కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

75వ కథ

బబులోనులో నలుగురు యువకులు

బబులోనులో నలుగురు యువకులు

రాజైన నెబుకద్నెజరు మంచి విద్యావంతులైన ఇశ్రాయేలీయులందరినీ బబులోనుకు తీసుకువెళ్ళాడు. తరువాత ఆయన వాళ్ళలోనుండి అందరికంటే అందమైన, తెలివైన యువకులను ఎంపిక చేసుకున్నాడు. వాళ్ళలో నలుగురు యువకులను మీరు ఇక్కడ చూడవచ్చు. వాళ్ళలో ఒకరు దానియేలు, మిగిలిన ముగ్గురినీ బబులోనీయులు షద్రకు, మేషాకు, అబేద్నెగో అని పిలిచేవారు.

ఈ యువకులకు తన రాజభవనంలో సేవ చేయడానికి శిక్షణ ఇవ్వాలని నెబుకద్నెజరు అనుకున్నాడు. వాళ్ళకు మూడు సంవత్సరాలు శిక్షణ ఇచ్చిన తర్వాత, తన సమస్యలు పరిష్కరించడానికి సహాయపడేందుకు అందరికంటే తెలివైనవాళ్ళను ఎంపిక చేసుకోవాలి అని ఆయన తలంచాడు. ఆయన, శిక్షణ పొందే కాలంలో ఆ యువకులు బలంగా ఆరోగ్యంగా ఉండాలనుకున్నాడు. కాబట్టి ఆయన తాను, తన కుటుంబం భుజించే బలవర్థకమైన ఆహారమే ఆ యువకులకు కూడా ఇవ్వమని తన సేవకులకు ఆజ్ఞాపించాడు.

దానియేలును చూడండి. నెబుకద్నెజరు ముఖ్య సేవకుడైన అష్పెనజుతో ఆయన ఏమి చెబుతున్నాడో మీకు తెలుసా? రాజు భుజించే బలవర్థకమైన ఆహారం తినడం తనకు ఇష్టంలేదని ఆయన చెబుతున్నాడు. అయితే ఆ మాటలు విన్న అష్పెనజు కంగారుపడి, ‘మీరు ఏమి తినాలో, ఏమి త్రాగాలో రాజే నిర్ణయించాడు. మీరు ఇతర యువకుల్లా ఆరోగ్యంగా కనిపించకపోతే ఆయన నన్ను చంపేస్తాడు’ అన్నాడు.

కాబట్టి దానియేలు తనకు, తన ముగ్గురు స్నేహితులకు అష్పెనజు సంరక్షకునిగా నియమించిన వ్యక్తి దగ్గరకు వెళ్ళాడు. దానియేలు ఆయనతో ‘దయచేసి మమ్మల్ని 10 రోజులు పరీక్షించండి. మాకు తినడానికి కూరగాయలు, త్రాగడానికి నీళ్ళు ఇవ్వండి. తర్వాత మమ్మల్ని రాజు తినే ఆహారాన్ని భుజించే ఇతర యువకులతో పోల్చి, ఎవరు బాగా కన్పిస్తారో చూడండి’ అన్నాడు.

సంరక్షకుడు అలా చేయడానికి అంగీకరించాడు. ఆ 10 రోజులు ముగిసినప్పుడు దానియేలు, ఆయన స్నేహితులు ఇతర యువకులకంటే ఆరోగ్యంగా కన్పించారు. కాబట్టి వాళ్ళు రాజు ఇచ్చే ఆహారానికి బదులు, కూరగాయలను తినడానికి ఆయన సంరక్షకుడు అనుమతించాడు.

మూడు సంవత్సరాల తర్వాత, యువకులందరూ నెబుకద్నెజరు దగ్గరకు తీసుకెళ్ళబడ్డారు. వాళ్ళందరితో మాట్లాడిన తర్వాత దానియేలు, ఆయన ముగ్గురు స్నేహితులు మిగతా అందరికంటే తెలివైనవాళ్ళని రాజు తెలుసుకున్నాడు. కాబట్టి వాళ్ళను రాజభవనంలో సహాయం చేసేందుకు ఉంచుకున్నాడు. దానియేలు, షద్రకు, మేషాకు, అబేద్నెగోలను రాజు ఎప్పుడు ప్రశ్నలు అడిగినా, లేక కష్టమైన సమస్యలను పరిష్కరించమని చెప్పినా వాళ్ళు ఆయన యాజకులకంటే జ్ఞానులకంటే 10 రెట్లు ఎక్కువ వివేచనతో వాటిని పరిష్కరించేవారు.

దానియేలు1-21.