కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

62వ కథ

దావీదు ఇంట్లో శ్రమ

దావీదు ఇంట్లో శ్రమ

యెహోవా, దావీదు యెరూషలేములో పరిపాలించడం ప్రారంభించిన తర్వాత ఆయన సైన్యం శత్రువులపై అనేకసార్లు విజయం సాధించేలా చేశాడు. యెహోవా కనాను దేశాన్ని ఇశ్రాయేలీయులకు ఇస్తానని వాగ్దానం చేశాడు. యెహోవా సహాయంతో వాళ్ళకు వాగ్దానం చేయబడిన దేశమంతా వాళ్ళ స్వంతమయ్యింది.

దావీదు మంచి పరిపాలకుడు. ఆయన యెహోవాను ప్రేమించాడు. కాబట్టి ఆయన యెరూషలేమును ఆక్రమించిన తర్వాత చేసిన మొదటి పనులలో ఒకటి యెహోవా నిబంధన మందసమును అక్కడకు తేవడం. ఆయన దానిని ఉంచడానికి ఒక ఆలయాన్ని కట్టించాలని అనుకున్నాడు.

ఇంకొంత కాలం గడిచిన తర్వాత దావీదు ఒక చెడ్డ పని చేశాడు. మరొకరికి చెందిన దానిని తీసుకోవడం తప్పు అని దావీదుకు తెలుసు. కానీ ఒకరోజు సాయంకాలం ఆయన తన భవనం పైకప్పుమీద ఉన్నప్పుడు క్రింద ఒక అందమైన స్త్రీని చూశాడు. ఆమె పేరు బత్షెబ. ఆమె భర్త దావీదు సైనికులలో ఒకడు. అతని పేరు ఊరియా.

దావీదు బత్షెబను ఎంతగా ఇష్టపడ్డాడంటే ఆమెను తన భవనానికి తెప్పించాడు. ఆమె భర్త యుద్ధానికి వెళ్లాడు. దావీదు ఆమెతో శయనించాడు, తర్వాత ఆమె గర్భవతి అయ్యింది. దావీదు ఎంతో చింతపడి, ఊరియా చనిపోయేటట్లు అతనిని యుద్ధంలో ముందుంచమని తన సేనాధిపతియైన యోవాబుకు కబురు పంపించాడు. ఊరియా చనిపోయినప్పుడు, దావీదు బత్షెబను పెళ్ళి చేసుకున్నాడు.

యెహోవాకు దావీదుపై చాలా కోపం వచ్చింది. కాబట్టి ఆయన తన సేవకుడైన నాతానును దావీదు పాపాల గురించి ఆయనకు తెలియజేయడానికి పంపించాడు. నాతాను దావీదుతో మాట్లాడటాన్ని మీరిక్కడ చూడవచ్చు. దావీదు తాను చేసిన పనికి చాలా బాధపడ్డాడు, అందువల్ల యెహోవా ఆయనకు మరణశిక్ష వేయలేదు. కానీ యెహోవా దావీదుతో, ‘నీవు ఈ చెడ్డ పనులు చేసినందుకు నీ ఇంట్లో చాలా శ్రమ కలుగుతుంది’ అని చెప్పాడు. దావీదుకు ఎంతటి శ్రమ కలిగిందో!

మొదట బత్షెబ కుమారుడు చనిపోయాడు. తర్వాత దావీదు మొదటి కుమారుడైన అమ్నోను తన చెల్లెలైన తామారును ఒంటరిగా పిలిపించుకొని ఆమెతో బలవంతంగా శయనించాడు. ఆ విషయం తెలుసుకున్న దావీదు కుమారుడైన అబ్షాలోము చాలా కోపంతో అమ్నోనును చంపేశాడు. తర్వాత అబ్షాలోము చాలామంది ప్రజల మద్దతును పొంది, తనను తాను రాజుగా చేసుకున్నాడు. చివరకు దావీదు అబ్షాలోముపై చేసిన యుద్ధంలో విజయం సాధించాడు, ఆ యుద్ధంలో అబ్షాలోము చంపబడ్డాడు. దావీదు నిజంగానే ఎంతో శ్రమ అనుభవించాడు.

ఇదంతా జరుగుతుండగా, బత్షెబకు సొలొమోను అనే కుమారుడు పుట్టాడు. దావీదు ముసలివాడై రోగగ్రస్తుడైనప్పుడు, ఆయన కుమారుడు అదోనియా తనను తాను రాజుగా చేసుకోవడానికి ప్రయత్నించాడు. అప్పుడు దావీదు తన తర్వాత సొలొమోను రాజవుతాడు అని చూపించడానికి సాదోకు అనే యాజకుని ద్వారా సొలొమోను తలపై తైలాన్ని పోయించాడు. ఆ తర్వాత కొద్దికాలానికే 70 ఏండ్ల వయస్సులో దావీదు మరణించాడు. ఆయన 40 సంవత్సరాలు పరిపాలించాడు, ఆయన తర్వాత సొలొమోను ఇశ్రాయేలు రాజయ్యాడు.