కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

40వ కథ

మోషే బండను కొట్టడం

మోషే బండను కొట్టడం

సంవత్సరాలు గడిచిపోయాయి—10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 39 సంవత్సరాలు! ఇశ్రాయేలీయులు అప్పటికి ఇంకా అరణ్యంలోనే ఉన్నారు. కానీ ఆ సంవత్సరాలన్నింటిలో యెహోవా తన ప్రజలను శ్రద్ధగా చూసుకున్నాడు. ఆయన వారిని మన్నాతో పోషించాడు. పగలు మేఘ స్తంభం ద్వారా, రాత్రి అగ్ని స్తంభం ద్వారా వాళ్ళను నడిపించాడు. ఆ సంవత్సరాలన్నింటిలో వాళ్ళ బట్టలు చినిగిపోలేదు, వాళ్ళ చెప్పులు అరిగిపోలేదు.

ఇశ్రాయేలీయులు ఐగుప్తును విడిచి వచ్చి అప్పటికి 39 సంవత్సరాలు ఒక నెలా గడిచాయి. వాళ్ళు మళ్ళీ కాదేషుకు చేరుకున్నారు. దాదాపు 40 సంవత్సరాల క్రితం వాళ్ళు అక్కడి నుండే కనాను దేశాన్ని వేగు చూడడానికి 12 మంది వేగులవాళ్ళను పంపించారు. మోషే అక్క మిర్యాము కాదేషులో మరణించింది. అక్కడ మళ్ళీ మొదటిలాగే సమస్య మొదలయ్యింది.

ప్రజలకు త్రాగటానికి నీళ్ళు దొరకలేదు. కాబట్టి వాళ్ళు ‘మేము అక్కడే చనిపోయివుంటే బాగుండేది. మమ్మల్ని ఐగుప్తునుండి బయటకు నడిపించి ఏమీ పెరగని ఈ ఘోరమైన ప్రాంతానికి ఎందుకు తీసుకువచ్చావు? ఇక్కడ ధాన్యం లేదు, అంజూర పండ్లు లేవు, ద్రాక్షలు లేవు, దానిమ్మలు లేవు. త్రాగటానికి నీళ్ళు కూడా లేవు’ అని మోషేకు ఫిర్యాదు చేశారు.

మోషే అహరోనులు ప్రార్థించడానికి గుడారం దగ్గరకు వెళ్ళినప్పుడు యెహోవా మోషేతో, ‘ప్రజలందరిని పోగుచెయ్యి. వాళ్ళందరి ముందు అక్కడున్న ఆ బండతో మాట్లాడు. దానిలోనుండి ప్రజలకు, వాళ్ళ పశువులన్నింటికి చాలినన్ని నీళ్ళు వస్తాయి’ అని చెప్పాడు.

మోషే ప్రజలందరిని పోగుచేసి వాళ్ళతో, ‘దేవునిపై నమ్మకంలేని ప్రజలారా, వినండి! నేను, అహరోను మీ కోసం ఈ బండనుండి నీళ్ళు రప్పించాలా?’ అన్నాడు. తర్వాత మోషే రెండుసార్లు బండను కర్రతో కొట్టినప్పుడు ఆ బండనుండి గొప్ప నీటి ప్రవాహం వచ్చింది. ప్రజలందరూ అలాగే పశువులూ త్రాగడానికి చాలినన్ని నీళ్ళు దానిలోనుండి వచ్చాయి.

కానీ యెహోవాకు మోషే అహరోనులపై కోపం వచ్చింది. ఎందుకో తెలుసా? ఎందుకంటే మోషే అహరోనులు తామే ఆ బండనుండి నీళ్ళను రప్పించబోతున్నామని చెప్పారు. నిజానికి ఆ బండనుండి నీళ్ళు రప్పించింది యెహోవాయే. ఆ విషయంలో మోషే అహరోనులు నిజం చెప్పలేదు కాబట్టి యెహోవా, ‘నేను వాళ్ళను శిక్షిస్తాను’ అని అన్నాడు. ‘మీరు నా ప్రజలను కనానుకు నడిపించరు’ అని ఆయన చెప్పాడు.

త్వరలోనే ఇశ్రాయేలీయులు కాదేషునుండి బయలుదేరారు. కొంతకాలానికి హోరు కొండకు చేరుకున్నారు. అక్కడే కొండ శిఖరాన అహరోను మరణించాడు. ఆయన మరణించేటప్పటికి ఆయన వయస్సు 123 సంవత్సరాలు. ఇశ్రాయేలీయులు ఎంతో దుఃఖించారు, వాళ్ళంతా అహరోను కోసం 30 రోజులు దుఃఖించారు. ఆయన కుమారుడు ఎలియాజరు ఇశ్రాయేలు జనాంగానికి తర్వాతి ప్రధాన యాజకుడు అయ్యాడు.