కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

29వ కథ

మోషే పారిపోవడానికిగల కారణం

మోషే పారిపోవడానికిగల కారణం

ఐగుప్తు నుండి పారిపోతున్న మోషేను చూడండి. ఆయనను తరుముతున్న మనుష్యులు కనిపిస్తున్నారా? వాళ్ళు మోషేను ఎందుకు చంపాలనుకుంటున్నారో మీకు తెలుసా? కారణమేమిటో మనం చూద్దాం.

మోషే ఐగుప్తు పాలకుడైన ఫరో గృహంలో పెరిగాడు. ఆయన ఎంతో జ్ఞానవంతుడు, గొప్పవాడు అయ్యాడు. అయితే తాను ఐగుప్తీయుడను కానని, తన అసలు తలిదండ్రులు దాసులుగా ఉన్న ఇశ్రాయేలీయులని మోషేకు తెలుసు.

మోషేకు 40 సంవత్సరాలున్నప్పుడు ఒకరోజు ఆయన తన ప్రజలు ఎలా ఉన్నారో చూడ్డానికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. ఐగుప్తీయులు వాళ్ళతో దారుణంగా వ్యవహరించేవారు. ఒక ఐగుప్తీయుడు ఇశ్రాయేలీయుడైన దాసుణ్ణి కొట్టడం ఆయన చూశాడు. మోషే అటు ఇటు చూసి ఎవరూ లేకపోవడంతో ఆ ఐగుప్తీయుని కొట్టినప్పుడు అతను చనిపోయాడు. మోషే అతని శరీరాన్ని ఇసుకలో దాచిపెట్టాడు.

మోషే ఆ మరుసటి రోజు మళ్ళీ తన ప్రజలను చూడ్డానికి వెళ్ళాడు. వాళ్ళు దాసులుగా ఉండకుండా తాను వాళ్ళకు సహాయం చేయగలనని ఆయన అనుకున్నాడు. కానీ ఇద్దరు ఇశ్రాయేలీయులు కొట్లాడుకోవడాన్ని చూసినప్పుడు మోషే వారిలో తప్పు ఉన్న వ్యక్తితో, ‘నువ్వు నీ సహోదరుణ్ణి ఎందుకు కొడుతున్నావు?’ అని అడిగాడు.

అందుకు ఆ ఇశ్రాయేలీయుడు, ‘నిన్ను మా మీద అధికారిగా తీర్పరిగా ఎవరు నియమించారు? ఆ ఐగుప్తీయుని చంపినట్లే నన్ను కూడా చంపుతావా?’ అని అడిగాడు.

దానితో మోషేకు భయం వేసింది. తాను ఐగుప్తీయుడిని చంపిన విషయం ప్రజలకు తెలిసిపోయిందని ఆయనకు అర్థమైంది. ఫరో కూడా ఆ సంగతిని విని మోషేను చంపడానికి మనుష్యులను పంపించాడు. అందుకే మోషే ఐగుప్తునుంచి పారిపోవలసి వచ్చింది.

మోషే ఐగుప్తును విడిచిపెట్టి ఎంతో దూరంలో ఉన్న మిద్యానుకు వెళ్ళాడు. అక్కడ యిత్రో కుటుంబాన్ని కలుసుకొని ఆయన కుమార్తెలలో ఒకరైన సిప్పోరాను పెళ్ళి చేసుకున్నాడు. మోషే గొర్రెల కాపరియై యిత్రో గొర్రెలను కాసేవాడు. ఆయన 40 సంవత్సరాలు మిద్యానులో నివసించాడు. ఆయనకు 80 సంవత్సరాలు వచ్చాయి. అప్పుడు ఒకరోజు మోషే యిత్రో గొర్రెలను కాస్తున్నప్పుడు ఒక వింత సంఘటన జరిగింది, అది ఆయన జీవితాన్నే మార్చేసింది. పేజీ తిప్పి ఆ వింత సంఘటన ఏమిటో చూద్దాం.