కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

బైబిలు మొదటి చేతివ్రాత ప్రతుల్లో దేవుని పేరు ప్రాచీన హీబ్రూ అక్షరాల్లో ఎన్నోసార్లు రాసి ఉంది

దేవుని పేరు

దేవుని పేరు

దేవుని పేరు

లక్షలమంది ప్రజలు దేవున్ని ప్రభువు, నిత్యుడు, అల్లా, లేదా దేవుడు అనే బిరుదులతో ఎంతో గౌరవంగా పిలుస్తారు. కానీ దేవునికి ఒక సొంత పేరు ఉంది. మనం ఆ పేరును ఉపయోగించాలా?

దేవుని పేరు ఏంటి?

కొంతమంది ఏమంటారు?

 

క్రైస్తవులు అని చెప్పుకునే చాలామంది దేవుని పేరు యేసు అని నమ్ముతుంటారు. మిగతావాళ్లు సర్వశక్తిమంతుడైన దేవుడు ఒక్కడే కాబట్టి ఆయన సొంత పేరు ఉపయోగించాల్సిన అవసరం లేదని అంటారు. ఇంకొంతమంది దేవుని పేరు ఉపయోగించడం మంచిది కాదు అని వాదిస్తారు.

బైబిలు ఏం చెప్తుంది?

 

సర్వశక్తిమంతుడైన దేవుని పేరు యేసు కాదు, ఎందుకంటే యేసు సర్వశక్తిమంతుడైన దేవుడు కాదు. నిజానికి యేసు దేవునికి ఇలా ప్రార్థన చేయమని తన తోటి ఆరాధకులకు నేర్పించాడు: “తండ్రీ, నీ పేరు పవిత్రపర్చబడాలి.” (లూకా 11:2) యేసే స్వయంగా దేవునికి ఇలా ప్రార్థన చేశాడు: “తండ్రీ, నీ పేరును మహిమపర్చు.”—యోహాను 12:28.

బైబిల్లో దేవుడు ఇలా ప్రకటిస్తున్నాడు: “యెహోవాను నేనే; . . . మరి ఎవనికిని నా మహిమను నేనిచ్చువాడను కాను.” (యెషయా 42:8) హీబ్రూలో YHWH అనే నాలుగు హల్లులతో దేవుని పేరును చెప్తారు. “జెహోవా” అనే పదం ఆ నాలుగు అక్షరాలకు ఇంగ్లీషు అనువాదం. ఆ పేరు హీబ్రూ లేఖనాల్లో దాదాపు 7,000 సార్లు కనిపిస్తుంది. a ఇది “దేవుడు,” “సర్వశక్తిమంతుడు,” “ప్రభువు” లాంటి ఏ బిరుదుకన్నా ఎక్కువసార్లు కనిపిస్తుంది. అబ్రాహాము, మోషే, దావీదు లాంటి పేర్లు కన్నా కూడా ఎక్కువసార్లు కనిపిస్తుంది.

బైబిల్లో తన పేరును గౌరవంగా ఉపయోగించడాన్ని యెహోవా ఎక్కడా నిషేధించలేదు. పైగా దేవుని సేవకులు దేవుని పేరును స్వేచ్ఛగా ఉపయోగించారు అని వచనాలు చూపిస్తున్నాయి. వాళ్ల పిల్లలకు పెట్టిన పేర్లలో దేవుని పేరును కలిపారు. ఉదాహరణకు ఏలీయా అంటే “నా దేవుడు యెహోవా” అని, జెకర్యా అంటే “యెహోవా గుర్తుచేసుకున్నాడు” అని అర్థం. ప్రతీరోజూ మాట్లాడుకునేటప్పుడు దేవుని పేరును ఉపయోగించడానికి వాళ్లు వెనకాడలేదు.—రూతు 2:4.

తన పేరును మనం ఉపయోగించాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం యెహోవాకు కృతజ్ఞతలు చెప్పాలని, ఆయన పేరును పిలవాలని ప్రోత్సహించబడుతున్నాం. (కీర్తన 105:1) “ఆయన నామమును స్మరించుచు ఉండువారికి” దేవుడు ప్రత్యేక శ్రద్ధను కూడా చూపిస్తాడు.—మలాకీ 3:16.

“యెహోవా అను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడవని వారెరుగుదురుగాక.”—కీర్తన 83:18.

దేవుని పేరుకు అర్థం ఏంటి?

కొంతమంది పండితులు హీబ్రూలో దేవుని పేరుకు అర్థం “తానే కర్త అవుతాడు” అని నమ్ముతారు. అంటే దేవుడు తన ఇష్టాన్ని జరిగించడానికి తనను లేదా తన సృష్టిని ఎలా కావాలనుకుంటే అలా అయ్యేలా చేయగలడు అని అర్థం. సర్వశక్తిమంతుడైన దేవుడు మాత్రమే అలాంటి పేరుకు తగ్గట్లుగా ఉండగలడు.

ఆ పేరు వల్ల మీకు ఏ ప్రయోజనాలు ఉంటాయి

 

దేవుని పేరు తెలుసుకోవడం ద్వారా ఆయన గురించి మీరు ఆలోచించే విధానం మారిపోతుంది. అప్పుడు దేవునికి దగ్గరవ్వడం మీకు తేలిక అవుతుంది. ఎందుకంటే పేరు కూడా తెలియని వాళ్లకు మీరు దగ్గర కాలేరు కదా? అంతెందుకు, మీరు ఆయనకు దగ్గరవ్వాలని ఆయన కోరుకుంటున్నాడు కాబట్టే దేవుడు తన పేరుని మీకు తెలిసేలా చేశాడు.—యాకోబు 4:8.

యెహోవా చెప్పినవన్నీ నెరవేర్చే దేవునిగా ఉంటూ తన పేరుకు తగ్గట్లుగా ఉంటాడని మీరు నమ్మకంతో ఉండవచ్చు. అందుకే “నీ నామమెరిగినవారు నిన్ను నమ్ముకొందురు” అని బైబిలు చెప్తుంది. (కీర్తన 9:10) నమ్మకమైన ప్రేమ, జాలి, దయ, న్యాయం లాంటి ఆయన లక్షణాలతో యెహోవా పేరు ముడిపడి ఉందని మీరు తెలుసుకున్నప్పుడు మీరు ఆ నమ్మకాన్నే పెంచుకుంటారు. (నిర్గమకాండము 34:5-7) యెహోవా తాను ఇచ్చిన మాటలను ఎప్పుడూ నిలబెట్టుకుంటూనే, తన లక్షణాలకు వ్యతిరేకంగా ఎప్పుడూ ప్రవర్తించడు అని తెలుసుకోవడం నిజంగా ఎంత ధైర్యాన్ని ఇస్తుంది.

సర్వశక్తిమంతుడైన దేవున్ని ఆయన పేరుతో తెలుసుకోవడం ఖచ్చితంగా చాలా గొప్ప గౌరవం. అది ఇప్పుడు, భవిష్యత్తులో మీకు ఎన్నో ఆశీర్వాదాలను తెస్తుంది. దేవుడు ఇలా వాగ్దానం చేస్తున్నాడు: అతడు నా నామమును ఎరిగినవాడు కనుక నేను అతనిని కాపాడతాను.—కీర్తన 91:14.

“యెహోవా నామమునుబట్టి ఆయనకు ప్రార్థనచేయు వారందరును రక్షింపబడుదురు.”—యోవేలు 2:32.

దేవుని పేరు వేర్వేరు భాషల్లో

a చాలా బైబిలు అనువాదాల్లో దేవుని పేరుకు బదులు “ప్రభువు” అని పెద్ద అక్షరాల్లో పెట్టారు. ఇంకొన్ని అనువాదాల్లో దేవుని పేరును కొన్ని వచనాల్లో లేదా ఫుట్‌నోటుల్లో మాత్రమే ఉపయోగించారు. న్యూ వరల్డ్‌ ట్రాన్స్‌లేషన్‌ ఆఫ్‌ ద హోలీ స్క్రిప్చర్స్‌ బైబిల్లో దేవుని పేరు ఎక్కువసార్లు కనిపిస్తుంది.