కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవునికి పిల్లలపై నిజంగా శ్రద్ధ ఉందా?

దేవునికి పిల్లలపై నిజంగా శ్రద్ధ ఉందా?

బైబిలు ఉద్దేశము

దేవునికి పిల్లలపై నిజంగా శ్రద్ధ ఉందా?

ప్రతీ సంవత్సరం కోట్లాదిమంది పిల్లలు స్వలాభానికి ఉపయోగించుకోబడుతున్నారు, దౌర్జన్యానికి, క్రూరమైన దాడులకు గురవుతున్నారు. చాలామంది పిల్లలు ప్రమాదకరమైన పరిస్థితుల్లో బానిసల్లా పని చేస్తున్నారు. మరికొంతమంది పిల్లలు అపహరించబడి సైనికులుగా, బాలవేశ్యలుగా పని చేయడానికి బలవంత పెట్టబడుతున్నారు. రక్తసంబంధీకులే తమపై అత్యాచారం చేయడం, ఘోరమైన వేధింపులకు గురిచేయడం వంటివి చాలామంది పిల్లల నమ్మకాన్ని వమ్ము చేశాయి.

పిల్లల దురవస్థ చూసి నిజంగా శ్రద్ధచూపే వ్యక్తులు వ్యాకులపడుతున్నారంటే అది అర్థం చేసుకోదగినదే. కొంతమంది అలాంటి దుర్వ్యవహారానికి మానవ దురాశ, దుర్నీతి ప్రధాన కారణాలని అంగీకరించినా, ప్రేమగల దేవుడు అలాంటి అన్యాయాన్ని ఎందుకు అనుమతిస్తున్నాడో అర్థం చేసుకోవడం కష్టంగా ఉంటుంది. దేవుడు ఆ పిల్లలను వదిలేశాడని, ఆయనకు వాళ్ళపై అసలు శ్రద్ధే లేదని వారు భావించవచ్చు. అది నిజమేనా? పిల్లలు స్వలాభానికి ఉపయోగించుకోబడి, తరచూ వేధింపులకు గురవుతున్నారనే దుఃఖకరమైన వాస్తవం, పిల్లలపై దేవునికి శ్రద్ధ లేదని చూపిస్తోందా? దీని గురించి బైబిలు ఏమి చెబుతోంది?

వేధించేవారిని దేవుడు ఖండిస్తాడు

దయలేని పెద్దవాళ్ళు పిల్లలను స్వలాభానికి ఉపయోగించుకోవాలని యెహోవా దేవుడు ఎన్నడూ సంకల్పించలేదు. పిల్లలపై జరుగుతున్న దౌర్జన్యం, ఏదెను తోటలో మానవజాతి చేసిన తిరుగుబాటు కారణంగా వచ్చిన అత్యంత దుఃఖకరమైన పర్యవసానాల్లో ఒకటి. వాళ్ళలా దేవుని సర్వాధిపత్యాన్ని నిరాకరించడం, మానవులు తమ తోటివారిని క్రూరంగా స్వలాభానికి ఉపయోగించుకోవడానికి దారితీసింది.​—ఆదికాండము 3:11-13, 16; ప్రసంగి 8:9.

బలహీనులను, నిస్సహాయులను తమ స్వలాభానికి ఉపయోగించుకునే వాళ్ళను దేవుడు అసహ్యించుకుంటాడు. యెహోవాను సేవించని అనేక ప్రాచీన జనాంగాలు పిల్లలను బలి ఇచ్చేవారు, కానీ అది ‘తాను ఆజ్ఞాపించని క్రియ, తనకు తోచని క్రియ’ అని యెహోవా అన్నాడు. (యిర్మీయా 7:31) దేవుడు తన ప్రాచీన ప్రజలను ఇలా హెచ్చరించాడు: ‘[దిక్కులేని పిల్లలు] నీచేత ఏ విధముగానైనను బాధనొంది నాకు మొఱపెట్టినయెడల నేను నిశ్చయముగా వారి మొఱను విందును. నా కోపాగ్ని రవులుకొనును.’​—నిర్గమకాండము 22:22-24.

యెహోవాకు పిల్లలపై ప్రేమ ఉంది

దేవుడు మానవ తల్లిదండ్రులకు ఇచ్చిన జ్ఞానయుక్తమైన నిర్దేశాలను చూస్తే పిల్లలపై ఆయనకున్న శ్రద్ధ స్పష్టంగా కనిపిస్తుంది. సురక్షితమైన గృహాల్లో పెరిగిన పిల్లలు పరిణతి చెందినవారిగా, మంచివారిగా ఎదిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే మన సృష్టికర్త వివాహాన్ని ప్రారంభించాడు, అది జీవితాంతం కొనసాగే బంధం, దానికి అనుగుణంగా “పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును; వారు ఏక శరీరమైయుందురు.” (ఆదికాండము 2:24) బైబిల్లో లైంగిక సంబంధాలు కేవలం వివాహానికి మాత్రమే పరిమితమై ఉండాలని ఆజ్ఞాపించబడింది, తద్వారా పుట్టిన పిల్లలను ఒక సుస్థిరమైన వాతావరణంలో పెంచే అవకాశం ఉంటుంది.​—హెబ్రీయులు 13:4.

తల్లిదండ్రులు శిక్షణ ఇవ్వవలసిన ప్రాముఖ్యతను కూడా లేఖనాలు నొక్కి చెబుతున్నాయి. “కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన యిచ్చు బహుమానమే. యౌవనకాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణములవంటివారు” అని బైబిలు చెబుతోంది. (కీర్తన 127:3, 4) పిల్లలు దేవుడిచ్చిన అమూల్యమైన బహుమానం, వాళ్ళు చక్కగా వర్ధిల్లాలని ఆయన కోరుకుంటున్నాడు. విలుకాడు జాగ్రత్తగా గురి చూసి బాణం వేసినట్లే, తల్లిదండ్రులు తమ పిల్లలకు జీవితంలో మంచి నిర్దేశాన్ని ఇవ్వాలని దేవుడు వారికి ఉద్బోధిస్తున్నాడు. “తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి” అని దేవుని వాక్యం ఉపదేశిస్తోంది.​—ఎఫెసీయులు 6:4.

దుర్మార్గుల నుండి పిల్లలను కాపాడమని తల్లిదండ్రులకు ఉపదేశించడం ద్వారా కూడా యెహోవా పిల్లలపై తనకున్న ప్రేమను చూపించాడు. ప్రాచీన ఇశ్రాయేలులో ధర్మశాస్త్రం చదవబడుతున్నప్పుడు ‘పిల్లలు’ కూడా వినాలని ఆజ్ఞాపించబడింది, ధర్మశాస్త్రంలో లైంగిక సంబంధాల్లో ఏది సముచితమైనదో ఏది అనుచితమైనదో గుర్తించడానికి దోహదపడే ఉపదేశాలు ఉండేవి. (ద్వితీయోపదేశకాండము 31:12; లేవీయకాండము 18:6-24) తమ పిల్లలను స్వార్థానికి ఉపయోగించుకునే వారినుండి లేదా వారిపై దౌర్జన్యం చేసే వారినుండి కాపాడడానికి తల్లిదండ్రులు తమకు సాధ్యమైనదంతా చేయాలని దేవుడు కోరుతున్నాడు.

పిల్లలకు నిరీక్షణ

యెహోవాకు పిల్లలపై ఉన్న అమితమైన ప్రేమ, తన తండ్రి వ్యక్తిత్వాన్ని పరిపూర్ణంగా ప్రతిబింబించే యేసుక్రీస్తు ద్వారా చక్కగా ప్రదర్శించబడింది. (యోహాను 5:19) యేసు అపొస్తలులు ఆయనకు అంతరాయం కలిగించకూడదనే ఉద్దేశంతో, తల్లిదండ్రులు తమ చిన్న పిల్లలను యేసు దగ్గరికి తీసుకునిరానివ్వకుండా వారిని అడ్డుకున్నప్పుడు, ఆయన వాళ్ళను మందలించాడు. “చిన్నబిడ్డలను నాయొద్దకు రానియ్యుడి” అని యేసు అన్నాడు. ఆ తర్వాత ఆయన “ఆ బిడ్డలను ఎత్తి కౌగిలించుకొని, వారి మీద చేతులుంచి ఆశీర్వదించెను.” (మార్కు 10:13-16) పిల్లలు యెహోవా దేవుని దృష్టిలోనూ ఆయన కుమారుని దృష్టిలోనూ అమూల్యమైనవారే.

వాస్తవానికి, వేధింపులకు గురవుతున్న పిల్లలకు ఉపశమనం కలిగించడానికి, దేవుడు త్వరలోనే తన నియమిత రాజైన యేసుక్రీస్తు ద్వారా చర్య తీసుకుంటాడు. ఈ లోకంలోని దురాశాపరులు, నిర్దయులైన దుర్మార్గులు శాశ్వతంగా నిర్మూలించబడతారు. (కీర్తన 37:10, 11) అయితే యెహోవాను వెదికే దీనుల గురించి బైబిలు ఇలా చెబుతోంది: “ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయెను.”​—ప్రకటన 21:3, 4.

ఈలోగా, స్వార్థానికి ఉపయోగించుకోబడుతున్నవారికి, దౌర్జన్యానికి గురవుతున్నవారికి ఆధ్యాత్మిక, భావోద్వేగ సహాయాన్ని అందించడం ద్వారా దేవుడు ఇప్పుడు కూడా వారిపట్ల ప్రేమ చూపిస్తున్నాడు. “తప్పిపోయిన దానిని నేను వెదకుదును, తోలివేసిన దానిని మరల తోలుకొని వచ్చెదను, గాయపడినదానికి కట్టు కట్టుదును, దుర్బలముగా ఉన్నదానిని బలపరచుదును” అని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. (యెహెజ్కేలు 34:16) పీడించబడుతున్న పేద పిల్లలను యెహోవా తన వాక్యం ద్వారా, తన పరిశుద్ధాత్మ ద్వారా, క్రైస్తవ సంఘం ద్వారా ఓదారుస్తున్నాడు. “కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు” ఇప్పుడు కూడా, ఆయన భవిష్యత్తులో చేయబోయేలా ‘మన శ్రమ అంతటిలో మనల్ని ఆదరిస్తాడు’ అని తెలుసుకోవడం ఎంతటి ఆనందాన్నిస్తుందో కదా!​—2 కొరింథీయులు 1:3, 4. (g04 8/8)

[12వ పేజీలోని చిత్రసౌజన్యం]

© Mikkel Ostergaard /Panos Pictures