కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

60వ కథ

అబీగయీలు, దావీదు

అబీగయీలు, దావీదు

దావీదును కలుసుకోవడానికి వస్తున్న ఆ అందమైన స్త్రీ ఎవరో మీకు తెలుసా? ఆమె పేరు అబీగయీలు. ఆమె వివేచనగల స్త్రీ, దావీదు ఒక చెడు పని చేయకుండా ఆమె ఆపింది. అయితే దాని గురించి తెలుసుకునే ముందు దావీదుకు ఏమి జరిగిందో చూద్దాం.

దావీదు సౌలు దగ్గరనుండి పారిపోయిన తర్వాత ఒక గుహలో దాక్కున్నాడు. ఆయన సహోదరులు, ఇతర కుటుంబ సభ్యులంతా ఆయన దగ్గరకు వెళ్ళారు. మొత్తం 400 మంది పురుషులు ఆయన దగ్గరకు వచ్చారు, దావీదు వారికి నాయకుడయ్యాడు. దావీదు మోయాబు రాజు దగ్గరకు వెళ్ళి, ‘నాకేమి జరుగుతుందో తెలిసేంతవరకు దయచేసి నా తల్లిని, నా తండ్రిని మీ దగ్గర ఉండనివ్వండి’ అని కోరాడు. తర్వాత దావీదు, ఆయన మనుష్యులు కొండలలో దాక్కోవడానికి వెళ్ళారు.

అలా జరిగిన తర్వాతనే దావీదు అబీగయీలును కలిశాడు. ఆమె భర్త నాబాలు చాలా ఆస్తిపరుడైన భూస్వామి. ఆయనకు 3,000 గొర్రెలు, 1,000 మేకలు ఉన్నాయి. నాబాలు చాలా మొరటువాడు. కానీ ఆయన భార్య అబీగయీలు చాలా అందమైనది. అంతేగాక ఆమెకు సరైనది ఎలా చెయ్యాలో తెలుసు. ఒకసారి ఆమె తన కుటుంబాన్ని రక్షించుకుంది. అదెలాగో చూద్దాం.

దావీదు, ఆయన మనుష్యులు నాబాలుపట్ల ఎంతో దయగా ప్రవర్తించారు. వాళ్ళు ఆయన గొర్రెలను రక్షించేందుకు సహాయపడ్డారు. కాబట్టి ఒకరోజు దావీదు నాబాలును సహాయం అడగడానికి తన మనుష్యులలో కొంతమందిని అతని దగ్గరకు పంపించాడు. నాబాలు, ఆయన మనుష్యులు గొర్రె బొచ్చు కత్తిరిస్తున్నప్పుడు వాళ్ళ దగ్గరకు దావీదు మనుష్యులు వెళ్ళారు. ఆ రోజు విందు జరుగుతుండడంవల్ల నాబాలు దగ్గర తినడానికి చాలా మంచి పదార్థాలు ఉన్నాయి. దావీదు మనుష్యులు నాబాలుతో, ‘మేము నీపట్ల దయగా ప్రవర్తించాము. మేము నీ గొర్రెలను దొంగిలించలేదు, కానీ వాటిని సంరక్షించడానికి సహాయం చేశాము. కాబట్టి దయచేసి ఇప్పుడు మాకు కొంత ఆహారం ఇవ్వు’ అని అడిగారు.

అప్పుడు నాబాలు వాళ్ళతో ‘మీలాంటి మనుష్యులకు నేను ఆహారం ఇవ్వను’ అని అన్నాడు. అతడు చాలా నీచంగా మాట్లాడి దావీదు గురించి చెడు విషయాలు అన్నాడు. ఆ మనుష్యులు తిరిగి వెళ్ళి జరిగిన దాని గురించి దావీదుకు చెప్పినప్పుడు, ఆయనకు చాలా కోపం వచ్చింది. ఆయన తన మనుష్యులకు ‘కత్తులు ధరించండి!’ అని ఆజ్ఞాపించాడు. నాబాలును, అతని మనుష్యులను చంపడానికి వాళ్ళు బయలుదేరారు.

నాబాలు పలికిన కఠినమైన మాటలను విన్న నాబాలు మనుష్యులలో ఒకడు, జరిగిన దానిని అబీగయీలుకు చెప్పాడు. వెంటనే అబీగయీలు కొంత ఆహారాన్ని సిద్ధం చేసింది. ఆమె దానిని కొన్ని గాడిదలపై వేసుకొని బయలుదేరింది. ఆమె దావీదును కలిసినప్పుడు తన గాడిదపైనుండి దిగి, ఆయనకు నమస్కరించి, ‘అయ్యా, దయచేసి నా భర్త నాబాలు మాటలను పట్టించుకోకండి. అతడు బుద్ధిహీనుడు, అతడు బుద్ధిహీనమైన పనులనే చేస్తాడు. ఇదిగో మీకు కానుక తెచ్చాను. దయచేసి, దీన్ని తీసుకొని జరిగినదానికి మమ్మల్ని క్షమించండి’ అంది.

అందుకు దావీదు ‘నీవు బుద్ధిగలదానవు. నాబాలు నీచంగా ప్రవర్తించినందుకు అతనికి బుద్ధి చెప్పి అతనిని చంపకుండా నన్ను ఆపావు. నీవు సమాధానముతో ఇంటికి వెళ్ళు’ అని జవాబిచ్చాడు. తర్వాత నాబాలు చనిపోయినప్పుడు, అబీగయీలు దావీదు భార్యలలో ఒకరయ్యింది.