కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

తల్లిగా లేక తండ్రిగా మీ పాత్ర

తల్లిగా లేక తండ్రిగా మీ పాత్ర

తల్లిగా లేక తండ్రిగా మీ పాత్ర

“ఒక పిల్లవాడు తాను ప్రేమించబడుతున్నానని, కుటుంబంలో తానొక భాగమనీ, తనకు కూడా ఒక సంకల్పముందనీ, తానూ జిజ్ఞాస గల వ్యక్తిననీ భావించేలా మీరు చేయగలిగితే ఆ పిల్లవానిలో తప్పకుండా మనో వికాసం కలుగుతుంది. తల్లిదండ్రులుగా మన పాత్ర, మెదడు వ్యవస్థను లోపరహితం చేయడం కాదు కానీ ఆరోగ్యవంతమైన, వివేకవంతమైన, శ్రద్ధాసక్తులుగల వ్యక్తులను వృద్ధి చేయడమే” అని హార్వర్డ్‌ మెడికల్‌ స్కూలుకు చెందిన పీటర్‌ గోర్‌స్కీ అంటున్నారు.

మీ పిల్లవాడు మంచి నైతికతగల వ్యక్తిగా, ఇతరుల కష్టసుఖాల గురించి ఆలోచించే వ్యక్తిగా ఎదగడాన్ని చూడడం తల్లిదండ్రులుగా మీకు ఎంత సంతృప్తికరంగా ఉంటుందో కదా! మీరు అటువంటి ఫలితం పొందాలంటే, ఒక ఆదర్శకునిగా, సహచరునిగా, సంభాషకునిగా, బోధకునిగా ఉండడానికి మీరు తీసుకునే చొరవ మీదే ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. పిల్లలందరూ నైతికంగా సరైనవిధంగా ప్రవర్తించే ప్రాథమిక సామర్థ్యంతోనే పుట్టినప్పటికీ, వారు ఎదిగే కొద్దీ తల్లిదండ్రులు వారికి క్రమక్రమంగా నైతిక విలువలు నేర్పించాలి.

పిల్లలను ఎవరు తీర్చిదిద్దుతారు?

పిల్లలను తీర్చిదిద్దడంలో ఎవరు ఎక్కువ ప్రభావం చూపిస్తారనే విషయంలో పరిశోధకుల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. పిల్లల మీద ముఖ్యంగా తోటివారి ప్రభావమే ఎక్కువగా ఉంటుందని కొందరు నమ్ముతారు. కానీ పిల్లల వికాస రంగంలో నిపుణులైన టి. బెర్రీ బ్రెజెల్టన్‌, స్టాన్‌లీ గ్రీన్‌స్పాన్‌ అనే డాక్టర్లు మాత్రం, పసితనం నుండి ఆప్యాయత, అనురాగాలతో పెంచే తల్లిదండ్రుల పాత్రను తక్కువ అంచనా వేయలేమని నమ్ముతున్నారు.

ఒక పిల్లవాని పసితనంలో ఆరంభమైన వికాసానికి, జీవితంలో ఆ తర్వాత ఎదురయ్యే అనుభవాలూ, తోటివారి ప్రభావాలూ మరింత దోహదపడతాయి. కుటుంబంలో పిల్లలపట్ల సానుభూతి, అవగాహన చూపించడం ప్రాముఖ్యం. తమలో కలిగే భావాలతో పరిణతి చెందిన రీతిలో ఎలా వ్యవహరించాలో కూడా వారికి నేర్పించాలి. అలాంటి సహాయం పొందిన పిల్లలు సాధారణంగా ఇతరులతో కలిసి పని చేస్తున్నప్పుడు సహకరించేవారిగా, సానుభూతి గలవారిగా, ఎదుటివారి భావాలను అర్థం చేసుకునేవారిగా తయారవుతారు.

పిల్లలకు పసితనం నుండి శిక్షణ ఇవ్వడమనేది చాలా ప్రయాసతో కూడిన పని. అందులో మీరు విజయవంతం కావాలంటే, ప్రత్యేకించి మీరు కొత్తగా తల్లిదండ్రులైన వారైతే అనుభవజ్ఞులైన ఇతరుల నుండి సలహా తీసుకోవడం, ఆ తర్వాత ఒక నిర్దిష్టమైన విధానాన్ని పాటించడం తెలివైన పని. పిల్లల పెంపకంపై నిపుణులు లెక్కలేనన్ని పుస్తకాలు వ్రాశారు. వారు చెప్పేవి తరచుగా, బైబిలులో ఉన్న ఆధారపడదగిన సలహాలనే ప్రతిధ్వనిస్తుంటాయి. తల్లిదండ్రులు దేవుని వాక్యంలోని ఆధారపడదగిన సూత్రాలను పాటించినప్పుడు, తమ పిల్లలను సమర్థంగా పెంచడానికి అవి వారికి సహాయపడ్డాయి. ఇక్కడున్న ఈ ఆచరణాత్మకమైన మార్గనిర్దేశాన్ని పరిశీలించండి.

ప్రేమను వ్యక్తం చేయడంలో ఉదారంగా ఉండండి

క్రమంగా ప్రేమపూర్వక శ్రద్ధతో పోషిస్తే, బలంగా ఏపుగా పెరిగే లేత మొక్కల్లా ఉంటారు పిల్లలు. నీళ్ళు, సూర్యరశ్మి చిన్న మొక్కలను పోషిస్తూ అవి ఆరోగ్యంగా, దృఢంగా పెరిగేలా చేస్తాయి. అదేవిధంగా తమ మాటల ద్వారా చేతల ద్వారా ప్రేమను వ్యక్తం చేసే తల్లిదండ్రులు, తమ పిల్లల మానసిక, భావోద్వేగ పెరుగుదలను, వారి దృఢత్వాన్ని వృద్ధిచేస్తారు.

బైబిలు స్పష్టంగా ఇలా చెబుతోంది: “ప్రేమ క్షేమాభివృద్ధి కలుగజేయును.” (1 కొరింథీయులు 8:1) వాస్తవానికి తమ పిల్లలపట్ల ప్రేమను ఉదారంగా వ్యక్తం చేసే తల్లిదండ్రులు, తమ సృష్టికర్త అయిన యెహోవా దేవుణ్ణి అనుకరిస్తున్నారు. బైబిలు యేసు బాప్తిస్మం తీసుకున్న సందర్భం గురించి వివరిస్తున్నప్పుడు, తన తండ్రి ఆమోదాన్నీ ప్రేమనూ వ్యక్తం చేస్తూ పలికిన మాటలను ఆయన విన్నాడని చెబుతోంది. యేసు అప్పుడు పెద్దవాడే అయినా ఆ మాటలు ఆయనను ఎంత బలపరిచాయో కదా!​—లూకా 3:22.

మీరు మీ పిల్లలపట్ల చూపించే ఆప్యాయతా, వారు పడుకునేటప్పుడు చదివి వినిపించే కథలూ, వారితో ఆడే ఆటలూ వారి వికాసానికి ప్రధానమైన అంశాలుగా ఉంటాయి. ‘పిల్లలు చేసే ప్రతీది వారి జీవితానుభవానికి తోడయ్యే అంశమే. ఒక పిల్లవాడు పాకడం నేర్చుకుంటున్నట్లయితే అప్పుడు మీరు ఎలా ప్రోత్సహిస్తారు, ఎలా స్పందిస్తారు అన్నది ముఖ్యం’ అని డాక్టర్‌ జె. ఫ్రేసర్‌ మస్టర్డ్‌ అంటున్నారు. తల్లిదండ్రులుగా మీరు చూపించే ప్రేమా శ్రద్ధలు మీ పిల్లవాడు బాధ్యతగల, పరిణతి చెందిన ఒక వ్యక్తిగా ఎదగడానికి దృఢమైన పునాది వేస్తాయి.

సహచరులుగా, సంభాషకులుగా ఉండండి

మీ పిల్లలతో సమయం గడపడం ఒక బంధాన్ని ఏర్పరుస్తుంది. అంతేగాక అది సంభాషించే నైపుణ్యాలను కూడా పెంపొందిస్తుంది. ఇంట్లోనేకాక సముచితమైన ఇతర సమయాల్లో కూడా అలాంటి సాన్నిహిత్యం ఉండాలని లేఖనాలు ప్రోత్సహిస్తున్నాయి.​—ద్వితీయోపదేశకాండము 6:6, 7; 11:18-21.

తల్లిదండ్రులు తమ పిల్లలతో గడిపే సమయం, ఖరీదైన బొమ్మలు ప్రత్యేకమైన కార్యకలాపాల కన్నా ఎంతో ముఖ్యమైనవని పిల్లల వికాస నిపుణులు అంగీకరిస్తున్నారు. మీ దైనందిన కార్యకలాపాల్లో మీ పిల్లలతో గడిపే అవకాశాలు ఎన్నో లభిస్తాయి, వాటికి పెద్ద ఖర్చు కూడా ఉండదు. ఉదాహరణకు, తల్లిదండ్రులు తమ పిల్లలతో కలిసి ప్రకృతిని చూసి ఆనందించడానికి ఏదైనా పార్కుకు వెళ్ళడం, అర్థవంతమైన ప్రశ్నలు అడగడానికీ మంచి సంభాషణకూ అవకాశమిస్తుంది.

“నాట్యమాడుటకు” కూడా “సమయము కలదు” అని లేఖనాలు చెబుతున్నాయి. (ప్రసంగి 3:1, 4) అవును స్వేచ్ఛగా ఆడే ఆటలు పిల్లవాని మేధాపరమైన, భావోద్వేగపరమైన, సహజీవన నైపుణ్యాల ఎదుగుదలకు కీలకం. డాక్టర్‌ మస్టర్డ్‌ ప్రకారం, ఆటలు కేవలం విలువైనవే కావు, ఎంతో ముఖ్యమైనవి. ఆయనిలా అంటున్నాడు: “పిల్లల మెదడులో అనేక రకాల ప్రక్రియల కోసం కావలసిన, నాడుల మధ్య ఏర్పడే సంధానాలు ముఖ్యంగా ఆటల ద్వారానే ఏర్పడతాయి.” ఒక పిల్లవాడు ఆడుకోవడానికి ఖాళీ అట్టపెట్టె వంటి సాధారణమైన వాటినే ఆటబొమ్మలుగా ఉపయోగించవచ్చు. సురక్షితమైన వస్తువులు, ఇంట్లో ప్రతిదినం ఉపయోగించుకునే వస్తువులు, ఖరీదైన హైటెక్‌ ఆటబొమ్మల్లాగే పిల్లల ఆసక్తిని చూరగొంటాయి. *

పెద్దలు నాయకత్వం వహించే విపరీతమైన కార్యకలాపాలతో పిల్లలను నియంత్రిస్తే అది వారిలోని భావనాశక్తిని, సృజనాత్మకతను అణగార్చవచ్చు అని నిపుణులు అంటున్నారు. సమతుల్యతను సిఫార్సు చేస్తున్నారు. మీ పిల్లవాడు తన చిన్ని లోకాన్ని తానుగా పరిశీలించుకునేందుకూ, తన శక్తిసామర్థ్యాలను వినియోగించుకునేందుకూ అనుమతించండి. సాధారణంగా పిల్లలు తమ మనోరంజనం కోసం తామే ఏదో ఒకటి వెతుక్కుంటారు. అయితే ఇది, మీ పిల్లవాడు తనకు తాను హాని చేసుకోకుండా చూసేందుకు, వాడు ఏమి చేస్తున్నాడో, ఎక్కడ ఆడుకుంటున్నాడో తెలుసుకునే బాధ్యత నుండి మిమ్మల్ని మినహాయించదు.

సమయం తీసుకోండి

చక్కగా సర్దుకుపోయేలా పిల్లలను పెంచి పెద్దచేయడంలో బోధించడం కీలక పాత్ర పోషిస్తుంది. చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలకు చదివి వినిపించడానికి ప్రతిరోజు కొంత సమయాన్ని కేటాయిస్తారు. అది వారు తమ పిల్లలకు ఆమోదకరమైన ప్రవర్తన గురించిన పాఠాలు నేర్పించడానికే కాక, మన సృష్టికర్త చెబుతున్నవాటి ఆధారంగా వారిలో నైతిక విలువలను పాదుకొల్పేందుకు కూడా అవకాశమిస్తుంది. నమ్మకస్థుడైన బోధకుడు, మిషనరీ అయిన తిమోతి ‘పరిశుద్ధలేఖనములను బాల్యమునుండి ఎరిగిన’ వ్యక్తి అని బైబిలు చెబుతోంది.​—2 తిమోతి 3:14, 15.

మీ శిశువుకు చదివి వినిపించడం అతని నాడీ కేంద్రాలను ఉత్తేజపరచగలదు. చదివి వినిపించే వ్యక్తి శిశువుపట్ల ప్రేమ, శ్రద్ధలు గలవాడిగా ఉండడం ప్రాముఖ్యం. విద్యా సంబంధిత ప్రొఫెసర్‌ అయిన లిండా సీగల్‌ చదివేవాటిలో ఏమి ఉండాలనే విషయంలో ఇలా హెచ్చరిస్తోంది: “అవి పిల్లలు ఆనందించే స్థాయిలోనే ఉండాలి.” అంతేగాక క్రమంగా, రోజూ ఒకే సమయంలో చదివి వినిపించడానికి ప్రయత్నించండి. ఆ విధంగా పిల్లలు ఆ సమయం కోసం ఎదురుచూడడం ప్రారంభిస్తారు.

బోధించడంలో క్రమశిక్షణ కూడా ఉంది. ప్రేమపూర్వక క్రమశిక్షణ నుండి చిన్నపిల్లలు ప్రయోజనం పొందగలరు. “తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానముగలవాడగును” అని సామెతలు 13:1 చెబుతోంది. అయితే క్రమశిక్షణలో అనేక విషయాలు ఉన్నాయని గుర్తుంచుకోండి. ఉదాహరణకు, అందులో మాటల ద్వారా సరిదిద్దడం లేదా కొన్ని విషయాలపై ఆంక్షలు విధించడం లేదా ఇతర విధాలుగా శిక్షించడం ఉండవచ్చు. క్రమశిక్షణ అంటే “కొన్ని భావాలతో, నియంత్రించుకోలేని ప్రవర్తనలతో ఎలా వ్యవహరించాలో ఒక పిల్లవానికి బోధించడం అని అర్థం. ప్రతి పిల్లవాడు హద్దుల కోసం ఎదురుచూస్తాడు. మీరు పిల్లలకు ఇచ్చే అత్యంత ప్రాముఖ్యమైన వాటిలో ప్రేమ తర్వాత పేర్కొదగినది క్రమశిక్షణే” అని ప్రారంభంలో పేర్కొన్న డాక్టర్‌ బ్రెజెల్టన్‌ అంటున్నారు.

ఒక తల్లిగా లేక తండ్రిగా మీ క్రమశిక్షణ సమర్థవంతమైనదో కాదో ఎలా ధ్రువీకరించుకోవచ్చు? ఒక పద్ధతి ఏమిటంటే, మీ పిల్లల్ని మీరెందుకు శిక్షిస్తున్నారో వాళ్ళు అర్థం చేసుకోవాలి. మీరు మీ పిల్లలను సరిదిద్దుతున్నప్పుడు వారిమీదున్న ప్రేమాశ్రద్ధలతోనే మీరలా చేస్తున్నారని వారు గ్రహించేలా చేయండి.

విజయవంతమయ్యే ప్రయత్నాలు

ఫ్రెడ్‌ అనే ఒక తండ్రి తన కూతురు పడుకునే ముందు అలవాటుగా రోజూ ఆమెకు చదివి వినిపించేవాడు. కొంతకాలానికి, ఆమె చాలా కథలను కంఠతా పట్టినట్లు, పదాలను వాటికి సంబంధించిన శబ్దాలను గుర్తిస్తూ తాను చదువుతున్నది గ్రహిస్తున్నట్లు ఆయన గమనించాడు. క్రిస్‌ అనే మరొక తండ్రి తన పిల్లలకు చదివి వినిపించడంలో చాలా శ్రద్ధ తీసుకునేవాడు. ఆయన వివిధ సమాచారాలను చదివి వినిపించేందుకు కృషిచేశాడు. పిల్లలు చాలా చిన్నగా ఉన్నప్పుడు ఆయన నైతిక, ఆధ్యాత్మిక పాఠాలు నేర్పించేందుకు నా బైబిలు కథల పుస్తకము వంటి పుస్తకాల్లోని చిత్రాలను ఉపయోగించాడు. *

మరికొందరు తల్లిదండ్రులు చదివి వినిపించడాన్ని బొమ్మలు గీయడం, రంగుల చిత్రాలు వేయడం, సంగీతం, కుటుంబమంతా కలిసి జంతు ప్రదర్శనశాలకు లేదా పిక్నిక్‌లకు వెళ్ళడం వంటి అదనపు కార్యకలాపాలతో సమతుల్యం చేయడానికి కృషి చేస్తున్నారు. అలాంటి సందర్భాలను, పిల్లలకు పాఠాలు నేర్పించడానికీ సులభంగా ప్రభావితంకాగల వారి మనసులో, హృదయంలో మంచి నైతిక విలువలను, ప్రవర్తనను పాదుకొల్పేందుకూ అవకాశాలుగా ఉపయోగించవచ్చు.

ఇంత శ్రమకూ, ఇంత కృషికీ తగిన ఫలితం ఉంటుందా? పైన చెప్పబడిన ఆచరణాత్మక మార్గనిర్దేశాలను ప్రశాంతత, భద్రతలు గల వాతావరణంలో అన్వయించడానికి తమ శాయశక్తులా ప్రయత్నించే తల్లిదండ్రులు, తమ పిల్లలు సానుకూల వైఖరితో ఎదగడాన్ని తప్పకుండా చూడగలుగుతారు. మీరు మీ పిల్లల పసితనంలో వివేచన, సంభాషణల నైపుణ్యాలను అభివృద్ధి చేసినట్లయితే వారి నైతిక, ఆధ్యాత్మిక స్వభావానికి మీరు ఎంతో దోహదపడిన వారవుతారు.

శతాబ్దాలకు ముందే బైబిలు సామెతలు 22:6 లో స్పష్టంగా ఇలా పేర్కొంది: “బాలుడు నడువవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దానినుండి తొలగిపోడు.” పిల్లలకు శిక్షణనివ్వడంలో తల్లిదండ్రులు కీలక పాత్ర పోషిస్తారనడంలో సందేహం లేదు. మీ పిల్లల విషయంలో మీ ప్రేమను ఉదారంగా వ్యక్తం చేయండి. వారితో సమయం గడపండి, వారిపట్ల శ్రద్ధ చూపించండి, వారికి బోధించండి. అలా చేయడం ద్వారా వారికీ మీకూ సంతోషం కలుగుతుంది.​—సామెతలు 15:20. (g04 10/22)

[అధస్సూచీలు]

^ ఈ పత్రిక యొక్క మార్చి 22, 1993 (ఆంగ్లం) సంచికలో ఉన్న “ఉచితంగా ఆఫ్రికన్‌ ఆటబొమ్మలు” అనే ఆర్టికల్‌ చూడండి.

^ యెహోవాసాక్షులు ప్రచురించారు. మరొక పుస్తకం గొప్ప బోధకుని నుండి నేర్చుకోండి (ఆంగ్లం), చిన్న పిల్లలకు నేర్పించడానికి సమర్థంగా ఉపయోగించబడుతోంది, దీన్ని కూడా యెహోవాసాక్షులే ప్రచురించారు.

[7వ పేజీలోని బాక్సు]

మీ పిల్లలతో ఆడుకోవడం

▪ పసిపిల్లలు ఎక్కువ సేపు అవధానం నిలపలేరు, కాబట్టి వారు ఆనందిస్తున్నారని అనిపించినప్పుడు మాత్రమే ఆడండి.

▪ ఆటబొమ్మలను ఉపయోగిస్తే అవి సురక్షితమైనవిగా, పిల్లల భావాలను ప్రేరేపించేవిగా ఉండేలా చూడండి.

▪ క్రియాత్మకమైన ఆటలు ఆడండి. పసిపిల్లలు తాము కింద పడేసిన బొమ్మను మీరు పైకెత్తడం వంటి పనులను, మీరు పదే పదే చేయడం చూసి ఆనందిస్తారు.

[చిత్రసౌజన్యం]

చిత్ర సౌజన్యం: క్లినికల్‌ రెఫరెన్స్‌ సిస్టమ్స్‌

[10వ పేజీలోని బాక్సు/చిత్రం]

మీ పిల్లలకు చదివి వినిపించే విషయంలో చిట్కాలు

▪ సరైన పదాలను ఉపయోగిస్తూ వాటిని స్పష్టంగా పలకండి. పిల్లలు తమ తల్లిదండ్రులు మాట్లాడేటప్పుడు వినడం ద్వారా నేర్చుకుంటారు.

▪ చిన్న పిల్లలకు కథల పుస్తకాల్లోని చిత్రాల్లో వ్యక్తులనూ, వస్తువులనూ చూపిస్తూ పేర్లు చెప్పండి.

▪ పిల్లలు కాస్త ఎదిగాక, ఆ సమయంలో వారు ఇష్టపడే విషయాలున్న పుస్తకాలను ఎంపిక చేసుకోండి.

[చిత్రసౌజన్యం]

చిత్ర సౌజన్యం: పీడియాట్రిక్స్‌ ఫర్‌ పేరెంట్స్‌

[8, 9వ పేజీలోని చిత్రాలు]

ఆనందకరమైన ఉల్లాస కార్యకలాపాల్లో మీ పిల్లలతో గడపండి