కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

57వ కథ

దేవుడు దావీదును ఎన్నుకోవడం

దేవుడు దావీదును ఎన్నుకోవడం

ఇక్కడ ఏమి జరిగిందో మీకు కనిపిస్తోందా? ఈ యువకుడు అక్కడున్న గొర్రెపిల్లను ఎలుగుబంటి నుండి రక్షించాడు. ఆ ఎలుగుబంటి గొర్రెపిల్లను ఎత్తుకుపోయి దానిని తినబోయింది. కానీ ఆ యువకుడు దాని వెంట పరుగెత్తుకొని వెళ్ళి గొర్రెపిల్లను ఆ ఎలుగుబంటి నోటినుండి విడిపించాడు. ఆ ఎలుగుబంటి అతనిపైకి లేచినప్పుడు ఆ యువకుడు దానిని పట్టుకొని చంపేశాడు! మరొకసారి అతను ఒక గొర్రెను సింహం బారినుండి తప్పించాడు. అతనెంతో ధైర్యవంతుడైన యువకుడు కాదా? అతను ఎవరో మీకు తెలుసా?

అతను దావీదు. అతను బేత్లెహేము పట్టణంలో నివసించేవాడు. అతని తాత, రూతు బోయజులకు పుట్టిన ఓబేదు. వాళ్ళు మీకు గుర్తున్నారా? దావీదు తండ్రి యెష్షయి. దావీదు తన తండ్రి గొర్రెలను కాస్తూ ఉండేవాడు. యెహోవా సౌలును రాజుగా ఎంపిక చేసుకొన్న తర్వాత 10 సంవత్సరాలకు దావీదు జన్మించాడు.

కొంతకాలమైన తర్వాత యెహోవా సమూయేలుతో, ‘నీవు కొంత ప్రత్యేకమైన తైలాన్ని తీసుకొని బేత్లెహేములోని యెష్షయి ఇంటికి వెళ్ళు. అతని కుమారులలో ఒకరిని నేను రాజుగా ఎన్నుకున్నాను’ అని చెప్పాడు. సమూయేలు యెష్షయి పెద్ద కుమారుడైన ఏలీయాబును చూసిన వెంటనే తనలో తాను, ‘యెహోవా ఎన్నుకున్న వ్యక్తి ఇతనే అయ్యుంటాడు’ అని అనుకున్నాడు. కానీ యెహోవా ఆయనతో, ‘అతను ఎంత ఎత్తుగా ఉన్నాడో, ఎంత అందంగా ఉన్నాడో చూడవద్దు. అతనిని నేను రాజుగా ఎన్నుకోలేదు’ అని చెప్పాడు.

అప్పుడు యెష్షయి తన కుమారుడైన అబీనాదాబును సమూయేలు వద్దకు పిలిపించాడు. అయితే సమూయేలు, ‘ఇతను కూడా యెహోవా ఎన్నుకున్న వ్యక్తి కాదు’ అని చెప్పాడు. ఆ తర్వాత యెష్షయి తన కుమారుడైన షమ్మాను తీసుకొచ్చాడు. ‘ఇతన్ని కూడా యెహోవా ఎన్నుకోలేదు’ అని సమూయేలు చెప్పాడు. యెష్షయి తన కుమారులలో ఏడుగురిని సమూయేలు వద్దకు తీసుకొని వచ్చినా వాళ్ళలో ఎవరినీ యెహోవా ఎన్నుకోలేదు. అప్పుడు సమూయేలు ‘నీ కుమారులంతా వీళ్లేనా?’ అని అడిగాడు.

‘వీళ్ళందరికంటే చిన్నవాడు ఉన్నాడు. కానీ అతను గొర్రెలు కాస్తున్నాడు’ అని యెష్షయి చెప్పాడు. దావీదును పిలిపించినప్పుడు సమూయేలుకు అతను ఎంతో అందమైన యువకుడిగా కనిపించాడు. అప్పుడు యెహోవా ‘నేను ఎన్నుకున్న వ్యక్తి ఇతనే. ఇతనిపై తైలం పొయ్యి’ అని చెప్పాడు. సమూయేలు అలాగే చేశాడు. అయితే దావీదు ఇశ్రాయేలీయులందరిపై రాజయ్యే సమయం ఇంకా రాలేదు.