కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ముందుమాట

ముందుమాట

ఇది నిజమైన కథల పుస్తకము. ఇందులోని కథలు ప్రపంచంలోని అతి గొప్ప పుస్తకమైన బైబిలు నుండి తీసుకోబడ్డాయి. అవి దేవుడు సృష్టిని ప్రారంభించినప్పటినుండి నేటివరకున్న లోకం చరిత్రను తెలియజేస్తాయి. దేవుడు భవిష్యత్తులో ఏమి చేస్తానని వాగ్దానం చేశాడో కూడా చెబుతాయి.

ఈ పుస్తకము మీకు బైబిలు గురించి సమగ్రంగా తెలియజేస్తుంది. బైబిలులోని ప్రజల గురించి వాళ్లు చేసిన పనుల గురించి చెబుతుంది. మానవులు పరదైసు భూమిపై నిరంతరం జీవిస్తారని దేవుడు ఇచ్చిన గొప్ప నిరీక్షణ గురించి కూడా చెబుతుంది.

ఈ పుస్తకములో 116 కథలున్నాయి. అవి ఎనిమిది భాగాలుగా చేయబడ్డాయి. ప్రతి భాగానికి ముందున్న పేజీ ఆ భాగంలో ఏముందో క్లుప్తంగా చెబుతుంది. చరిత్రలో సంఘటనలు జరిగిన క్రమాన్ని బట్టే కథలు కూర్చబడ్డాయి. ఇతర సంఘటనలకు సంబంధించి ఆయా విషయాలు చరిత్రలో ఎప్పుడెప్పుడు జరిగాయో తెలుసుకోవడానికి అది మీకు సహాయపడుతుంది.

ఈ కథలు సులభమైన భాషలో చెప్పబడ్డాయి. చిన్నపిల్లలు చాలామంది తమకై తామే వాటిని చదువుకోగలుగుతారు. తమ పిల్లలు వాటిని పదేపదే చదివించుకోవడానికి ఎంతో ఇష్టపడుతున్నారని తల్లిదండ్రులు గమనిస్తారు. ఈ పుస్తకములో పిల్లలకు అలాగే పెద్దలకు ఎంతో ఆసక్తికరమైన విషయాలున్నట్లు మీరు కనుగొంటారు.

ప్రతి కథకు చివర్లో బైబిలు లేఖనాలు ఇవ్వబడ్డాయి. ఆ కథలు తీసుకోబడిన ఆయా బైబిలు భాగాలను చదవాలని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాం. మీరు ఒక కథ చదవడం ముగించాక, ఆ కథకు సంబంధించి 116వ కథ తర్వాత ఉన్న ప్రశ్నలను కూడా పరిశీలించి సమాధానాలు గుర్తుతెచ్చుకోవడానికి ప్రయత్నించండి.