కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పిల్లలు భయకంపితులు చేయబడుతున్నారు

పిల్లలు భయకంపితులు చేయబడుతున్నారు

పిల్లలు భయకంపితులు చేయబడుతున్నారు

మీరు ఉత్తర ఉగాండాలో, చీకటిపడుతున్నప్పుడు, కాళ్లకు చెప్పులులేని వేలాదిమంది పిల్లలను రోడ్లమీద చూస్తారు. వారు చీకటిపడకముందు తమ మారుమూల పల్లెలనుండి బయలుదేరి, గులు, కిట్గమ్‌, లీరా వంటి పెద్ద నగరాలకు కాలినడకన వెళ్తారు. వారు అక్కడకి చేరుకున్న తర్వాత భవనాలు, బస్టాండ్లు, పార్కులు, ఆవరణలు వంటి వేరువేరు చోట్లకు వెళ్తారు. ఉదయాన్నే వారు మళ్ళీ రోడ్ల వెంబడిపడి తమ ఇళ్లకు వెళ్ళడాన్ని మీరు చూస్తారు. వారు ఎందుకు అలాంటి అసాధారణమైన దినచర్య పాటించాల్సివస్తుంది?

కొందరు వారిని రాత్రి ప్రయాణికులు అని పిలుస్తారు. అయితే ఈ పిల్లలు రాత్రి షిఫ్ట్‌లో పనిచేయడానికి వెళ్ళడంలేదు. అడవిప్రదేశంలో చీకటిపడినప్పుడు వారి గృహాలు ప్రమాదకరమైన స్థలాలుగా మారతాయి కాబట్టి వారు పొద్దుబోకముందే ఇళ్ళనుండి బయలుదేరుతారు.

దాదాపు రెండు దశాబ్దాలుగా, గెరిల్లా దళాలు పల్లెలో ఉన్న సముదాయాలమీద దాడిచేసి పిల్లల్ని కిడ్నాప్‌ చేస్తున్నాయి. ప్రతీ సంవత్సరం ఆ దళాలవారు అబ్బాయిలను, అమ్మాయిలను వారి ఇళ్లనుండి అపహరించి దట్టమైన అడవుల్లోకి కనుమరుగవుతున్నారు. సాధారణంగా వారు పిల్లలను రాత్రిపూటే అపహరిస్తారు, తిరుగుబాటుదారులు ఆ పిల్లల్ని యువసైనికులుగా, సామాను మోసేవారిగా, లైంగిక బానిసలుగా ఉపయోగించుకుంటారు. అపహరించబడిన పిల్లలు సహకరించకపోతే, వారిని చెరపట్టినవారు వారి ముక్కులు లేక పెదవులు కోసేయవచ్చు. తప్పించుకోవడానికి ప్రయత్నించి పట్టుబడినవారు వర్ణించడానికి వీలుకానంత భయానకమైన రీతిలో చంపబడతారు.

ఇతర యౌవనులు కూడా ఉగ్రవాదానికి బలవుతున్నారు. సియర్రాలియోన్‌లో, ఇప్పుడు వికలాంగులుగా ఉన్న టీనేజర్ల చేతులు, కాళ్లు వారు తప్పటడుగులు వేస్తున్న పసికందులుగా ఉన్నప్పుడు కొందరు వ్యక్తులు పెద్ద కత్తులతో నరికారు. ఆఫ్ఘనిస్తాన్‌లోని అబ్బాయిలు, అమ్మాయిలు సీతాకోకచిలుక ఆకారంలో ఉన్న మందుపాతర్లతో ఆడుకుంటారు, ఆ రంగురంగుల “ఆటబొమ్మలు” పేలినప్పుడు ఆ చిన్నారులు తమ చేతివేళ్లు, కళ్లు కోల్పోతారు.

ఉగ్రవాదానికి గురైన కొందరు యౌవనుల పరిస్థితి మరోవిధంగా ఉంటుంది. ఉదాహరణకు, 1995లో అమెరికాలోని ఓక్లహామ నగరంలో జరిగిన ఉగ్రవాద దాడిలో చనిపోయిన 168 మందిలో 19 మంది చిన్నారులు ఉన్నారు, ఆ చిన్నారులలో కొందరు శిశువులు కూడా ఉన్నారు. బలమైన గాలి కొవ్వొత్తులను ఆర్పేసినట్లే, ఒక బాంబు ఆ పసికందుల జీవితాలను హఠాత్తుగా ఆర్పేసింది. ఆ ఉగ్రవాద చర్య, పిల్లలుగా ఉండే హక్కును, ఆడుకోవడానికి, కేరింతలు కొట్టడానికి, తమ తల్లిదండ్రుల ఒడిలో ఒదిగిపోవడానికి వారికున్న హక్కును దోచుకుంది.

ఈ ఘటనలు ఇటీవలే సంభవించాయి, అయితే మనం చూడబోతున్నట్లుగా, ఉగ్రవాద హింస మానవజాతిని ఎన్నో శతాబ్దాలుగా పట్టిపీడిస్తోంది. (g 6/06)

[3వ పేజీలోని బాక్సు]

పిల్లవాని మరణానికి సిద్ధపడడం

“ఈ రోజు ఉదయం, నేను మా పదకొండు ఏండ్ల అబ్బాయిని నిద్ర లేపినప్పుడు, ‘ఈ రోజు జరగాల్సిన ఉగ్రవాద దాడి ఇప్పటికే జరిగిందా?’ అని అడిగాడు.” తమ స్వదేశాన్ని పట్టిపీడిస్తున్న హింస గురించి గ్రంథకర్త డేవిడ్‌ గ్రాస్మెన్‌ అలా వ్రాశాడు. అంతేగాక, “నా కుమారుడు భయపడుతున్నాడు” అని ఆయన చెప్పాడు.

ఇటీవలి కాలంలో చాలామంది పిల్లలు ఉగ్రవాద దాడుల్లో మరణించారు, ఆ కారణంగా కొందరు తల్లిదండ్రులు, ఒకవేళ తమ చిన్నారులు క్రూరంగా హత్య చేయబడితే ఏమి చేయాలి అనే విషయం గురించి ప్రణాళికలు వేసుకుంటున్నారు. “ఓ యువజంట ఒకసారి తమ భవిష్యత్తు ప్రణాళిక గురించి నాతో చెప్పిన విషయం నేను ఎప్పటికీ మరచిపోలేను, వారు వివాహం చేసుకుని ముగ్గురు పిల్లలను కనాలనుకుంటున్నారు, ఇద్దరిని కాక, ముగ్గురిని కనాలనుకుంటున్నారు. అలాగైతే, వారిలో ఒకరు మరణించినా మరో ఇద్దరు మిగిలివుంటారు” అని గ్రాస్మెన్‌ వ్రాశాడు.

ఒకవేళ ఇద్దరు పిల్లలు మరణిస్తే లేక ముగ్గురూ మరణిస్తే ఏమి చేస్తారో వారు చెప్పలేదు. *

[అధస్సూచి]

^ ఈ భాగంలో ఉదాహరించబడిన మాటలు, డేవిడ్‌ గ్రాస్మెన్‌ వ్రాసిన డెత్‌ యాస్‌ ఎ వే ఆఫ్‌ లైఫ్‌ పుస్తకం నుండి ఉల్లేఖించబడ్డాయి.

[3వ పేజీలోని చిత్రసౌజన్యం]

© Sven Torfinn/ Panos Pictures