కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

11వ కథ

మొదటి వర్షధనుస్సు

మొదటి వర్షధనుస్సు

నోవహు తన కుటుంబంతోపాటు ఓడనుండి బయటకు వచ్చిన తర్వాత చేసిన మొట్టమొదటి పని ఏమిటో మీకు తెలుసా? ఆయన దేవునికి అర్పణ అర్పించాడు. ఆయన అలా అర్పించడాన్ని మీరు క్రిందున్న చిత్రంలో చూడవచ్చు. తన కుటుంబాన్ని గొప్ప జలప్రళయంనుండి రక్షించినందుకు కృతజ్ఞతగా నోవహు దేవునికి జంతు బలులను అర్పించాడు.

ఆ అర్పణను చూసి యెహోవా ఆనందించాడా? అవును, ఆనందించాడు. అంతేగాక ఈ లోకాన్ని ఇంకెప్పుడూ జలప్రళయంతో నాశనం చేయనని ఆయన నోవహుకు వాగ్దానం చేశాడు.

త్వరలోనే నేల అంతా ఆరిపోయింది, నోవహు ఆయన కుటుంబం ఓడ బయట క్రొత్త జీవితాన్ని ప్రారంభించారు. దేవుడు వారిని ఆశీర్వదించి, ‘మీరు ఎక్కువమంది పిల్లలను కని, భూమి అంతటా ప్రజలు నివసించేంత వరకు మీ సంతానాన్ని అభివృద్ధిపరచండి’ అని వారితో చెప్పాడు.

కానీ ఆ తర్వాత ప్రజలు గొప్ప జలప్రళయం గురించి విన్నప్పుడు, మళ్ళీ అలాంటి జలప్రళయం వస్తుందేమోనని భయపడవచ్చు. అందుకే దేవుడు భూమంతటిపైకి అలాంటి జలప్రళయాన్ని మళ్ళీ తీసుకురాను అని తాను చేసిన ప్రమాణాన్ని ప్రజలకు జ్ఞాపకం చేసేందుకు ఒక ఏర్పాటు చేశాడు. ఆయన ఏమి ఏర్పాటు చేశాడో మీకు తెలుసా? వర్షధనుస్సును ఏర్పాటు చేశాడు.

వానవెలసిన తర్వాత సూర్యుడు ప్రకాశించినప్పుడు ఆకాశంలో తరచూ మనకు వర్షధనుస్సు కనిపిస్తుంది. వర్షధనుస్సులు అందమైన అనేక రంగులతో ఉంటాయి. మీరు ఎప్పుడైనా వర్షధనుస్సును చూశారా? ఇక్కడ చిత్రంలోవున్న దానిని మీరు చూశారా?

దేవుడు ఇలా చెప్పాడు: ‘ఇక ఎన్నడూ జలప్రళయంలో ప్రజలందరు నశించరు, జంతువులు నశించవు అని నేను వాగ్దానం చేస్తున్నాను. మేఘాలలో నేను నా వర్షధనుస్సును ఉంచుతున్నాను. వర్షధనుస్సు కనిపించినప్పుడు దానిని చూసి నేను నా వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటాను.’

మీరు వర్షధనుస్సును చూసినప్పుడు దేనిని జ్ఞాపకం చేసుకోవాలి? దేవుడు ఇక ఎన్నడూ లోకాన్ని గొప్ప జలప్రళయంతో నాశనం చేయడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి.