కంటెంట్‌కు వెళ్లు

బైబిలు మన వరకు ఎలా వచ్చింది?

బైబిలు మన వరకు ఎలా వచ్చింది?

బైబిలు మన వరకు ఎలా వచ్చింది?

బైబిలు చెక్కుచెదరకుండా మన వరకు వచ్చి, ఇప్పుడు మనం చదవగలుగుతున్నాం అంటే అది అద్భుతం అనే చెప్పాలి. బైబిలు రాయడం పూర్తయి 1,900 కన్నా ఎక్కువ సంవత్సరాలు గడిచిపోయాయి. బైబిల్ని మొదట్లో జంతు చర్మాలతో లేదా పపైరస్‌ మొక్క కాండంతో తయారుచేసిన కాగితాల మీద రాశారు. అవి త్వరగా పాడైపోయేవి. పైగా, బైబిల్ని మొదట్లో రాసినప్పుడు ఉపయోగించిన భాషలు ఇప్పుడు అంత వాడుకలో లేవు. అలాగే అధికారం-పలుకుబడి ఉన్నవాళ్లు, అంటే చక్రవర్తుల నుండి మత బోధకుల వరకు చాలామంది బైబిల్ని అంతం చేయాలని శతవిధాలా ప్రయత్నించారు.

బైబిలు అన్ని కాలాల్ని దాటి, అందరూ చదవగలిగేలా ఎలా అందుబాటులోకి వచ్చింది? రెండు కారణాల్ని పరిశీలించండి.

ఎన్నో కాపీలు రాయడం వల్ల అది భద్రపర్చబడింది

ఇశ్రాయేలీయులు ప్రాచీన బైబిలు ప్రతుల్ని చాలా జాగ్రత్తగా భద్రపర్చి, వాటిని నకలు రాసి ఎన్నో కాపీలు తయారుచేశారు. ఉదాహరణకు, ఇశ్రాయేలు రాజులు ‘లేవీయులైన యాజకుల దగ్గర ఉండే ధర్మశాస్త్రాన్ని తీసుకొని ఒక పుస్తకంలో నకలు రాసుకోవాలి’ అని దేవుడు చెప్పాడు.​—ద్వితీయోపదేశకాండం 17:18.

చాలామంది ఇశ్రాయేలీయులు లేఖనాల్ని దేవుని వాక్యమని నమ్మారు, కాబట్టి వాటిని చదవడానికి ఎంతో ఇష్టపడేవాళ్లు. అందుకే, బాగా శిక్షణ పొందిన శాస్త్రులు వాటిని చాలా జాగ్రత్తగా నకలు రాసేవాళ్లు. అలాంటి ఒక వ్యక్తే, ఎజ్రా. ఆయన “ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇచ్చిన మోషే ధర్మశాస్త్రంలో ఆరితేరిన శాస్త్రి [లేదా, “నకలు రాసే వ్యక్తి”].” (ఎజ్రా 7:6, అధస్సూచి) క్రీ.శ. 500-1,000 మధ్య కాలంలో, మాసొరెట్స్‌ అనే వాళ్లు “పాత నిబంధన” అని పిలిచే హీబ్రూ లేఖనాల్ని నకలు రాశారు. తప్పులు రాకుండా ఉండడం కోసం వాళ్లు అక్షరాల్ని సైతం లెక్కపెట్టేవాళ్లు. అలా వాళ్లు జాగ్రత్తగా, ఉన్నదున్నట్టుగా చాలా కాపీలు రాశారు. దానివల్ల, శత్రువులు బైబిల్ని అంతం చేయాలని ఎంత ప్రయత్నించినా అది మన కాలం వరకు వచ్చింది.

ఉదాహరణకు, క్రీ.పూ. 168 లో, సిరియా పరిపాలకుడైన ఆంటియోకస్‌ IV, పాలస్తీనా అంతటా హీబ్రూ లేఖన ప్రతుల్ని అంతం చేయాలని చూశాడు. “లేఖనాల గ్రంథపు చుట్టలు ఎక్కడ కనిపించినా, వాటిని చింపేసి కాల్చేవాళ్లు” అని ఒక యూదుల చరిత్ర పుస్తకం చెప్తుంది. “లేఖన ప్రతుల్ని కాల్చేయాలనే ఆ ఆదేశాల్ని అధికారులు నిష్ఠగా పాటించారు. ... అలాగే అవి ఎవరి దగ్గరుంటే ... వాళ్లను చంపేశారు” అని ద జ్యూయిష్‌ ఎన్‌సైక్లోపీడియా చెప్తుంది. ఇంత జరిగినా, పాలస్తీనాలో అలాగే వేరే దేశాల్లో నివసిస్తున్న యూదుల దగ్గర హీబ్రూ లేఖనాల కాపీలు భద్రంగా ఉన్నాయి.

“కొత్త నిబంధన” అని పిలిచే క్రైస్తవ గ్రీకు లేఖనాలు రాయడం పూర్తయిన వెంటనే, అందులోని ఉత్తరాలు, ప్రవచనాలు, చారిత్రక సంఘటనలు చాలా విస్తృతంగా వ్యాపించాయి. ఉదాహరణకు, యోహాను తన సువార్త పుస్తకాన్ని ఎఫెసులో లేదా ఎఫెసుకు దగ్గర్లో రాశాడు. అయితే దాన్ని రాసిన 50 ఏళ్లలోపే, ఆ పుస్తకంలోని ఒక చిన్నభాగం ఎన్నో వందల మైళ్ల దూరంలో ఉన్న ఈజిప్టులో దొరికింది. దీన్నిబట్టి, ఆ ప్రేరేపిత లేఖనాల కాపీలు కొద్దికాలానికే దూరదేశాల్లో ఉన్న క్రైస్తవుల దగ్గరికి కూడా చేరాయని అర్థమౌతుంది.

అలా లేఖనాల కాపీలు విస్తృతంగా వ్యాపించడం వల్ల, క్రీస్తు చనిపోయిన వందల సంవత్సరాల తర్వాత కూడా దేవుని వాక్యం భద్రంగా ఉంది. ఉదాహరణకు, క్రీ.శ. 303, ఫిబ్రవరి 23, తెల్లవారుజామున రోమా చక్రవర్తి అయిన డయోక్లెషియన్‌, తన సైనికులు చర్చిలోకి జొరబడి బైబిలు కాపీల్ని తగలబెట్టేయడం చూశాడని ఒక నివేదిక చెప్తుంది. బైబిలు కాపీల్ని అంతం చేస్తే క్రైస్తవత్వాన్నే లేకుండా చేయవచ్చని డయోక్లెషియన్‌ అనుకున్నాడు. ఆ తర్వాతి రోజు, రోమా సామ్రాజ్యమంతటా ఉన్న బైబిలు కాపీల్ని బహిరంగంగా తగలబెట్టేయమని ఆయన ఆదేశాలిచ్చాడు. అయినా కొన్ని కాపీలు భద్రపర్చబడ్డాయి, మళ్లీ రాయబడ్డాయి. నిజానికి, డయోక్లెషియన్‌ కాలంనాటి రెండు గ్రీకు బైబిలు కాపీలు ఈరోజుకీ ఉన్నాయి. వాటిలో ఒకటి, రోములో ఉంది. మరొకటి, లండన్‌లోని బ్రిటీష్‌ లైబ్రరీలో ఉంది.

నిజమే, బైబిలు రచయితలు రాసిన అసలైన మూలప్రతులు ఇప్పుడు లేవు. అయితే, ప్రాచీన కాలంలో నకలు రాసిన వేల రాతప్రతులు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. వాటిలో కొన్ని చాలా పాతవి. ఇంతకీ మూలప్రతుల నుండి నకలు రాస్తున్నప్పుడు, అందులోవున్న సమాచారానికి మార్పులు-చేర్పులు జరిగాయా? హీబ్రూ లేఖనాల గురించి డబ్ల్యూ. హెచ్‌. గ్రీన్‌ అనే పండితుడు ఇలా అన్నాడు: “వేరే ఏ ప్రాచీన పుస్తకం ఇంత ఖచ్చితంగా లేదని ధైర్యంగా చెప్పవచ్చు.” బైబిలు మూలప్రతుల నిపుణుడైన సర్‌ ఫ్రెడరిక్‌ కెన్యన్‌, క్రైస్తవ గ్రీకు లేఖనాల గురించి ఇలా చెప్పాడు: ‘మూలప్రతికి, మనకు దొరికిన అతి పురాతనమైన రాతప్రతికి మధ్య ఎక్కువ కాలనిడివి లేదు. అందుకే, ఈరోజు మన దగ్గరున్న బైబిలు ఖచ్చితంగా ఉందని చెప్పవచ్చు. వేరే ఏ ప్రాచీన పుస్తకం గురించి ఇలా చెప్పలేం.’

బైబిల్ని చాలా భాషల్లోకి అనువదించడం

బైబిలు మన వరకు వచ్చి, దాన్ని ఎక్కువమంది చదవగలుగుతున్నారు అంటే దానికి మరో కారణం, అది చాలా భాషల్లోకి అనువదించబడడమే. ఇదేం చూపిస్తుందంటే, అన్ని దేశాల-భాషల ప్రజలు తనను తెలుసుకుని “పవిత్రశక్తితో, సత్యంతో” తనను ఆరాధించాలని దేవుడు కోరుకుంటున్నాడు.​—యోహాను 4:​23, 24; మీకా 4:2.

హీబ్రూ లేఖనాల్ని మొట్టమొదట అనువదించింది, గ్రీకులోకి. దాన్నే సెప్టువజింటు అంటారు. పాలస్తీనా వెలుపల ఉండే గ్రీకు మాట్లాడే యూదుల కోసం దాన్ని అనువదించారు. యేసు భూమ్మీద జీవించడానికి దాదాపు రెండు వందల సంవత్సరాల ముందే ఆ అనువాదం పూర్తయింది. క్రైస్తవ గ్రీకు లేఖనాలతో సహా మొత్తం బైబిల్ని రాయడం పూర్తయిన కొన్ని వందల సంవత్సరాలకే, అది ఎన్నో భాషల్లోకి అనువదించబడింది. కానీ ఆ తర్వాత రాజులు, ఆఖరికి ప్రీస్టులు కూడా దానికి అడ్డుపడ్డారు. తమ అధికారాన్నంతా ఉపయోగించి ప్రజలకు బైబిల్ని అందజేయాల్సిన ప్రీస్టులే దాన్ని వాళ్లకు అందకుండా చేశారు. వాళ్లు దేవుని వాక్యాన్ని వేర్వేరు భాషల్లోకి అనువదించకుండా అడ్డుకోవడం ద్వారా ప్రజల్ని ఆధ్యాత్మిక చీకట్లోనే ఉంచడానికి ప్రయత్నించారు.

కొంతమంది ధైర్యవంతులైన వ్యక్తులు ఆ రాజులకు, మత బోధకులకు భయపడలేదు. వాళ్లు ఎక్కువమంది ప్రజలు మాట్లాడే భాషలోకి బైబిల్ని అనువదించడానికి వాళ్ల ప్రాణాల్ని కూడా పణంగా పెట్టారు. వాళ్లలో ఒకరు, ఇంగ్లండ్‌కు చెందిన విలియమ్‌ టిండేల్‌. అధికారంలో ఉన్నవాళ్లు టిండేల్‌ను ఆపాలని చూసినా, ఆయన బైబిల్లోని మొదటి ఐదు పుస్తకాల్ని నేరుగా హీబ్రూ నుండి ఇంగ్లీషులోకి అనువదించాడు. అంతేకాదు, ఇంగ్లీషు బైబిల్లో యెహోవా అనే పేరును మొట్టమొదట ఉపయోగించిన వ్యక్తి కూడా ఈయనే. ప్రాణాన్ని పణంగా పెట్టిన మరొక వ్యక్తి, కాస్యోడోరో డి రేనా. ఈయన స్పెయిన్‌కు చెందిన బైబిలు పండితుడు. బైబిల్ని స్పానిష్‌ భాషలోకి అనువదిస్తున్నందుకు క్యాథలిక్‌ చర్చి ఆయన్ని చంపాలనుకుంది. తన అనువాదాన్ని పూర్తిచేసే లోపు ఆయన ఇంగ్లండ్‌కు, జర్మనీకి, ఫ్రాన్స్‌కు, హోలాండ్‌కు, స్విట్జర్లాండ్‌కు పారిపోవాల్సి వచ్చింది. *

ఈరోజు బైబిలు ఇంకా ఎక్కువ భాషల్లోకి అనువదించబడుతుంది, అలాగే కోట్ల కాపీలు ముద్రించబడుతున్నాయి. బైబిలు మన వరకు వచ్చి, దాన్ని వేరే ఏ పుస్తకం కన్నా ఎక్కువమంది చదవగలుగుతున్నారు అంటే, పేతురు రాసిన ఈ మాటలు ఎంత నిజమో అర్థమౌతుంది: “గడ్డి వాడిపోతుంది, పువ్వు రాలిపోతుంది, కానీ యెహోవా మాట [లేదా, “వాక్యం”] ఎప్పటికీ నిలుస్తుంది.”—1 పేతురు 1:24, 25, అధస్సూచి.

[అధస్సూచీలు]

^ రేనా అనువాదం 1569 లో ప్రచురించబడింది, తర్వాత 1602 లో సిప్రియానో డి వెలెరా దాన్ని రివైజ్‌ చేశాడు.

[బాక్సు]

నేను ఏ బైబిలు అనువాదం చదవాలి?

చాలా భాషల్లో రకరకాల బైబిలు అనువాదాలు ఉన్నాయి. కొన్ని అనువాదాలు కష్టమైన భాషను, ఇప్పటికాలం వాళ్లకు అర్థంకాని భాషను ఉపయోగించాయి. ఇంకొన్ని అనువాదాలు స్వేచ్ఛగా, ఇష్టమొచ్చినట్టుగా అనువదిస్తూ ఖచ్చితత్వం కంటే కూడా తేలిగ్గా చదవగలిగేలా ఉంటే చాలు అనుకున్నాయి. మరికొన్ని అనువాదాలు ఉన్నదున్నట్టుగా మక్కికిమక్కి అనువదించాయి.

యెహోవాసాక్షులు ప్రచురించిన పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం ఇంగ్లీషు ఎడిషన్‌ను, ఒక కమిటీ నేరుగా మూలభాషల (అసలు మొదట్లో బైబిలు రాయబడిన భాషల) నుండి అనువదించింది. ఈ ఇంగ్లీషు ఎడిషన్‌ను ఆధారం చేసుకుని బైబిల్ని దాదాపు 60 భాషల్లోకి అనువదించడం జరిగింది. అలా అనువదిస్తున్నప్పుడు, అనువాదకులు మూలభాషలోని సమాచారాన్ని కూడా పోల్చుకుంటూ అనువదించారు. కొత్త లోక అనువాద కమిటీలోని వాళ్లు, వీలైన ప్రతీచోట మూలభాషలో ఉన్నదాన్ని అక్షరార్థంగా అనువదించారు. విషయం అర్థంకాదు అనుకున్న చోట్ల మాత్రమే అక్షరార్థంగా కాకుండా భావం అర్థమయ్యేలా పెట్టారు. అప్పట్లో మూలప్రతులు ఎంత తేలిగ్గా అర్థమయ్యేవో, ఇప్పటికాలం ప్రజలకు కూడా బైబిలు అంతే తేలిగ్గా అర్థమవ్వాలని వాళ్లు కోరుకున్నారు.

కొంతమంది భాషా పండితులు ఆధునిక బైబిలు అనువాదాల్ని అలాగే కొత్త లోక అనువాదంను పరిశీలించి, ఎక్కడైనా అనువాదకులు ఉన్నదున్నట్టు కాకుండా సొంత అభిప్రాయాలు చేర్చారేమో అని పరిశోధన చేశారు. అలా పరిశోధన చేసిన ఒక పండితుడు, జేసన్‌ డేవిడ్‌ బెడూన్‌. ఆయన అమెరికాలోని ఉత్తర ఆరిజోన విశ్వవిద్యాలయంలో, మతపరమైన విద్యకు ప్రొఫెసర్‌. “ఇంగ్లీషులో ఎక్కువమంది ఉపయోగిస్తున్న” తొమ్మిది వేర్వేరు బైబిళ్ల మీద ఆయన పరిశోధన చేసి, 2003 లో 200 పేజీల పుస్తకాన్ని ప్రచురించాడు. ఆయన ఆ పరిశోధనలో భాగంగా, అనువాదకులు “తమ సొంత అభిప్రాయాల్ని చేర్చే అవకాశమున్న” కొన్ని లేఖనాల్ని పరిశీలించాడు. ప్రతీ లేఖనాన్ని పరిశీలిస్తున్నప్పుడు, ఆయన గ్రీకు మూల సమాచారాన్ని అలాగే ఇంగ్లీషు బైబిల్లో దాన్ని అనువదించిన విధానాన్ని పోల్చి చూసుకుంటూ, ఎక్కడైనా అనువాదకులు తమ సొంత అభిప్రాయాల్ని పెట్టి అర్థం మార్చేశారేమో గమనించాడు. ఇంతకీ ఆయన పరిశోధనలో ఏం తేలింది?

బెడూన్‌ ఇలా చెప్తున్నాడు: ‘కొత్త లోక అనువాదంను (NW) అనువదించిన వాళ్లకు మతపరమైన పక్షపాతం ఉండడం వల్లే ఈ అనువాదంలో తేడాలు ఉన్నాయని సామాన్య ప్రజలు, చాలామంది బైబిలు పండితులు అనుకుంటున్నారు. కానీ, అప్పట్లో బైబిలు రచయితలు రాసిన మాటల్ని ఉన్నదున్నట్టు చాలా ఖచ్చితంగా అనువదించడమే NWలో ఇన్ని తేడాలు ఉండడానికి కారణం.’ బెడూన్‌కు కొత్త లోక అనువాదంలో కొన్ని పదాలు నచ్చకపోయినా, ఆయన ఇలా చెప్తున్నాడు: “వేరే అనువాదాలతో పోలిస్తే, కొత్త లోక అనువాదం అన్నిటికన్నా చాలా ఖచ్చితంగా ఉంది.” ఇది “ఎంతో మంచి అనువాదం” అని ఆయన అంటున్నాడు.

ఇజ్రాయిల్‌కు చెందిన డా. బెంజమిన్‌ కెదార్‌ అనే హీబ్రూ పండితుడు కూడా, కొత్త లోక అనువాదం గురించి అలానే చెప్పాడు. 1989 లో ఆయన ఇలా అన్నాడు: “ఆ బైబిల్ని చూస్తున్నప్పుడు, సమాచారాన్ని వీలైనంత ఖచ్చితంగా, అర్థమయ్యేలా అనువదించడానికి అనువాదకులు ఎంతో నిజాయితీగా కష్టపడ్డారని నాకు చాలాసార్లు అనిపించింది. ... కొత్త లోక అనువాదం బైబిల్లో, లేని సమాచారాన్ని కలిపినట్టుగా గానీ, సొంత అభిప్రాయాలు చేర్చినట్టుగా గానీ నాకు ఎక్కడా అనిపించలేదు.”

మీరు ఈ ప్రశ్నలు వేసుకోండి: ‘నేను ఏ ఉద్దేశంతో బైబిల్ని చదవాలని అనుకుంటున్నాను? బైబిలు ఎంత ఖచ్చితంగా ఉందో పట్టించుకోకుండా, సులభంగా చదివేలా ఉంటే చాలు అనుకుంటున్నానా? లేక దేవుడు రాయించిన మాటల్ని ఉన్నదున్నట్టు చదవాలని అనుకుంటున్నానా?’ (2 పేతురు 1:20, 21) మీరు ఏ ఉద్దేశంతో బైబిల్ని చదవాలని అనుకుంటున్నారో, దాన్నిబట్టి సరైన అనువాదాన్ని ఎంచుకోండి.

[చిత్రం]

“పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం” చాలా భాషల్లో ఉంది

[చిత్రం]

మాసొరెటిక్‌ రాతప్రతులు

[చిత్రం]

దొరికిన ఒక రాతప్రతి మీద లూకా 12:7లోని ఈ మాటలు ఉన్నాయి: “... భయపడకండి, మీరు చాలా పిచ్చుకల కన్నా విలువైనవాళ్లు”

[చిత్రసౌజన్యం]

ముందు పేజీ: National Library of Russia, St. Petersburg; రెండు, మూడు పేజీలు: Bibelmuseum, Münster; వెనక పేజీ: © The Trustees of the Chester Beatty Library, Dublin