇంకో ఉదాహరణ చెప్పాడు. ఆయన ఇలా రాశాడు: “నిశ్చయమైన, స్థిరమైన ఈ నిరీక్షణ మన ప్రాణాలకు లంగరులా ఉంది.” (హెబ్రీయులు 6:19) పౌలు ఎన్నోసార్లు ఓడ ప్రమాదం నుండి బయటపడ్డాడు కాబట్టి, లంగరు ఎంత అవసరమో ఆయనకు బాగా తెలుసు. సముద్రంలో తుఫాను వచ్చినప్పుడు నావికులు లంగరును దించుతారు. ఓడ తుఫానుకు కొట్టుకుపోయి, రాళ్లకు గుద్దుకోకుండా లంగరు గట్టిగా పట్టి ఉంచుతుంది.

అదేవిధంగా, దేవుని వాగ్దానాల మీద మనకు “నిశ్చయమైన, స్థిరమైన” నిరీక్షణ ఉంటే తుఫాను లాంటి కష్టమైన పరిస్థితుల్ని తట్టుకోగలుగుతాం. యుద్ధాలు, నేరం, దుఃఖం, చివరికి మరణం కూడా ఉండని కాలం అతిత్వరలో వస్తుందని యెహోవా మాటిస్తున్నాడు. (10వ పేజీలోని బాక్సు చూడండి.) ఆ నిరీక్షణ మనల్ని కాపాడగలదు. నేడు లోకంలోని దిగజారిన నైతిక విలువల వెంట వెళ్లి ప్రమాదం కొని తెచ్చుకోకుండా, దేవుని ప్రమాణాలకు అంటిపెట్టుకొని ఉండేలా అది మనకు సహాయం చేస్తుంది.

మీరు కూడా ఆశతో జీవించాలని, సంతోషంగా ఉండాలని యెహోవా కోరుతున్నాడు. ‘అన్నిరకాల ప్రజలు రక్షించబడాలన్నది’ ఆయన కోరిక. అలా రక్షించబడాలంటే, మనం ‘సత్యం గురించిన సరైన జ్ఞానాన్ని సంపాదించుకోవాలి.’ (1 తిమోతి 2:4) దేవుని వాక్యంలోని సత్యం నేర్చుకోమని మేము మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాం. సత్యం నేర్చుకోవడం వల్ల మీరు పొందే నిరీక్షణ, లోకం అందించే ఎలాంటి నిరీక్షణ కన్నా కూడా చాలా ఉన్నతమైనది.

అలాంటి నిరీక్షణ మీకు ఉంది కాబట్టి, మీరు ఎప్పుడూ నిరాశపడాల్సిన అవసరం లేదు. తన ఇష్టానికి అనుగుణంగా మీరు పెట్టుకున్న ఎలాంటి లక్ష్యమైనా చేరుకోవడానికి దేవుడు మీకు శక్తిని ఇవ్వగలడు. (2 కొరింథీయులు 4:7; ఫిలిప్పీయులు 4:13) ఇలాంటి నిరీక్షణను అందరం కోరుకుంటాం కదా? కాబట్టి మీరు నిరీక్షణ కోసం వెదుకుతుంటే, ధైర్యంగా ఉండండి. మీరు దాన్ని తప్పకుండా కనుగొనగలరు!

[బాక్సు/చిత్రం]

ఆశతో బ్రతకడానికి కారణాలు

మీరు మరింత ఆశతో బ్రతకడానికి బైబిల్లోని ఈ విషయాలు సహాయం చేయగలవు:

భవిష్యత్తులో సంతోషంగా ఉంటామని దేవుడు మాటిస్తున్నాడు.

భూమంతా పరదైసులా అంటే అందమైన తోటలా మారుతుందని, అందులో మనుషులందరూ సంతోషంగా, కలిసిమెలిసి ఉంటారని బైబిలు చెప్తుంది.—కీర్తన 37:11, 29; యెషయా 25:8; ప్రకటన 21:3, 4.

దేవుడు అబద్ధమాడడు.

ఆయన అన్నిరకాల అబద్ధాల్ని ద్వేషిస్తాడు. యెహోవా పూర్తిస్థాయిలో పవిత్రుడు లేదా స్వచ్ఛమైనవాడు, కాబట్టి అబద్ధమాడడం ఆయనకు అసాధ్యం.—సామెతలు 6:16-19; యెషయా 6:2, 3; తీతు 1:2; హెబ్రీయులు 6:18.

దేవునికి అపరిమితమైన శక్తి ఉంది.

యెహోవా మాత్రమే సర్వశక్తిమంతుడు. ఆయన చెప్పింది జరగకుండా ఈ విశ్వంలో ఏదీ ఆయన్ని ఆపలేదు.—నిర్గమకాండం 15:11; యెషయా 40:25, 26.

మీరు శాశ్వతకాలం జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు.

యోహాను 3:16; 1 తిమోతి 2:3, 4.

దేవుడు మన విషయంలో ఒక ఆశతో ఉన్నాడు.

ఆయన మన లోపాలు, వైఫల్యాల మీద కాదుగానీ మన మంచి లక్షణాల మీద, కృషి మీద మనసుపెడతాడు. (కీర్తన 103:12-14; 130:3; హెబ్రీయులు 6:10) మనం సరైనది చేస్తామని ఆయన నమ్ముతాడు, అలా చేసినప్పుడు ఆయన సంతోషిస్తాడు.—సామెతలు 27:11.

మీరు పెట్టుకున్న మంచి లక్ష్యాల్ని చేరుకోవడానికి సహాయం చేస్తానని దేవుడు మాటిస్తున్నాడు.

ఆయన సేవకులు ఎప్పుడూ నిరాశపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, మనకు సహాయం చేయడానికి దేవుడు తన పవిత్రశక్తిని ఉదారంగా ఇస్తాడు. అది ఈ విశ్వంలోనే అత్యంత శక్తివంతమైనది.—ఫిలిప్పీయులు 4:13.

దేవుని మీద పెట్టుకున్న ఆశలు ఎప్పుడూ వమ్ము కావు.

మీరు దేవుణ్ణి పూర్తిగా నమ్మవచ్చు, ఆయన మిమ్మల్ని ఎప్పుడూ నిరాశపర్చడు.—కీర్తన 25:3.

[చిత్రం]

హెల్మెట్‌ తలను కాపాడినట్టే, నిరీక్షణ ఆలోచనా సామర్థ్యాన్ని కాపాడుతుంది

[చిత్రం]

లంగరులాగే, బలమైన ఆధారాలతో ఉన్న నిరీక్షణ మనం స్థిరంగా ఉండేలా సహాయం చేస్తుంది

[చిత్రసౌజన్యం]

Courtesy René Seindal/Su concessione del Museo Archeologico Regionale A. Salinas di Palermo