కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

సృష్టికర్త గురించి తెలుసుకోండి, ఆయనకు స్నేహితులవ్వండి

సృష్టికర్త గురించి తెలుసుకోండి, ఆయనకు స్నేహితులవ్వండి

మన సృష్టికర్త కేవలం శక్తిమంతుడే కాదు, ఆయనకు ఎన్నో అద్భుతమైన లక్షణాలు కూడా ఉన్నాయి. ఆయన మనకు తన గురించి ఎన్నో విషయాలు చెప్తున్నాడు. మనం వాటిని తెలుసుకోవాలని, తనతో స్నేహం చేయాలని ఆయన కోరుకుంటున్నాడు. (యోహాను 17:3; యాకోబు 4:8) మరి, సృష్టికర్త గురించి కొన్ని విషయాలు తెలుసుకుందామా.

మన సృష్టికర్తకు ఒక పేరు ఉంది

“యెహోవా అనే పేరున్న నువ్వు మాత్రమే భూమంతటి పైన మహోన్నతుడివని ప్రజలు తెలుసుకోవాలి.”—కీర్తన 83:18.

దేవుడు ఒక్కడే ఉన్నాడని, ఆయన పేరు యెహోవా అని బైబిలు చెప్తుంది. భూమిని, ఆకాశాన్ని, చంద్రుడిని, నక్షత్రాల్ని, సమస్త ప్రాణుల్ని ఇలా అన్నిటినీ ఆయనే చేశాడు. మనం ఆరాధించడానికి ఆయన మాత్రమే అర్హుడు.—ప్రకటన 4:11.

యెహోవా మనల్ని చాలా ప్రేమిస్తున్నాడు

“దేవుడు ప్రేమ.”—1 యోహాను 4:8.

మనం బైబిల్ని చదివినప్పుడు, మన చుట్టూ ఉన్న సృష్టిని గమనించినప్పుడు మన సృష్టికర్తకున్న అద్భుతమైన లక్షణాల్ని తెలుసుకుంటాం. ఆయనకున్న లక్షణాల్లో అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది ప్రేమ. ఆయన చేసే ప్రతీ పనిలో ప్రేమ కనిపిస్తుంది. యెహోవా గురించి ఎంత ఎక్కువ తెలుసుకుంటే, ఆయన్ను అంత ఎక్కువ ప్రేమిస్తాం.

యెహోవా క్షమించే దేవుడు

“నువ్వు క్షమించడానికి సిద్ధంగా ఉండే దేవుడివి.”—నెహెమ్యా 9:17.

మనలో ఉన్న బలహీనతలవల్ల కొన్ని పొరపాట్లు చేస్తుంటామని యెహోవాకు తెలుసు. అందుకే ఆయన మనల్ని ‘క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు.’ చేసిన తప్పుకు బాధపడి క్షమాపణ అడిగితే, ఆ తప్పును ఇంకెప్పుడూ చేయకుండా ఉండడానికి మనస్ఫూర్తిగా ప్రయత్నిస్తే ఆయన మనల్ని క్షమిస్తాడు. ఒకసారి క్షమించాక, మళ్లీ ఆ తప్పుల్ని గుర్తుపెట్టుకుని ఆయన మనల్ని శిక్షించడు.—కీర్తన 103:12, 13.

తనకు ప్రార్థించమని యెహోవా చెప్తున్నాడు

‘తనకు మొరపెట్టే వాళ్లందరికీ యెహోవా దగ్గరగా ఉన్నాడు. సహాయం కోసం వాళ్లు పెట్టే మొరలు వింటున్నాడు.’—కీర్తన 145:18, 19.

యెహోవాకు ప్రార్థించడానికి ప్రత్యేకమైన పూజలు చేయాల్సిన అవసరం లేదు; విగ్రహాల్ని గానీ, ఇంకేవైనా వస్తువుల్ని గానీ ఉపయోగించాల్సిన అవసరం లేదు. మనం ఎప్పుడు ప్రార్థన చేసినా ఆయన వింటాడు. పిల్లలు మాట్లాడుతున్నప్పుడు వాళ్ల అమ్మనాన్నలు ఎంత శ్రద్ధగా వింటారో, మనం ప్రార్థన చేసినప్పుడు కూడా యెహోవా అంతే శ్రద్ధగా వింటాడు.