కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

13వ కథ

అబ్రాహాము—దేవుని స్నేహితుడు

అబ్రాహాము—దేవుని స్నేహితుడు

జలప్రళయం తర్వాత ప్రజలు జీవించడానికి వెళ్ళిన ప్రాంతాలలో ఊరు అని పిలువబడే ప్రాంతం ఒకటి. అది అందమైన గృహాలుగల ప్రాముఖ్యమైన పట్టణంగా తయారయ్యింది. కానీ అక్కడున్న ప్రజలు అబద్ధ దేవుళ్ళను ఆరాధించేవారు. బాబెలులో కూడా వాళ్ళు అలాగే చేసేవారు. ఊరులోని మరియు బాబెలులోని ప్రజలు, యెహోవాను సేవించిన నోవహు, ఆయన కుమారుడైన షేము వంటివారు కారు.

చివరకు జలప్రళయం వచ్చిన 350 సంవత్సరాల తర్వాత నమ్మకస్థుడైన నోవహు మరణించాడు. ఆ తర్వాత రెండు సంవత్సరాలకు మీకు ఇక్కడ చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి జన్మించాడు. ఆయన దేవునికి ఎంతో ప్రత్యేకమైన వ్యక్తి. ఆయన పేరు అబ్రాహాము. ఆయన తన కుటుంబంతోపాటు ఊరు అనే పట్టణంలో నివసించేవాడు.

ఒకరోజు యెహోవా, ‘నువ్వు ఊరును, నీ బంధువులను విడిచిపెట్టి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు’ అని అబ్రాహాముతో చెప్పాడు. అబ్రాహాము దేవుని మాట విని, ఊరులోవున్న అన్ని సౌకర్యాలను విడిచిపెట్టాడా? అవును, విడిచిపెట్టాడు. ఆ విధంగా అబ్రాహాము ఎప్పుడూ దేవునికి విధేయత చూపించేవాడు, అందుకే ఆయన దేవుని స్నేహితుడని పిలువబడ్డాడు.

అబ్రాహాము ఊరును విడిచిపెట్టినప్పుడు, ఆయన కుటుంబంలోని కొంతమంది ఆయనతోపాటు వెళ్ళారు. వారిలో ఆయన తండ్రియైన తెరహు, ఆయన అన్న కుమారుడు లోతు ఉన్నారు. అలాగే అబ్రాహాము భార్య శారా కూడా ఉంది. కొంతకాలానికి వాళ్ళంతా హారాను అనబడే ప్రాంతానికి చేరుకున్నారు, అక్కడే తెరహు చనిపోయాడు. అప్పుడు వాళ్ళు ఊరుకు చాలా దూరంలో ఉన్నారు.

కొంతకాలం తర్వాత అబ్రాహాము, ఆయన కుటుంబం హారానును విడిచిపెట్టి కనాను అనబడే ప్రాంతానికి వచ్చారు. అక్కడ యెహోవా, ‘నేను నీ పిల్లలకు ఇచ్చే ప్రదేశము ఇదే’ అని చెప్పాడు. అబ్రాహాము కనానులో ఉండి గుడారాల్లో నివసించాడు.

అబ్రాహాము గొప్ప గొర్రెల మందలను, ఇతర జంతువులను, వందలాది సేవకులను కలిగివుండేలా దేవుడు ఆయనకు సహాయం చేశాడు. కానీ ఆయనకు, శారాకు పిల్లలు పుట్టలేదు.

అబ్రాహాముకు 99 సంవత్సరాలు వచ్చినప్పుడు యెహోవా ఆయనతో, ‘నువ్వు అనేక జనములకు తండ్రివి అవుతావని నేను నీకు వాగ్దానం చేస్తున్నాను’ అని చెప్పాడు. అయితే అప్పటికే అబ్రాహాము, శారా పిల్లలను కనలేనంత వృద్ధులైపోయారు కాబట్టి అది ఎలా సాధ్యమవుతుంది?