కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

వివక్షకు ఉన్న వివిధ రూపాలు

వివక్షకు ఉన్న వివిధ రూపాలు

వివక్షకు ఉన్న వివిధ రూపాలు

“వివక్షను గుమ్మం నుండి వెళ్ళగొడితే, అది కిటికీలో నుండి మళ్ళీ ప్రవేశిస్తుంది.” ​—ఫ్రెడ్రిక్‌ ద గ్రేట్‌, ప్రష్యా రాజు.

రాజేష్‌ ఇండియాలోని పాలియాడ్‌ గ్రామ నివాసి. అతను ఇతర అంటరాని వాళ్ళలాగే తన కుటుంబానికి నీళ్ళు తీసుకురావాలంటే 15 నిమిషాల పాటు నడవాలి. “గ్రామంలో ఉన్నత కులాలవాళ్ళు పట్టుకునే కుళాయిలనుండి మేము నీళ్ళు పట్టుకోవడానికి వీల్లేదు” అని ఆయన వివరించాడు. రాజేష్‌ చదువుకునే రోజుల్లో అతను అతని స్నేహితులు ఇతర పిల్లలు ఆడుకునే ఫుట్‌బాల్‌ను ముట్టుకోవడం కూడా తప్పే. “దానికి బదులు మేము రాళ్ళతో ఆడుకునే వాళ్ళం” అని ఆయన చెప్పాడు.

“ప్రజలు నన్ను ద్వేషిస్తున్నారని నాకనిపిస్తుంది, కానీ ఎందుకో తెలియదు” అని ఆసియానుండి వచ్చి యూరప్‌లో నివసిస్తున్న క్రిస్టీనా అనే యువతి చెప్పింది. “అది చాలా బాధాకరమైనది. సాధారణంగా నేను వాళ్ళకు దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తాను, కానీ అది కూడా నాకు సహాయం చేయడంలేదు” అని ఆమె చెప్పింది.

“నాకు 16 సంవత్సరాలు ఉన్నప్పుడు మొదటిసారిగా వివక్ష గురించి తెలిసింది” అని పశ్చిమ ఆఫ్రికాలో నివసిస్తున్న స్టాన్లీ చెప్పాడు. “నాకు అస్సలు తెలియని వ్యక్తులు నన్ను ఊళ్ళోనుండి వెళ్లిపొమ్మని చెప్పారు. మా తెగకు చెందిన కొంతమంది ఇళ్ళు తగలబెట్టబడ్డాయి. మా నాన్నగారి బ్యాంక్‌ ఖాతా ఉపయోగించడానికి వీల్లేకుండా చేయబడింది. తత్ఫలితంగా మాపై వివక్ష చూపిస్తున్న తెగను నేను ద్వేషించడం ఆరంభించాను” అని అతను చెప్పాడు.

ఇలా వివక్షకు గురయ్యింది రాజేష్‌, క్రిస్టీనా, స్టాన్లీలు మాత్రమే కాదు. నేడు కోట్లాదిమంది, “జాతీయవాదం, పక్షపాతం, విదేశీయులపట్ల భయం, ద్వేషం, సామాజిక బహిష్కరణ వంటివాటివల్ల కష్టాలు అనుభవిస్తున్నారు. అజ్ఞానం, వివక్షలు సమర్థించే అలాంటి అమానవీయ అభ్యాసాలు అనేక దేశాల్లో పౌరుల మధ్య సంఘర్షణలకు దారితీసి మానవులను విపరీతంగా హింసించాయి” అని అంతర్జాతీయ విద్యా, విజ్ఞాన, సాంస్కృతిక వ్యవస్థ (యునెస్కో) ప్రధాన సంచాలకులైన కోయిచెరో మాట్సూరా వివరించారు.

మీరు ఎప్పుడైనా వివక్షను అనుభవించకపోతే, అది ఎంతటి మానసిక వ్యథను కలిగిస్తుందో అర్థం చేసుకోవడం మీకు కష్టంగా ఉంటుంది. “కొందరు దానిని మౌనంగా భరిస్తారు. మరికొందరైతే వివక్షకు ప్రతివివక్షను చెల్లిస్తారు” అని ఫేస్‌ టు ఫేస్‌ ఎగెయిన్స్‌ట్‌ ప్రిజుడీస్‌ అనే పుస్తకం వ్యాఖ్యానించింది. వివక్ష ఏ విధంగా జీవితాలకు హాని చేస్తుంది?

మీరు అల్పసంఖ్యాక వర్గానికి చెందిన వారైతే, ప్రజలు మీకు దూరంగా ఉండడాన్ని, మిమ్మల్ని తిరస్కార భావంతో చూడడాన్ని లేదా మీ సంస్కృతి గురించి చులకనగా మాట్లాడడాన్ని మీరు గమనించవచ్చు. ఎవరూ చేయడానికి ఇష్టపడని హీనమైన పనులు చేయడానికి ఒప్పుకోకపోతే మీకు ఉద్యోగ అవకాశాలు అంతంత మాత్రంగానే ఉండవచ్చు. సరైన ఇల్లు దొరకడం కూడా కష్టం కావచ్చు. పాఠశాలలో మీ పిల్లలు వేరుచేయబడినవారిగా, తోటి విద్యార్థులచేత తిరస్కరించబడినవారిగా భావించవచ్చు.

అంతకంటే ఘోరమైన విషయమేమంటే, వివక్ష ప్రజలను దౌర్జన్యం చేయడానికి, చివరకు హత్యలు చేయడానికి పురికొల్పవచ్చు. నిజానికి మారణహోమాలు, జాతి నిర్మూలన, జాతి ప్రక్షాళన అని పిలువబడే వాటితోపాటు వివక్ష సృష్టించిన భయంకరమైన హింసాయుత ఘట్టాలతో చరిత్ర పుటలు నిండి ఉన్నాయి.

శతాబ్దాలుగా కొనసాగుతున్న వివక్ష

ఒకప్పుడు క్రైస్తవులు వివక్షకు ప్రధాన లక్ష్యాలుగా ఉండేవారు. ఉదాహరణకు, యేసు మరణించిన కొద్దికాలానికే వారు క్రూరంగా హింసించబడ్డారు. (అపొస్తలుల కార్యములు 8:3; 9:1, 2; 26:10, 11) రెండు శతాబ్దాల తర్వాత క్రైస్తవులమని చెప్పుకునేవారు చిత్రహింసలకు గురయ్యారు. “ఒక మహమ్మారి వ్యాపిస్తే, వెంటనే ‘క్రైస్తవులను సింహాలకు పడేయ్యండి’ అనే కేకలు వినబడేవి” అని మూడవ శతాబ్దపు రచయిత టెర్టూలియన్‌ వ్రాశాడు.

అయితే 11వ శతాబ్దంలో జరిగిన మతయుద్ధాలు మొదలుకొని యూరప్‌లో యూదులు ప్రజల ఆగ్రహానికి గురయ్యే అల్పసంఖ్యాక వర్గంగా తయారయ్యారు. యూరప్‌ ఖండమంతటా బుబోనిక్‌ తెగులు వ్యాపించి కొద్ది సంవత్సరాల్లోనే నాల్గవవంతు జనాభా నశించినప్పుడు, అప్పటికే చాలామంది చేత ద్వేషించబడుతున్న యూదులే దానికి కారణం అని నిందించడం సులభమయ్యింది. “ఆ తెగులు భయం పట్టుకున్న ప్రజల్లోని ద్వేషం ఆ తెగులుకు యూదులే కారణం అనుకునేలా చేసింది” అని జానెట్‌ ఫేరెల్‌ తన స్వీయ పుస్తకమైన ఇన్‌విజిబుల్‌ ఎనిమీస్‌లో వ్రాసింది.

చివరకు దక్షిణ ఫ్రాన్సులో ఒక యూదుడు హింసను భరించలేక, బావుల్లో విషం కలిపి తెగులును రప్పించింది యూదులే అని “ఒప్పుకున్నాడు.” అతను చెప్పింది అబద్ధమే అయినా, అది నిజమని ప్రచారం చేయబడింది. ఆ వెంటనే స్పెయిన్‌, ఫ్రాన్స్‌, జర్మనీల్లోని యూదా సమాజాలు సమూలంగా హతమార్చబడ్డాయి. అసలు దోషులైన ఎలుకలను మాత్రం ఎవరూ పట్టించుకున్నట్లు కనిపించలేదు. అందరిలాగే యూదులు కూడా ఆ తెగులువల్ల మరణిస్తున్నారని ఎవ్వరూ గమనించలేదు!

వివక్ష అనే అగ్ని ఒక్కసారి రగులుకుందంటే, అది శతాబ్దాలపాటు రగులుతూనే ఉంటుంది. మొదటి ప్రపంచ యుద్ధంలో జర్మనీ ఓడిపోయినందుకు యూదులను నిందిస్తూ 20వ శతాబ్దం మధ్య భాగంలో అడాల్ఫ్‌ హిట్లర్‌, యూదుల వ్యతిరేకాగ్నికి ఆజ్యం పోశాడు. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసేనాటికి, ఆష్‌విట్జ్‌ కాన్‌సన్‌ట్రేషన్‌ క్యాంప్‌ నాజీ కమాండర్‌ రుడాల్ఫ్‌ హోస్‌ ఇలా అంగీకరించాడు: “మా సైనిక శిక్షణ, సిద్ధాంతపరమైన శిక్షణ మేము జర్మనీని యూదులనుండి కాపాడాలనే విషయం నిజమని భావించేలా చేశాయి.” కాబట్టి ‘జర్మనీని కాపాడడానికి’ హోస్‌ 20,00,000 మంది చంపబడేలా చూశాడు, ఆ చంపబడినవారిలో అత్యధికులు యూదులే.

విషాదకరంగా, దశాబ్దాలు గడుస్తున్న కొద్దీ అలాంటి దారుణకృత్యాలు ఆగలేదు. ఉదాహరణకు, 1994లో తూర్పు ఆఫ్రికాలోని టుట్సీ, హుటు తెగల మధ్య ప్రజ్వరిల్లిన ద్వేషం కనీసం ఐదు లక్షలమందిని పొట్టన పెట్టుకుంది. “ప్రజలు ఆశ్రయం పొందగల స్థలాలంటూ ఏమీ లేకుండా పోయాయి. చాలామంది తలదాచుకున్న చర్చీల్లో రక్తం కాలువలై పారింది. . . . ప్రజలు ఒకరినొకరు దారుణంగా నరుక్కున్నారు, మాటలకందని ఆ రక్తపిపాసను తప్పించుకున్న వారు నోటమాటరాక నిశ్చేష్ఠులయ్యారు” అని టైమ్‌ పత్రిక నివేదించింది. ఆ భయంకరమైన హింసలో చిన్నపిల్లలు సైతం మినహాయించబడలేదు. “రువాండ చాలా చిన్న దేశమే. కానీ ఈ లోకంలో ఎక్కడాలేని ద్వేషం మాలో ఉంది” అని ఒక పౌరుడు వ్యాఖ్యానించాడు.

పూర్వపు యుగోస్లావియా చీలిపోయినప్పుడు చెలరేగిన పోరాటాల్లో 2,00,000 కంటే ఎక్కువమంది మరణించారు. అనేక సంవత్సరాలు శాంతియుతంగా పక్కపక్కనే నివసించిన ప్రజలు కూడా ఒకరినొకరు చంపుకున్నారు. వేలాదిమంది స్త్రీలు బలాత్కరించబడ్డారు, జాతి ప్రక్షాళన అనే క్రూరమైన పద్ధతి కారణంగా లక్షలాదిమంది బలవంతంగా తమ ఇళ్ళనుండి వెళ్ళగొట్టబడ్డారు.

వివక్ష చాలామట్టుకు హత్యాకాండకు దారితీయకపోయినా, అది ఎప్పుడూ ప్రజలను విభాగించి పగను పెంచుతుంది. ప్రపంచీకరణ జరుగుతున్నా జాతి, తెగల వివక్ష “ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో వేళ్లూనుకుంటున్నట్లుగా కనిపిస్తోంది” అని ఇటీవలి యునెస్కో నివేదిక చెప్పింది.

వివక్షను నిర్మూలించడానికి ఏదైనా చేసే అవకాశముందా? ఆ ప్రశ్నకు జవాబిచ్చేందుకు, వివక్ష మనస్సుల్లో, హృదయాల్లో ఎలా వేళ్లూనుకుంటుందో తేల్చాలి. (g04 9/8)

[5వ పేజీలోని బాక్సు]

వివక్ష లక్షణాలు

ద నేచర్‌ ఆఫ్‌ ప్రిజుడీస్‌ అనే తన పుస్తకంలో గోర్డన్‌ డబ్ల్యు. ఆల్‌పోర్ట్‌ వివక్ష కారణంగా ఉత్పన్నమయ్యే ప్రవర్తనకు సంబంధించిన ఐదు అంశాలను పేర్కొన్నాడు. వివక్షగల వ్యక్తి సాధారణంగా వీటిలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ లక్షణాలను కనబరచవచ్చు.

1. ప్రతికూలంగా మాట్లాడడం. ఒక వ్యక్తి తాను ఇష్టపడని గుంపును చులకన చేసి మాట్లాడతాడు.

2. దూరంగా ఉండడం. అతను ఆ గుంపుకు చెందిన వారినందరినీ త్యజిస్తాడు.

3. పక్షపాతం. అతను హానికరమని తలంచిన ఆ గుంపు సభ్యులకు కొన్నిరకాల ఉద్యోగాలు ఇవ్వడు, ఇళ్ళలోకి అనుమతించడు లేదా సామాజిక ప్రయోజనాలు దక్కనివ్వడు.

4. శారీరక దాడి చేయడం. తాను ద్వేషించే ప్రజలను భయపెట్టడానికి ఉద్దేశించిన హింసలో పాలుపంచుకుంటాడు.

5. హతమార్చడం. దొమ్మీగా ఎగబడి హతమార్చడం, మారణహోమాలు లేదా ఊచకోతవంటి కార్యక్రమాల్లో అతను పాల్గొంటాడు.

[4వ పేజీలోని చిత్రం]

బెనాకో శరణార్థి శిబిరం, టాంజానియా, మే 11, 1994

నీళ్ళ డబ్బాలతో కూర్చున్న మహిళ. 3,00,000 కంటే ఎక్కువమంది శరణార్థులు టాంజానియాలోకి ప్రవేశించారు, వారిలో రువాండాకు చెందిన హుటు తెగవాళ్ళు ఎక్కువగా ఉన్నారు.

[చిత్రసౌజన్యం]

చిత్రాలు Paula Bronstein/Liaison