కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

67వ కథ

యెహోషాపాతు యెహోవాపై నమ్మకం ఉంచడం

యెహోషాపాతు యెహోవాపై నమ్మకం ఉంచడం

ఈ మనుష్యులు ఎవరో, వాళ్లేమి చేస్తున్నారో మీకు తెలుసా? వాళ్ళు యుద్ధానికి వెళ్తున్నారు. వాళ్ళ ముందున్న మనుష్యులు పాడుతున్నారు. అయితే, ‘పాటలు పాడుతున్న వ్యక్తుల దగ్గర యుద్ధం చేయడానికి కత్తులుగాని, ఈటెలుగాని ఎందుకు లేవు?’ అని మీరు అడగవచ్చు. ఎందుకులేవో మనం చూద్దాం.

యెహోషాపాతు, ఇశ్రాయేలీయుల రెండు గోత్రాల రాజ్యానికి రాజు. ఉత్తర ప్రాంతపు 10 గోత్రాల రాజ్యానికి రాజైన అహాబు, యెజెబెలు జీవించిన కాలంలోనే ఆయన జీవించాడు. అయితే యెహోషాపాతు మంచి రాజు, ఆయన తండ్రి ఆసా కూడా మంచి రాజుగా ఉండేవాడు. కాబట్టి చాలా సంవత్సరాలపాటు దక్షిణ ప్రాంతపు రెండు గోత్రాల రాజ్యంలోని ప్రజలు మంచి జీవితాన్ని అనుభవించారు.

అయితే తర్వాత ప్రజలకు భయము కలిగించే ఒక సంఘటన జరిగింది. ‘మోయాబు, అమ్మోను దేశాలనుంచి, శేయీరు అరణ్యప్రాంతము నుంచి గొప్ప సైన్యము మీపై దాడిచేయడానికి వస్తోంది’ అని కొంతమంది యెహోషాపాతుకు తెలియజేశారు. అప్పుడు చాలామంది ఇశ్రాయేలీయులు యెహోవా సహాయం కోసం వేడుకోవడానికి యెరూషలేముకు వచ్చారు. వాళ్ళు ఆలయానికి వెళ్ళినప్పుడు యెహోషాపాతు, ‘ఓ యెహోవా, మా దేవా, మాకు ఏమి చేయాలో తెలియడం లేదు. ఈ గొప్ప సైన్యముతో పోరాడేందుకు మాకు శక్తి చాలదు. నీవే మాకు సహాయం చేయాలి’ అని ప్రార్థించాడు.

యెహోవా ఆ ప్రార్థనను విని, తన సేవకులలో ఒకరితో ప్రజలకు ఇలా చెప్పించాడు: ‘యుద్ధం మీది కాదు, దేవునిది. మీరు యుద్ధం చేయనవసరం లేదు. కేవలం చూడండి, యెహోవా మిమ్మల్ని ఎలా రక్షిస్తాడో చూడండి.’

మరుసటి రోజు ఉదయం యెహోషాపాతు ప్రజలతో, ‘యెహోవాపై నమ్మకముంచండి!’ అని చెప్పాడు. తర్వాత ఆయన తన సైనికుల ముందు గాయకులను నిలబెట్టాడు, వాళ్ళు యెహోవాకు స్తుతిగీతాలు పాడుతూ ముందుకు వెళ్ళారు. యుద్ధం చేయబోయే ప్రాంతం దగ్గరకు వాళ్ళు రాగానే ఏమి జరిగిందో మీకు తెలుసా? శత్రు సైనికులు తమలో తాము యుద్ధం చేసుకునేలా యెహోవా చేశాడు. ఇశ్రాయేలీయులు వచ్చేటప్పటికి శత్రు సైనికులంతా మరణించి ఉన్నారు!

యెహోవాపై నమ్మకముంచి యెహోషాపాతు వివేకంగా ప్రవర్తించలేదా? యెహోవాపై నమ్మకముంచితే మనం కూడా వివేకులమౌతాం.