కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

20వ కథ

దీనా కష్టాల్లో చిక్కుకోవడం

దీనా కష్టాల్లో చిక్కుకోవడం

దీనా ఎవరిని కలవడానికి వెళ్తోందో గమనించారా? కనాను దేశంలో నివసించే కొంతమంది అమ్మాయిలను కలవడానికి వెళ్తోంది. ఆమె తండ్రి యాకోబు దానిని ఇష్టపడతాడా? ఈ ప్రశ్నకు సమాధానం కోసం, అబ్రాహాము ఇస్సాకులు కనాను స్త్రీలను ఎలా దృష్టించారో గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించండి.

అబ్రాహాము తన కుమారుడైన ఇస్సాకు కనాను అమ్మాయిని పెళ్ళి చేసుకోవడానికి ఇష్టపడ్డాడా? లేదు, ఆయన ఇష్టపడలేదు. ఇస్సాకు, రిబ్కా తమ కుమారుడైన యాకోబు కనాను అమ్మాయిని చేసుకోవడానికి ఇష్టపడ్డారా? లేదు, వాళ్ళు కూడా ఇష్టపడలేదు. ఎందుకో తెలుసా?

ఎందుకంటే కనానులోని ప్రజలు అబద్ధ దేవుళ్ళను ఆరాధించేవారు. వాళ్ళు భర్తలుగా, భార్యలుగా ఉండడానికి, సన్నిహిత స్నేహితులుగా ఉండడానికి తగినవాళ్ళు కాదు. కాబట్టి తన కుమార్తె కనాను అమ్మాయిలతో స్నేహం చేయడాన్ని యాకోబు ఇష్టపడడని మనకు ఖచ్చితంగా తెలుసు.

నిజంగానే దీనా కష్టాల్లో చిక్కుకుంది. ఈ చిత్రంలో దీనావైపు చూస్తున్న కనాను వ్యక్తిని చూశారా? అతని పేరు షెకెము. ఒకరోజు దీనా ఆ అమ్మాయిలను చూడడానికి వెళ్ళినప్పుడు షెకెము ఆమెను బలవంతంచేసి ఆమెతో శయనించాడు. అది తప్పు, ఎందుకంటే పెళ్ళైన స్త్రీ పురుషులు మాత్రమే అలా కలిసి శయనించాలి. దీనా విషయంలో షెకెము చేసిన ఆ చెడ్డపని మరెక్కువ కష్టాలకు దారి తీసింది.

దీనా సహోదరులు జరిగిన సంగతిని విన్నప్పుడు, వాళ్ళకు చాలా కోపం వచ్చింది. వాళ్ళలో షిమ్యోను, లేవి అనే ఇద్దరు విపరీతమైన కోపంతో తమ కత్తులను తీసుకొని పట్టణంపై అకస్మాత్తుగా దాడి చేశారు. వాళ్ళూ వాళ్ళ సహోదరులు షెకెమునూ ఇతర పురుషులందరినీ చంపేశారు. తన కుమారులు అలా చేసినందుకు యాకోబుకు చాలా కోపం వచ్చింది.

ఈ కష్టమంతా ఎలా మొదలైంది? దీనా దేవుని నియమాలను పాటించని ప్రజలతో సహవాసం చేయడం మూలంగానే ఇదంతా జరిగింది. మనం అలాంటి వాళ్ళతో స్నేహం చేయడానికి ఇష్టపడం, ఇష్టపడతామా?