కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పట్టు “దారాల్లో రాణి”

పట్టు “దారాల్లో రాణి”

పట్టు “దారాల్లో రాణి”

జపాన్‌లోని తేజరిల్లు! రచయిత

జపనీయుల కిమోనో, భారతీయుల చీర, కొరియన్‌ల హాన్బోక్‌ లాంటి ప్రపంచంలోని కొన్ని అందమైన వస్త్రాలన్నింటిలో ఓ సారూప్యత ఉంది. అవి తరచూ, దారాల్లో రాణిగా పిలువబడే కాంతివంతమైన పట్టుతో తయారుచేయబడతాయి. ప్రాచీనకాలంలోని రాచరికం నుండి నేటి సామాన్యులవరకు, ప్రపంచమంతటా ఉన్న ప్రజలు పట్టుకి ఉన్న వైభవాన్నిబట్టి ముగ్ధులవుతున్నారు. కానీ పూర్వం, నేడు లభించినంత విస్తృతంగా అది అందుబాటులో ఉండేది కాదు.

ప్రాచీన కాలాల్లో పట్టు పరిశ్రమ కేవలం చైనాకే పరిమితంగా ఉండేది. దాన్ని ఉత్పత్తి చేయడమెలాగో ఇంకెవరికీ తెలిసేది కాదు, అంతేగాక చైనా దేశస్థులెవరైనా పట్టుపురుగుల రహస్యాన్ని బయటపెట్టడానికి ప్రయత్నిస్తే, వారిని దేశద్రోహులుగా పరిగణించి, మరణశిక్ష విధించేవారు. కేవలం ఒక్క దేశమే పట్టును ఉత్పత్తి చేసేది కాబట్టి దాని వెల ఎక్కువగా ఉండేది. ఉదాహరణకు, ఒకప్పుడు రోమా సామ్రాజ్యమంతటా పట్టు వెల బంగారంతో సమంగా ఉండేది.

అనతికాలంలో చైనానుండి ఎగుమతయ్యే పట్టు అంతటిపై పర్షియా దేశం అధికారం చేజిక్కించుకుంది. అయినా, దాని వెల మాత్రం తగ్గలేదు, పైగా పర్షియా వర్తకుల కళ్లుకప్పి చైనానుండి సరుకు తెచ్చుకోవడానికి చేసిన ప్రయత్నాలు కూడా విఫలమయ్యాయి. ఆ సమయంలోనే, బైజాంటియం చక్రవర్తియైన జుస్టీనియన్‌ ఓ పథకం పన్నాడు. దాదాపు సా.శ. 550లో ఆయన ఇద్దరు సన్యాసులను గూఢచారులుగా చైనాకు పంపించాడు. రెండు సంవత్సరాల తర్వాత వారు తిరిగి వచ్చారు. వారు తెచ్చిన వెదురుగొట్టాల్లో ఎంతోకాలంగా ఎదురుచూసిన పట్టుపురుగుల గ్రుడ్ల నిధి దాగి ఉంది. రహస్యం వెల్లడైపోయింది. పట్టు ఉత్పత్తి చేయడంలో కేవలం ఒక్క దేశానికే ఉన్న అధికారం అంతటితో ముగిసింది.

పట్టుకు ఉన్న రహస్యం

పట్టుని, పట్టుపురుగులు లేదా ఆకుపురుగులు ఉత్పత్తి చేస్తాయి. పట్టుపురుగుల్లో కొన్ని వందల రకాలున్నాయి, అయితే అత్యుత్తమ పట్టును ఉత్పత్తి చేసే పురుగుకున్న శాస్త్రీయ నామం బాంబిక్స్‌ మోరీ. పట్టు వస్త్రాలు చేయడానికి ఎన్నో పట్టుపురుగులు అవసరమౌతాయి కాబట్టే, పట్టుపురుగులను పెంచే పరిశ్రమ అంటే సెరీకల్చర్‌ ప్రారంభించబడింది. జపాన్‌లోని దాదాపు 2,000 కుటుంబాలు ఇప్పటికీ ప్రయాసతో కూడుకున్న ఈ వృత్తిలో కొనసాగుతున్నాయి. జపాన్‌లోని గున్మా జిల్లాలో నివసించే షోయిచీ కవాహరాడాగారి కుటుంబం కూడా వాటిలో ఒకటి. పట్టుపురుగుల్ని పెంచేందుకు అనువుగా నిర్మించబడిన వారి రెండు అంతస్థుల ఇల్లు, మల్బరీ తోటలకు ఎదురుగా చిన్న గుట్ట పక్కన ఉంది (1).

ఆడ పట్టుపురుగు, గుండుసూది తల సైజులో దాదాపు 500 గ్రుడ్లు పెడుతుంది (2). ఇంచుమించు 20 రోజుల తర్వాత ఆ గ్రుడ్లలోనుండి పురుగులు బయటికి వస్తాయి. ఆ చిన్ని పురుగులకు విపరీతమైన ఆకలి ఉంటుంది. రాత్రీపగలూ అవి మల్బరీ ఆకుల్ని మాత్రమే తింటాయి (3,4). కేవలం 18 రోజుల్లో అవి, వాటి అసలు పరిమాణంకన్నా 70 రెట్లు పెరిగిపోతాయి. ఆ కాలంలో అవి దాదాపు నాలుగుసార్లు శరీర పొరలను విడుస్తాయి.

కవాహరాడాగారి ఫామ్‌లో దాదాపు 1,20,000 పట్టుపురుగులు పెంచబడుతున్నాయి. అవి తింటున్నప్పుడు వచ్చే శబ్దం, ఆకులపై కుండపోతగా వర్షం కురుస్తున్నప్పుడు వచ్చే శబ్దంలాగే ఉంటుంది. పట్టుపురుగు పెద్దదయ్యేసరికి దాని బరువు 10,000 రెట్లు పెరిగిపోతుంది! ఈ దశకు చేరుకున్న తర్వాత అది గూడు అల్లడానికి సిద్ధంగా ఉంటుంది.

నిశ్శబ్దంగా అల్లుతాయి

పట్టుపురుగు పూర్తిగా పెరిగాక, దాని శరీరం తేటగా మారుతుంది, అలా మారడం అది గూడు అల్లడానికి సిద్ధంగా ఉందనడానికి సూచన. పట్టుపురుగులు అసహనంగా కదులుతూ, తమ గూళ్లను అల్లడానికి స్థలాన్ని వెదకడం ప్రారంభించినప్పుడు, చిన్న చిన్న గళ్లుగా చేసిన అరల్లోకి తరలించబడడానికి అవి సిద్ధంగా ఉంటాయి. ఆ గళ్లలో అవి సన్నని, తెల్లని దారాన్ని వదులుతూ (5), తమ చుట్టూ పట్టుగూళ్లు అల్లుకుంటాయి.

అక్కడుండే 1,20,000 పట్టుపురుగులన్నీ దాదాపు ఒకేసారి అల్లడం ప్రారంభిస్తాయి కాబట్టి, కవాహరాడాగారికి ఆ సమయంలో తీరికే ఉండదు. ఆ ఇంట్లోని రెండవ అంతస్థులో చల్లటి గాలి వీచే చోట ఆ అరలను వరుసగా తగిలించారు (6).

ఈలోగా, ఆ పట్టుపురుగుల్లో అద్భుతమైన మార్పు జరుగుతుంది. అవి తిన్న మల్బరీ ఆకులు జీర్ణమై, ఫైబ్రోయిన్‌ అనే ప్రోటీన్‌గా మారతాయి. ఆకుపురుగు, దాని శరీరం పొడవునా ఉండే రెండు గ్రంథుల్లో ఆ ప్రోటీన్‌ను సేకరించుకుంటుంది. ఫైబ్రోయిన్‌ ప్రోటీన్‌ను గ్రంథులనుండి బయటికి వదులుతున్నప్పుడు, ఆకుపురుగు దానికి సెరిసిన్‌ అనే జిగురులాంటి పదార్థంతో పూత పూసి వదులుతుంది. పురుగు నోటిదగ్గర ఉండే స్పిన్నరెట్‌ అనే అవయవంలోనుండి రెండు ఫైబ్రోయిన్‌ పోగులు బయటికి వస్తున్నప్పుడు అవి సెరిసిన్‌తో జతచేయబడతాయి. బయటకు వచ్చిన తర్వాత ఆ పదార్థం గాలికి గట్టిపడి ఆ రెండు పోగులు కలిసి ఒక దారంగా మారతాయి.

పట్టుపురుగు ఒక్కసారి పట్టు వడకడం ప్రారంభించిందంటే, పని పూర్తయ్యేదాక ఆగదు. పట్టుపురుగు నిమిషానికి 30 నుండి 40 సెంటీమీటర్ల వేగంతో వడుకుతుంది, అలా చేస్తున్నంతసేపూ అది దాని తల గుండ్రంగా తిప్పుతూనే ఉంటుంది. ఒక గూడు పూర్తయ్యేలోపు పట్టుపురుగు దాని తలని కనీసం 1,50,000 సార్లైనా తిప్పి ఉంటుందని ఓ శీర్షిక అంచనా వేసింది. పట్టుపురుగు రెండు రోజులు, రెండు రాత్రులు వడికిన పట్టుని దారంగా చేస్తే, దాదాపు 1,500 మీటర్ల పొడవుండే ఒక్క దారం అవుతుంది! ఎత్తైన బిల్డింగుతో పోలిస్తే, ఆ దారం ఆ బిల్డింగుకన్నా నాలుగు రెట్లు ఎత్తుగా ఉంటుంది!

కేవలం ఒక వారంలోనే కవాహరాడాగారు దాదాపు 1,20,000 గూళ్ళు సేకరిస్తారు, ఆ తర్వాత వాటిని వస్త్రాల తయారీకి పంపిస్తారు. ఒక్క కిమోనో తయారుచేయడానికి దాదాపు 9,000 గూళ్లు, టైకోసం సుమారు 140 గూళ్లు, పట్టు స్కార్ఫ్‌కోసం దాదాపు 100కన్నా ఎక్కువ గూళ్లు అవసరమవ్వచ్చు.

పట్టుబట్ట ఎలా నేయబడుతుంది

పట్టు గూడునుండి పట్టుపోగుల్ని విప్పి, వాటిని చక్రాలకు చుట్టే ప్రక్రియను రీలింగ్‌ అంటారు. రీలింగ్‌ ప్రక్రియ ఎలా ప్రారంభమైంది? దాని గురించి చాలా కల్పిత కథలు, పురాణాలున్నాయి. వాటిలో ఒకటేమిటంటే, చైనా దేశపు రాణియైన సి-లింగ్‌-షి, మల్బరీ చెట్టుమీదనుండి ఒక పట్టుగూడు తన టీ కప్పులో పడిందని గమనించింది. దాన్ని తీయడానికి ప్రయత్నించినప్పుడు, ఆ గూడుతోపాటు సన్నని పట్టుదారం కూడా బయటికి రావడం ఆమె గమనించింది. ఆ సంఘటనే చక్రంతో వడికే ప్రక్రియకు పునాది వేసింది, నేడు ఆ ప్రక్రియ యంత్రాలనుపయోగించి చేయబడుతోంది.

గూళ్లను మార్కెట్లో అమ్మాలంటే, వాటిల్లోని ప్యూపాలు, సీతాకోకచిలుకలుగా మారకముందే చంపేయాలి. ఆ క్రూరమైన పని చేయడానికి వాళ్ళు ఉష్ణోగ్రతను ఉపయోగిస్తారు. అలా చేసిన తర్వాత, పాడైపోయిన గూళ్లను వేరుచేసి, మిగతావాటిని పట్టు వస్త్రాలు నేయడానికి ఉపయోగించవచ్చు. మొదటిగా, గూడునుండి పోగుల్ని విప్పడానికి లేదా వేరుచేయడానికి గూళ్లను వేడినీటిలో లేదా వేడి ఆవిరిలో వేస్తారు. ఆ తర్వాత, అలా గూడునుండి విడిపోయిన పోగుల కొసలు గుండ్రంగా తిరుగుతున్న కుంచెలకు లేదా చీపుర్లకు అంటుకుంటాయి (7). కావల్సిన మందాన్నిబట్టి ఒకటి లేదా ఎక్కువ గూళ్ల పోగుల్ని కలిపి ఒక దారంగా చేస్తారు. చక్రానికి చుడుతుండగా ఆ దారం తడారిపోతుంది. అవసరమైన పొడవు, బరువుగల దారపు ఉండ తయారుచేయడం కోసం ఇంకా పూర్తిగా తయారుకాని ఆ పట్టును మళ్లీ పెద్ద చక్రానికి చుడతారు (8,9).

పట్టు ఎంతో మృదువుగా, మెత్తగా, నలగని విధంగా ఉండడం చూసి దానితో మీ చెక్కిళ్లను నిమురుకోవాలని అనిపించవచ్చు. పట్టుకు ఉండే మృదుత్వం దేనిపై ఆధారపడి ఉంటుంది? ఫైబ్రోయిన్‌కు పూతవేయబడి ఉండే సెరిసిన్‌ జిగురుపదార్థం ఎంతమేరకు తొలగించబడుతుందనేది ఒక కారకం. అలా జిగురు తొలగించని పట్టు గరుకుగా ఉంటుంది, అలాంటివాటికి రంగులు వేయడం కష్టం. దానిలోని సెరిసిన్‌ పూర్తిగా తొలగించనందువల్ల షిఫాన్‌ బట్టలు ముట్టుకోవడానికి కాస్త గరుకుగా ఉంటాయి.

దారాలు ఎంతగా మెలిపెట్టబడతాయనేది మృదుత్వం ఆధారపడి ఉండే మరో కారకం. జపనీస్‌ హబూటెయ్‌ అనబడే బట్ట ముట్టుకోవడానికి చాలా మృదువుగా, మెత్తగా ఉంటుంది. దాన్ని చేయడానికి ఉపయోగించే దారాల్లో చాలా తక్కువ మెలికలుంటాయి లేదా అసలు మెలికలే ఉండవు. దానికి భిన్నంగా క్రేపు రకం బట్ట గరుకుగా ఉంటుంది. దానిలోని దారాలు చాలా బలంగా, లేదా గట్టిగా మెలిపెట్టబడతాయి.

బట్టకు రంగులు వేయడం మరో ప్రాముఖ్యమైన ప్రక్రియ. పట్టుకు రంగు వేయడం చాలా సులువు. ఫైబ్రోయిన్‌ ప్రోటీన్‌ నిర్మించబడిన తీరు, రంగు దారం లోపలికి వెళ్లేందుకు అనుమతిస్తుంది, దానివల్ల రంగులు చక్కగా అంటుకుని, అవి వెలసిపోకుండా ఉంటాయి. అంతేగాక, సింథటిక్‌ వస్త్రాలకు భిన్నంగా పట్టులో పాజిటివ్‌ (ధనాత్మక), నెగిటివ్‌ (ఋణాత్మక) అయాన్‌లు రెండూ ఉంటాయి, కాబట్టి దానికి ఏ విధమైన రంగు వేసినా చక్కగా కనిపిస్తాయి. పట్టు బట్టగా నేయబడకముందే, దారాలుగా ఉన్నప్పుడే దానికి రంగు వేయవచ్చు (10) లేదా బట్టగా తయారైన తర్వాత కూడా రంగు వేయవచ్చు. కిమోనోలపై రంగులు వేసే ప్రఖ్యాతమైన యుజెన్‌ అనబడే పద్ధతిలో పట్టు నేయబడిన తర్వాత వాటిపై ఎంతో అందమైన నగిషీపని చేసి, వాటికి చేతితో రంగులు వేస్తారు.

నేడు పట్టు ఇండియా, చైనాలాంటి దేశాల్లో అధికంగా ఉత్పత్తి చేయబడుతున్నా, ఫ్రాన్సులో దుస్తులు డిజైన్‌ చేసేవారు, ఇటలీలో ఫాషన్‌ డిజైనర్‌లు ఇప్పటికీ పట్టువస్త్రాల డిజైనింగ్‌లో అగ్రగణ్యులుగా ఉన్నారు. అయితే, నేటి వస్త్రాల మార్కెట్లో నైలాన్‌, రేయాన్‌లాంటి కృత్రిమ దారాలతో నేయబడిన వస్త్రాలు చౌకగా అందుబాటులో ఉన్నాయి. కానీ ఇప్పటికీ పట్టుకి సాటి ఏదీలేదు. “విజ్ఞానం నేడు ఎంతగా అభివృద్ధి చెందినా, పట్టును కృత్రిమంగా తయారుచేయలేం. మనకు అన్నీ తెలుసు, పట్టు అణు సాంకేతికం నుండి దాని అణు నిర్మాణంవరకు అన్నీ తెలుసు. కానీ మనం దాన్ని నకలు చేయలేం. దాన్నే నేను పట్టుకు ఉన్న రహస్యం అని అంటాను” అని జపాన్‌లో ఉన్న యోకహామాలోని పట్టు మ్యూజియమ్‌ అధికారి అన్నాడు. (g 6/06)

[26వ పేజీలోని బాక్సు/చిత్రం]

పట్టుకుఉన్న గుణాలు

గట్టిది: స్టీలు తీగ మందంలో ఉండే సిల్క్‌ దారం ఆ తీగంత గట్టిగా ఉంటుంది.

కాంతివంతమైనది: పట్టుకి ముత్యాలవంటి కాంతి ఉంటుంది. అనేక పొరలున్న, పట్టకంలాంటి నిర్మాణంగల ఫైబ్రోయిన్‌కు కాంతిని వ్యాపింపజేసే లక్షణం ఉంది కాబట్టి పట్టుకి ఆ కాంతి వస్తుంది.

చర్మానికి మృదువైనది: పట్టులో ఉండే ఎమైనో ఆమ్లాలు చర్మానికి హాని కలిగించవు. వివిధ చర్మ సంబంధిత వ్యాధుల నుండి పట్టు రక్షిస్తుందని భావించబడుతుంది. కొన్ని అలంకార సామాగ్రి పట్టు పొడితో తయారుచేయబడతాయి.

తేమను పీల్చుకుంటుంది: దానిలోని ఎమైనో ఆమ్లాలు, అలాగే పట్టు దారంలో ఉండే చిన్న రంధ్రాలు చెమటను పీల్చుకుని, చెప్పుకోదగిన పరిమాణంలో చెమటను బయటకు పోనిచ్చి వేసవి కాలంలో మీ శరీరాన్ని పొడిగా, చల్లగా ఉంచుతాయి.

వేడిని తట్టుకుంటుంది: పట్టు త్వరగా కాలదు, ఒకవేళ నిప్పంటుకుంటే హానికరమైన విషవాయువులను వదలదు.

సంరక్షించేది: పట్టు అతినీలలోహిత కిరణాల్ని హరించి, చర్మాన్ని సంరక్షిస్తుంది.

దానిలో స్థిర విద్యుత్‌ ఉండదు: పట్టులో పాజిటివ్‌ (ధనాత్మక) అయాన్‌లు, నెగిటివ్‌ (ఋణాత్మక) అయాన్‌లు రెండూ ఉండడంవల్ల, అలాగే దానికి తేమ పీల్చుకునే స్వభావం ఉండడంవల్ల, అది ఇతర బట్టల్లాగా స్థిర విద్యుత్‌ను ఉత్పత్తి చేయదు, అంటే పట్టుబట్ట ధరించినప్పుడు అది శరీరానికి అంటుకోదు.

పట్టుపట్ల శ్రద్ధ తీసుకోవడం

ఉతకడం: పట్టు వస్త్రాల్ని సామాన్యంగా డ్రై క్లీనింగ్‌ చేయించడం మంచిది. ఒకవేళ ఇంట్లోనే ఉతుకుతున్నట్లయితే, మృదువైన సబ్బును ఉపయోగించి గోరువెచ్చటి నీటిలో (సుమారు 30 డిగ్రీల సెంటీగ్రేడ్‌) ఉతకండి. సున్నితంగా ఉతకండి, గట్టిగా పిండకండి. డ్రయర్‌లో వేయకండి.

ఇస్త్రీ చేయడం: పట్టు బట్టల్ని ఇస్త్రీ చేస్తున్నప్పుడు దానిపై వేరే బట్ట ఉంచాలి. ఇస్త్రీపెట్టెను 130 డిగ్రీల సెంటీగ్రేడ్‌వరకు మాత్రమే వేడి చేసి, బట్టలో దారాలు నేయబడిన దిశలోనే ఇస్త్రీ చేయండి. ఇస్త్రీ పెట్టెలో స్టీమ్‌ను ఉపయోగించే సౌకర్యం ఉంటే దానిని మితంగానే వాడండి.

మరకలను తీసివేయడం: ఒకవేళ మరక పడితే, వెంటనే మరకపడిన చోటును పొడి గుడ్డపై పరిచి, మరకవున్న బట్ట వెనుకభాగాన్ని తడి గుడ్డతో మెల్లగా అద్దండి, రుద్దకండి. ఆ తర్వాత దాన్ని డ్రై క్లీనింగ్‌ చేయించండి.

భద్రపరచడం: వాటిని తేమ ఉండే చోట ఉంచకండి, పురుగులు నుండి సంరక్షించండి, ఎండలో వేయకండి. స్పాంజి అమర్చబడి ఉన్న హ్యాంగర్లు వాడండి. లేదా వాటిని సాధ్యమైనన్ని తక్కువ మడతలుపెట్టి సమంగా ఉన్నచోట భద్రపరచండి.

[25వ పేజీలోని చిత్రం]

పట్టు గూళ్లు

[26వ పేజీలోని చిత్రసౌజన్యం]

ఫోటోలు 7-9: Matsuida Machi, Annaka City, Gunma Prefecture, Japan; 10వ ఫోటో, దగ్గరగా చూపించబడిన నేతపని: Kiryu City, Gunma Prefecture, Japan