కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

21వ కథ

యోసేపు సహోదరులు ఆయనను ద్వేషించడం

యోసేపు సహోదరులు ఆయనను ద్వేషించడం

చిత్రంలోని అబ్బాయి ఎంత బాధతో నిరాశతో ఉన్నాడో చూడండి. ఆయన యోసేపు. ఆయన సహోదరులు ఆయన్ని ఐగుప్తుకు వెళ్తున్న మనుష్యులకు అమ్మేశారు. యోసేపు అక్కడ దాసుడవుతాడు. ఆయన సహోదరులు ఎందుకు ఆ చెడ్డ పని చేశారు? ఎందుకంటే వాళ్ళు యోసేపుమీద అసూయపడ్డారు.

వాళ్ళ తండ్రియైన యాకోబు యోసేపును ఎంతో గాఢంగా ప్రేమించాడు. ఆయన యోసేపు కోసం ఒక అందమైన పొడవాటి అంగీని కుట్టించి తన ఆప్యాయతను చూపించాడు. యాకోబు యోసేపును అంత ఎక్కువగా ప్రేమించడం చూసి యోసేపు 10 మంది అన్నలు ఆయనపై అసూయ పెంచుకొని ద్వేషించడం మొదలుపెట్టారు. అయితే వాళ్ళు ఆయనను ద్వేషించడానికి మరో కారణం కూడా ఉంది.

యోసేపుకు రెండు కలలొచ్చాయి. యోసేపుకు వచ్చిన ఆ రెండు కలల్లోనూ ఆయన సహోదరులు ఆయనకు వంగి నమస్కారం చేశారు. ఆ కలలను యోసేపు వాళ్ళకు చెప్పినప్పుడు వాళ్ళ ద్వేషం ఇంకా ఎక్కువయ్యింది.

ఒకరోజు యోసేపు అన్నలు తమ తండ్రి గొర్రెల మందలను కాస్తున్నప్పుడు, వారి యోగక్షేమాలు కనుక్కొని రమ్మని యాకోబు యోసేపుతో చెప్పాడు. యోసేపు రావడాన్ని చూసినప్పుడు ఆయన సహోదరులలో కొంతమంది ‘అతనిని చంపుదాం’ అన్నారు. అయితే అందరికంటే పెద్దవాడైన రూబేను, ‘వద్దు అలా చేయవద్దు!’ అన్నాడు. అప్పుడు వాళ్ళు ఆయనను పట్టుకొని నీళ్ళులేని ఒక గుంటలో పడవేసి, ఆయనను ఏమి చెయ్యాలో నిర్ణయించడానికి కూర్చున్నారు.

ఇంతలో ఆ మార్గాన కొంతమంది ఇష్మాయేలీయులు వచ్చారు. అప్పుడు యూదా తన సహోదరులతో, ‘ఇతనిని ఇష్మాయేలీయులకు అమ్మేద్దాం పదండి’ అన్నాడు. వాళ్ళు అలాగే చేశారు. వాళ్ళు యోసేపును 20 తులముల వెండికి అమ్మేశారు. అది ఎంతటి నీచమైన, దయలేని పనో కదా!

ఆ తర్వాత వాళ్ళు తమ తండ్రికి ఏమి చెప్పారు? వాళ్ళు ఒక మేకను చంపి దాని రక్తంలో యోసేపు అందమైన అంగీని మళ్ళీ మళ్ళీ ముంచారు. ఆ తర్వాత ఆ అంగీని ఇంటికి తీసుకెళ్ళి తమ తండ్రికి చూపించి, ‘ఈ అంగీ మాకు కనిపించింది, ఇది యోసేపుదేమో చూడండి’ అన్నారు.

ఆ అంగీ యోసేపుదేనని యాకోబు గుర్తించాడు. ‘యోసేపును అడవి మృగం చంపివుంటుంది’ అని ఆయన ఏడ్చాడు. యోసేపు సహోదరులు కూడా తమ తండ్రి అలా అనుకోవాలనే పథకం వేశారు. యాకోబు ఎంతో దుఃఖించాడు. ఆయన చాలా రోజులు ఏడ్చాడు. కానీ యోసేపు చనిపోలేదు. ఆయనను తీసుకొని వెళ్ళిన చోట ఆయనకేమి జరిగిందో మనం చూద్దాం.