కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

చివరకు భూమ్మీద శాంతి!

చివరకు భూమ్మీద శాంతి!

చివరకు భూమ్మీద శాంతి!

హింస ద్వారానే తాము రాజకీయ స్వేచ్ఛను, ఆధ్యాత్మిక స్వచ్ఛతను సాధిస్తామని, వినాశకరమైన శక్తి మాత్రమే అనవసరమైన పరిపాలకులను నిర్మూలిస్తుందని కొందరు భావిస్తారు. అంతేకాక, శాంతి భద్రతలు కాపాడడానికి, పౌరులను తమ అదుపులో ఉంచుకోవడానికి కొన్ని ప్రభుత్వాలు ప్రజలను భయాందోళనలకు గురిచేస్తాయి. పరిపాలించడానికి, సామాజిక సంస్కరణలు తీసుకురావడానికి ఉగ్రవాదమే సమర్థమైన సాధనమైతే అది శాంతిని, సుభిక్షాన్ని, స్థిరత్వాన్ని నెలకొల్పాలి. కొంతకాలానికి హింస, భయం తగ్గిపోవాలి. మరి మనమలాంటి ఫలితాలను చూశామా?

నిజం చెప్పాలంటే, ఉగ్రవాదం జీవంపట్ల ఉన్న గౌరవాన్ని హరించివేస్తుంది, రక్తపాతానికి, క్రూరత్వానికి దారితీస్తుంది. బాధితులు తాము ఎదుర్కొంటున్న బాధల కారణంగా సాధారణంగా ప్రతీకార చర్యలకు పాల్పడతారు, అది మరింత అణచివేతకు దారితీస్తుంది, పర్యవసానంగా ప్రతీకార చర్యలు మరింత పెరుగుతాయి.

హింస మన సమస్యలను పరిష్కరించదు

వేలాది సంవత్సరాలుగా మానవులు తమ రాజకీయ, మతసంబంధ, సామాజిక సమస్యలను తమంతటతామే పరిష్కరించుకోవడానికి ప్రయత్నించారు. అయితే వారి ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. అది బైబిలు చెబుతున్నట్లుగా ఇలా ఉంది: “యెహోవా, తమ మార్గము నేర్పరచుకొనుట నరులవశములో లేదనియు, మనుష్యులు తమ ప్రవర్తనయందు సన్మార్గమున ప్రవర్తించుట వారి వశములో లేదనియు నేనెరుగుదును.” (యిర్మీయా 10:​23) యేసు ఇలా చెప్పాడు: “జ్ఞానము జ్ఞానమని దాని క్రియలనుబట్టి తీర్పుపొందును.” (మత్తయి 11:​19) విస్తృతార్థంలో చెప్పాలంటే, ఉగ్రవాదంమీద నమ్మకముంచడం తప్పని ఆ బైబిలు సూత్రాలు సూచిస్తున్నాయి. ఉగ్రవాదంవల్ల స్వేచ్ఛ, సంతోషం వంటి ఫలితాలు రాలేదు గానీ మరణం, దుఃఖం, నాశనం వంటి ఫలితాలే వచ్చాయి. ఈ చెడు ఫలితాలు 20వ శతాబ్దాన్ని ప్రభావితం చేశాయి, 21వ శతాబ్దాన్ని కూడా ప్రభావితం చేయడం ప్రారంభించాయి. ఉగ్రవాదం ఒక పరిష్కారమయ్యే బదులు అదే ఒక సమస్యగా పరిణమించిందని చాలామంది అభిప్రాయపడుతున్నారు.

“నా కుటుంబ సభ్యుల్లో, స్నేహితుల్లో ఎవ్వరూ చనిపోకూడదని నేను ప్రతీరోజు ఆశిస్తాను . . . అలా జరగాలంటే మన విషయంలో ఒక అద్భుతం జరగాలి” అని ఒక యౌవనస్థురాలు వ్రాసింది, ఆమె స్వదేశం ఉగ్రవాద హింసతో రగిలిపోయింది. మానవులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడం మానవుల తరంకాదు, ఉగ్రవాదంతో సహా నేడు లోకం ఎదుర్కొంటున్న సమస్యలను మానవుని సృష్టికర్త మాత్రమే పరిష్కరించగలడనే విషయాన్ని ఆమె మాటలు సూచిస్తున్నాయి, చాలామంది అదే ముగింపుకు వచ్చారు. అయితే, దేవునిమీద మనమెందుకు నమ్మకముంచాలి?

దేవుడు మన నమ్మకానికి ఎందుకు యోగ్యుడు?

ఒక కారణమేమిటంటే, సృష్టికర్తగా యెహోవా మనకు జీవాన్నిచ్చాడు, మనం దానిని శాంతితో, సంతృప్తితో ఆస్వాదించాలనేది ఆయన కోరిక. దేవుని ప్రవక్తయైన యెషయా ఇలా వ్రాయడానికి ప్రేరేపించబడ్డాడు: “యెహోవా, నీవే మాకు తండ్రివి. మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరివాడవు; మేమందరము నీ చేతిపనియై యున్నాము.” (యెషయా 64:8) యెహోవా మానవజాతికి తండ్రి, ఆయన అన్ని దేశాల ప్రజలను అమూల్యమైనవారిగా ఎంచుతాడు. ఉగ్రవాదానికి దారితీసే అన్యాయం, ద్వేషం ఈ లోకంలో ఉండడం ఆయన తప్పుకాదు. జ్ఞానియైన సొలొమోను రాజు ఒకసారిలా చెప్పాడు: “[సత్య]దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించెను గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని యున్నారు.” (ప్రసంగి 7:​29) ఉగ్రవాదానికి మూలకారణం మానవ దుష్టత్వం, దయ్యాల ప్రభావమే గానీ దేవునికి సామర్థ్యం లేక కాదు.​—ఎఫెసీయులు 6:​11, 12.

మనం యెహోవా మీద నమ్మకముంచడానికి మరో కారణం, ఆయన మానవులను సృష్టించాడు కాబట్టి, మానవజాతి సమస్యలకుగల కారణం అందరి కన్నా ఆయనే బాగా అర్థంచేసుకుంటాడు, వాటిని ఎలా పరిష్కరించాలో ఆయనకు తెలుసు. బైబిలు ఈ సత్యాన్ని సామెతలు 3:19 లో ఇలా పేర్కొంటోంది: “జ్ఞానమువలన యెహోవా భూమిని స్థాపించెను. వివేచనవలన ఆయన ఆకాశవిశాలమును స్థిరపరచెను.” దేవుని మీద పూర్తి నమ్మకంతో ప్రాచీన కాలానికి చెందిన ఒక వ్యక్తి ఇలా వ్రాశాడు: “నాకు సహాయము ఎక్కడనుండి వచ్చును? యెహోవావలననే నాకు సహాయము కలుగును, ఆయన భూమ్యాకాశములను సృజించినవాడు.”​—కీర్తన 121:1, 2.

మనం దేవుని మీద నమ్మకముంచడానికి మూడవ కారణం, క్రూరమైన రక్తపాతాన్ని ఆపుజేసే శక్తి ఆయనకుంది. నోవహు కాలంలో “భూలోకము బలాత్కారముతో నిండియుండెను.” (ఆదికాండము 6:​11) దేవుని తీర్పు అకస్మాత్తుగా, సమగ్రంగా అమలు చేయబడింది: ‘దేవుడు భక్తిహీనుల సమూహముమీదికి జలప్రళయము రప్పించినప్పుడు, పూర్వకాలమందున్న లోకమును’ శిక్షించకుండా ‘విడిచిపెట్టలేదు.’​—2 పేతురు 2:5.

నోవహు దినాల్లో వచ్చిన జలప్రళయం నుండి మనం నేర్చుకోవాల్సిన ఒక పాఠాన్ని బైబిలు పేర్కొంటోంది: “భక్తులను శోధనలోనుండి తప్పించుటకును, దుర్ణీతిపరులను . . . తీర్పుదినమువరకు కావలిలో ఉంచుటకును, ప్రభువు సమర్థుడు.” (2 పేతురు 2:9) మంచి జీవితం కావాలని యథార్థంగా కోరుకునేవారికీ, ఇతరుల జీవితాలను కష్టతరం చేసేవారికీ మధ్య ఉన్న వ్యత్యాసాన్ని దేవుడు గుర్తించగలడు. ఆయన రెండవ కోవకు చెందిన వారిని ‘భక్తిహీనుల నాశనం’ కోసం దాచివుంచాడు. అయితే, ఆయన శాంతికాముకులకోసం నీతి నివసించే క్రొత్త భూమిని సిద్ధం చేస్తున్నాడు.​—2 పేతురు 3:​7, 13.

భూమ్మీద శాశ్వత శాంతి!

బైబిలు రచయితలు “భూమి” అనే పదాన్ని సాధారణంగా మానవజాతిని సూచించడానికి ఉపయోగించారు. ఉదాహరణకు, “భూమియందంతట,” అంటే ఆ కాలంలో జీవించిన మానవులు, ఒకే భాష మాట్లాడారని ఆదికాండము 11:1 పేర్కొంటోంది. అపొస్తలుడైన పేతురు “క్రొత్త భూమి” గురించి వ్రాసినప్పుడు ఆయన మనసులో ఆ భావమే ఉంది. యెహోవా దేవుడు మానవ సమాజాన్ని ఎంతగా పునరుద్ధరిస్తాడంటే లోకంలో హింస, ద్వేషం స్థానంలో నీతి, న్యాయం ‘నివాసులుగా’ ఉంటాయి. మీకా 4:3 లో నమోదుచేయబడిన ప్రవచనంలో బైబిలు మనకిలా చెబుతోంది: “ఆయన మధ్యవర్తియై అనేక జనములకు న్యాయము తీర్చును, దూరమున నివసించు బలముగల అన్యజనులకు తీర్పు తీర్చును. వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ యీటెలను మచ్చుకత్తులుగాను సాగకొట్టుదురు, జనముమీదికి జనము ఖడ్గము ఎత్తక యుండును, యుద్ధముచేయ నేర్చుకొనుట జనులు ఇక మానివేతురు.”

ఈ ప్రవచనం నెరవేరినప్పుడు ప్రజలు ఎలా జీవిస్తారు? మీకా 4:4 ఇలా పేర్కొంటోంది: “ఎవరి భయములేకుండ ప్రతివాడును తన ద్రాక్షచెట్టు క్రిందను తన అంజూరపు చెట్టు క్రిందను కూర్చుండును.” ఆ భూపరదైసులో తర్వాతి ఉగ్రవాద దాడి ఎప్పుడు జరుగుతుందో అనే భయం ఎవరికీ ఉండదు. మీరు ఆ వాగ్దానాన్ని నమ్మవచ్చా? నమ్మవచ్చు, ఎందుకంటే “సైన్యములకధిపతియగు యెహోవామాట యిచ్చియున్నాడు.”​—మీకా 4:4.

కాబట్టి, ఉగ్రవాద ముప్పులు పెరిగి, దేశాలు హింస కారణంగా వణికిపోతున్నప్పుడు, యెహోవా మీద నమ్మకముంచడం మూలంగానే శాంతికాముకుల సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఆయన పరిష్కరించలేని సమస్యంటూ ఏదీ లేదు. ఆయన అన్యాయం, బాధలతోపాటు మరణాన్ని కూడా తీసివేస్తాడు. బైబిలు ఇలా పేర్కొంటోంది: “మరెన్నడును ఉండకుండ మరణమును ఆయన మ్రింగివేయును. ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖముమీది బాష్ప బిందువులను తుడిచివేయును.” (యెషయా 25:8) ఉగ్రవాదం కారణంగా నేడు బాధలతో, భయాలతో నిండివున్న అనేక ప్రజల అమూల్యమైన దేశాలు త్వరలో శాంతితో పొంగిపొర్లుతాయి. “అబద్ధమాడనేరని దేవుడు” వాగ్దానం చేసిన ఆ శాంతి మానవజాతికి అత్యవసరం.​—తీతు 1:1; హెబ్రీయులు 6:17, 18. (g 6/06)

[9వ పేజీలోని బాక్సు/చిత్రాలు]

బుల్లెట్లకు, పేలుడు పదార్థాలకు సమర్థవంతమైన ప్రత్యామ్నాయం

హింస ద్వారానే రాజకీయ మార్పు తీసుకురావచ్చని గతంలో విశ్వసించినవారు వ్యక్తం చేసిన అభిప్రాయాలు క్రింద ఉన్నాయి.

◼ “నేను చరిత్ర పుస్తకాలను తిరిగేసినప్పుడు, రాజులు, ఉన్నతాధికారులు ఎల్లప్పుడూ పేద ప్రజలమీద అధికారం చెలాయించారని తెలుసుకున్నాను. బడుగు వర్గాల బాధలను నేను గుర్తించాను. ఈ బాధలు ఎలా అంతంకావచ్చనే విషయం గురించి నేను ఆలోచించినప్పుడు, మేము పోరాడాల్సిన అవసరం ఉందని, తుపాకీకి తుపాకీయే జవాబనే ముగింపుకు వచ్చాను.”​రామన్‌. *

◼ “నేను హింసాయుతమైన సాయుధ పోరాటాల్లో పాల్గొన్నాను. పాత ప్రభుత్వాన్ని ఎదిరించి ప్రపంచంలోని ప్రజల మధ్య ఉన్న అసమానతలను తొలగించే సమాజాన్ని స్థాపించాలన్నదే నా లక్ష్యం.”​లుచాన్‌.

◼ “నా చిన్నప్పటి నుండి అన్యాయాలు నన్ను కలవరపెట్టాయి. ఆ అన్యాయాల్లో పేదరికం, నేరం, నాసిరకం విద్య, వైద్య సేవలు లేకపోవడం వంటివి ఉన్నాయి. ఆయుధాలు ఉపయోగించడం ద్వారా విద్య, వైద్య సేవలు, ఇళ్లు, ఉద్యోగం అందరికీ లభించగలవని నేననుకున్నాను. తమ పొరుగువారితో మర్యాదగా, గౌరవంగా వ్యవహరించడానికి ఇష్టపడనివారు శిక్షించబడాలని కూడా అనుకున్నాను.”​పీటర్‌.

◼ “నేను, నా భర్త హింసాయుతమైన తిరుగుబాటును ప్రోత్సహించిన ఒక రహస్య సంస్థలో సభ్యులుగా ఉన్నాం. సమాజానికి సంక్షేమాన్ని, శాంతిభద్రతలను, అందరికీ సమానత్వాన్ని తీసుకువచ్చే ప్రభుత్వాన్ని స్థాపించాలని మేము ఆశించాం. ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొనడం ద్వారానే మా దేశంలో న్యాయం స్థాపించవచ్చని మేము అనుకున్నాం.”​లూర్డ్స్‌.

ఈ వ్యక్తులు శక్తిని ఉపయోగించడం ద్వారా, బాధలు అనుభవిస్తున్న మానవజాతికి సహాయం చేయాలని ప్రయత్నించారు. అయితే వారు యెహోవాసాక్షులతో బైబిలును అధ్యయనం చేయడం ద్వారా దేవుని వాక్యం మంచి మార్గం గురించి చెబుతుందని గుర్తించారు. యాకోబు 1:​20లో బైబిలు ఇలా పేర్కొంటోంది: “నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు.” ఆ వచనం, ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌లో ఇలా ఉంది: “కోపం ద్వారా దేవుడు ఆశించే నీతి కలుగదు.”

దేవుని పరిపాలన మాత్రమే మానవ సమాజాన్ని మార్చగలదు. మత్తయి 24వ అధ్యాయం, 2 తిమోతి 3:​1-5 వంటి బైబిలు ప్రవచనాలు, దేవుని ప్రభుత్వం త్వరలో మానవసమాజాన్ని మార్చనుందని సూచిస్తున్నాయి. యెహోవాసాక్షులతో బైబిలు అధ్యయనం చేయడం ద్వారా ఆ సత్యాలను స్వయంగా తెలుసుకోమని మిమ్మల్ని మేము ప్రోత్సహిస్తున్నాం.

[అధస్సూచి]

^ పేర్లు మార్చబడ్డాయి.