కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

16వ కథ

ఇస్సాకుకు మంచి భార్య లభించడం

ఇస్సాకుకు మంచి భార్య లభించడం

ఈ చిత్రంలోని స్త్రీ ఎవరో మీకు తెలుసా? ఆమె పేరు రిబ్కా. ఆమె కలుసుకోబోతున్న ఆ వ్యక్తి ఇస్సాకు. ఆమె ఆయనకు భార్య కాబోతుంది. ఇది ఎలా జరిగింది?

ఇస్సాకు తండ్రి అబ్రాహాము తన కుమారునికి మంచి భార్య లభించాలని కోరుకున్నాడు. ఇస్సాకు కనాను స్త్రీని పెళ్ళి చేసుకోవడం ఆయనకు ఇష్టంలేదు, ఎందుకంటే వాళ్ళు అబద్ధ దేవుళ్ళను ఆరాధించేవాళ్ళు. కాబట్టి అబ్రాహాము తన సేవకుడిని పిలిచి, ‘నువ్వు హారానులో నివసిస్తున్న నా బంధువుల దగ్గరకు వెళ్ళి నా కుమారుడైన ఇస్సాకుకు భార్యను తీసుకురావాలి’ అని చెప్పాడు.

వెంటనే అబ్రాహాము సేవకుడు పది ఒంటెలను తీసుకొని ఆ సుదూర ప్రాంతానికి ప్రయాణమై వెళ్ళాడు. అతను అబ్రాహాము బంధువులు నివసించే ప్రాంతానికి చేరుకున్నప్పుడు, అక్కడ ఒక బావి దగ్గర ఆగాడు. అప్పటికి మధ్యాహ్నం దాటిపోయింది, అది పట్టణంలోని స్త్రీలు బావిలోనుండి నీళ్ళు చేదుకోవడానికి వచ్చేవేళ. అబ్రాహాము సేవకుడు యెహోవాకు ఇలా ప్రార్థించాడు: ‘నాకు, ఒంటెలకు త్రాగడానికి నీళ్ళిచ్చే స్త్రీయే ఇస్సాకుకు భార్యగా నువ్వు ఎంపిక చేసిన స్త్రీయై యుండును గాక.’

కొద్దిసేపట్లోనే నీళ్ళు చేదుకోవడానికి రిబ్కా వచ్చింది. సేవకుడు ఆమెను నీళ్ళు అడిగినప్పుడు ఆమె అతనికి నీళ్ళిచ్చింది. ఆ తర్వాత దప్పికతోవున్న ఒంటెలకు కూడా కావలసినన్ని నీళ్ళు తోడిపెట్టింది. అది చాలా కష్టమైన పని, ఎందుకంటే ఒంటెలు చాలా చాలా నీళ్ళు త్రాగుతాయి.

రిబ్కా ఆ పని పూర్తి చేసిన తర్వాత, అబ్రాహాము సేవకుడు ఆమె తండ్రి పేరేమిటో చెప్పమని అడిగాడు. ఆ రాత్రికి ఆయన వారింట్లో గడపవచ్చా అని కూడా అడిగాడు. అందుకు ఆమె, ‘నా తండ్రి పేరు బెతూయేలు, మా ఇంట్లో మీరు ఉండడానికి స్థలముంది’ అని చెప్పింది. బెతూయేలు అబ్రాహాము సహోదరుడైన నాహోరు కుమారుడని అబ్రాహాము సేవకునికి తెలుసు. కాబట్టి ఆయన మోకాళ్ళూని తనను అబ్రాహాము బంధువుల దగ్గరకు నడిపించినందుకు యెహోవాకు కృతజ్ఞతలు తెలిపాడు.

అబ్రాహాము సేవకుడు ఆ రాత్రే బెతూయేలుతో, రిబ్కా సహోదరుడైన లాబానుతో తాను వచ్చిన పనేమిటో తెలియజేశాడు. రిబ్కా అతనితో వెళ్ళి ఇస్సాకును పెళ్ళి చేసుకోవడానికి వాళ్ళిద్దరూ అంగీకరించారు. వాళ్ళు రిబ్కాను అడిగినప్పుడు ఆమె ఏమి చెప్పింది? వెళ్ళడం తనకు ‘ఇష్టమే’ అని చెప్పింది. ఆ మరుసటి రోజే వాళ్ళు ఒంటెలెక్కి తిరిగి కనానుకు సుదూర ప్రయాణాన్ని ప్రారంభించారు.

వాళ్ళు అక్కడికి చేరుకునేటప్పటికి సాయంకాలమయ్యింది. రిబ్కా పొలాలలో నడుస్తున్న ఒక వ్యక్తిని చూసింది. ఆయనే ఇస్సాకు. ఆయన రిబ్కాను చూసి ఎంతో ఆనందించాడు. ఆయన తల్లి శారా చనిపోయి అప్పటికి కేవలం మూడు సంవత్సరాలే గడిచాయి కాబట్టి ఇస్సాకుకు ఇంకా దుఃఖం తీరలేదు. అయితే ఇస్సాకు రిబ్కాను ఎంతో ప్రేమించడం ప్రారంభించి, తిరిగి సంతోషభరితుడయ్యాడు.