కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

రక్తపు సిరాతో వ్రాయబడిన చరిత్ర

రక్తపు సిరాతో వ్రాయబడిన చరిత్ర

రక్తపు సిరాతో వ్రాయబడిన చరిత్ర

కేవలం కొన్ని సంవత్సరాల క్రితం, ఉగ్రవాదం ఉత్తర ఐర్లాండ్‌, ఉత్తర స్పెయిన్‌ భూభాగంలోని బాస్క్యూ వంటి కొన్ని ప్రాంతాలకు, మధ్య ప్రాచ్యంలోని కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమైనట్లు కనిపించేది. ఇప్పుడు, ప్రత్యేకంగా 2001, సెప్టెంబరు 11న న్యూయార్క్‌లోని ట్విన్‌ టవర్స్‌ నాశనమైనప్పటి నుండి ఉగ్రవాదం వేగంగా ప్రపంచమంతటా వ్యాప్తి చెందుతోంది, అది అందమైన బాలీ ద్వీపం, స్పెయిన్‌లోని మాడ్రిడ్‌, ఇంగ్లాండ్‌లోని లండన్‌, శ్రీలంక, థాయ్‌లాండ్‌లలోనే కాక, నేపాల్‌లో కూడా రాజుకుంటోంది. అయినా ఉగ్రవాదం ఒక క్రొత్త పరిణామంకాదు. “ఉగ్రవాదం” అనే పదానికున్న అర్థమేమిటి?

ఉగ్రవాదం అనే పదం, “సాధారణంగా సిద్ధాంతపరమైన లేక రాజకీయపరమైన కారణాలనుబట్టి, సమాజాలను లేక ప్రభుత్వాలను భయపెట్టాలనో వాటిపై ఒత్తిడి తీసుకురావాలనో, ప్రజలమీద లేక ఆస్తులమీద ఒక వ్యక్తి లేక వ్యవస్థీకరించబడిన ఒక గుంపు చట్టవిరుద్ధంగా బలప్రయోగం చేయడం లేక అలా చేస్తామని బెదిరించడం” అని నిర్వచించబడింది. (ది అమెరికన్‌ హెరిటేజ్‌ డిక్షనరీ ఆఫ్‌ ది ఇంగ్లీష్‌ లాంగ్వేజ్‌) అయితే జెస్సీకా స్టర్న్‌ అనే రచయిత ఇలా వ్యాఖ్యానించింది: “ఉగ్రవాదం అనే అంశాన్ని అధ్యయనం చేస్తున్న విద్యార్థి దానికి సంబంధించిన అనేక నిర్వచనాలను తెలుసుకుంటాడు . . . అయితే ఇతర రకాల హింసలకూ ఉగ్రవాదానికీ మధ్య ఉన్న భేదాన్ని తెలుసుకోవాలంటే దానికున్న రెండు లక్షణాలను మాత్రమే తెలుసుకోవడం ప్రాముఖ్యం.” అవి ఏమిటి? “మొదటిగా, ఉగ్రవాదం పౌరులను లక్ష్యంగా చేసుకుంటుంది. . . . రెండవదిగా, ఉగ్రవాదులు ప్రజల మనసులపై గట్టి ప్రభావం చూపించడానికి హింసను ప్రయోగిస్తారు, అంటే తాము లక్ష్యంగా చేసుకున్న ప్రజలపై దాడి చేయడంకన్నా వారిలో భయాందోళనలు పుట్టించడానికే వారు సాధారణంగా ఎక్కువ ప్రాముఖ్యతనిస్తారు. అలా ఉద్దేశపూర్వకంగా భయాందోళనలు సృష్టించడమే ఉగ్రవాదానికీ, సాధారణ హత్యకూ లేక దాడికీ మధ్య ఉన్న వ్యత్యాసం.”

చాలాకాలం క్రితమే ఉగ్రవాదం ప్రారంభమైంది

మొదటి శతాబ్దపు యూదయలో, జీలట్లు అనే పేరుగల హింసాత్మక గుంపొకటి, రోమా సామ్రాజ్యం నుండి యూదులను విడిపించడానికి ప్రయత్నించింది. ఆ గుంపుకు చెందిన అతి ఉత్సాహవంతులైనవారు సికారియొయి లేక నరహంతకులు అని పేరుపొందారు, తమ దుస్తుల్లో చిన్న కత్తులను దాచుకునేవారు కాబట్టి, వారికి ఆ పేరు వచ్చింది. వారు పండుగ ఆచరించడానికి యెరూషలేముకు వచ్చిన గుంపుల్లో కలిసిపోయి తమ శత్రువుల గొంతులు కోసేవారు లేక శత్రువుల వెన్ను పొడిచేవారు. *

సా.శ. 66లో జీలట్ల గుంపొకొటి మృత సముద్రం దగ్గరున్న మసాడకోటను స్వాధీనం చేసుకుంది. ఆ గుంపు రోమా కోటరక్షకదళాన్ని వధించి మసాడ పర్వతకోటను తమ కార్యకలాపాలకు స్థావరంగా మార్చుకుంది. అది ఎన్నో సంవత్సరాలు అక్కడినుండి దాడులు చేసి, రోమా సామ్రాజ్య అధికారులను వేధించింది. సా.శ. 73లో, అధిపతియైన ఫ్లేవియస్‌ సిల్వా నాయకత్వంలో రోమా దళానికి చెందిన పదో విభాగం మసాడ కోటను తిరిగి స్వాధీనపరచుకుంది, అయితే వారు జీలట్లమీద విజయం సాధించలేదు. ఆ కాలానికి చెందిన ఒక చరిత్రకారుని ప్రకారం, వారు రోమా సైన్యానికి లొంగిపోయే బదులు, ఇద్దరు మహిళలు, ఐదుగురు పిల్లలు తప్ప మిగిలిన 960 మంది ఆత్మహత్య చేసుకున్నారు.

మనం నేడు దేనినైతే ఉగ్రవాదమని పిలుస్తున్నామో అది జీలట్ల తిరుగుబాటుతో ప్రారంభమైందని కొందరు భావిస్తారు. అది నిజమైనా కాకపోయినా అప్పటినుండి ఉగ్రవాదం ప్రపంచంమీద గొప్ప ప్రభావాన్ని చూపిస్తోంది.

క్రైస్తవమత సామ్రాజ్యంలో వేళ్ళూనిన ఉగ్రవాదం

1095 మొదలుకొని, రెండు శతాబ్దాలవరకు దండయాత్రలు చేసిన క్రైస్తవ సేనలు యూరప్‌, మధ్యప్రాచ్య దేశాల మధ్య తరచూ సంచరిస్తుండేవి. ఆసియా నుండి, ఉత్తర ఆఫ్రికా నుండి వచ్చిన ముస్లిమ్‌ దళాలు వాటికి వ్యతిరేకంగా నిలిచాయి. యెరూషలేమును తమ అధీనంలోకి తెచ్చుకోవాలన్నదే ఆ రెండు పక్షాలవారి లక్ష్యం, ఆ పక్షాలు ఒకరిపై మరొకరు ఆధిపత్యం చెలాయించడానికి ప్రయత్నించాయి. వారి మధ్య జరిగిన అనేక యుద్ధాల్లో ఆ “పవిత్ర యోధులు” ఖడ్గాలతో, యుద్ధగొడ్డళ్లతో ఒకరినొకరు నరుక్కున్నారు. అమాయకులైన ప్రజలకు హానితలపెట్టడానికి కూడా వారు ఆ ఆయుధాలను ఉపయోగించారు. 12వ శతాబ్దపు మతనాయకుడైన తూరుకు చెందిన విలియమ్‌, సా.శ. 1099లో దండయాత్రలు చేసిన క్రైస్తవ సేనలు యెరూషలేములోకి ప్రవేశించడాన్ని ఇలా వర్ణించాడు:

“వారంతా కలిసి తమ కత్తులు, ఈటెలు చేతపట్టుకొని వీధుల గుండా వెళ్లారు. వారు పురుషులు, స్త్రీలు, పిల్లలు అనే తేడా లేకుండా తమకు ఎదురైన వారినందరినీ క్రూరంగా పొడిచి చంపారు. . . . వారు ఎంతమందిని చంపారంటే వీధుల్లో మృతదేహాలు కుప్పలుకుప్పలుగా పేరుకుపోయాయి, మృతదేహాలమీద అడుగు వేయకుండా నడవలేని లేక దాటివెళ్లలేని స్థితి ఏర్పడింది. . . . అక్కడ ఎంత రక్తపాతం జరిగిందంటే ఏరులు, మురుగుకాలువలు రక్తమయమయ్యాయి, పట్టణంలోని వీధులు మృతదేహాలతో నిండిపోయాయి.” *

తర్వాతి శతాబ్దాల్లో ఉగ్రవాదులు పేలుడు పదార్థాలను, ఆయుధాలను ఉపయోగించడం ప్రారంభించారు, దానివల్ల భయంకరమైన, ప్రాణాంతకమైన పరిస్థితులు ఏర్పడ్డాయి.

కోట్లాదిమంది మరణించారు

1914 జూన్‌ 28వ తేదీని, యూరప్‌ చరిత్రలో మలపురాయిగా చరిత్రకారులు దృష్టిస్తారు. కొంతమంది కథానాయకునిగా దృష్టించిన ఒక యువకుడు ఆస్ట్రియాదేశ రాజకుమారుడైన ఫ్రాన్సిస్‌ ఫెర్డినాండ్‌ను చంపాడు. ఆ ఘటన మానవజాతిని మొదటి ప్రపంచ యుద్ధంలోకి నడిపించింది. రెండు కోట్లమందిని పొట్టనబెట్టుకున్న తర్వాత ఆ గొప్ప యుద్ధం ముగిసింది.

మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది, అది సామూహిక నిర్బంధ శిబిరాలకు, వైమానిక దాడుల్లో పౌరుల సంహరణకు, అమాయక ప్రజలమీద ప్రతీకార చర్యలకు పేరుగాంచింది. యుద్ధం తర్వాత హత్యలు కొనసాగాయి. 1970లలో కంబోడియాలో జరిగిన సామూహిక సంహారంలో పది లక్షల కన్నా ఎక్కువమంది మరణించారు. 1990లలో రువాండాలో జరిగిన సామూహిక సంహారంలో 8,00,000 కన్నా ఎక్కువమంది మరణించారు, ఆ దేశ ప్రజలు ఇంకా ఆ దుర్ఘటన నుండి తేరుకోలేదు.

1914 నుండి మన కాలంవరకు, అనేక దేశాల్లో జరిగిన ఉగ్రవాద చర్యల కారణంగా మానవజాతి కష్టాలను అనుభవించింది. అయినా, చరిత్ర నుండి ఆధునిక మానవుడు నేర్చుకోవాల్సిన పాఠాలు ఏవీ లేవన్నట్లు నేడు కొందరు ప్రవర్తిస్తారు. ఉగ్రవాద దాడులు క్రమంగా వందలాదిమందిని చంపుతున్నాయి, వేలాదిమందిని వికలాంగులను చేస్తున్నాయి, మనశ్శాంతిని, భద్రతను అనుభవించే హక్కు లక్షలాదిమందికి లేకుండా చేస్తున్నాయి. మార్కెట్‌స్థలాల్లో బాంబులు పేలుతున్నాయి, పల్లెలు కాలి బూడిదవుతున్నాయి, స్త్రీలు అత్యాచారానికి గురవుతున్నారు, పిల్లలు బంధీలుగా తీసుకెళ్లబడుతున్నారు, ప్రజలు మరణిస్తున్నారు. చట్టాలు ఉన్నా, విశ్వవ్యాప్తంగా ఉగ్రవాద చర్యలు ఖండించబడుతున్నా, ఆ క్రూర నిత్యకృత్యం ఆగడంలేదు. ఉగ్రవాదం అంతమవుతుందనే ఆశ ఉందా? (g 6/06)

[అధస్సూచీలు]

^ అపొస్తలుల కార్యములు 21:38 లో నమోదుచేయబడినట్లు, అపొస్తలుడైన పౌలు 4,000 మంది “నరహంతకులకు” నాయకుడని ఒక రోమా సైనికాధికారి అన్యాయంగా ఆరోపించాడు.

^ ‘శత్రువులను ప్రేమించమని’ యేసు తన శిష్యులకు బోధించాడే గానీ వారిని ద్వేషించి చంపమని కాదు.​—మత్తయి 5:​43-45.

[6వ పేజీలోని బ్లర్బ్‌]

ప్రపంచం 1914, జూన్‌ 28న యుద్ధంలో కూరుకుపోయింది

[5వ పేజీలోని చిత్రం]

ఇస్తాంబుల్‌ నవంబరు 15, 2003

[5వ పేజీలోని చిత్రం]

మాడ్రిడ్‌ మార్చి 11, 2004

[5వ పేజీలోని చిత్రం]

లండన్‌ జూలై 7, 2005

[4, 5వ పేజీలోని చిత్రం]

న్యూయార్క్‌ సెప్టెంబరు 11, 2001

[5వ పేజీలోని చిత్రసౌజన్యం]

ఎడమ నుండి కుడికి: AP Photo/Murad Sezer; AP Photo/ Paul White; Photo by Peter Macdiarmid/Getty Images

[6వ పేజీలోని చిత్రసౌజన్యం]

Culver Pictures