కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

79వ కథ

సింహాల బోనులో దానియేలు

సింహాల బోనులో దానియేలు

అయ్యో! దానియేలు ఎంతో ఆపదలో ఉన్నట్లు కనిపిస్తోంది. కానీ సింహాలు ఆయనకు హాని చేయడంలేదు! ఎందుకో మీకు తెలుసా? దానియేలును ఆ సింహాల దగ్గర ఎవరు వేశారు? చూద్దాం.

బబులోనుకు దర్యావేషు అనే పేరుగల వ్యక్తి రాజయ్యాడు. దానియేలు ఎంతో దయగలవాడు, బుద్ధిగలవాడు కాబట్టి దానియేలును ఆయన ఎంతో ఇష్టపడేవాడు. దర్యావేషు దానియేలును తన రాజ్యంలో ప్రధాన పాలకునిగా ఉండడానికి ఎన్నుకున్నాడు. దానిని చూసి రాజ్యంలోని ఇతర వ్యక్తులు అసూయపడ్డారు, అందుకే వాళ్ళు ఒక పథకం వేశారు.

వాళ్ళు దర్యావేషు దగ్గరకు వెళ్ళి, ‘రాజా, మాకు ఒక ఆలోచన వచ్చింది, 30 రోజుల వరకు ప్రజలందరూ నీకు తప్ప మరే దేవునికి ప్రార్థన చేయకూడదని ఒక శాసనం చెయ్యి. ఎవరైనా దానిని పాటించకపోతే అతను సింహాల గుహలో పడద్రోయబడాలి’ అన్నారు. ఆ వ్యక్తులు అలా ఎందుకు చేయమన్నారో దర్యావేషుకు తెలియదు. అయితే, అది మంచి ఆలోచనే అనుకుని ఆయన దానిని శాసనంగా వ్రాయించాడు. అది వ్రాయబడింది కాబట్టి దానిని మార్చడానికి వీల్లేదు.

దానియేలుకు ఆ శాసనం గురించి తెలిసినప్పుడు, ఆయన ఇంటికి వెళ్ళి ఎప్పుడూ చేసే విధంగానే ప్రార్థన చేశాడు. దానియేలు యెహోవాకు ప్రార్థన చేయడాన్ని ఆపుచేయడని ఆ చెడ్డ మనుష్యులకు తెలుసు. దానియేలును చంపడానికి తాము వేసిన పథకం బాగానే పని చేస్తున్నట్లు కనిపించడంతో వాళ్ళు సంతోషపడ్డారు.

అయితే ఆ మనుష్యులు తనతో ఆ శాసనం ఎందుకు చేయించారో దర్యావేషుకు అర్థమైనప్పుడు ఆయన చాలా బాధపడ్డాడు. కానీ ఆయన ఆ శాసనాన్ని మార్చలేడు, కాబట్టి దానియేలును సింహాల గుహలో పడద్రోయమని ఆయన ఆజ్ఞాపించవలసి వచ్చింది. కానీ రాజు దానియేలుతో, ‘నీవు సేవిస్తున్న దేవుడు నిన్ను రక్షిస్తాడని ఆశిస్తున్నాను’ అన్నాడు.

దర్యావేషు ఎంత బాధపడ్డాడంటే ఆ రాత్రంతా నిద్రపోలేకపోయాడు. మరుసటి రోజు ఉదయమే ఆయన సింహాల గుహ దగ్గరకు పరుగెత్తుకొని వెళ్ళాడు. ఆయనను మీరు చిత్రంలో చూడవచ్చు. ఆయన గుహలోకి చూస్తూ ‘జీవముగల దేవుని సేవకుడవైన దానియేలూ! నీవు సేవిస్తున్న నీ దేవుడు నిన్ను రక్షించగలిగాడా?’ అని అరిచాడు.

‘దేవుడు తన దూతను పంపి, సింహాలు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్ళు మూయించాడు’ అని దానియేలు సమాధానమిచ్చాడు.

రాజు చాలా సంతోషపడ్డాడు. దానియేలును ఆ గుహలోనుండి బయటకు తెప్పించమని ఆజ్ఞాపించాడు. ఆ తర్వాత దానియేలును చంపడానికి పథకం వేసిన చెడ్డ మనుష్యులను ఆయన సింహాలకు వేయించాడు. వాళ్ళు గుహ అడుగుకు చేరకముందే సింహాలు వాళ్ళను చీల్చి, వాళ్ళ ఎముకలను పగలగొరికాయి.

అప్పుడు దర్యావేషు రాజు, ‘ప్రతి ఒక్కరూ దానియేలు దేవున్ని ఘనపరచాలని నేను ఆజ్ఞాపిస్తున్నాను. ఆయన గొప్ప అద్భుతకార్యాలు చేస్తాడు. ఆయన దానియేలును సింహాల నోటనుండి రక్షించాడు’ అని తన రాజ్యంలోని ప్రజలందరికీ వ్రాశాడు.