కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

43వ కథ

యెహోషువ నాయకుడు కావడం

యెహోషువ నాయకుడు కావడం

ఇశ్రాయేలీయులతోపాటు కనానుకు వెళ్ళాలని మోషే కోరుకున్నాడు. ‘యెహోవా, నన్ను యొర్దాను నదిని దాటనివ్వు. ఆ మంచి దేశాన్ని చూడనివ్వు’ అని ఆయన అడిగాడు. అయితే యెహోవా, ‘ఇక చాలు! ఆ సంగతి గురించి మళ్ళీ మాట్లాడవద్దు!’ అని అన్నాడు. యెహోవా ఎందుకలా అన్నాడో తెలుసా?

దానికి కారణం మోషే బండను కొట్టినప్పుడు జరిగిన సంగతే. ఆయన, అహరోను యెహోవాను ఘనపరచలేదు అని గుర్తు చేసుకోండి. యెహోవాయే ఆ బండనుండి నీళ్ళు రప్పించాడని వాళ్ళు చెప్పలేదు. అందుకే వాళ్ళు కనానులోకి ప్రవేశించరని యెహోవా చెప్పాడు.

అహరోను చనిపోయిన కొన్ని నెలల తర్వాత యెహోవా మోషేతో, ‘నువ్వు యెహోషువను తీసుకువెళ్ళి యాజకుడైన ఎలియాజరు ఎదుట, ప్రజల ఎదుట నిలబెట్టు. అక్కడ అందరి ముందు యెహోషువ క్రొత్త నాయకుడని చెప్పు’ అన్నాడు. ఇక్కడ చిత్రంలో కనిపిస్తున్నట్లు మోషే యెహోవా చెప్పినట్లే చేశాడు.

అప్పుడు యెహోవా యెహోషువతో, ‘ధైర్యంగా ఉండు, భయపడవద్దు. నేను వాగ్దానం చేసిన కనానులోకి నువ్వు ఇశ్రాయేలీయులను నడిపిస్తావు. నేను నీకు తోడుగా ఉంటాను’ అని చెప్పాడు.

తర్వాత యెహోవా మోషేను మోయాబు దేశములోని నెబో కొండపైకి ఎక్కమన్నాడు. అక్కడనుండి మోషే యొర్దాను నదికి అవతలి వైపున్న అందమైన కనాను దేశాన్ని చూడగలిగాడు. యెహోవా ఆయనతో, ‘నేను అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు సంతానానికి ఇస్తానని వాగ్దానం చేసిన దేశము ఇదే. నిన్ను దానిని చూడనిచ్చాను గాని, దానిలోకి ప్రవేశించనివ్వను’ అన్నాడు.

మోషే అక్కడే నెబో కొండపైన మరణించాడు. అప్పుడు ఆయన వయస్సు 120 సంవత్సరాలు. ఆయన అప్పటికి బలంగానే ఉండేవాడు. ఆయన చూపు మందగించలేదు. మోషే మరణించినందుకు ప్రజలు ఎంతో దుఃఖపడి ఏడ్చారు. అయితే వాళ్ళు తమ క్రొత్త నాయకునిగా యెహోషువ ఉన్నందుకు సంతోషించారు.