కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

61వ కథ

దావీదు రాజుగా చేయబడడం

దావీదు రాజుగా చేయబడడం

సౌలు మళ్లీ దావీదును బంధించడానికి ప్రయత్నించాడు. ఆయన తన సైనికులలో మంచివాళ్ళను 3,000 మందిని తీసుకొని దావీదును వెదకడానికి వెళ్ళాడు. దావీదుకు ఆ విషయం తెలిసినప్పుడు, సౌలు ఆయన మనుష్యులు ఆ రాత్రికి ఎక్కడ దిగారో చూడడానికి తన మనుష్యులను పంపించాడు. ఆ తర్వాత దావీదు తన మనుష్యులలో ఇద్దరిని పిలిచి, ‘మీలో ఎవరు నాతో సౌలు శిబిరం దగ్గరకు వస్తారు?’ అని అడిగాడు.

అబీషై ‘నేను వస్తాను’ అని అన్నాడు. అబీషై దావీదు సహోదరియైన సెరూయా కుమారుడు. సౌలు ఆయన మనుష్యులు నిద్రిస్తున్నప్పుడు దావీదు, అబీషై నిశ్శబ్దంగా దండులోకి ప్రవేశించారు. వాళ్ళు సౌలు ఈటెను, అతని తలగడ ప్రక్కనే ఉన్న నీటిబుడ్డిని తీసుకున్నారు. వాళ్ళను ఎవరూ చూడలేదు, వాళ్ళ శబ్దం వినలేదు, ఎందుకంటే అందరూ గాఢనిద్రలో ఉన్నారు.

ఇప్పుడు దావీదును, అబీషైను చూడండి. వాళ్ళు తప్పించుకొని సురక్షితంగా ఒక కొండమీద ఉన్నారు. దావీదు అక్కడనుండి ఇశ్రాయేలు సేనాధిపతిని ఉద్దేశిస్తూ, ‘అబ్నేరూ, రాజైన నీ యజమానుని నీవెందుకు కాపాడడం లేదు? ఇవిగో! ఆయన ఈటె, నీటిబుడ్డి ఎక్కడ ఉన్నాయో చూడు?’ అని అరిచాడు.

సౌలుకు మెలకువ వచ్చింది. ఆయన దావీదు స్వరాన్ని గుర్తుపట్టి ‘దావీదు, నువ్వేనా?’ అని అడిగాడు. సౌలు, అబ్నేరు అక్కడ క్రింద నిలబడి ఉండడం మీకు కనిపిస్తోందా?

అందుకు దావీదు సౌలుతో ‘అవును, ప్రభువా’ అని సమాధానమిచ్చి, ‘నన్ను బంధించడానికి నీవెందుకు ప్రయత్నిస్తున్నావు? నేనేమి చెడ్డ పని చేశాను? రాజా, ఇదిగో నీ ఈటె ఇక్కడుంది. నీ మనుష్యులలో ఒకరు వచ్చి దీనిని తీసుకోవచ్చు’ అని అన్నాడు.

అప్పుడు సౌలు ‘నేను తప్పు చేశాను, నేను బుద్ధిహీనంగా ప్రవర్తించాను’ అని ఒప్పుకున్నాడు. అంతటితో దావీదు తన దారిన వెళ్ళగా, సౌలు తిరిగి ఇంటికి వెళ్ళాడు. కానీ దావీదు తనలో తాను, ‘ఏదో ఒక రోజున సౌలు నన్ను చంపుతాడు. నేను ఫిలిష్తీయుల దేశములోకి తప్పించుకొని వెళ్ళాలి’ అనుకున్నాడు. ఆయన అనుకున్నట్లే చేశాడు. దావీదు ఫిలిష్తీయులను మోసం చేసి ఇప్పుడు తాను వాళ్ళవైపు ఉన్నట్లు వాళ్ళను నమ్మించగలిగాడు.

కొంతకాలం తర్వాత ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధం చేయడానికి వెళ్ళారు. యుద్ధంలో సౌలు, యోనాతానులు ఇద్దరూ చంపబడ్డారు. అది దావీదుకు ఎంతో దుఃఖాన్ని కల్గిస్తుంది. అప్పుడు ఆయన, ‘నా సహోదరుడా, యోనాతానా నాకు ఎంత మనోహరుడవై ఉంటివి. నేను నీ నిమిత్తము బహు శోకము నొందితిని!’ అనే చక్కని పాట కూర్చి పాడాడు.

ఆ తర్వాత దావీదు ఇశ్రాయేలులోని హెబ్రోను పట్టణానికి తిరిగి వెళ్ళాడు. అప్పుడు సౌలు కుమారుడైన ఇష్బోషెతును రాజుగా చెయ్యాలనుకున్న వాళ్ళకు, దావీదు రాజుగా ఉండాలని కోరుకున్న వాళ్ళకు మధ్య యుద్ధం జరిగింది. చివరకు దావీదు మనుష్యులు జయించారు. దావీదు రాజుగా చేయబడినప్పుడు ఆయన వయస్సు 30 సంవత్సరాలు. ఏడున్నర సంవత్సరాలు ఆయన హెబ్రోనులో పరిపాలించాడు. అక్కడ ఆయనకు పుట్టిన కుమారులలో కొంతమంది పేర్లు అమ్నోను, అబ్షాలోము, అదోనియా.

దావీదు, ఆయన మనుష్యులు యెరూషలేము అని పిలువబడే అందమైన పట్టణాన్ని ఆక్రమించవలసిన సమయం వచ్చింది. దావీదు సహోదరియైన సెరూయా మరో కుమారుడు యోవాబు యుద్ధంలో నాయకత్వం వహించాడు. దావీదు యోవాబును తన సేనకు ప్రధానునిగా చేసి ఆయనను సత్కరించాడు. ఆ తర్వాత దావీదు యెరూషలేము పట్టణంలో పరిపాలించడం ప్రారంభించాడు.