కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీరు గెలవవచ్చు!

మీరు గెలవవచ్చు!

మీరు గెలవవచ్చు!

“ధైర్యంగా” మీరు అనుకున్నది జరిగించడానికి సమయం వచ్చేసింది. (1 దినవృత్తాంతాలు 28:10) గెలవడానికి మీరు చివరిగా ఏం చేయవచ్చు?

ఒకరోజు అనుకోండి. ద యూ.ఎస్‌. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హెల్త్‌ అండ్‌ హ్యూమన్‌ సర్వీసెస్‌ ఏం చెప్తుందంటే, మీరు సిగరెట్‌ మానేయాలని నిర్ణయించుకున్నాక దాన్ని రెండు వారాల్లోనే అమలులో పెట్టండి. అప్పుడైతేనే సిగరెట్‌ మానేయాలనే కోరిక మీలో బలంగా ఉంటుంది. మీరు మానేయాలనుకునే రోజును మీ క్యాలెండర్‌లో టిక్‌ పెట్టుకోండి, ఆ రోజు నుండి సిగరెట్‌ మానేస్తున్నట్టు మీ ఫ్రెండ్స్‌కి చెప్పండి, ఆరు నూరైనా సరే ఆ రోజునే మానేయండి.

ఒక కార్డ్‌ రాసి పెట్టుకోండి. అందులో ఈ కింది విషయాలు రాసుకోవచ్చు, అలాగే సిగరెట్‌ మానుకోవాలనే కోరికను పెంచే దేన్నైనా రాసుకోవచ్చు:

● సిగరెట్‌ మానేయడానికి కారణాలు

● సిగరెట్‌ తాగాలని అనిపించినప్పుడు, మనసు దానిమీదికి వెళ్లకుండా సహాయం చేసేవాళ్ల ఫోన్‌ నంబర్లు

● కొన్ని మంచిమాటలు, ఉదాహరణకు గలతీయులు 5:22, 23 వంటి బైబిలు లేఖనాలు

ఆ కార్డ్‌ను ఎప్పుడూ మీతోనే పెట్టుకుని, రోజంతటిలో చాలాసార్లు చదువుకోండి. సిగరెట్‌ పూర్తిగా మానేసిన తర్వాత కూడా, మళ్లీ ఎప్పుడైనా మీకు సిగరెట్‌ తాగాలనిపిస్తే, ఆ కార్డ్‌ తీసి చదువుకోండి.

మీ అలవాట్లు మార్చుకుంటూ రండి. మీరు ఏ రోజు నుండైతే సిగరెట్‌ మానేయాలని అనుకుంటున్నారో, దానికి ముందు మీరు కొన్ని అలవాట్లు మార్చుకోవచ్చు. ఉదాహరణకు, మీకు ఉదయం లేవగానే సిగరెట్‌ తాగే అలవాటు ఉంటే, దాన్ని ఒక గంట లేదా అంతకంటే ఎక్కువసేపు వాయిదా వేయగలరేమో ప్రయత్నించి చూడండి. ఒకవేళ మీకు భోజన సమయంలో గానీ, భోజనం అయిపోయిన వెంటనే గానీ సిగరెట్‌ తాగే అలవాటు ఉంటే, దాన్ని కూడా మార్చుకోండి. వేరేవాళ్లు సిగరెట్లు తాగే చోట్లకు వెళ్లకండి. అలాగే, ఒంటరిగా ఉన్నప్పుడు బయటికి ఇలా అనడం ప్రాక్టీస్‌ చేయండి: “వద్దు. నేను సిగరెట్‌ మానేశాను!” అలాంటి పనులు, మీరు సిగరెట్‌ మానేయాలనుకున్న తేదీ కోసం మిమ్మల్ని సిద్ధం చేయడమే కాదు, మీరు త్వరలోనే సిగరెట్లు మానేసిన మంచి వ్యక్తిగా అవ్వబోతున్నారని కూడా గుర్తుచేస్తాయి.

రెడీగా ఉండండి. మీరు అనుకున్న తేదీ దగ్గరపడుతుండగా, మీ ఇంట్లో కొన్ని క్యారెట్లు, బబుల్‌ గమ్‌, జీడిపప్పు, బాదంపప్పు లాంటివి తెచ్చి పెట్టుకోండి. మీరు అనుకున్న తేదీని ఫ్రెండ్స్‌కి, ఇంట్లోవాళ్లకి గుర్తుచేసి వాళ్ల సహాయం కోరండి. రేపు మానేస్తాం అనగా ఈరోజు యాష్‌-ట్రే, లైటర్లు పడేయండి. అలాగే మీ ఇంట్లో, కారులో, జేబుల్లో, ఆఫీస్‌లో ఏమైనా సిగరెట్లు మిగిలి ఉన్నాయేమో చూసి, అవి కూడా పడేయండి. ఎందుకంటే, సిగరెట్లు మీకు అందుబాటులో ఉంటే గబుక్కున తీసుకుని తాగుతారు, అదే ఒక ఫ్రెండ్‌ని అడిగో, లేకపోతే షాపుకెళ్లి తెచ్చుకునో తాగాలంటే కొంచెం ఆలోచిస్తారు కదా! దేవుని సహాయం కోసం ప్రార్థిస్తూ ఉండండి. మరిముఖ్యంగా, మీరు చివరి సిగరెట్‌ తాగేసిన తర్వాత, ఇంకా పట్టుదలగా అలా ప్రార్థించండి.​—లూకా 11:13.

చాలామంది ఈ హానికరమైన, ప్రమాదకరమైన స్నేహితుడిని అంటే సిగరెట్‌ని “వదిలించుకున్నారు.” మీరూ అలా చేయగలరు. మంచి ఆరోగ్యం, చెప్పలేనంత స్వేచ్ఛ మీ కోసం ఎదురుచూస్తున్నాయి!

[చిత్రం]

మీరు రాసిపెట్టుకున్న కార్డును ఎప్పుడూ మీ దగ్గర ఉంచుకోండి, రోజంతటిలో ఎక్కువసార్లు దాన్ని చదువుకుంటూ ఉండండి