కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

23వ కథ

ఫరో కలలు

ఫరో కలలు

రెండు సంవత్సరాలు గడిచాయి, యోసేపు అప్పటికి చెరసాలలోనే ఉన్నాడు. పానదాయకుడు ఆయనను జ్ఞాపకం చేసుకోలేదు. అలా ఉండగా ఒక రాత్రి ఫరోకు రెండు ప్రత్యేకమైన కలలొచ్చాయి, కానీ వాటి భావమేమిటో ఆయనకు అర్థం కాలేదు. ఆయన నిద్రపోవడం మీకు కనిపిస్తోందా? ఆ మరుసటి రోజే ఫరో జ్ఞానులను పిలిపించి తనకు వచ్చిన కలల గురించి చెప్పాడు. కానీ వాళ్ళు ఆయన కలల భావాన్ని చెప్పలేకపోయారు.

చివరకు, పానదాయకుడు యోసేపును గుర్తు చేసుకున్నాడు. ‘నేను చెరసాలలో ఉన్నప్పుడు అక్కడ కలల భావం చెప్పగల ఒక వ్యక్తి ఉండేవాడు’ అని అతను ఫరోకు చెప్పాడు. ఫరో వెంటనే యోసేపును చెరసాలనుండి బయటకు రప్పించాడు.

ఫరో యోసేపుకు తన కలల గురించి ఇలా చెప్పాడు: ‘నేను బలిసిన, అందమైన ఏడు ఆవులను చూశాను. ఆ తర్వాత చాలా బలహీనమైన, చిక్కిపోయిన మరో ఏడు ఆవులను చూశాను. బలహీనమైన ఆవులు బలిసిన ఆవులను తినేశాయి.

‘నాకు వచ్చిన రెండవ కలలో ఏడు మంచి పుష్టిగల వెన్నులు ఒక దంటున మొలిచాయి. ఆ తర్వాత ఏడు పీలవెన్నులు మొలిచాయి. పీలవెన్నులు ఏడు మంచి వెన్నులను మ్రింగేశాయి.’

యోసేపు ఫరోతో, ‘ఆ రెండు కలల భావం ఒక్కటే. ఏడు బలిసిన ఆవులు, ఏడు పుష్టిగల వెన్నులు ఏడు సంవత్సరాలని అర్థం. ఏడు బలహీనమైన ఆవులు, ఏడు పీలవెన్నులు అంటే మరో ఏడు సంవత్సరాలని అర్థం. ఐగుప్తులో సమృద్ధిగా పంట పండే ఏడు సంవత్సరాలు వస్తాయి. ఆ తర్వాత చాలా తక్కువ పంట పండే ఏడు సంవత్సరాలు వస్తాయి’ అని అన్నాడు.

అందువల్ల యోసేపు ఫరోతో ఇలా చెప్పాడు: ‘తెలివైన ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకొని రాబోయే ఏడు మంచి సంవత్సరాలలో ఆహారాన్ని సమకూర్చండి. ఆ తర్వాత పంట చాలా తక్కువగా పండే ఏడు సంవత్సరాలలో ప్రజలు కరవుతో బాధపడకుండా ఉంటారు.’

ఫరోకు ఆ ఆలోచన బాగా నచ్చింది. ఆహారాన్ని సమకూర్చి నిల్వ చేసేందుకు ఆయన యోసేపునే ఎన్నుకున్నాడు. ఫరో తర్వాత యోసేపే ఐగుప్తులో ప్రముఖ వ్యక్తి అయ్యాడు.

ఎనిమిది సంవత్సరాల తర్వాత కరవు కాలంలో కొంతమంది వ్యక్తులు ఐగుప్తుకు రావడాన్ని యోసేపు చూశాడు. వాళ్ళెవరో తెలుసా? వాళ్ళు ఆయన 10 మంది అన్నలే! వాళ్ళు నివసిస్తున్న కనానులో ఆహార కొరత ఏర్పడినందువల్ల వాళ్ళ తండ్రి యాకోబు వాళ్ళను ఐగుప్తుకు పంపాడు. యోసేపు తన సహోదరులను గుర్తుపట్టాడు గాని, వాళ్ళు ఆయనను గుర్తుపట్టలేదు. ఎందుకో తెలుసా? ఎందుకంటే యోసేపు పెద్దవాడయ్యాడు, అంతేగాక ఆయన వేరే రకమైన వస్త్రాలు ధరించాడు.

యోసేపు తన చిన్నతనంలో తన సహోదరులు వచ్చి తనకు వంగి నమస్కారం చేసినట్లు వచ్చిన కలను గుర్తు చేసుకున్నాడు. దాని గురించి మనం చదివినట్లు మీకు గుర్తుందా? దేవుడే ఒక మంచి కారణాన్నిబట్టి తనను ఐగుప్తుకు పంపాడని యోసేపు అప్పుడు అర్థం చేసుకోగలిగాడు. యోసేపు ఆ తర్వాత ఏమి చేశాడని మీరనుకుంటున్నారు? మనం చూద్దాం.