కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

1వ కథ

దేవుడు సృష్టిని ప్రారంభించడం

దేవుడు సృష్టిని ప్రారంభించడం

మనకున్న మంచివన్ని దేవుని నుండి వచ్చినవే. ఆయన పగటివేళ వెలుగునివ్వడానికి సూర్యుణ్ణి, రాత్రివేళ వెలుగునివ్వడానికి చంద్రుణ్ణి, అలాగే నక్షత్రాలను చేశాడు. మనం నివసించేందుకు భూమిని సృష్టించాడు.

అయితే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, భూమి దేవుడు మొట్టమొదట చేసినవి కావు. ఆయన మొదట ఏమి చేశాడో తెలుసా? మొదట దేవుడు తనలాంటి వ్యక్తులను చేశాడు. మనం దేవుణ్ణి ఎలా చూడలేమో అలాగే ఆ వ్యక్తులను కూడా చూడలేము. బైబిలులో వాళ్ళు దేవదూతలని పిలువబడుతున్నారు. దేవుడు, ఆ దేవదూతలను తనతోపాటు పరలోకంలో జీవించడానికి చేశాడు.

దేవుడు సృష్టించిన మొట్టమొదటి దూత చాలా ప్రత్యేకమైన వ్యక్తి. ఆయనే దేవుని మొదటి కుమారుడు, ఆయన తన తండ్రితో కలిసి పనిచేశాడు. మిగిలిన వాటినన్నింటిని చేయడానికి ఆయన దేవునికి సహాయం చేశాడు. సూర్యుణ్ణి, చంద్రుణ్ణి, నక్షత్రాలను, మన భూమిని కూడా తయారు చేయడానికి ఆయన దేవునికి సహాయం చేశాడు.

మొదట్లో భూమి ఎలా ఉండేది? మొదట్లో భూమ్మీద ఎవ్వరూ జీవించగలిగేవారు కాదు. భూమి అంతా ఒక పెద్ద సముద్రంలా నీళ్ళతో నిండి ఉండేది. కానీ భూమ్మీద ప్రజలు జీవించాలని దేవుడు కోరుకున్నాడు. అందుకే ఆయన భూమ్మీద మనకు కావలసిన వాటిని సిద్ధం చేయడం ప్రారంభించాడు. ఆయన ఏమి చేశాడు?

మొదట భూమికి వెలుగు అవసరమైంది. కాబట్టి దేవుడు, సూర్యుని నుండి వచ్చే వెలుగు భూమిపై ప్రకాశించేలా చేశాడు. రాత్రీ పగలూ ఏర్పడేలా చేశాడు. ఆ తర్వాత దేవుడు సముద్రజలము నుండి భూమి పైకివచ్చేలా చేశాడు.

మొదట్లో భూమిపై ఏమీ ఉండేది కాదు. అది ఇక్కడ మీకు కనిపిస్తున్న చిత్రంలా ఉండేది. అప్పుడు భూమిపై పువ్వులు, చెట్లు, జంతువులు ఏమీ ఉండేవి కావు. చివరకు సముద్రంలో చేపలు కూడా ఉండేవి కావు. భూమిని జంతువులు, మనుష్యులు నివసించేందుకు అనుకూలంగా చేయడానికి దేవుడు ఇంకా ఎంతో చేయవలసి ఉండింది.