కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

టెక్నాలజీ మీ స్నేహితులతో ఉన్న సంబంధాన్ని ఎలా పాడుచేయగలదు?

టెక్నాలజీ మీ స్నేహితులతో ఉన్న సంబంధాన్ని ఎలా పాడుచేయగలదు?

మెసేజ్‌లు, ఈ-మెయిల్స్‌, వీడియో కాల్స్‌, సోషల్‌ మీడియా వంటి వాటివల్ల వేర్వేరు దేశాల్లో ఉన్నా చక్కగా మాట్లాడుకోగలుగుతున్నాం. నిజమే, టెక్నాలజీ ప్రజల మధ్య దూరాన్ని తగ్గిస్తుంది. కానీ కొంతమంది, స్నేహితులతో మాట్లాడడానికి కేవలం టెక్నాలజీని మాత్రమే ఉపయోగిస్తున్నారు.

వాళ్లకు ఇలాంటి సమస్యలు ఎదురవ్వవచ్చు . . .

  • ఇతరుల్ని అర్థంచేసుకోలేరు.

  • ఒంటరిగా, ఏదో పోగొట్టుకున్నట్టు భావిస్తారు.

  • వేరేవాళ్ల కన్నా తమ గురించే ఎక్కువగా ఆలోచిస్తారు.

మీరు మనసులో ఉంచుకోవాల్సినవి . . .

ఇతరుల్ని అర్థంచేసుకోవడం

వేరేవాళ్లను అర్థంచేసుకోవాలంటే వాళ్ల గురించి సమయం తీసుకుని ఆలోచించాలి. కానీ మెసేజ్‌లు పంపిస్తూ, సోషల్‌ మీడియా చూస్తూ, బిజీగా ఉంటే అలా చేయడం కష్టం.

ఒకవేళ మీకు చాలా మెసేజ్‌లు వస్తుంటే, మీ స్నేహితులు పెట్టిన మెసేజ్‌లకు రిప్లై ఇవ్వడం కూడా మీకు కష్టంగా అనిపించవచ్చు. అవి ప్రాముఖ్యమైనా కాకపోయినా ఆ మెసేజ్‌లన్నిటికీ రిప్లై ఇవ్వాలనే తొందరలో, అవసరంలో ఉన్న మీ స్నేహితుణ్ణి కూడా మీరు పట్టించుకోకపోవచ్చు.

ఇలా ఆలోచించండి: స్నేహితులతో మాట్లాడడానికి టెక్నాలజీని ఉపయోగిస్తున్నప్పుడు, వాళ్ల పట్ల “సహానుభూతిని” అంటే వాళ్లను నిజంగా అర్థం చేసుకుంటున్నారని ఎలా చూపించవచ్చు?—1 పేతురు 3:8.

ఒంటరిగా అనిపించడం

సోషల్‌ మీడియాలో కొంత సమయం గడిపాక, చాలామందికి ఒంటరితనం పెరిగిందే కానీ తగ్గలేదని ఒక పరిశోధనలో తేలింది. ఇతరులు పెట్టిన ఫోటోలు, పోస్ట్‌లు చూస్తూ చివరికి టైమంతా వేస్ట్‌ చేశామని చాలామంది ఒప్పుకుంటున్నట్టు పరిశోధకులు చెప్తున్నారు.

ఇంకా చెప్పాలంటే, వేరేవాళ్లు పెట్టిన మంచి-మంచి ఫోటోలు, పోస్ట్‌లు చూసినప్పుడు ‘నా జీవితం ఎందుకు వాళ్లలా లేదు?’ అని అనుకునే అవకాశం ఉంది. అందరూ హ్యాపీగా సమయం గడుపుతుంటే, నా జీవితంలో మాత్రం సరదా గానీ సంతోషం గానీ లేదని అనుకుంటారు.

ఇలా ఆలోచించండి: సోషల్‌ మీడియాను ఉపయోగిస్తున్నప్పుడు ఇతరులతో పోల్చుకోకుండా ఎలా ఉండవచ్చు?—గలతీయులు 6:4.

స్వార్థంగా ఆలోచించడం

కొంతమంది విద్యార్థులు తమకు సహాయం చేసే వాళ్లను మాత్రమే స్నేహితులుగా చేసుకోవడానికి ఇష్టపడుతున్నారని ఒక టీచర్‌ చెప్పింది. సరదా కోసం ఏదైనా వస్తువుని వాడి పక్కన పెట్టేసినట్టు, కొంతమంది తమ స్నేహితుల్ని అవసరం కోసం వాడుకుని మిగతా సమయాల్లో పట్టించుకోరు.

ఇలా ఆలోచించండి: మీరు ఆన్‌లైన్‌లో పెట్టే పోస్ట్‌లు మీ గురించి మీరు ఎక్కువగా ఆలోచించుకుంటున్నారని, లేదా మీలో పోటీతత్వం ఉందని చూపిస్తున్నాయా? —గలతీయులు 5:26.

మీరు ఏం చేయవచ్చు?

టెక్నాలజీని ఎలా ఉపయోగిస్తున్నారో పరిశీలించుకోండి

టెక్నాలజీని మీరు సరిగ్గా ఉపయోగిస్తే మీ స్నేహితులతో మాట్లాడడానికి, వాళ్లకు మరింత దగ్గరవ్వడానికి అది ఎంతో సహాయం చేస్తుంది.

మంచి సలహా: “ప్రేమ . . . సొంత ప్రయోజనం మాత్రమే చూసుకోదు.”—1 కొరింథీయులు 13:4, 5.

కింద ఇచ్చిన సలహాల్లో మీరు ఏం పాటించాలనుకుంటున్నారో ఎంచుకోండి, లేదా మీరు ఏం చేయాలనుకుంటున్నారో రాయండి.

  • మెసేజ్‌లు, ఈమెయిల్లోనే కాకుండా నేరుగా మాట్లాడడానికి ప్రయత్నించాలి

  • ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు ఫోన్‌ పక్కన పెట్టేయాలి (లేదా సైలెంట్‌లో పెట్టాలి)

  • సోషల్‌ మీడియాలో వేరేవాళ్లు పెట్టే పోస్ట్‌లను, ఫోటోలను చూసే సమయాన్ని తగ్గించుకోవాలి

  • ఇతరులు మాట్లాడుతున్నప్పుడు శ్రద్ధగా వినడానికి ప్రయత్నించాలి

  • నా ఫ్రెండ్స్‌లో ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే వాళ్లతో మాట్లాడాలి