కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

77వ కథ

వాళ్లు సాగిలపడలేదు

వాళ్లు సాగిలపడలేదు

ఈ ముగ్గురు యువకుల గురించి విన్నట్లు మీకు జ్ఞాపకం ఉందా? అవును వాళ్ళు దానియేలు స్నేహితులు, వాళ్ళు తమకు మంచిది కానిదానిని తినడానికి నిరాకరించారు. బబులోనీయులు వాళ్ళను షద్రకు, మేషాకు, అబేద్నెగో అని పిలిచేవారు. కానీ ఇప్పుడు వాళ్ళను చూడండి. వాళ్ళు మిగతా ప్రజలందరిలాగే ఆ పెద్ద విగ్రహం ఎదుట సాగిలపడి ఎందుకు నమస్కరించడం లేదు? ఎందుకో మనం ఇప్పుడు చూద్దాం.

యెహోవా స్వయంగా వ్రాసిన పది ఆజ్ఞలు అని పిలువబడిన నియమాలు మీకు జ్ఞాపకం ఉన్నాయా? వాటిలో మొదటిది, ‘నన్ను తప్ప మరి ఏ దేవుళ్ళనూ మీరు ఆరాధించకూడదు’ అనే ఆజ్ఞ. ఆ ఆజ్ఞకు విధేయత చూపించడం అంత సులభం కాకపోయినా, ఇక్కడున్న ఈ యువకులు దానికి విధేయులౌతున్నారు.

బబులోను రాజైన నెబుకద్నెజరు తాను నిలబెట్టిన ఈ ప్రతిమను ఘనపరచడానికి ఎంతోమంది ప్రముఖులను పిలిపించాడు. అక్కడున్న ప్రజలందరితో, ‘మీరు బాకా, వీణ ఇంకా ఇతర సంగీత వాయిద్యాల శబ్దాన్ని విన్నప్పుడు, ఈ బంగారు విగ్రహం ఎదుట సాగిలపడి నమస్కరించాలి. ఎవరైనా అలా సాగిలపడి నమస్కరించకపోతే వాళ్ళు మండుతున్న అగ్నిగుండంలో వేయబడతారు’ అని చెప్పాడు.

షద్రకు, మేషాకు, అబేద్నెగో అలా సాగిలపడలేదని తెలుసుకున్నప్పుడు నెబుకద్నెజరుకు చాలా కోపం వచ్చింది. ఆయన వాళ్ళను తన వద్దకు పిలిపించాడు. వాళ్ళు సాగిలపడడానికి మరో అవకాశమిచ్చాడు. అయితే ఆ యువకులు యెహోవాపై నమ్మకముంచారు. ‘మేము ఆరాధిస్తున్న మా దేవుడు మమ్మల్ని రక్షించగలడు. ఒకవేళ ఆయన మమ్మల్ని రక్షించకపోయినా, నీవు చేసిన బంగారు ప్రతిమకు మేము సాగిలపడము’ అని నెబుకద్నెజరుతో చెప్పారు.

అది వినగానే నెబుకద్నెజరుకు ఇంకా ఎక్కువ కోపం వచ్చింది. అక్కడ పక్కనే ఒక అగ్నిగుండం ఉంది, ఆయన ‘అగ్నిగుండాన్ని మునుపటికంటే ఏడంతలు ఎక్కువ వేడి చేయండి!’ అని ఆజ్ఞాపించాడు. తర్వాత తన సైన్యంలోని బలమైన వ్యక్తులను పిలిపించి వాళ్ళతో షద్రకు, మేషాకు, అబేద్నెగోలను తాళ్ళతో కట్టించి అగ్నిగుండంలో పడవేయించాడు. ఆ అగ్నిగుండం ఎంత వేడిగా ఉందంటే, ఆ బలమైన వ్యక్తులు దాని మంటలకు కాలి చనిపోయారు. మరి వాళ్ళు లోపలకు పడవేసిన ముగ్గురు యువకుల మాటేమిటి?

రాజు అగ్నిగుండంలోకి చూసి చాలా భయపడ్డాడు. ‘మనం ముగ్గురు మనుష్యులను బంధించి అగ్నిగుండంలో వేశాం గదా?’ అని ఆయన అడిగాడు.

‘అవును, ముగ్గురినే వేశాం’ అని సేవకులు సమాధానమిచ్చారు.

‘కానీ నలుగురు మనుష్యులు అగ్నిలో తిరగడం నాకు కనిపిస్తోంది. వాళ్ళు తాళ్ళతో కట్టబడి లేరు, అగ్ని వాళ్ళకు ఏ హానీ చేయడంలేదు. నాలుగవ వ్యక్తి ఒక దేవుడిలా కన్పిస్తున్నాడు’ అని చెప్పాడు. రాజు అగ్నిగుండం తలుపు దగ్గరకు వెళ్ళి, ‘షద్రకు! మేషాకు! అబేద్నెగో! మహోన్నతుడైన దేవుని సేవకులారా, బయటకు రండి!’ అని పిలిచాడు.

వాళ్ళు బయటకు వచ్చినప్పుడు, వాళ్ళకు ఎలాంటి హానీ జరగలేదని అందరూ చూశారు. అప్పుడు రాజు, ‘షద్రకు, మేషాకు, అబేద్నెగోల దేవుడు స్తుతించబడును గాక! వాళ్ళు తమ దేవునికి తప్ప వేరే దేవునికి నమస్కరించనందుకు, ఆయన తన దూతను పంపించి వాళ్ళను రక్షించాడు’ అని చెప్పాడు.

యెహోవాపై నమ్మకముంచే విషయంలో మనం అనుసరించడానికి ఇది మంచి మాదిరి కాదా?