కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

4వ కథ

వాళ్ళు తమ గృహాన్ని పోగొట్టుకోవడానికిగల కారణం

వాళ్ళు తమ గృహాన్ని పోగొట్టుకోవడానికిగల కారణం

ఇక్కడేమి జరుగుతుందో చూడండి. అందమైన ఏదెను తోట నుండి ఆదాము హవ్వలు బయటకు పంపివేయబడుతున్నారు. ఎందుకో తెలుసా?

వాళ్ళు చాలా చెడ్డ పని చేశారు. అందుకే యెహోవా దేవుడు వాళ్ళను శిక్షించాడు. ఆదాము హవ్వలు చేసిన ఆ చెడ్డ పని ఏమిటో మీకు తెలుసా?

దేవుడు చెయ్యవద్దన్న పనినే వాళ్ళు చేశారు. తోటలోని చెట్లనుండి ఆహారం తినవచ్చని దేవుడు వాళ్ళతో చెప్పాడు. కానీ ఒక్క చెట్టునుండి మాత్రం వాళ్ళు తినకూడదని, అలా తింటే చనిపోతారని దేవుడు చెప్పాడు. ఆ చెట్టును ఆయన తన స్వంత దానిగా ఉంచుకున్నాడు. వేరే వాళ్ళదేదైనా తీసుకోవడం తప్పని మనకు తెలుసు కదా? అసలు ఏమి జరిగింది?

ఒకరోజు హవ్వ తోటలో ఒంటరిగా ఉన్నప్పుడు ఒక పాము ఆమెతో మాట్లాడింది. అదెలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి! దేవుడు ఏ చెట్టునుండి పండు తినవద్దని చెప్పాడో ఆ చెట్టునుండే పండు తీసుకొని తినమని ఆ పాము హవ్వతో చెప్పింది. యెహోవా పాములను చేసినప్పుడు వాటికి మాట్లాడే శక్తి ఇవ్వలేదు. అంటే ఆ పామును ఇంకెవరో మాట్లాడేలా చేశారన్నమాట. ఎవరు అలా చేశారు?

అలా చేసింది ఆదాము కాదు. కాబట్టి భూమిని చేయడానికి ఎంతోకాలం ముందు యెహోవా చేసిన వారిలో ఒకరు అలా చేసి ఉండాలి. వాళ్ళు దూతలు, వాళ్ళను మనం చూడలేం. అలా చేసిన దూత చాలా అహంకారిగా తయారయ్యాడు. తాను కూడా దేవునిలా పరిపాలకుడినవ్వాలని అతను అనుకున్నాడు. ప్రజలు యెహోవాకు విధేయత చూపించే బదులు తనకు విధేయత చూపించాలని అతడు కోరుకున్నాడు. ఆ దూతే పామును మాట్లాడేలా చేశాడు.

ఆ దూత హవ్వను మోసం చేయగలిగాడు. పండు తింటే తను దేవునిలా అవుతుందని అతను హవ్వతో అన్నప్పుడు, ఆమె దానిని నమ్మింది. అందుకే ఆమె, అలాగే ఆదాము కూడా ఆ పండును తిన్నారు. ఆదాము హవ్వలు దేవునికి అలా అవిధేయులైనందువల్లనే, వాళ్ళు తమ అందమైన గృహాన్ని పోగొట్టుకున్నారు.

అయితే ఒక రోజు, ఈ భూమంతా ఏదెను తోటలా అందంగా మారేలా దేవుడు చేస్తాడు. ఆ పనిలో మీరు కూడా ఎలా పాల్గొనవచ్చో మనం తర్వాత తెలుసుకుంటాం. అయితే ఇప్పుడు, ఆదాము హవ్వలకు ఏమి జరిగిందో చూద్దాం.