కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

సంతోషాన్ని తీసుకొచ్చే మార్గం

నిరీక్షణ

నిరీక్షణ

మీకు మంచి భవిష్యత్తు, నిరీక్షణ ఇవ్వడానికి విపత్తు గురించి కాకుండా శాంతి గురించి నేను ఆలోచిస్తున్నానుయిర్మీయా 29:11.

“నిరీక్షణ . . . ఆధ్యాత్మికతకు చాలా ముఖ్యం. అది నిస్సహాయత, ఒంటరితనం, భయం నుండి బయటపడడానికి చాలా మంచి మందు.” అని హోప్‌ ఇన్‌ ది ఏజ్‌ ఆఫ్‌ ఎన్‌గ్జైటీ అనే పుస్తకం చెప్తుంది.

మనకు నిరీక్షణ ఎంత అవసరమో బైబిలు చెప్తుంది, అనవసర నిరీక్షణల గురించి కూడా హెచ్చరిస్తుంది. “రాజులచేతనైనను నరులచేతనైనను రక్షణ కలుగదు వారిని నమ్ముకొనకుడి” అని కీర్తన 146:3 చెప్తుంది. మనల్ని రక్షించుకోవడం కోసం మనుషుల ప్రయత్నాలను నమ్మడం కన్నా, చేసిన వాగ్దానాలను నిలబెట్టుకునే శక్తి ఉన్న మన సృష్టికర్తను నమ్మడం తెలివైన పని. ఆయన మనకు ఏమని వాగ్దానం చేశాడు? ఈ విషయాలు పరిశీలించండి.

చెడు అంతం అవుతుంది; నీతిమంతులకు శాంతికరమైన పరిస్థితులు శాశ్వతంగా ఉంటాయి: “ఇక కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోవుదురు . . . దీనులు భూమిని స్వతంత్రించుకొందురు బహు క్షేమము కలిగి సుఖించెదరు” అని కీర్తన 37:10, 11 చెప్తుంది. 29వ వచనంలో ఇంకా ఇలా ఉంది: భూమ్మీద “నీతిమంతులు . . . నిత్యము నివసించెదరు.”

యుద్ధాలు అంతం అవుతాయి: “యెహోవా . . . భూదిగంతములవరకు యుద్ధములు మాన్పువాడు. విల్లు విరుచువాడును బల్లెమును తెగనరుకువాడును ఆయనే యుద్ధ రథములను అగ్నిలో కాల్చివేయువాడు ఆయనే.”—కీర్తన 46:8, 9.

రోగాలు, బాధలు, మరణం ఇక ఉండవు: “దేవుని నివాసం మనుషులతో ఉంది. . . . వాళ్ల కళ్లలో నుండి కారే ప్రతీ కన్నీటి బొట్టును ఆయన తుడిచేస్తాడు. మరణం ఇక ఉండదు, దుఃఖం గానీ ఏడ్పు గానీ నొప్పి గానీ ఇక ఉండవు. అంతకుముందున్న విషయాలు గతించిపోయాయి.”—ప్రకటన 21:3, 4.

అందరికీ కావాల్సినంత ఆహారం: “దేశములోను పర్వత శిఖరములమీదను సస్య సమృద్ధి కలుగును.”—కీర్తన 72:16.

ప్రపంచమంతా పరిపాలించే ఒక్క ప్రభుత్వం అంటే క్రీస్తు రాజ్యం ద్వారా న్యాయమైన పరిపాలన ఉంటుంది: “సకల జనులును రాష్ట్రములును ఆ యా భాషలు మాటలాడువారును ఆయనను సేవించునట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయన [యేసుక్రీస్తు] కీయబడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది అదెన్నటికిని తొలగిపోదు; ఆయన రాజ్యము ఎప్పుడును లయముకాదు.”—దానియేలు 7:14.

ఆ వాగ్దానాలను మనం ఎలా నమ్మవచ్చు? యేసు భూమ్మీద ఉన్నప్పుడు కాబోయే రాజు తనేనని బహిరంగంగా నిరూపించుకున్నాడు. ఆయన రోగులను స్వస్థపర్చాడు, పేదవాళ్లకు భోజనం పెట్టాడు, చనిపోయినవాళ్లను తిరిగి లేపాడు. అంతకన్నా ముఖ్యంగా ఆయన ఎన్నో మంచి విషయాలను నేర్పించాడు. ప్రజలందరూ శాంతితో ఐక్యంగా నిత్యమూ జీవించడానికి అవసరమైన మంచి సలహాలు కూడా ఆయన చెప్పాడు. యేసు భవిష్యత్తులో జరగబోయే విషయాలను అంటే చివరి రోజులకు గుర్తుగా ఇప్పుడు జరుగుతున్న సంఘటనలను ముందే చెప్పాడు.

తుఫాను ముందు ప్రశాంతత ఉంటుంది కానీ . . .

చివరి రోజుల్లో శాంతి, ప్రశాంతత కాకుండా పరిస్థితులు దానికి పూర్తి విరుద్ధంగా ఉంటాయని యేసు ముందే చెప్పాడు. “యుగసమాప్తి” జరిగే ముందు ప్రపంచ యుద్ధాలు, ఆహార కొరతలు, వ్యాధులు, పెద్దపెద్ద భూకంపాలు వస్తాయని ఆయన ఇచ్చిన సూచనలో ఉంది. (మత్తయి 24:3, 7; లూకా 21:10, 11; ప్రకటన 6:3-8) యేసు ఇంకా ఇలా చెప్పాడు: “చెడుతనం పెరిగిపోవడం వల్ల చాలామంది ప్రేమ చల్లారిపోతుంది.”—మత్తయి 24:12.

అలా ప్రేమ చల్లారిపోవడాన్ని చాలా రకాలుగా చూడొచ్చు, దాని గురించి మరో బైబిలు రచయిత వివరంగా ఇలా చెప్పాడు. 2 తిమోతి 3:1-5⁠లో ఉన్నట్లు, “చివరి రోజుల్లో” ప్రజలు స్వార్థపరులుగా, డబ్బును ప్రేమించేవాళ్లుగా, సుఖాన్ని ప్రేమించేవాళ్లుగా ఉంటారు. గర్విష్ఠులుగా, క్రూరులుగా ఉంటారు. కుటుంబాల్లో అనురాగం ఉండదు, పిల్లలు అమ్మానాన్నలకు లోబడరు. పైకి దైవభక్తి ఉన్నట్లు కనిపించినా దానికి తగ్గట్లు జీవించని వాళ్లు ఎక్కువగా ఉంటారు.

తుఫాను లాంటి ఈ పరిస్థితులు ప్రపంచం చివరి రోజుల్లో ఉందని రుజువు చేస్తున్నాయి. ప్రశాంతమైన రాజ్య పరిపాలన కూడా దగ్గర్లో ఉందని అవి చూపిస్తున్నాయి. చివరి రోజులు గురించి యేసు చేసిన ప్రవచనంలో ఈ వాగ్దానం కూడా ఉంది: “అన్ని దేశాల ప్రజలకు సాక్ష్యంగా ఉండేలా, రాజ్యం గురించిన మంచివార్త భూమంతటా ప్రకటించబడుతుంది. ఆ తర్వాత అంతం వస్తుంది.”—మత్తయి 24:14.

ఆ మంచివార్త తప్పులు చేసేవాళ్లకు స్పష్టమైన హెచ్చరికను, మంచి వాళ్లకు నిరీక్షణను ఇస్తుంది. వాగ్దానం చేయబడిన ఆశీర్వాదాలు త్వరలోనే నెరవేరుతాయనే భరోసాను కూడా వాళ్లకు ఇస్తుంది. ఆ వాగ్దానాల గురించి మీరు ఇంకా ఎక్కువ తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే, ఈ పత్రికలోని చివరి పేజీ చూడండి.