కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

48వ కథ

తెలివైన గిబియోనీయులు

తెలివైన గిబియోనీయులు

కనానులోని చాలా పట్టణాలు ఇశ్రాయేలీయులతో యుద్ధం చేయడానికి సిద్ధమయ్యాయి. వాళ్ళు తాము జయించగలము అనుకున్నారు. కానీ దగ్గర్లోని గిబియోను పట్టణస్థులు అలా అనుకోలేదు. దేవుడు ఇశ్రాయేలీయులకు సహాయం చేస్తున్నాడని వాళ్ళకు తెలుసు కాబట్టి వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా యుద్ధం చేయడానికి ఇష్టపడలేదు. కాబట్టి గిబియోనీయులు ఏమి చేశారో తెలుసా?

వాళ్ళు ఎక్కడో దూరప్రాంతంలో నివసించేవారిలా కనిపించాలని నిర్ణయించుకున్నారు. వాళ్ళలో కొంతమంది చాలా పాతబడిన బట్టలను, అరిగిపోయిన చెప్పులను వేసుకున్నారు. ఎంతో పాతబడిన బస్తాలను తమ గాడిదలపై వేసుకొని, తమతోపాటు కొన్ని ఎండిపోయిన సద్ది రొట్టెలను తీసుకొని వెళ్ళారు. వాళ్ళు యెహోషువ దగ్గరకు వెళ్ళి, ‘మేము మీ గొప్ప దేవుడైన యెహోవా గురించి విని ఎంతో దూరంనుండి వచ్చాము. ఆయన మీకు ఐగుప్తులో చేసిన వాటన్నింటి గురించి మేము విన్నాము. అందుచేత మా పెద్దలు ప్రయాణానికి కొంత ఆహారమును సిద్ధం చేసుకొని వెళ్ళి, “మేము మీ దాసులం. మాతో యుద్ధము చేయమని మాకు ప్రమాణం చేయండి” అని మీకు చెప్పమన్నారు. దూరప్రయాణం మూలంగా మా బట్టలు చినిగిపోయాయని, మా రొట్టెలు సద్దివై ఎండిపోయాయని మీరు చూడవచ్చు’ అని చెప్పారు.

యెహోషువ, ఇతర నాయకులు గిబియోనీయుల మాటలను నమ్మారు. కాబట్టి వాళ్ళతో యుద్ధం చేయము అని వాళ్ళకు ప్రమాణం చేశారు. కానీ మూడు రోజుల తర్వాత గిబియోనీయులు నిజానికి ఆ దగ్గర్లోనే నివసిస్తున్నారని వాళ్ళకు తెలిసింది.

‘మీరు దూరప్రాంతంనుండి వచ్చామని ఎందుకు చెప్పారు?’ అని యెహోషువ వాళ్ళను అడిగాడు.

అందుకు గిబియోనీయులు, ‘మీ దేవుడైన యెహోవా ఈ కనాను దేశమంతటిని మీకు ఇస్తానని వాగ్దానం చేశాడని మేము విన్నాము. కాబట్టి మీరు మమ్మల్ని చంపేస్తారని మేము భయపడ్డాము. అందుకే మేము అలా చెప్పాము’ అని సమాధానమిచ్చారు. అయితే ఇశ్రాయేలీయులు తమ ప్రమాణాన్ని నిలుపుకొని గిబియోనీయులను చంపలేదు. దానికి బదులు వాళ్ళు గిబియోనీయులను తమ సేవకులుగా చేసుకున్నారు.

గిబియోనీయులు ఇశ్రాయేలీయులతో సమాధానపడినందుకు యెరూషలేము రాజుకు చాలా కోపం వచ్చింది. కాబట్టి ఆయన వేరే నలుగురు రాజులను, ‘గిబియోనుతో యుద్ధం చేసేందుకు నాకు సహాయం చేయండి’ అని అడిగాడు. ఆ ఐదుగురు రాజులు కలిసి అలానే యుద్ధం చేశారు. ఇశ్రాయేలీయులతో సమాధానపడినందుకే ఆ రాజులు యుద్ధం చేయడానికి వచ్చారు కదా, మరి గిబియోనీయులు ఇశ్రాయేలుతో సమాధానపడి జ్ఞానయుక్తమైన పనే చేశారా? మనం దాని గురించి చూద్దాం.